Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekambar

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Dasara

మేఘన

జరిగిన కథ : ఉరుములూ, మెరుపుల భీభత్స వాతావరణంలో ప్రయాణిస్తున్న డా. హరి కారు ట్రబులివ్వడంతో మధ్యలో ఆగిపోతాడు. చిమ్మ చీకట్లో ఒక స్త్రీ ఆకారం అతనిని సమీపిస్తుంది. ఆమెను మేఘనగా పోల్చుకుని, ఆశ్చర్యపోతాడు. దగ్గరలోని తమ పిన్ని ఇంటికి హరిని తీస్కెళుతుంది మేఘన. అక్కడ........

మెదడు మొద్దుబారిపోయింది హరికి. గబుక్కున జేబులోంచి విస్కీ బాటిల్‌తీసి, రెండు గుక్కలు తాగి, మళ్ళీ బాటిల్‌ని జేబులోకి తోసేసి, వడివడిగా పరుగెడుతున్నట్లుగా మేఘన వెనకాలే ఫాలో అయ్యాడు. సరిగ్గా ఇరవై అడుగుల దూరంలో ఉందొక పెంకుటిల్లు. నాలుగు మెట్లు ఎక్కి మెయిన్‌డోర్‌తీసి, లోపలికి వెళ్లింది మేఘన.పాతకాలం ఇల్లు.. మెట్లెక్కగానే రెండు వైపులా పెద్ద అరుగులు... గుమ్మం దగ్గరే ఆగిపోయాడు హరి.

‘‘అక్కడే నిలబడి పోయారేం డాక్టరు గారూ... లోపలికి రండి..’’ మర్యాదపూర్వకంగా ఆహ్వానించింది మేఘన.

‘‘మీరొక్కరే....’’

‘‘మా పిన్ని సాయంత్రమే టౌన్‌లోకి వెళ్లింది. ఈ పాటికి రావాల్సి ఉంది... కానీ చూస్తున్నారుగా.. ఈ వాతావరణంలో ఆమె తిరిగి వస్తుందనుకోను. అయినా... నగరంలో పేరు పొందిన డాక్టర్‌మీరు. మీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. మంచి వారనీ... అందరితోనూ కలుపుగోలుగా ఉంటారనీ, భేషజాలు లేవనీ... హస్తవాసి మంచిదనీ... నాకే భయాలూ లేవు’’ గలగలా మాట్లాడిరది మేఘన.

చటుక్కున గడపదాటి, హాల్లోకి అడుగుపెట్టి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు హరి. మేఘన ఇచ్చిన టవల్‌తో తల, ముఖం తుడుచుకుని అదే టవల్‌తో తడిసిపోయిన చొక్కా, ప్యాంటు కూడా పైపైనే రుద్దుకున్నాడు. బట్టల తడి పోయినట్లయ్యింది. హాల్లో గుడ్డిగా వెలుగుతున్నాయి ఛార్జింగ్‌లైట్లు... చాలా సేపటి నుండీ వెలుగుతున్నట్లున్నాయి. ఛార్జింగ్‌అయిపోవచ్చినట్టుగా ఉన్నాయి.

‘‘ఈ పేషెంట్లు డాక్టర్ని దర్శించే ముందే ఆ డాక్టర్‌జీవిత చరిత్ర అంతా క్షుణ్ణంగా తెలుసుకుంటారేమో? ఏమైతేనేం రోడ్డు మీద గడపాల్సింది, ఏదో తలదాచుకోవడానికింత గూడు దొరికింది. అంతవరకూ సంతోషం...

ఈ వాతావరణంలో వాచ్‌మన్‌జైరాజ్‌కి చెప్పి వేడి వేడి చికన్‌సూప్‌తెప్పించుకుని ఉండేవాడిని’’ అనుకుంటున్నంతలోనే...రెండు చేతుల్లో రెండు పొగలు కక్కుతున్న బౌల్స్‌తో ప్రత్యక్షమయింది మేఘన.

‘‘డాక్టర్‌గారూ... టమోటా సూప్‌. తీసుకోండి.’’ అంటూ ఒక బౌల్‌హరికి ఇచ్చి, ఇంకోటి తను తీసుకుని హరికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నది.

కృతజ్ఞతగా అందుకుని, టేస్ట్‌చేసాడు హరి...

‘‘అద్భుతంగా ఉంది..’’ టకటకా వేడిని కూడా లెక్క చేయకుండా లాగించేసాడు. అడుగున కొద్దిగా సూప్‌మిగిలింది. ఒక్కసారి బయట అరుగు మీదికి వెళ్ళి చూరు దగ్గర నిలబడి, పడుతున్న వర్షాన్ని చూస్తూ ఒక్క దమ్ము కొడితే ఎంత బాగుంటుందో అన్పించింది.

‘‘ఈ తాగుడు మీకెప్పట్నించి అలవాటు?’’ ఎంతో ఈజీగా, సింపుల్‌గా చాలా కాలం నుంచి పరిచయమున్న మనిషిని ప్రశ్నించినట్లుగా ప్రశ్నించింది మేఘన.

ఒక్కసారిగా... పీకల్దాకా కోపం వచ్చింది హరికి. చేతిలో ఉన్న బౌల్‌లో మిగిలిన సూప్‌బౌల్‌ని అమాంతంగా ఆమె నెత్తిమీద బోర్లించాలన్నంత కోపం కలిగింది హరికి.

తమాయించుకుని, ఒక చిరునవ్వు నవ్వాడు. కానీ ఆ నవ్వు కోపాన్ని కప్పిపుచ్చలేకపోయింది.

ఆ గుడ్డి వెలుతురులోనే... గమనించినట్లుగా...

‘‘మీకిష్టం లేకపోతే చెప్పవద్దులెండి.’’ అన్నదామె.

‘‘మీకు వినే ఓపిక ఉంటే చెబుతాను.’’ అన్నాడు హరి.

తనదైన చిరు మందహాసంతో... అలవోకగా తలాడిరచిదామె.

ఆ సమయంలో ఆమె చెవి జూకాలు చిత్రంగా తళుక్కున మెరిసాయి.

చూపులు మళ్లించి, చెప్పడం మొదలు పెట్టాడు...

‘‘టెన్త్‌క్లాస్‌లో స్కూలు టాపర్‌ని నేను. ఇంటర్మీడియట్‌లో కాలేజీ ఫస్ట్‌... ఎమ్‌సెట్‌లో ఫస్ట్‌ర్యాంకర్‌... ఉస్మానియా మెడికల్‌కాలేజీ ఎమ్‌బీబీఎస్‌గోల్డ్‌మెడలిస్ట్‌ని... పీజీలోనూ సూపర్‌స్పెషాలిటీలోనూ అందరికంటే పదడుగులు ముందున్నాను. ఎన్నో మెడల్స్‌అందుకున్నాను. నా సీనియర్‌డాక్టర్లు నేనంటే భయపడతారు. నా జూనియర్‌లు భయభక్తులతో గౌరవిస్తారు. శస్త్రచికిత్సా నిపుణుడిగా నాకు భారతదేశం మొత్తం మీద మంచి పేరుంది. చిన్న వయసులోనే అనేక దేశాల్ని సందర్శించిన డాక్టరుగా గౌరవమర్యాదలున్నాయి.

ఒక చిన్న తప్పుడు గీత తయారవ్వబోయే కళాఖండాన్ని ఎ్కడ పాడు చేస్తుందేమోనన్న భయంతో తను గీసే ప్రతి గీతలో ఒక చిత్రకారుడు ఎలా నిమగ్నమైపోతాడో... అదే విధంగా ఆపరేషన్‌సమయంలో నేనొక చిత్రకారుడినైపోతాను.

తన శరీరాన్ని నా చేతుల్లో పెట్టి, నిశ్చింతగా గాఢ సుషుప్తిలోకి జారిపోతాడు రోగి. ఒక వీణ మీటి రాగాలు పలికించినట్లుగా, నరాలతో సరాగాలాడాల్సి ఉంటుంది. కత్తులతో కుత్తుకలు కోయడం తేలిక. కానీ అదే కత్తితో మనిషిని నిలువునా చీలుస్తూ ప్రాణాలు కాపాడాల్సి ఉంటుంది. ఒక చిన్న ఏమరపాటు, పొరపాటు, క్షణాల్లో ప్రాణాల్ని హరించివేస్తుంది. మనమేం చేసామో తెలుసుకునే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.’’

చెప్తూ.. చెప్తూ... గాలి పీల్చుకోవడానికన్నట్లుగా ఒక్క సెకను పాటు ఆగాడు హరి.

ఇంతలో అడ్డుబడిరది మేఘన...

‘‘డాక్టర్‌గారూ నేనడిగింది వేరు... మీరు చెప్తున్నది వేరు.’’

‘‘ఔను, మీరడిగినది చిన్న ప్రశ్నే. చాలా ఈజీగా అడిగేసారు. కానీ దాని మూలం లోతైనది. విడమరచి చెబితేనే గానీ నాకు సమాధానం చెప్పినట్లుగా ఉండదు. కనుక దయచేసి వినండి.

ఇది గాక, నా దైనందిన చర్యల్లో భాగంగా సెల్‌ఫోన్‌ఎప్పుడూ ‘ఆన్‌’లో పెట్టుకోవాలి. పేషంట్‌లయినా ఫోన్‌చేయవచ్చు. డాక్టర్లయినా ఫోన్‌చేయవచ్చు. ఆ ఫోన్‌లు ఇండియా నుండి కావచ్చు. ఫారెన్‌నుండి కావచ్చు. ఇప్పుడున్న కార్పొరేట్‌కల్చర్‌ని బట్టి పేషెంట్లు ఫోన్‌లోనే సందేహాలడుగుతూ ఉంటారు. ఏ పేషంటో? ఏ హాస్పటల్‌లో కలిసానో... ఏమి కంప్లైంటో గుర్తున్నంతవరకూ చెప్పగలగాలి. ప్రతీ పేషెంటూ తనొక్కడినే పేషెంటునన్నట్లుగా సందేహాలడుగుతాడు. విసుక్కోకుండా వివరాలు తెలుసుకుని సమధానపరచాల్సి ఉంటుంది. విసుక్కుంటే చెడ్డపేరు వస్తుంది.

ఇక ఇంటర్నెట్‌... ఏ హాస్పిటల్‌నుండి ఏ మెసేజ్‌, ఏ ఈ మెయిల్‌ఏ టైమ్‌లో వస్తుందో చూసుకుంటూ తగిన విధంగా రెస్పాన్స్‌ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి రోగ సంబంధిత వెబ్‌సైట్ల లింకులను పంపించాల్సి ఉంటుంది. వాళ్లకు చెప్పాలంటే ముందుగా నేను ’అప్‌టు డేట్‌’గా ఉండాలి.

ఎప్పటికప్పుడు మెడికల్‌ ఫీల్డ్‌లో జరిగే కొత్త కొత్త డెవలప్‌మెంట్లను గమనించుకుంటూ ఉండాలి, జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉండాలి. ఇంకేమీ అవసరం లేదు, చదివేసాం కదా, డిగ్రీలున్నాయి కదా అనుకోవడానికి లేదు. ఏ మాత్రం అలసత్వం చూపించినా వెనుకబడిపోయావంటారు. అయితే కొంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెషనల్స్‌, ఐఏఎస్‌, ఐపీఎస్‌వంటి అధికారులు తమను తాము ‘అప్‌డేట్‌’ చేసుకోకుండా ఏదో ఉన్నదానితో నడిపించేస్తుంటారు. అటువంటి వాళ్లకు ఎదుగుదల ఉండదు, ఏదో బతికేస్తుంటారంతే.’’

మీకింకో విషయం తెలుసా?’’

‘‘చెప్పండి.’’

‘‘భారత దేశంతో ఉన్నన్ని వెరైటీ జబ్బులు, రోగాలు ప్రపంచంలోని ఇతర దేశాల్లో లేవు. పాశ్చాత్య దేశాల్లోని గొప్పగొప్ప డాక్టర్లు కొన్ని రోగాలను చూసి నోరెళ్లబెడతారు. అవే రోగాలను మన ఇండియన్‌ డాక్టర్లు చాలా తేలిగ్గా కనిపెట్టి రోగ నిర్ధారణ చేసేస్తారు. అసలు రోగ నిర్ధారణ పరీక్షలు కూడా మన ఇండియన్‌ డాక్టర్లకు అవసరం లేదు.

పాశ్చాత్య డాక్టర్లయితే, పరీక్షల  అనంతరం కూడా రోగ నిర్ధారణ చేయలేక, ఊగిసలాడతారు. తగిన మందు సిఫార్సు చేయలేరు.’ఆగండాగండి..’’ మళ్లీ అడ్డుబడి నది మేఘన.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti