Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ : పెరట్లో కనిపించిన చచ్చిన పాముని చూసి భయంతో కెవ్వున కేక వేసి అందర్నీ పిలిచి చూపిస్తుంది పర్వతాలు. ఆ హడావుడి వల్ల ఏకాంబర్ కి కస్టమర్ల ఇళ్ళకు వెళ్ళేందుకు లేటయి ఎవర్నీ కలవలేక పోతాడు.  ఆ చికాకులో ఒంటరిగా కూర్చుని ఉన్న ఏకాంబర్ దగ్గరకు స్వీట్ పాకెట్ తో వచ్చి తాను అత్యఢికంగా టార్గెట్ ని అధిగ మించినట్లుగా చెబుతుంది నూకరత్నం. ఇద్దరూ కలిసి స్టాఫందరికీ స్వీట్స్ పంచి ఈ ఆనందాన్ని షేర్ చేసుకుంటారు. అందరూ ఇలాగే అభివృద్ధి సాధించాలని చిన్న స్పీచ్ ఇచ్చి ఉత్తేజ పరుస్తాడు ఏకాంబర్...
ఆ తర్వాత...


మీరూ స్వయంకృషితో ఎదగాలని కోరుకుంటూ సెలవా మరి " అంటూ ముగించాడు ఏకాంబర్.
ప్రసంగం ముగియగానే అందరూ ఆనందంగా చప్పట్లు కొడుతూ ఆప్యాయంగా ఏకాంబర్ దగ్గరకు వచ్చి ' షేక్ హ్యాండ్స్ ' ఇచ్చారు.

ఏకాంబర్ చెప్పిందంతా దూరంగా ఉండే పద్మక్క వింది. ఆ విషయం వింటూనే నూకరత్నం దగ్గరకు వచ్చి ఆప్యాయంగా కౌగలించుకుంది. 

కలక్షన్ టీం అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫీసులో అమ్మాయిలు ముగ్గురు తమ సీట్లో కూర్చున్నారు.

ఏకాంబర్, నూకరత్నం సంతోషంగా మాట్లాడుకుంటూ ఏకాంబర్ కేబిన్ లో కూర్చున్నారు.

ఇంతలో ఏకాంబర్ సెల్ కి తల్లి పర్వతాలు ఫోన్ చేసింది. సెల్ డిస్ ప్లే లో ఇంటి నెంబర్ చూస్తూనే టక్కున సెల్ తీసాడు.

" హలో..చెప్పమ్మా ! " అన్నాడు ఏకాంబర్.

" ఒరేయ్ చిన్నోడా నువు అర్జెంటుగా నాన్నని తీసుకుని ఇంటికొచ్చేయ్ " ఆతృతగా అంది పర్వతాలు.

" ఏమైందమ్మా ! ఇంకా పాము గొడవేనా ? " అడిగాడు ఏకాంబర్.

" అయ్యో ! ఉదయాన్నెప్పుడో చచ్చిన పాము గురించి ఎందుకురా ఫోన్ చేస్తాను. నువ్వు నాన్నని తీసుకుని ఇంటికి రా ! ఇక్కడ మాట్లాడుకుందాం ! " అంటూనే ఫోన్ కట్ చేసింది పర్వతాలు.

విషయం చెప్పకుండా తల్లి ఫోన్ కట్ చేసేసరికి విసుగ్గా కుర్చీలోనుంచి లేచాడు ఏకాంబర్. అలా విసురుగా లేచేసరికి ఏకాంబర్ కూర్చున్న రివాల్వింగ్ చైర్ గిర్రున తిరిగి తిరిగి ఆగింది.

" మీ అమ్మ గారా ? " తెలిసినా అడిగింది నూకరత్నం.

" ఆ ! ఎందుకో అర్జెంటుగా ఇంటికి రమ్మంటోంది. నాన్న గారిని కూడా వెంట్బెట్టుకు రమ్మంటోంది.ఏమైందో ? ఏమో ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడో? వాడికేమైందోనని గాబరాగా ఉంది. " ఆందోళనగా ఉంది " అన్నాడు ఏకాంబర్.

" మీ అన్నకేమౌతుంది ? బాగానే ఉన్నారు కదా ! " అయోమయంగా అడిగింది నూకరత్నం.

" ఏం కాలేదు, ఏం చేసుకున్నాడేమోనని భయంగా ఉంది " బ్యాగ్ భుజాన తగిలించుకుంటూ అన్నాడు ఏకాంబర్.

" అబ్బ ! అర్థమయ్యేట్లు చెప్పండి. మీ అన్నగారు పుణేలో కదా ఉన్నారు, ఆయనకేమౌతుంది ? " ఆందోళనగా ఏకాంబర్ కి అడ్డుపడి అడిగింది నూక రత్నం.  ఉద్యోగం ఊడి ఇంటికొచ్చేసాడు ఫెర్వర్డెడ్ గా ఉన్నాడు. నేను ధైర్యం కూడా చెప్పను. కొంపతీసి వాడేమైనా అఘాయిత్యం చేసుకున్నాడేమోనని గుండెల్లో ఆందోళనగా ఉంది. వస్తా! వచ్చాక మాట్లాడదాం " అంటూ మరిక అక్కడ ఒక్క క్షణం నిలబడకుండా క్రిందకి దిగి పోయాడు.

బైక్ మీద నేరుగా తండ్రి డిపార్ట్ మెంటల్ స్టోర్ కి వెళ్ళాడు. బైక్ స్టాండ్ వేస్తూ షాపు గోడకు తగిలించిన తన నేం బోర్డు కేసి ఓ క్షణం చూసి వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళాడు.

" పదరా! నేనూ నీకోసమే చూస్తున్నాను. మీ అమ్మ ఇపుడే ఫోన్ చేసింది. " అంటూ అప్పటికే షాపు పని పిల్లలకి అప్పగించి రెడీగా ఉన్నాడు పీతాంబరం.

తండ్రీ కొడుకులిద్దరూ బైక్ మీద ఇంటికి బయల్దేరారు.

" ఏమైంది నాన్నా? అమ్మ ఇంత కంగారుగా ఎందుకు పిలిచింది? " బైక్ నడుపుతూనే తండ్రిని అడిగాడు ఏకాంబర్.

" ఇంటికి పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చాడట, అది దాని కంగారు. " చెప్పాడు పీతాంబరం.

" పెళ్ళిళ్ళ పేరయ్య వస్తే నేనెందుకు ? " సంశయంగా అడిగాడు.

"నీకోసం కాదురా! మీ చెల్లెలి కోసం. మొన్న చూసి వెళ్లిన పెళ్లికొడుకు వాళ్లు కబురు చేశారట, రేపే తాంబూలాలకి ఏర్పాట్లు చేసుకోమని. అందుకే ఆందోళన పడుతోంది మీ అమ్మ" చెప్పాడు తండ్రి.

"అదేంటి! ఇంత హఠాత్తుగానా? అయినా, వాళ్లు కట్నకానుకలు ఎక్కువ అడిగారని అమ్మ చెప్పింది. అందుకే, ఏ కబురూ చెప్పలేదంది!" అడిగాడు ఏకాంబర్. "అది నిజమేరా! నేను మధ్యవర్తితో ఇంతే ఇవ్వగలమని మన స్థోమతు తెలియజేశాను. అది వాళ్లకి నచ్చిందట!  ముహూర్తాలు లేవని, రేపే వస్తామని, తాంబూలాలు కూడా తీసేసుకుందామని కబురు చేశారట! మీ అమ్మ చెప్పిందిరా!" అన్నాడు పీతాంబరం.

"దీనికింత కంగారెందుకు నాన్నా! మీరున్నారు, ఇంట్లో అన్నయ్య వున్నాడు. మళ్లీ నేనెందుకు?" అన్నాడు ఏకాంబర్."ఆడపిల్ల తల్లి కదరా ఆందోళన ఉంటుంది. ఇంట్లో మొదటి శుభకార్యం. అందులోనూ ఆడపిల్ల పెళ్లి కదా! భయం, బెంగ రెండూ వుంటాయి. అందుకో తనకి ఏంచేయాలో... ఏం మాట్లాడాలో తోచక మనకి ఫోన్ చేసింది" బోధపరిచాడు పీతాంబరం.

"మీరున్నారు కదా నాన్నా!" అన్నాడు ఏకాంబర్.

"నేనుంటే మీ అమ్మకి నమ్మకంరా! నువ్వుంటే ధైర్యంరా! మీ అమ్మకే కాదు. నాకూనూ!" నెమ్మదిగా అన్నాడు పీతాంబరం.

"ధైర్యమా?!" తండ్రి మాటలు అర్థం కాలేదు ఏకాంబర్ కి.

"అవున్రా! రేపు తాంబూలాలు తీసుకోవాలంటే మా ప్రక్కన నువ్వు నిలబడితే అదే చాలురా!" అన్నాడు పీతాంబరం.

ఏకాంబరానికి అప్పుడర్థమయింది పీతాంబరం మాటల్లోని గూఢార్థం.

"అదేంటి నాన్నా! చెల్లి పెళ్లి మీకే కాదు! మాకూ బాధ్యత కదా! దేనికీ మీరు వెనుకాడకండి! ధూంధాంగా చేద్దాం. మనింట్లో మొదటి పెళ్లి బంధువులందరి మధ్య ఘనంగా జరగాలి" అన్నాడు ఆనందంగా.

చిన్నకొడుకు అంతలా భరోసా ఇచ్చేసరికి పీతాంబరం గుండెల్లో దాగి రగిలిపోతున్న ఆందోళన ఆనందంగా మారి మనసును తేలిక పరచింది."నాకు తెలుసురా! పెద్దోడు చేజారిపోయాడని భయపడ్డా. నువ్వున్నావన్న కొండంత ధైర్యంతోనే కదరా పెళ్లివాళ్లకి కబురు చేశాను. నువ్వున్నావనే!" కళ్లల్లో అతడికి తెలియకుండానే జాలువారిన కన్నీటిని తుడుచుకుంటూ అన్నాడు పీతాంబరం. 

తండ్రి మాటలు వింటూనే ఇంటికేసి బాణంలా బైకుమీద దూసుకుపోతున్నాడు ఏకాంబర్.

బైకుమీద కూర్చుని సంతోషంగా చిన్నకొడుకు ఏకాంబర్ నడుం చుట్టూ చేతులు బిగించాడు పీతాంబరం.

ధైర్యం కూడా పీతాంబరం గుండెల్నిండా ఆవహించుకున్నట్టయింది.

ఆ రోజు సాయంత్రం వేగంగానే ఇంటికి చేరుకుంది నూకరత్నం. ఆఫీసు మూసేసి దార్లో స్వీట్లు, పళ్లు కొనుక్కుని ఇంటికి బయల్దేరింది. మనసంతా చాలా ఉల్లాసంగా వుంది నూకరత్నానికి.

ఇంటికి వెళ్లిన వెంటనే తన ఆనందాన్ని అమ్మ, చెల్లాయి, తమ్ముడితో పంచుకోవాలి. ఈ రెండు నెలలు సాదాసీదాగానే గడచింది. నెలనెలా ఎంతోకొంత మిగిలిన డబ్బే తల్లి చేతిలో పెడుతోంది. కలెక్షన్ బాయ్ ల జీతాలు పోను మిగిలిన నాలుగు వేలో, అయిదు వేలో అమ్మకిస్తూంటే అమ్మే ఆశ్చర్యపోయేది.

"నెలనెలా ఒకేలా జీతమివ్వరా రత్నం?" ఒక్కోసారి ఎక్కువ, ఒక్కోసారి తక్కువ ఇస్తున్నావు" అని అడిగేది.

బట్టల షాపులో అయితే నెలనెలా మూడువేలు వచ్చేవి. అమ్మ చేతికిచ్చేది. అక్కడ మానేసి కొత్త కొలువు ఎంచుకున్నానని చెప్పానేగానీ, తనే సొంతంగా ఫ్రాంఛైజీ ప్రారంభించానని చెప్పలేకపోయాను. అలా చేస్తే ఏకాంబర్ గురించి చెప్పాల్సి వస్తుందని భయపడి మానేసింది.ఫ్రాంఛైజీ ప్రారంభించినరోజే లక్షల్లో డబ్బు ఇంటికి పట్టుకెళ్తే ఎన్నో చీవాట్లు పెట్టింది. హద్దులు మీరి బాధ్యతలు స్వీకరించకూడదని తిట్టింది.

బట్టల షాపులో మానేసి సొంతంగా తానే పదిమంది కుర్రాళ్ళతో ఫ్రాంఛైజీ నడుపుతున్నానంటే పెళ్లి చేసుకుని ఇంటికి పోవాల్సిన దానికి ఇన్ని వేషాలెందుకుంటుందని భయపడే చెప్పలేదు.ఈరోజు ఉదయం ఏకాంబర్ కి 'తన గురించి, తను సాధించిన చిట్ బిజినెస్ గురించి అందరికీ ఎంత ఉత్కంఠగా చెప్పాడు. అలానే ఇంట్లో కూడా ఊరించి ఊరించి చెప్పాలి. నాలుగు నెలలు ఆగితే తన చేతికి పది లక్షల రూపాయల కమీషన్ చెక్కుతో పాటు పోటీలో బహుమతిగా ఇచ్చే స్కూటీ గురించి కూడా చెప్పాలి.

మనసులోనే పరి పరి విధాలు ఆలోచిస్తూ నడుస్తోంది నూకరత్నం.

రైల్వే బ్రిడ్జి దాటి చంద్రనగర్ లోకి చేరుకుంది. అప్పటికి ఆరు దాటి ఏడవుతోంది. చీకటి ఆకాశాన్ని ఆక్రమించేస్తోంది.

ఆనందంగా త్రుళ్లుతూ ఇంట్లోకి అడుగు పెట్టింది నూకరత్నం. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా వుంది. ఇంట్లో ఎవరో కొత్తవాళ్లున్నారనడానికి సాక్ష్యంగా గుమ్మంలో చెప్పులు కుప్పగా పడి వున్నాయి.

నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్లి చేత్తో తలుపు నెట్టింది నూకరత్నం.

ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చుని వున్నారు. ఏమైందబ్బా! కొంపదీసి అమాకి ఏంకాలేదు కదా! అనుకుంటూనే ఇంట్లో అడుగు పెట్టింది నూకరత్నం.

వంటగది గోడకి చేరగిలబడి వున్న తల్లిని చూస్తూనే చెంగున వెళ్లి "అమ్మా..." అంటూ ఆనందంగా స్వీటు తీసి నోట్లో పెట్టబోయింది నూకరత్నం.

అంతే...!

కోపంగా నూకరత్నం చేతిలో వున్న స్వీటు బాక్సుని తీసి నేలకేసి కొట్టింది తల్లి. ఆ హఠాత్పరిణామానికి అదిరిపడింది నూకరత్నం.

"ఎవరితో తిరిగి తెస్తున్నావే ఈ ముష్టి స్వీటు?" కటువుగా అంది నూకరత్నం తల్లి.

"అమ్మా...!" గొంతు పగిలేలా అరచింది నూకరత్నం.

"అడుగత్తా" రోజూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఆ కుర్రాడెవరో అడుగు...!" అంటున్న బావకేసి చూసి ఉలిక్కిపడింది. ఇంట్లో ఓ మూల మంచం మీద మౌనంగా కూర్చున్న చెల్లీ, తమ్ముడూ ఏడుస్తున్నారు.

ఇద్దరు బావలు, వాళ్ల భార్యలు పనిగట్టుకు వచ్చినట్టున్నారు. అందరూ మంచం మీదే బొమ్మల్లా కూర్చున్నారు.

"ఏంటమ్మా నువ్వంటున్నది?" ఏదుస్తూ అంది నూకరత్నం.

" నేననలేదే ! మీ బావే నిన్ను కళ్ళారా చూసాడట. అదిగో అడుగుతున్నాడుగా చెప్పేడు " నూకరత్నం తల్లి కూడా గొల్లుబ ఏడుస్తూ అంది." అదేం చెప్తుందత్తా ! బట్టల కొట్లో మానేసి బజారున పడ్డానని చెప్తుందా ! నాలుగు రోజులుగా దీని ఆటలు, ఆగడాలు అన్నీ కనిపెడుతూనే ఉన్నాను. నేను చూడలేదనుకుని జగదాంబ జంక్షన్ లో అవ్వ! ఆ కుర్రాడ్ని వాటేసుకుని నాకు కనిపించకుండా దాక్కోవడానికి ఎన్ని చిన్నెలు చేసింది. అదిగో ! ఆరోజు నుండి దీన్ని నీడలా వెంబడిస్తున్నాను. ఇంటి దగ్గర్నుంచి బYఅటపడింది మొదలు వూరిమీదే తిరుగుతోందత్తా ! బలాదూర్ గా బజారున పడింది. " కోపంతో రుసరుసలాడిపోతూ అన్నాడు నూకరత్నం బావ.

నూకరత్నానికి నరనరాన కోపం లావాలా ప్రవహిస్తోంది.

" నేను ఫ్రాంచైజీ సొంతంగా నడుపుతున్నాను. చాలా చిట్ కంపెనీల్లో ఏజెంట్ గా చేస్తున్నాను. ఎవరి దగ్గరా తల వంచి బ్రతకడం లేదు. తల ఎత్తుకు తిరుగుతున్నాను. ' మార్కెటింగ్ వ్యాపారం' అంటే తిరగాలి కద బావా! " చాలా సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నించింది నూకరత్నం." మగాళ్ళతో రాసుకు పూసుకు తిరగడమా ! నీ భాగోతం ఎవడికి తెలీదు. మార్కెటింగ్ చేయడం అంటే మానం గీనం మంటగలుపుకోడమా?" అన్నాడు అతను.

" బావ, మర్యాదగా మాట్లాడు. వింటున్నా కదా అని తప్పుడు మాటలు మాట్లాడకు. " రోషంగా అంది నూకరత్నం.తిరగడం నీకు తప్పు కాకపోవచ్చు. పేరూ వూరూ ఉన్నవాళ్ళం. మాకు తల వంపులుగా వుంది. బ్రతకలేక మా ఇంటికి వచ్చారు. మా నాన్నే బ్రతికుంటే నిన్ను ఇలా చూస్తే చంపేసేవారు. " రెండో బావ దిగ్గున లేచి అన్నాడు.

" పెద్దవాళ్ళని గౌరవం కూడా లేకుండా అవేం మాటలే రత్నం ? అయినవాళ్ళు కాబట్టే కదా మన ఇల్లుని వెదుక్కుని వచ్చి నీ మంచి కోసమే కదా చెప్తున్నారు. " అంది తల్లి.

" అయినవాళ్ళెవరమ్మా మామయ్య చనిపోగానే మనల్ని రోడ్డుమీద వదిలేసారు. ఇన్నాళ్ళూ చచ్చామో బ్రతికామో చూడ్డానికి రాని వాళ్ళు ఇవాళ ఇలా కూడా బ్రతక్కూడదని మనని శాసిస్తున్నారు, శపిస్తున్నారు " కోపంగా బాధగా అంది నూకరత్నం.

" నువ్వెలా పోతే మాకేంటి? మా నాన్న పరువు, మా పరువు పోతుందనే నీ భాగోతం అంతా అమ్మకి చెప్పాలని వచ్చాం. నువ్వేమో ఎక్కడో గుట్టుగా ఉద్యోగం చేసుకుంటున్నావనుకుంటోంది మీ అమ్మ ." నూకరత్నం బావలు ఇద్దరూ ఒక్కసారే అన్నారు.

అంతవరకూ మౌనంగా కూర్చున్న వాళ్ళ భార్యలు కూడా లేచి అన్నారు.

" మనకెందుకు ఆ అమ్మాయి ఎలా పోతే ? మీ ధర్మం కొద్దీ వచ్చి చెప్పారు. ఇక పోదాం పదండి. " అంటూ రుసరుసలాడిపోయారు." ఎలా పోతామే ? స్వయంగా మా నాన్న చెల్లెలి కూతురు రోడ్డున పడి బ్రష్టు పట్టి పోతుంటే చూస్తూ ఊరుకోవాలా ? " కోపంగా అన్నాడు పెద్ద బావ." రత్నం.. ఏం జరిగిందో ..ఏం చేస్తున్నావో చెప్పవే...." తల్లి కోపంగా అంది.

" నేనేం తప్పు చేయలేదమ్మా బట్టల కొట్లో పని చేస్తున్న నాకు ఆ మహానుభావుడే దారి చూపించాడు. నా కాళ్ళ మీద నేను నిలబడడానికి నాచేత ఫ్రాంచైజీ ప్రారంభింపజేసాడు. ఆయనతోనే నన్ను బావ చూసాడు " చెప్పింది నూకరత్నం.

" బ్రతకడానికి దారి చూపిస్తే దాసోహం అయిపోవాలా? " కోపంగా అన్నాడు చిన్న బావ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti