Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
govindudu andarivadele movie review

ఈ సంచికలో >> సినిమా >>

Happy Dasara

డాడీ జోక్యం... అంత‌గా ఉండ‌దు - రామ్‌చ‌ర‌ణ్‌

interview with ram charan tej

ఈ త‌రం క‌థానాయకులు సేఫ్ జ‌ర్నీనే ఎక్కువ‌గా న‌మ్ముకొన్నారు. కావ‌ల్సినంత హీరోయిజం, కొన్ని పంచ్ డైలాగులు, అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ హంగులూ.... ఇవి సినిమాని న‌డిపించేస్తాయ‌ని వాళ్ల న‌మ్మ‌కం. రామ్‌చ‌ర‌ణ్ కూడా ఇలాంటి సినిమాల్ని చేస్తూ వ‌చ్చాడు. జ‌స్ట్ ఫ‌ర్ ఛేంజ్ అన్న‌ట్టు... ఓ కుటుంబ క‌థ‌ని ఎంచుకొన్నాడు. అదే గోవిందుడు అంద‌రివాడేలే!  ఈ సినిమాతో చ‌ర‌ణ్ ఓ కొత్త జోన‌ర్‌లోకి ప్ర‌వేశించే ప్ర‌య‌త్నం చేశాడు. అందులో కొంత విజ‌యం సాధించాడు కూడా. ఈ ద‌స‌రా పండ‌క్కి గోవిందుడుగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం.. ఫీల్ గుడ్ మూవీగా మ‌న్న‌న‌లు అందుకొంటోంది. ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్‌తో గో తెలుగుడాట్ కామ్ ప్ర‌త్యేకంగా సంభాషించింది.

* ద‌స‌రా శుభాకాంక్ష‌లు...
- థ్యాంక్సండీ.. మీక్కూడా.

* ఏంటీ పండ‌గ స్పెష‌ల్..
- గోవిందుడు అంద‌రివాడేలే సినిమానే. ఈ సినిమా విజ‌యోత్సాహంలో కుటుంబంతో క‌ల‌సి పండ‌గ మ‌రింత ఆనందంగా జ‌రుపుకొంటున్నా.

* గోవిందుడు అంద‌రి వాడేలే.... రిజ‌ల్ట్ ఏమిటి?
- వ‌స్తున్న స్పంద‌న‌, సాధిస్తున్న వసూళ్లు చూస్తూనే ఉన్నాం క‌దా. చూసిన వాళ్లంతా ఫీల్ గుడ్ మూవీ అంటున్నారు. చ‌ర‌ణ్ కొత్తగా క‌నిపించాడ‌ని చెబుతున్నారు... అంత‌కంటే కావ‌ల్సింది ఏముంది. ఒక విధంగా నా ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్టే.

* మాస్‌.. యాక్షన్ శైలి మీది. మ‌రి కృష్ణవంశీ జోన‌ర్‌లోకి మార‌డం ఇబ్బంది అనిపించ‌లేదా?
- నేనే ఇలాంటి సినిమా కావాల‌ని కోరుకొన్నా. మంచి న‌టుడిని అనిపించుకోవాలంటే... అన్నిర‌కాల క‌థ‌లూ చేయాలి. అంద‌కే.. ఇప్పుడీ ఫ్యామిలీ డ్రామా ఎంచుకొన్నా.

* ప్రయోగాల‌న‌గానే.. ఆరెంజ్ సినిమా గుర్తుకురావ‌డం లేదా?
- నాకు ఇప్పటికీ ఆ సినిమా అంటే చాలా ఇష్టం. కొన్ని కార‌ణాల వ‌ల్ల స‌రైగా పోట్రైట్ చేయ‌లేక‌పోయాం.

* అంటే మున్ముందూ మీ శైలి పూర్తిగా మార్చుకోవ‌డానికి సిద్ధమ‌న్నమాట‌..
- శైలి మార్చుకోవ‌డం అంటే.. విక్రమ్‌లా ఒక్కసారిగా అప‌రిచితుడు గెట‌ప్ వేసుకొని జ‌నం ముందుకొచ్చేయ‌లేను.. (న‌వ్వుతూ). ప్రయోగాలు కూడా నిర్మాత‌ల‌కు మేలు చేసేవిలా ఉండాలి. ఒక‌రి డ‌బ్బుతో మ‌నం ఆట ఆడ‌కూడ‌దు.

* కృష్ణవంశీ స్కూల్‌, సిల‌బ‌స్ అర్థమ‌వ్వడానికి స‌మ‌యం ప‌ట్టిందా?
- ఆయ‌న సినిమాల్ని ముందు నుంచీ గ‌మ‌నిస్తూనే ఉన్నా. ఇన్‌ఫాక్ట్ నాకు.. నిన్నే పెళ్లాడ‌తా, మురారి సినిమాలంటే చాలా ఇష్టం. దానికి తోడు.. ముందే ప్రిపేర్ అయ్యే సెట్‌కి వెళ్లా. రెండ్రోజులు కాస్త ఇబ్బందిగా అనిపించింది అంతే..

* అదే.. ఎలాంటి ఇబ్బంది అని..
- నేను సీన్‌ని ఒక‌లా అర్థం చేసుకొని వెళ్లేవాడిని. సెట్లో ఆయ‌న ఇంకోలా చూపించేవారు. అదే నాకు కొత్తగా అనిపించేది. సీన్‌ని ఇలాక్కూడా తీయొచ్చా?  అని చాలాసార్లు అనుకొన్నా..

* రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించేట‌ప్పుడు మొహ‌మాట‌ప‌డ్డార‌ట‌..
- (న‌వ్వుతూ..) బాగా.  అలాంటి పాట‌ల్లో, స‌న్నివేశాల్లో న‌టించ‌డం పూర్తిగా కొత్త. ఇప్పుడెందుకండీ ఇవ్వన్నీ..... అనేవాడ్ని. ఆయ‌న మాత్రం ఆ పాట‌లో పిండేశారు...

* కాజ‌ల్‌తో మీరు బాగా వ‌ర్కవుట్ అయిన‌ట్టుంది..
- మేం క‌ల‌సి చేసిన సినిమాలు బాగా ఆడాయి. త‌ను చాలా మంచి కోస్టార్‌.

* మీ క‌థ‌ల ఎంపిక‌లో మీ నాన్న‌గారు బాగా జోక్యం చేసుకొంటార‌ని, గోవిందుడు అంద‌రివాడేలే లో భారీ మార్పుల‌కూ మీ నాన్న‌గారే కార‌ణ‌మ‌ని బ‌య‌ట టాక్‌.. మీరేమంటారు..?
- ఓ క‌థ విష‌యంలో నేనూ, నాన్న‌గారూ క‌లిసే నిర్ణ‌యం తీసుకొంటాం. నా ప్ర‌తి క‌థా ఆయ‌న వింటారు. ఇక గోవిందుడు విష‌యానికొస్తే  ప్ర‌కాష్ రాజ్‌ని తీసుకోవాల‌న్న ఆలోచ‌న ఆయ‌న‌ది. అదే క‌రెక్ట్ అని ఈరోజు అంద‌రూ చెప్తున్నారు. నాన్న‌గారు మితిమీరి జోక్యం చేసుకోరు. ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కం ఉంటే... అస్స‌లు ప‌ట్టించుకోరు.

* మ‌రి ఉపాస‌న ఏమైనా స‌ల‌హాలిస్తుందా?
- (న‌వ్వుతూ) నా సినిమాల గురించెప్పుడూ త‌న‌కు చెప్ప‌ను. బ‌య‌ట సినిమాల గురించి మాట్లాడుకొంటామంతే. త‌న‌కి ప్రేమ క‌థ‌లంటే ఇష్టం. న‌న్ను అలాంటి క‌థ‌ల్లో చూడాల‌నుకొంటుంది..

*  ఈ మ‌ధ్య మీరూ మ‌హేష్ ఇద్ద‌రూ పోటాపోటీగా వ‌స్తున్నారు... దాదాపు వారం రోజుల వ్య‌వ‌ధిలో మీ సినిమాలు విడుద‌లవుతున్నాయి..-
అదేంటో మ‌రి.. ఇద్ద‌రి సినిమాలూ ఒకేసారొస్తున్నాయి. నాలుగు నెల‌ల క్రిత‌మే గోవిందుడు రిలీజ్ డేట్ అనుకొన్నాం. అదే స‌మ‌యంలో శ్రీ‌నువైట్ల న‌న్ను క‌లిశారు. ఒక‌రు సినిమా డేట్ ఎనౌన్స్ చేస్తే.. రెండు వారాల ముందు గానీ, త‌ర‌వాత గానీ మ‌రొక‌రు సినిమా విడుద‌ల చేసుకొందామ‌ని అప్పుడే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాం. మేం ముందు డేట్ చెప్పాం. వాళ్లు రెండు వారాల ముందు సినిమాని విడుద‌ల చేశారు.

* ఇంత‌కీ శ్రీ‌నువైట్ల‌తో సినిమా ఉందా?  లేదా?
- ఆయ‌న నాకో క‌థ చెప్తాన‌న్నారు. అది ఎలాంటి క‌థో ఇంకా తెలీదు. క‌థ న‌చ్చితే త‌ప్ప‌కుండా చేస్తా..

* కోన వెంక‌ట్‌, గోపీమోహ‌న్‌లు కూడా క‌థ చెప్పార‌ట‌..
- ఔను. ఆ క‌థ బాగా న‌చ్చింది. వ‌చ్చే యేడాది ఆ సినిమా ఉంటుంది. ద‌ర్శ‌కుడెవ‌నేది త్వ‌ర‌లో చెప్తా.

* రాష్ట్రం రెండుగా విడిపోయిన నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ వైజాగ్ త‌ర‌లిపోతుందా..?
- చెన్నై నుంచి ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ వ‌స్తుంద‌ని, ఇక్కడ ఇంతిలా నిల‌దొక్కుకొంటుద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. కానీ వ‌చ్చి నిల‌బ‌డింది.  రేపు వైజాగ్ సంగ‌తీ అంతే. ప్ర‌త్యామ్నాయాలు ఉండ‌డం మంచిదే క‌దా..

* బాలీవుడ్ వైపు మ‌ళ్లీ వెళ్తారా?
- త‌ప్ప‌కుండా. ల‌గాన్ ద‌ర్శ‌కుడు అశితోష్ ఓ క‌థ చెప్పారు. వ‌చ్చే యేడాది ఉండొచ్చు.

* నాన్న‌గారి సినిమా ఎంత వ‌ర‌కూ వ‌చ్చింది..?
- రెండు క‌థ‌ల్ని లాక్ చేశాం. ద‌ర్శ‌కుడ్ని నిర్ణ‌యించాలి.

కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka