Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Dasara

కాకా రాయుళ్లు... - భమిడిపాటి ఫణిబాబు

kakarayullu

నిజం చెప్పాలంటే, ఈ "కాకా" అంటే అర్ధం మాత్రం నాకు తెలియదు. కానీ, ఈ జాతి వారిని మాత్రం చాలా మందిని చూస్తూంటాము. వాళ్ళకి పేద్ద పనేమీ ఉండదు. తమకి తెలిసిన వారి ప్రక్కనే ఉండడం, వాళ్ళు చేయబోయే ప్రతీ పని గురించీ, తమకేదో తెలిసినట్లు, ఎడా పెడా వాగేయడం. పైగా, వీళ్ళు ( అంటే ప్రస్తుతానికి విక్టిం అన్నమాట) ప్రారంభించే పని లో వచ్చే లాభాలు, ఒకటికి రెండు చేసి, అరచేతిలో స్వర్గం చూపించేయడం. పని మొదలెట్టేవాడికి, ఇలా మాట్లాడే వాళ్ళంటే చచ్చేంత ప్రేమా అభిమానమూనూ. ఆ మాత్రం 'weakness' చాలు, కాకారాయుళ్ళు రంగంలోకి దిగడానికి! అదో ప్రొఫెషనండి బాబూ!

ఏదో ఓ బిజినెస్ మొదలెడదామని అనుకున్నారనుకోండి, ఇంక "ఓవర్ టు కాకారాయుళ్ళే". ఈ విక్టిం లకి, ఇంకోళ్ళు ఎవరైనా హితబోధ చేద్దామని ముందరకి వచ్చినా వీళ్ళకి ఇష్టం ఉండదు. పైగా, " మేము అభివృధ్ధి లోకి వస్తూంటే, మీకు అసూయా, కుళ్ళూ.." అంటూ,ఈ హితోభిలాషులతో సంబంధాలు తెగతెంపులు చేసుకోడానికి కూడా వెనుకాడరు. వీళ్ళంటే ఓ శత్రుత్వం పెంచేసికుంటారు.

ఈ కాకారాయుళ్ళు, అవతలివాడు మొదలెట్టే బిజినెస్ లో వచ్చే లాభాలతో మొదలెడతాడు. ఎక్కడలేనీ ప్రొజెక్షన్స్ తో, ఏవేవో లెఖ్ఖలేసేసి, మనకి ఇంత లాభం వస్తుందీ, అంత లాభం వస్తుందీ , ఓ రెండేళ్ళల్లో, బిజినెస్ మూడు పూవులూ ఆరుకాయల్లా పెరిగిపోతుంది, ఓ రెండేళ్ళు పోయిన తరువాత, అసలు మాలాటి వాళ్ళు ఎదురుపడినా,పలకరించే తీరికే ఉండదూ. "అర్రే, ఇన్నాళ్ళూ తెలియనే లేదూ, మనలో ఇంత టాలెంట్ ఉందా, చూశావా ఒక్కళ్ళూ చెప్పనేలేదూ,అందుకే అంటాను, చుట్టాలకంటే ఫ్రెండ్సే బెటరు. అసలు నేను వాడికేమౌతానని, ఇంత సహాయం చేస్తున్నాడూ.".. వగైరా వగైరా..ఊహలతో బిజినెస్ లో అడుగెట్టేస్తాడు.

  వీళ్ళు చెప్పే మాటలు విని, బిజినెస్ ప్రారంభిస్తాడు పాపం ఆ వెర్రిమనిషి. ఆరోజునుంచీ, మన కాకారాయుళ్ళు గాయబ్ ! తుపాగ్గుండుకి దొరకడు. పైగా ఎప్పుడైనా కనిపించినప్పుడు,అడిగినా, " ఏదో అనుకున్నామూ అప్పటి మార్కెట్ పరిస్థితులు చూసి, అయినా మేమన్నామని కాదుకానీ, బిజినెస్ అన్న తరువాత అప్పూ  డౌనూ ఉంటాయండి, కొద్దిగా ఓపిక పట్టాలీ.." అని ఓ జ్ఞానబోధ చేసి తప్పించుకుంటాడు. పడే తిప్పలేవో మనవాడే పడాలి!

  ఈ సందర్భం లో నేను చదువుకునే రోజుల్లో అన్నమాట, మా నాన్నగారు హెడ్మాస్టారుగా ఉండేవారు కదూ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కి టీచర్స్ నియోజకవర్గం నుంచి, ఈయన నుంచుంటే బావుంటుందీ అన్నారుట ( ఏదో లోకం అంతా కాదులెండి, ఆయన చుట్టూ ఉండే కాకారాయుళ్ళు!). అబ్బో నిజమే కదూ, మనకి ఫలానా చోట ఇంత పాప్యులారిటీ ఉందీ, ఫలానా స్కూళ్ళల్లో, మన పేరువింటేనే చాలూ, ఓట్లన్నీ వరద గోదారిలా పరవళ్ళు తొక్కుతూ వచ్చేస్తాయీ. ఇంకేముందీ, ఈవేళ నామినేషనూ, రేపు ఎన్నికలూ, ఎల్లుండి కల్లా హైదరాబాద్ చలో అనుకుని, కలలు రాత్రీ, ఒక్కొక్కప్పుడు బలవంతంగా నిద్ర పట్టించుకుని పగలు కూడా కనేసి, రంగం లోకి దిగిపోయారు.

అప్పటికింకా నా మెదడు అనే బుల్లి పదార్ధం అంత పరిపక్వం చెందలేదుగా, నిజమే కాబోసూ అనుకునేవాడిని. ఇంట్లో ఎక్కడ చూసినా ఈ ఎలెక్షను హడావిడే.ప్రతీ స్కూలుకీ కరపత్రాలు పంపడం,ఆ స్కూలికి  ప్రచారం కోసం వెళ్ళడం. అవేమైనా ఊరికే వస్తాయా ఏమిటీ? డబ్బులు ఖర్చయేయంటే అవవు మరీ? మనకేమైనా ఎస్టేట్లున్నాయా ఏమిటీ? ఆరోజుల్లో స్పాన్సర్షిప్పులూ వగైరాలుండేవి కావు. చచ్చినట్లు జేబులో డబ్బులే ఖర్చెట్టడం!

అప్పటికీ మా అమ్మగారంటూనే ఉండేవారు " ఎందుకండీ ఇప్పుడు ఆ ఎలెక్షన్లూ సంతానూ..." అని.ఎలెక్షన్ల నషాలో ఇలాటి హితబోధలెందుకు చెవులకెక్కుతాయీ.ఎలెక్షన్లూ అయ్యాయి, రిజల్టులూ వచ్చాయీ, ఎక్కడివాళ్ళక్కడే ఉన్నారు. ఇంక వాటిమీద పోస్టేలక్షన్ ఎనాలిసిస్సులూ- ఫలానా చోట ఫలానా వాడు, మనం ఫలానా శాఖకి చెందిన వాళ్ళమని ఓట్లు వేయలేదూ, ఆ నెగ్గినాయన ఇంకో శాఖలెండి. ఎందుకు  వేస్తారూ? అయినా మన ఔకాత్ ఏమిటో తెలిసికోకుండా అసలు ఈ ఎలెక్షన్లలో దిగమనెవరు చెప్పారుటా, రెడీ అన్సర్--  " కాకా మహా రాయుళ్ళు " ! ఫలితాలొచ్చిన తరువాత ఈ హితోభిలాషులు ఒక్కడంటే ఒక్కడు కనిపించలేదు. చివరకు తేలిందేమిటయ్యా అంటే, ఓ పదివేలు ఖర్చూ, శ్రమానూ.

పదివేలకే ఇంత హడావిడా అనకండి. మరి  యాభై రూపాయలకి తులం బంగారం వచ్చే రోజుల్లో, పదివేలంటే మాటలా మరి! అంతా గ్రహపాటూ అని వదిలెయడానికీ లేదు, మన బుర్రేమయింది?  ఇప్పుడు as an after thought ఇవన్నీ వ్రాయొచ్చు. కానీ అప్పుడో అంత ధైర్యం ఎక్కడుండేదీ? కానీ, కాకారాయుళ్ళు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు, చిరంజీవుల్లా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఎవరికైనా సరే, మొహం మీద పొగిడితేనే, వినడానికి బావుంటుంది. నిజాలు చెప్తే వినేవాడెవడూ?

  పెళ్ళి సంబంధాల్లో అయినా సరే, ఈ కాకారాయుళ్ళు, మధ్యవర్తి రూపంలో వచ్చి మన ప్రాణాలు తీస్తారు.అసలు మధ్యవర్తి అనే ప్రాణుంటాడే, వాడి పని, ఇంకోళ్ళని బుట్టలో వేయడం, తన పబ్బం గడుపుకోడమూనూ. ఓ ప్రాపర్టీ యో ఇంకోటేదో కొనాలనుకోండి, ఈ మధ్యవర్తి ప్రత్యక్షం.అంతదాకా ఎందుకూ, ఓ బ్యాంకు లోను ఇప్పించడానికి, ఎవడో ఏజంటొస్తాడు. వాడూ  ఈ జాతివాడే.అదిగో అంటాడు, ఇదిగో అంటాడు,ఫలానా బ్యాంకు లో అప్పు తొందరగా వచ్చేస్తుందంటాడు. ఏవేవో కాగితాలు తీసికొచ్చి ఓ యాభై సంతకాలు తీసికుంటాడు.  జీవితాంతం, చేసిన అప్పు తీర్చుకుంటూండడం మన పని. దీని దుంపతెగా, చేసిన అప్పుకి వడ్డీ ముందర వసూలు చేసేస్తారు. పదేళ్ళైనా అసలులో మాత్రం నయా పైస తగ్గదు! ఈ కిటుకులన్నీ, ఆ ఏజంటు గాడు ఛస్తే ముందర చెప్పడు. మీకు అన్నీ తెలుసేమో అనుకున్నాడంటాడు!వాడి ఇంటరెస్టు వాడిదీ. ఎన్ని బక్రాలు తెస్తే అంత కమిషన్ వాడికి బ్యాంకు వాళ్ళిస్తారు. ఎవడి గోల వాడిదీ...

పోనీ ఇన్నివిషయాలు తెలిసి, ఆ కాకారాయుళ్ళని దూరంగా పెడతారా, అంటే అదీ లేదూ. అదో నషా.. వాళ్ళు చెప్పేవే చెవులకి ఇంపుగా వినిపిస్తాయి. ఎవరిమాటా వినేది లేదు.వినడంమాట దేవుడెరుగు, అసలు దగ్గరకే రానీయరూ.ఈ కాకారాయుళ్ళు ఇదివరకటి రోజుల్లోని “ నల్ల మందు “ లాటివారు. ఆరారగా వేసికుంటూనే ఉండాలి. తీరా దాంట్లోంచి బయటపడేటప్పటికి పుణ్యకాలం కాస్తా అయ్యేపోతుంది....

మరిన్ని శీర్షికలు
duradrustapu dongalu