Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ :
మేఘన వెంట ఫాలో అయిన డా. హరికి వేడి  వేడి సూప్ ఇస్తుంది. తాగుడు గురించి అడిగిన మేఘన ప్రశ్నకి జవాబుగా సుదీర్ఘంగా ఉపన్యాసం మొదలెడతాడు హరి.. తన ప్రశ్నకి అతను చెబుతున్న దానికి పొంతన కుదరలేదని ఆమె వారించినా వినకుండా చెబుతూనే ఉంటాడు.............. ..................

  ‘‘అనవసరంగా.. ఎక్స్ రేలనీ, అల్ట్రాసోనిక్లనీ, బ్లడ్ టెస్ట్లనీ ఇంకా రకరకాల పరీక్షలనీ ఆ తర్వాత అనవసర ఆపరేషన్లనీ పేషెంట్ల డబ్బులు కొల్లగొట్టి వాళ్లకి నరకాన్ని చూపించే డాక్టర్లు లేరంటారా? చెప్పండి.’’

‘‘దురదృష్టవశాత్తూ.. మీరు చెప్పేదాంట్లో కొద్దోగొప్పో నిజమైతే ఉంది.. కాదనలేను. కానీ సాధారణంగా మన డాక్టర్ల కున్నటువంటి ‘పవర్’ గురించి చెబుతున్నాను నేను. అందుకనే చికిత్సల నిమిత్తం విదేశాల నుండి భారతదేశం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.’’

‘‘డాక్టరు గారూ.. ఇంతకీ నేనడిగిందేమిటి? మీరు చెప్తున్నదేమి? ఏమైనా పొంతన ఉందా?

అందుకేనేమో గొప్ప డాక్టర్లకి, ఇతర మేథావులకి వేపకాయంత వెర్రి ఉంటుందంటారు.’’

‘‘నేను కొద్దిగా దారి తప్పినమాట వాస్తవమే. కానీ మేఘన గారూ. ఇప్పటివరకూ నేను చెప్పిందంతా విన్న తర్వాత ఒక డాక్టర్ఎంత బాధ్యతగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు అర్థమయి ఉంటుందనుకుంటాను..!’’

‘‘ఖచ్చితంగా అర్థమయింది.’’

‘‘మరి పుసుక్కున ‘తాగుబోతు’ అని ఎలా అనేసారు?’’

‘‘అయ్యో.. నేను తాగుబోతు అనలేదండీ... మీకీ తాగుడు ఎప్పట్నించి అలవాటు? అని అడిగానంతే.’’

‘‘తాగుడు అనే మాట తాగుబోతుకే వర్తిస్తుంది. నేనేమన్నా తప్పతాగి భార్యని చితకబాదేవాడిలా కన్పిస్తున్నానా? తాగి, పర స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించేవాడిలా అనిపించానా? ఫుల్లుగా తాగి స్పృహ తప్పి పడిపోయే వాడిలా ఉన్నానా..? తాగి, తాగి సోలిపోతూ ఊరందరి మీద అరుపులు అరిచే మనిషినా? ఎంతో జాగ్రత్తతో నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ప్రజల ప్రాణాల్ని కాపాడేవాడిని నేను. తాగి, మత్తులో తేలిపోతే, ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలిగేవాడినా? ఇన్ని గొప్ప శస్త్ర చికిత్సలు చేయగలిగేవాడినా? ఇంతమంది జానియర్డాక్టర్లకి ఆదర్శంగా ఉండగలిగే వాడినా? వాళ్లకి ఎన్నో క్లిష్టమైన అంశాలు నేర్పించగలిగే వాడినా...? చెప్పండి...

ఏదో... ఒత్తిడిని కొద్దిగానైనా తప్పించుకోవడానికి, రిలాక్సవ్వడానికే రెండు పెగ్గులు తాగితే ‘తాగుడు’ ‘తాగుబోతు’ అని ముద్రలు వేసెయ్యడమేనా? అది న్యాయమేనా..! సమంజసమేనా?

నాకున్న అలవాట్లు, నా శరీరానికి గానీ, చుట్టు ఉన్న సమాజానికి ఏ మాత్రం హానికరం కానప్పుడు తేలిక భావంతో తీసి పారేయడం సబబేనా...? మన సమాజంలో చాలా మంది వాళ్లకు వాళ్లే గొప్ప వాళ్లనుకుంటారు. ఎదుటివాడితో ఏ చిన్న లోపం కనబడినా దాన్ని పెద్దది చేసి, ఎదుటి వాళ్లకు చెప్పడం, తమ బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడం బాగా అలవాటైపోయింది. లక్ష ఆపరేషన్లు సక్సెస్చేసిన డాక్టరు ఒక పెగ్గు తాగితే పొరపాట్న అదెవడైనా కనిపెడితే చాలు... ఓ... ఆయనా... మందు మేష్టారండీ అంటూ ఎదుటివాడి దగ్గర పిచ్చివాగుడు వాగుతారు.

ఇప్పుడు చెప్పండి మేఘనా... మీ చిన్న ప్రశ్నకి ఇంత సమాధానం అవసరమా? కాదా? మీరే చెప్పండి.’’ అంటూ ముగించాడు హరి.అప్రతిభురాలై, ఒక బొమ్మలాగా కూర్చుని, కదలకుండా మెదలకుండా హరినే చూస్తున్న మేఘనలో హఠాత్తుగా చలనం వచ్చింది. ఒక్క ఉదుటున లేచి హరికి దగ్గరగా వచ్చి తన రెండు చేతులతో అతని చేయి గట్టిగా పట్టుకుంది.

ఏదో ప్రవాహం... లింఫ్గ్రంథుల ప్రవాహమా? న్యూరాన్ల చలనమా? విద్యుత్చలనమా?

ఇక చేతి నుండి ఇంకో చేతికి కేవలం స్పర్శ ద్వారా సందేశాల్ని పంపించవచ్చా..?

తను చెప్పింది అర్థం చేసుకున్నాననీ... తననీ, తన భావాల్ని గౌరవిస్తున్నాననీ ఒకవేళ తన అల్లరి ప్రశ్నతో బాధపెట్టి ఉంటే, కోపం తెప్పించి ఉంటే క్షమించమని అడుగుతున్నాననీ ఇలా కూడా చెప్పవచ్చా..?

ఎంత సమయం గడిచిందో... ఆ చేతుల సంభాషణ ఎంతసేపు జరిగిందో...

బోయవాడి వలలో చిక్కుకున్న పక్షులన్నీ కూడ బలుక్కుని ఒక్కసారిగా వలతో పాటు ఆకాశంలోకి ఎగిరితే... వాటి రెక్కల శబ్దం ఎలా వినవస్తుందో... అంతే శబ్దంతో ఆ ఇంటి బయట ఉన్న పక్షుల సమూహం చేసిన రెక్కల రపరపా రావాలతో తిరిగి ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరూ...

‘‘నా ప్రశ్న మిమ్మల్ని ఇంత బాధిస్తుందని అనుకోలేదు.’’ మనస్ఫూర్తిగా అంది మేఘన.

‘‘ఈ విషయం ఎప్పుడో చెప్పేసారు నాకు.’’

‘‘నేనెప్పుడు చెప్పాను?’’

‘‘మీరు చెప్పడం జరిగింది, నేను వినడమూ జరిగింది.’’

‘‘ఎలా?’’

‘‘ఏమో?’’ స్వచ్ఛమైన చిరునవ్వుతో చెప్పాడు హరి.

‘‘మాటల్లో పడి భోజనం సంగతే మర్చిపోయాను. కేవలం బెండకాయ వేపుడు, టమోటా రసం మాత్రమే ఉన్నాయి. మాది సామాన్య భోజనం... మీకింకేమన్నా కావాలంటే చెప్పండి.’’ అన్నది మేఘన.

భోజనం సంగతే మర్చిపోయిన హరికి... ఆ మాట వినబడగానే ఆకలి నిద్రలేచింది. కడుపులో మంట మొదలయ్యింది.

‘‘అసలు ఏమీ దొరకని సమయంలో... మీరిచ్చే సామాన్య బోజనమే అమృతం.’’ అంటున్నంతలోనే రెండు ప్లేట్లతో వచ్చేసింది మేఘన.తింటూ, తింటూ.. ‘‘మీ హజ్బెండ్కు డ్రిరక్చేసే అలవాటు ఉండి ఉంటుంది. డ్రిరక్ప్రభావంతో మీ గాయాలకు కారకుడై ఉండి ఉండవచ్చు. అందుకనే చాలా ఈజీగా మీకు ఈ తాగుడు ఎప్పట్నించీ అలవాటు అని అడిగేసారు. ఔనా?  ఇలా అడుగుతున్నందుకు అన్యథా భావించకండి.’’ అన్నాడు హరి.

చిరు దీపం వెలుగులో ఆమె పలువరస మిలమిలా మెరిసింది.

‘‘మీరు ఊహించినది పూర్తి విరుద్దం. నా భర్త వినయ్కీ తాగుడుకీ ఆమడ దూరం.’’ అన్నది.

‘‘మరి ఈ గాయాలు?’’

‘‘అదో పెద్ద కథలెండి.’’

‘‘వినడానికి సమయం, సహనం రెండూ పుష్కలంగా ఉన్నాయి. చెప్పండి.’’

‘‘వినయ్... అదే నా భర్తది సంపన్న కుటుంబం. మామగారు సిటీలో పెద్ద బిల్డర్. ఆయనకు ముగ్గురు కూతుళ్ళ తర్వాత పుట్టాడు వినయ్. ఇంకేముందీ... అల్లారు ముద్దుగా, అవసరం అయినదాని కంటే ఎక్కువగా గారాబం చేస్తూ కాలు కింద పెట్టకుండా పెంచారు.

వినయ్ ఎప్పుడూ నీట్గా పాలిష్చేసిన బూట్లూ, ఇస్త్రీ బట్టలూ, టక్కూ వేసుకుని జులాయిగా ఫ్రెండ్స్తో తిరుగుతుండేవాడు. చేతిలో పెద్ద బండి, జేబులనిండా డబ్బులూ. డిగ్రీ పాసయ్యాడో లేదో కూడా తెలియదు బాధ్యతారాహిత్యం... సోమరితనం...

ఇవేమీ తెలియని మా నాన్న, అమ్మ అబ్బో శ్రీమంతుల కుటుంబం, సొంత ఇళ్ళూ, కార్లూ... ఏమి వైభోగం, ఇలాంటి సంబంధం మళ్ళీ దొరుకుతుందా? తరాల తరబడి తినికూర్చున్నా తరగని ఐశ్వర్యం, నౌకర్లు, చాకర్లూ... ఇంకేం కావాలి? నువ్వు ఎంతో సుఖపడతావు... చదువుదేముంది?

ఎప్పుడైనా చదువుకోవచ్చు. మా తాహతుకు ఇంత గొప్ప సంబంధం తేగలమా? ఏదో అనుకోకుండా వచ్చిన మంచి అవకాశం. పోగొట్టుకుంటే మళ్లీ రాదు. అంటూ... ఇంటర్ఫైనలియర్లోనే నాకు పెళ్ళి చేసాసారు.

‘‘అక్కడితో మీ చదువు కొండెక్కి ఉంటుంది.’’ అన్నాడు హరి.

‘‘ఊ హూ... దానికి అపోజిట్గా... చదువు కొనసాగించాలన్న నా కోరిక కాదనలేదు వినయ్. పెళ్లయిన మరు సంవత్సరంలో కొడుకు పుట్టాడు.’’

‘‘ఓహ్... మీకో కొడుకున్నాడా? కానీ మీరలా కన్పించడం లేదు. నేనస్సలు అనుకోనేలేదు.’’

‘‘ఆశ్చర్యం మేమీ లేదులెండి... ఎర్లీ మారేజ్.. ఎర్లీగా తల్లినయ్యాను... ఐనా పట్టువదలకుండా బీకాం (కంప్యూటర్స్) చదివాను. ఐతే మా అత్తగారికి నేను చదువు కోవడం ఇష్టం లేదు. అంత అవసరమా? అనేది వినయ్ఇచ్చిన సపోర్టుతో నేను ఎమ్కామ్కూడా పూర్తి చేసాను. వీటితో  పాటుగా అత్తగారి దగ్గర మీరు సినిమాల్లో చూసే కష్టాలన్నీ పడ్డాను.’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekambar