Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekambar

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ :
ప్రేయసి కోసం విరాట్ పడే ఆరాటం చూసి కోప్పడతాడు చందూ..అతడు క్యాజువల్ గా అన్న మాటని సీరియస్ గా తీసుకుని వెంటనే తమ మధ్య సంభాషణ గుర్తు చేస్తూ రైల్వే స్టేషన్ అంతా పోస్టర్స్ అతికింప జేస్తాడు. ఇద్దరమ్మయిలు తమ బైక్ ని దాటి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిలో ఒకామె తాను వెతుకుతున్న అమ్మాయేనని పోల్చుకోలేక పోతాడు విరాట్..... ఆ తర్వాత.......................................


పాపం విరాట్...   తను కోరుకుంటున్న యువతి...  తమ కాలనీలోనే ఉందన్న నిజం తెలిస్తే...  ఏమైపోతాడో...?

‘‘అబ్బ తలమీద ఈ కుండల్ని ఎవడు కనిపెట్టాడో గాని పెట్టుకోలేక చచ్చిపోతున్నామే బాబూ.  తలంతా ఉక్కపోత జుత్తుకూడా రాలిపోతోంది. 

కనిపెట్టిన వాడి నెత్తిమీద వందకుండలు పగలగొట్టి సత్కరించాలి’’ విసుగుతో.

స్కూటీ దిగుతూ కామెంట్ చేసింది...  ఆమె కామెంట్ చేసింది హెల్మెట్ల గురించి.

‘‘అనవసరంగా తిట్టకే దీక్ష.  మన సేప్టీకోసమే గదా హెల్మెట్లను కనిపెట్టింది.  ముందువెళ్ళి గేటు తియ్యి’’ అంది స్కూటీ నడిపిన యువతి.

దీక్ష అనే ఆ రెండో యువతి తలమీద హెల్మెట్  తీసి తలపై నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టు ఫీలవుతూ వెళ్ళి గేటు తీసింది.  మొదటి యువతి స్కూటీని లోనకుపోనిచ్చి పోర్టికోలో లాక్చేసి తనూ హెల్మెట్ తీసేసింది.  ఈ లోపల దీక్ష గేటుకు తాళం వేసి వచ్చింది.

‘‘నువ్వెన్నయినాచెప్పవే సహస్రా. ప్రపంచంలో అత్యంత చిరాకు కలిగించే విషయం హెల్మెట్  పెట్టుకోవడమే’’  అంటూ ఇంటి తాళం తీసింది దీక్ష.

‘‘నీ చిరాకులు పరాకులు చట్టాన్ని మార్చలేవమ్మా మన కోసమే చట్టాలు చేయబడుతున్నాయి గాబట్టి వాటిని మనం గౌరవించాలి.  అనుసరించాలి’’ అంటూ లోనకు దారి తీసింది సహస్ర.  ఇంట్లో లైట్లన్ని చకచకా ఆనయ్యాయి.

అప్పటికి బయట ఆకాశం మేఘావృతమైంది,  వర్షం వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.  పావుగంటలోనే యువతులిద్దరూ బాత్రూం నుంచి ప్రషప్పయి నైటీల్లోకి మారిపోయివచ్చారు.  టీ.వీ ఆన్ చేసింది సహస్ర.

రాగానే ముందు కుక్కర్లో రైస్  పడేసింది దీక్ష.  అన్నం రేడీ కాగానే వార్తలు చూస్తూ ఉదయం కూరలు చారుతో భోంచేసేసారు. ఇంతలో బయట ఉరుములు మెరుపులు  ఏమీ లేకుండానే వర్షం మొదలైంది.

‘‘ఏయ్ సహస్రా నీకో విషయం చెప్పటం మర్చిపోయానే’’ అంటూ టి.వి వార్తలు చూస్తున్న సహస్ర పక్కకొచ్చి నుంచుంది దీక్ష.

‘‘ఏ విషయం?  ఈ పూట వానోస్తుందనా?’’  అంది నవ్వుతూ సహస్ర.

‘‘కాదు వరుడు నీ కోసం వెదుకులాడుతున్న విషయం’’ అని ఫక్కున నవ్వింది దీక్ష. ఆమె నవ్వు బయట వాన శబ్ధంలో కలిసిపోయింది. సహస్ర ముఖంలో ఒక్కసారిగా అనేక ప్రశ్నలు తొంగిచూసాయి.

‘‘ఆర్ యు జోకింగ్?’’ అంది సీరియస్ గా.

‘‘జోకింగ్ కాదు తల్లీ,  విషయం తెలిస్తే నువ్వే షాకవుతావ్.  ఈ రోజు ఉదయం పని మీదటి.  నగర్   వెళ్ళాను గదా, అక్కడ రైల్వేస్టేషన్ లో ఒక ఆజ్ఞాతప్రేమికుడి అభ్యర్థనతో కూడిన పోస్టర్లు చూసాను. అవి చూసాక సందేహించి ఎగ్మోర్ వరకు వెళ్ళి గమనించాను. ఎగ్మోర్ నుండి టినగర్ వరకు అయిదు స్టేషన్లలోను అదే పబ్లిసిటీ పాపం చాలా ఖర్చుపెట్టి ఉంటాడు.’’

‘‘కావచ్చు. దానికి నాకూ ఏమిటి సంబధం?’’

‘‘సంబధం ఉంది. సెల్ ఫోన్ తో ఫోటోలు తీసి తెచ్చాను.  అవి చూస్తే నీకే అర్థమవుతుంది.  ఇప్పుడే వస్తానుండు’’  అంటూ దీక్ష ఫోన్ తీసుకొని తన బెడ్రూమ్ లోకి వెళ్ళింది. ఫోన్ లో ఫోటోల్ని ప్రింటవుట్లు తీసి తెచ్చి సహస్ర ముందు పడేసింది.

‘‘ఒక్కసారి అవేమిటో చూడగానే నీకే అర్థమవుతుంది’’ అంది.

యధాలాపంగా ఆ ఫోటోని వాటి లోని పోస్టర్ల మీది మేటర్ని చదివింది. మొదట ఏమీ అర్థం కాలేదు.‘‘ఏమిటే..  ఇదంతా నాకోసం చేసాడనా నీ ఉద్దేశం?  నాకేమీ అర్థంగావటం లేదు’’ అంది.

‘‘అర్థంగావటం లేదా..? ఓసే మొద్దు. ప్రోఫెషనల్ జర్నలిస్టువి. నీకు అర్థంగాక పోవటం ఏమిటి? ఓ సారి గుర్తు తెచ్చుకో’’

‘‘నాకేం గుర్తు రావటం లేదు గాని వాడెవడో ఇదంతా నా కోసమే చేసాడనెందు కనుకోవాలి.  నీ కోసం అనుకోవచ్చుగా?’’ అందినవ్వి.‘‘ఎలా అనుకోమంటావే తల్లీ.  ఆ సంభాషణ సాగింది మీమధ్య గాని మామధ్య కాదు గదా. వారం క్రితం మనం ఎగ్మోర్  నుంచి టినగర్  వరకూ ట్రైన్ లో వచ్చాం గదా?’’

‘‘అవును. అయినా నా సమస్యలు నాకున్నాయి.  ఇవన్నీ గుర్తుంచుకునే తీరికెక్కడిది?  కాస్త వివరంగా చెప్పు’’

‘‘జర్నలిస్టువై ఉండి ఇంత మతిమరు పేమిటీ?  వారం క్రితం నీ జాబ్ కన్ఫర్మ్ చేయించుకోడానికి మనం మా షాపింగ్ మాల్ ఓనర్ గార్నికలవడానికిఎగ్మోర్లోవాళ్ళింటికెళ్ళిజాయినింగ్ లెటర్ మీదసంతకంచేయించి తెచ్చుకున్నాం. గుర్తుందా..?  తిరిగి వచ్చేప్పుడు ఎగ్మోర్ స్టేషన్లో కిటికీ పక్కన కూచుంటే మనకి ఎదురుగా కిటికి పక్కన ఒక అందమైన యువకుడు, అతని ఫ్రెండు కూచున్నారు. నీతో మాటాడుతూనే నువ్వు అలనాడు గవాక్షం చెంతనుండి సీతాదేవి నీలమేఘశ్యాముడు ఆ రామచంద్రుని ఓరకంట చూసినట్టు అప్పుడప్పుడు అతడ్ని చూస్తూనే వున్నావు, అతనూనిన్నుచూసాడు. నీతోమాటకలపాలనిటైంఅడిగాడు. నీహేండ్ బ్యాగ్ బాగుందన్నాడు. ఇంతలో మనం టి.నగర్  స్టేషన్లో  దిగిపోయాం.  పార్కింగ్ లోంచి స్కూటీ తీసుకొని పాండీబజార్లో సరుకులు కొనుక్కొని ఇంటికొచ్చాం....!’’

‘‘ఆగాగు...’’ అంది ఉన్నట్టుండి సహస్ర.

ఇప్పుడామెకు అంతా గుర్తొచ్చింది.

‘‘అవును కదూ... నిజమే సుమా..  అలాగని నన్ను సీతాదేవితో వాడ్ని రాముడితోనూ పోల్చక.  వయసులో ఉన్నాం. కుర్రాడు బాగున్నాడని చూసిన మాట నిజమే. అంతమాత్రం చేత యిలాంటి పిచ్చి పనిచేయటమేమిటి? ఏకంగా పోస్టర్లే వేయిస్తాడా..? స్టుపిడ్ ఇప్పుడే వాడిపని చెప్తాను’’ అంటూ ఫోన్  అందుకోబోయింది కోపంతో సహస్ర.

వెంటనే ఫోన్  లాక్కుంది దీక్ష.

‘‘వాడు చేసింది పిచ్చి పని కాదు.  ఇప్పుడు నువ్వు చేయబోయేది పిచ్చిపని.  ఇప్పుడు నీ ఫోన్లోంచి చేసినా నా ఫోన్లోంచి ఫోన్ చేసినా నంబరు అతని ఫోన్లో ఫీడవుతుంది. తర్వాత తెగ ఫోన్లు చేసి విసిగిస్తాడు.’’ అంటూ హెచ్చరించింది.

దీక్ష మాటల్లో వాస్తవముంది.

ముక్కు ముఖం తెలీని వ్యక్తికి ఫోన్ చేసి తర్వాత ఇబ్బంది పడే కన్నా అస్సలు చేయకుండా ఉండటమే మంచిదనిపించింది సహస్రకి.బయట వర్షం పెరిగిందే గాని తగ్గలేదు. రాత్రంతా ఇలాగే ఉండేలా వుంది. చలి చలి వాతావరణం హాయిగా ఉంది. గాలి లేదు ఉరుముల్లేవు మెరుపుల్లేవు. కుండపోతగా వాన... ఒక్కోసారింతే..  నిశ్శబ్ధంగా అలుముకున్న మబ్బులు తెల్లార్లు కురిసిపోతాయి.  తన లైఫ్లో కష్టాల్లాగే..  కోరితెచ్చుకున్న కష్టాలు..  ఆజ్ఞాతవాసం...  ఆలోచిస్తోంది సహస్ర. ఆమె మౌనాన్ని మరోల అర్థం చేసుకుంది దీక్ష.

‘‘ఏమిటి అలా ఆలోచిస్తున్నావ్? నీకు నచ్చ లేదంటే వదిలేయ్. అతని సంగతి నేను చూసుకుంటాను. నాకు మాత్రం తెగ నచ్చాడు’’ అంది కొంటెగా.

‘‘అంతగా నచ్చితే ఎవరు కాదన్నారు.  చూసుకో’’ అంది సహస్ర.

‘‘వాడి ఫోటో చూస్తే చాలా ఆశ్చర్యపోతావ్  తెలుసా?’’  హీ మేన్ లా ఉన్నాడు’’ అంటూ లేచి వెళ్ళి వాన జల్లులు లోనకు రాకుండా కిటికీ రెక్కలు మూసి వచ్చింది దీక్ష.

సహస్ర ఆసక్తిగా చూసింది.

‘‘ఏమిటే తెగ జోకులేస్తున్నావ్  అతని ఫోటో నీ దగ్గర ఎందుకుంది?’’  అంది.

‘‘ఎందుకేమిటే ఫోటో తీస్తే ఉంటుంది. చూపులు కలిసిన శుభవేళాని నువ్వలా క్రీగంట చూస్తుంటే ముచ్చటేసి ఎవరూ చూడకుండానా ఫోన్ తో రెండు క్లిక్లు కొట్టాను. చూస్తావా?’’

వచ్చి కూచుని తన ఫోన్ అందుకుంది దీక్ష.

ఇరవైసెకన్ల తర్వాత ఫోన్లో ఫోటోని చూపించింది. ఒక ఫోటోలో అతడి ముఖం సైడ్ యాంగిల్లో ఉంది. రెండో ఫోటోలో స్ట్రెయిట్ గా చాలా బాగా వచ్చింది. నిజంగా అతను చూడ్డానికి చాలా చాలా బాగున్నాడు.

సహస్ర కళ్ళ ముందు ఆ రోజు రైలు ప్రయాణంలో జరిగిన సంఘటన ఇప్పుడంతా గుర్తుకొచ్చింది.

తను అంతగా నచ్చిందా?

ఎవరితను? ఎక్కడుంటాడు?

వూరేది పేరేమిటి?

అతడి ఫోటో చూస్తూ ఆలోచిస్తోంది.

‘‘ఏయ్ దీక్ష! రాను రాను నువ్వు మరీ కంత్రీవై పోతున్నావేమిటి?  ఎవరికీ చెప్పకుండా అతడి ఫోటో తీసింది గాక ఇన్ని రోజులూ దాచిపెట్టుంచావంటే...  నిన్నేం చేయాలే?’’ అంది నవ్వుతూ.

‘‘ఏం చేయక్కర్లేదు గాని ఫోటో అయితే చూసావ్  మరి పేరు అడగవా?  పాపం నీకోసం పరితపిస్తూ బ్యానర్లు కట్టాడుగా’’  అంది దీక్ష. ఆ మాటలకు సహస్ర ఆశ్యర్యం మరో మెట్టు పైకిపోయింది.

‘‘పేరు?...  ఇతని పేరు కూడా నీకు తెలుసా?’’ అంది నమ్మలేనట్టు.

‘‘తెలీదుకాని వాడి ఫ్రెండు వాడ్ని అలాగే పిలిచాడు కాబట్టి గుర్తుపెట్టుకున్నాను.  నీ పేరు లాగే అతడిదీ వెరైటీ పేరు.  ఏమిటో తెలుసా?...  వి... రా.. ట్...’’ అంటూ సాగదీసి పకపక నవ్వింది దీక్ష. సహస్ర కూడా నవ్వకుండా ఉండలేక పోయింది. నిజంగానే అతడి పేరు వెరైటీగా అర్థవంతంగా చాలా బాగుంది.

సహస్ర దీక్ష  ఇద్దరిదీ స్వస్థలం తమిళనాడు లోని మథురై.  మథురైని తెలుగు నాయక రాజులు పాలించిన కాలం నుంచీ మథురై, తంజావురు కోయంబత్తూరు లలో పూర్వం ఎప్పుడో సెటిల్  అయిన అనేక ఆంధ్రా కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో తమిళంతో బాటు తెలుగుకీ అంతటి ప్రాధాన్యత ఉంది. తంజావురు లోని సరస్వతీ గ్రంథాలయంలో అపూర్వమైన అనేక పురాతన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. అమూల్యమైన ఆ తెలుగు తాళపత్ర గ్రంథాలను ఆంధ్రాకు తేవాలని అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి యన్.టి. రామారావు గారు ఎంతో ప్రయత్నించారు. ఆయన కృషి ఒక కొలిక్కి వచ్చేలోన ఆయన పదవి నుంచి దిగిపోవటంతో తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ ఇక వాటి గురించి పట్టించుకోవటం మానేసారు

. తమిళనాడులోని ఆయా ప్రాంతాల్లో కోటీశ్వరులయిన ఆంధ్రా కుటుంబాలు అనేకం ఉన్నాయి. లేదంటే ప్రాంతీయంగా వారి భాష కొద్దిగా యాసతో కూడి కాస్త భిన్నంగా విన్పిస్తుంది. అది స్థానికుల వరకే. బయటి ప్రాంతాలకు వచ్చిపోయేవాళ్ళు మాత్రం మనలాగే తెలుగు చక్కగా చదువుతారు. మాట్లాడుతారు.

అటువంటి మథురై పట్టణంలో మహాదేవ నాయకర్ అనే బిజినెస్ మేన్ ఉన్నాడు. మథురైలో సగం లిక్కర్ షాపులు ఆయనవే. మథురై పరిసర ప్రాంతాల్లోను ఆయనకు ఇతరత్రా చాలా వ్యాపారాలున్నాయి. కోటీశ్వరుడు. ఆయన భార్య పేరు మూగాంబికై.

మహాదేవనాయకర్ మూగాంబికైదంపతులకుఏకైకసంతానంసహస్ర. ఈ అమ్మాయి పుట్టాక బాగా కలసి వచ్చిందని చిన్నప్పట్నుంచి సహస్రను ఎంతో గారాబంగా పెంచారు. సహస్ర స్థానిక కాలేజీ లోనే డిగ్రీ చేసింది. ఇంగ్లీషు లిటరేచర్ లో ఫస్ట్ క్లాస్ లో పాసయింది. తర్వాత తండ్రి కోరిక మీద అమెరికా వెళ్ళి బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్స్ చేసి వచ్చింది. తర్వాత తన ఇంట్రస్టు కొద్ది ఢల్లీి యూనివర్శిటీ నుంచి జర్నలిజంలో గోల్డ్ మెడల్  సాధించింది.

నిజానికి సహస్రకి బిజినెస్ కన్నాజర్నలిజం మీదే మక్కువ ఎక్కువ. స్థానిక రిపోర్టర్ గా పత్రికలకు వార్తలు వార్తా కథనాలు చక్కటి వ్యాసాలు విశ్లేషణలు పంపించేది. ఆ విధంగా ‘సహస్ర’గా పాఠకులకు చిరపరిచితురాలే. తెలుగు తమిళం హిందీ ఇంగ్లీషు భాషల్లో ప్రవీణురాలు సహస్ర.దీక్ష విషయం చూస్తే ఆమోదో విచిత్రమైన గాధ. ఆమె కూడా మధురై లోనే ఒక ఉన్నత కుటుంబానికి చెందిన యువతి. అయిదుగురు అన్నల తర్వాత ఆఖరున పుట్టిన ముద్దులచెల్లెలు.  సహస్రదీక్షలు ఒకే కాలేజీలో చదువుకున్నారు. వారి స్నేహం బలపడిరది.  కాలేజి వదిలి నా కూడా ఎప్పుడూ ఫోన్లో టచ్ లోనే ఉండేవారు. దీక్ష కూడా బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు చదువుతుండగా వూహించని పరిస్థితుల్లో మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది.

తల్లిదండ్రులు పోవటంతో, అన్నలు అయిదుగురూ పిత్రార్జితం ముఫ్పై కోట్ల ఆస్థినీ తామే కాజేసి దీక్షకు పాతిక లక్షలు కట్నం ఇచ్చి పెళ్ళి చేసి పంపించేయాలని ప్లాన్  చేసారు. అన్నల ద్రోహబుద్ధి తెలీగానే దీక్ష కోర్టుకెళ్ళి సంవత్సరం పాటు పోరాడి గెలిచి అన్నలతో బాటు సమంగా తన వాటా కింద అయిదుకోట్లు పొందింది. తర్వాత ఇక అక్కడ ఉండటం ఇష్టం లేక చెన్నై వచ్చేసి ఇప్పుడుంటున్ననూట అరవయ్యో నంబరు ఇంట్లో అద్దెకుఉంటూ కాలక్షేపానికి ఒక పేద్ద షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్ గా చేరింది.

మొట్టమొదట గోస్వామి బిల్డర్స్ అండ్ కన్స్ ట్రక్షన్స్ వారినుంచి ఆయిల్లు కొన్న వ్యక్తి స్టేట్ బ్యాంక్ మేనేజర్. అతనికి నాగపూర్ ట్రాన్స్ ఫరవటంతో ఇల్లు దీక్షకు అద్దెకిచ్చి ఫామిలీతో నాగపూర్ వెళ్ళిపోయాడు. తర్వాత ఏదో కారణాల వల్ల ఆ యింటిని అమ్మకానికి పెట్టడంతో దీక్ష సందేహించకుండా తొంభైలక్షలకు ఆ యింటిని కొనుక్కొంది.  తను మథురై వదిలాక తన అన్నలకు కూడా చెప్పలేదు. కాని సహస్రకు అంతా తెలుసు.  ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కాల్ చేసి ఒకరి కష్టసుఖాలు ఒకరికి చెప్పుకోవటం అలవాటు.

‘‘ఇల్లు కొనుక్కున్నావ్ సరే దీక్ష, మరి ఇల్లాలివెప్పుడవుతావే’’ అంటూ సహస్ర వేళాకోళం చేస్తే నవ్వేస్తూ ‘‘ దాని దేముందే నువ్వు నా దగ్గరకొచ్చేయవే... ఆటోమెటిక్ గా ఇల్లాలినైపోతాను’’ అనేది.

‘‘ఓసినీ.. నువ్వు నాకు మొగుడి పోస్టిచ్చినా నిన్ను భరించే శక్తి నాకు లేదులేవే కంత్రీ’’  అని సహస్ర కౌంటరివ్వగానే ఇద్దరూ తెగ నవ్వుకునేవారు.

ఇలా ఉండగా ఆరువారాల క్రితం`

ఏం జరిగిందో ఏమిటో తెలీదు.

సడెన్ గా రెండు సూట్ కేస్ లతో రాత్రి పది గంటలకి ఆటోలో ఇల్లువెదుక్కుంటూ దీక్ష వద్ద కొచ్చేసింది సహస్ర.  ఎందుకొచ్చావని దీక్ష అడగలేదు. తను చెన్నై వచ్చిన ఇంత కాలం తర్వాత తన వద్ద కొచ్చిన మొట్టమొదటి మనిషి సహస్ర. ఆమెను చూడగానే అందర్నీ చూసినంత ఆనందం. తన ఒంటరి జీవితంలోకి ఆమె రాక బలాన్ని ధైర్యాన్ని ఇచ్చింది.

దీక్ష అడక్కపోయినా సహస్ర క్లుప్లంగా తన రాకకి రెండు కారణాలు చెప్పింది. ఒకటి ఇంటి పరిస్థితి బాగాలేదు. ఇష్టం లేని పెళ్ళి చేయాలని చూస్తున్నారు. రెండో కారణం వృత్తి రీత్యా సమస్యలున్నాయి. కొంత కాలం నేనిక్కడనీ వద్ద ఉన్నసంగంతి ఎవరికీ తెలీయకూడదు. ఇంతే. ఇంతకు మించి ఆమె చెప్పనూలేదు దీక్ష అడగనూలేదు.

ఎలాగో తను బిజినెస్ మేనేజ్ మెంట్ చేసింది గనక ఖాళీగా ఉండటం ఇష్టం లేక దీక్షతో బాటు ఆమె పనిచేస్తున్నషాపింగ్ మాల్లో జాయినయింది. నెల తిరిగే సరికి షాపింగ్ మాల్ సూపర్ వైజర్ సహస్ర టాలెంటు గుర్తించి ఆమె ఏం చదివిందో తెలుసుకుని తమ ఓనర్ని రెకమెండ్ చేయటంతో వూహించని విధంగా సేల్స్, ఎగ్సిక్యూటివ్ గా సహస్రకు ప్రమోషన్ లభించింది. ఈ సందర్భంగానే దీక్ష వెంట తను ఎగ్మోర్ వెళ్ళి వస్తుండగా రైల్లో ఈ విరాట్  కన్పించాదు.

‘‘ఏయ్ సహస్ర!‘‘ అంటూ దీక్ష పలకరింపుతో ఆలోచనల నుంచి బయటపడిరది. సహస్ర.

‘‘వద్దనుకున్న వాడి గురించి మరీ ఎక్కువగా ఆలోచించకూడదమ్మా.  పాపం నీ మీద మనసు పారేసుకున్న ఈ సుకుమారుడికి దిష్టి తగులుతుంది’’ అంటూ ఫోన్ లాక్కుంది దీక్ష.

‘‘నేనేం వాడి గురించి ఆలోచించటంలేదులే, ట్రై చేస్తానన్నావ్ గా ఛాయిస్ నీదే’’ అంది నవ్వుతూ సహస్ర.

‘‘నీ ఉద్దేశం నువ్వు వదులుకున్న వాడ్ని నేను కట్టుకుంటాననుకున్నావా?  నెవ్వర్. పాపం నీ కోసం ప్రయత్నిస్తున్నాడుగా.  చూద్దాం నిన్ను ఏ మాత్రం పట్టుకుంటాడో, పడగొడతాడో’’ అంది టీజింగ్ గా దీక్ష.

నిజానికి విరాట్  తమ కాలనీలోనే ఉన్న సంగతి సహస్ర దీక్షలకు తెలీదు. తెలిసే అవకాశం కూడా లేదు ఎందుకంటే....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్