Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Dikkulu Choodaku Ramayya

ఈ సంచికలో >> సినిమా >>

నేను పంచ‌దార‌లాంటోడ్ని.. - ఎమ్‌.ఎమ్. కీర‌వాణి

Interview with  M.M. Keeravaani

ఇప్ప‌టి పాట‌.. డ‌బ్బాలో గుళక‌రాళ్లు వేసి ఆడించినట్టే ఉంది. అదేమంటే ట్రెండ్ అంటున్నారంతా! ఢ‌మ ఢ‌మ ఢ‌మ్  అంటూ శ‌బ్దాల మ‌ధ్య సాహిత్యం న‌లిగిపోయి వెర్రికేక‌లు పెడుతుంటే.. అదే కొత్త‌ద‌నం అని క‌వ‌రింగిస్తున్నారు..! ఇది నా సొంత ట్యూన్ అని చెప్పుకోవ‌డానికి ఏ సంగీత ద‌ర్శ‌కుడికీ ధైర్యం చాల‌డం లేదు. ఎందుకంటే ప్ర‌తీ హిట్ పాట‌కీ ఎక్క‌డి నుంచో స్ఫూర్తి తీసుకోవడం, లేదంటే కాపీ కొట్ట‌డం హాబీగా మారిపోతోంది. ఇలాంటి కాలుష్యంలో.. హాయిగా విన‌గాలిగే, సొంత బాణీ అనిపించే, తెలుగు ప‌దాలు గ‌ర్వించే పాటొక‌టి వ‌చ్చిదంటే.. నో డౌట్ - అది కీర‌వాణి పాటే అయ్యుంటుంది. ట్రెండ్ మారినా, అభిరుచులు ప‌క్క‌దారి ప‌డుతున్నా... తాను మాత్రం పొల్యూట్ కాకుండా సంగీత‌యానం సాగిస్తున్నారు కీర‌వాణి. దిక్కులు చూడ‌కు రామ‌య్యా సినిమాతో మ‌రోసారి త‌న‌దైన బాణీ వినిపిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కీర‌వాణితో జ‌రిపిన ముచ్చ‌ట్లివి..

*ఈమ‌ధ్య మీరు వినిపించ‌డం బొత్తిగా మానేశారు.. సినిమాలు బాగా త‌గ్గించేశారెందుకు..
- త‌గ్గించేశా అని చెప్ప‌కూడ‌దు. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవాళ్లు త‌గ్గిపోయారు..

* కీర‌వాణి అంత‌టివారితో మేం సంగీతం చేయించుకోగ‌ల‌మా అనే మీమాంశ‌లో ఉన్నారేమో..?
- నాకు మాత్రం అలాంటివేం లేవండీ. నేనేం పెద్ద సంగీత ద‌ర్శ‌కుడిని అనుకోవ‌డం లేదు.. అంద‌రికీ అందుబాటులోనే ఉన్నా..

* అందుబాటులో ఉన్నా అంటారే గానీ, ఎక్కువ‌గా రాఘ‌వేంద్ర‌రావు, రాజ‌మౌళి సినిమాలే చేస్తుంటారు..
- దిక్కులు చూడ‌కు రామ‌య్యా సినిమాకి వారిద్ద‌రు ద‌ర్శ‌కులు కారే...

* త్రికోఠి... రాజ‌మౌళి శిష్యుడే క‌దా. ఆ కాంపౌండ్‌లోని వ్య‌క్తులకే ప‌రిమిత‌మ‌య్యారు అనడానికి ఇంత‌కంటే ఏం కావాలి..?
- ఏ ఒక్క‌రితో ప‌రిమితం అవ్వాల‌ని లేదు. అది నా త‌ప్పూ కాదు. ఒక‌రు మ‌న‌ల్ని పూర్తిగా న‌మ్ముతున్నారంటే మంచిదేగా.
రాఘ‌వేంద్ర‌ర‌రావుగారితో ట్రావెల్ చేశా. ఇప్పుడాయ‌న రిటైర్‌మెంట్ మూడ్‌లో ఉన్నారు. ఈలోగా రాజ‌మౌళితో ప్ర‌యాణం మొద‌లైంది. రేపు ఇంకొక‌రు కావ‌చ్చు..

* రాజ‌మౌళి, రాఘ‌వేంద్రరావుల‌కే మీరు మంచి పాట‌లు అందిస్తార‌న్న విమ‌ర్శ ఉంది..
- చూడండి.  నేను పంచ‌దార లాంటోడ్ని. పంచ‌దార‌గారూ. పంచ‌దార‌గారూ మీరు పాల‌తో క‌లిసిన‌ప్పుడు ఒక‌లా ఉంటారు, నీళ్ల‌తో క‌లిసిన‌ప్పుడు మ‌రోలా ఉంటారు. కార‌ణం ఏంట‌ని అడిగితే  ఏం చెబ‌తా??  ద‌ర్శ‌కుడి అభిరుచిని బ‌ట్టే నా సంగీతం ఉంటుంది.

* దిక్కులు చూడ‌కు రామ‌య్యా విష‌యానికొద్దాం. పాటలు కాస్త కొత్త‌గా అనిపిస్తున్నాయి. కీర‌వాణి బ్రాండ్ గీతాల్లా లేవు. కార‌ణం..
- క‌థ కొత్త‌గా ఉంది. దానితో స‌న్నివేశాలు కొత్త‌గా పుట్టుకొచ్చాయి. ఆ ప్రేర‌ణ‌తోనే పాట‌లూ కొత్త‌గా వచ్చుంటాయి.

* ఈ సినిమాకి మీరే హీరో అంటున్నారంతా..
- కానీ నాకు మాత్రం ముగ్గురు హీరోలు క‌నిపిస్తున్నారు. నిర్మాత సాయికొర్ర‌పాటి, ద‌ర్శ‌కుడు త్రికోఠి, న‌టుడు అజ‌య్‌.. ఏ ఒక్క‌రితోనో సినిమా ఆడేయ‌దు. స‌మ‌ష్టి కృషి అంటారే... ఆ మాట‌ ఈ సినిమాకి బాగా  న‌ప్పుతుంది.

* చిన్న సినిమా చేస్తున్నానే అనే ఫీలింగ్ క‌ల‌గ‌లేదా.?
- అస‌లు చిన్న సినిమా అంటే ఏంటి??   భారీ బ‌డ్జెట్, భారీ తారాగ‌ణం ఉండి కూడా, భారీగా ఖ‌ర్చు పెట్టి కూడా త‌మ సినిమాని విడుద‌ల చేసుకోని ప‌రిస్థితిలో ఉన్న ప్ర‌తి సినిమా చిన్న సినిమానే. ఈ సినిమా అనుకొన్న తేదీకి వ‌చ్చేసింది. కాబ‌ట్టి పెద్ద సినిమానే.

* సంగీతానికి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉంటుందా?
- అది మ‌నం పెట్టుకొన్న ప‌రిమితి. స్వ‌రానికీ, సాహిత్యానికీ పెట్టుబ‌డి ఎంతండీ.??  ఖ‌రీదైన గాయ‌కుడితో పాడిస్తే.. ఆ పాట కాస్త బాగుంటుందేమో. కానీ ఆ ఖ‌ర్చు పాట‌లో క‌నిపించ‌దు క‌దా..??

* ఈ పాట ఫ‌లానావాళ్ల‌తోనే పాడించాల‌న్న నియ‌మం ఎప్పుడైనా పెట్టుకొన్నారా?
- ఆగ‌దూ.. ఆగ‌దూ. అని పాడుకొన్న‌ట్టు, ఏ సినిమా ఎవ‌రి కోస‌మూ ఆగ‌దండీ. ఫ‌లానా వాళ్ల‌తోనే పాడించాల‌ని కూర్చుంటే టైమ్ నిల‌బ‌డ‌దు. ఒక్క బాలుగారి కోస‌మే నా పాట ఎదురుచూస్తుంటుంది. ఆయ‌న మాత్ర‌మే పాడాలి అనుకొన్న పాట‌ని ఆయ‌న‌చేతే పాడించా. మ‌రెవ్వ‌రి కోసం నేను ఎదురుచూడ‌ను.

*  ఈమ‌ధ్య పాట‌లు రాయ‌డం లేదేంటి?
- కావాల‌ని కూర్చుంటే పాట రాదండి. అది స‌హ‌జంగా పెల్లుబీకాలి. నిజానికి సంగీత ద‌ర్శ‌కుడికంటే ర‌చ‌యిత‌ని అని చెప్పుకోవ‌డంలోనే ఎక్కువ సంతృఫ్తి దొరుకుతుంది.

* ఈమ‌ధ్య మిమ్మ‌ల్ని బాగా ఆక‌ట్టుకొన్న సంగీత ద‌ర్శ‌కుడు..
- ఎం.ఆర్ స‌న్నీ పాట‌లు బాగా న‌చ్చాయి. స్వామి రారా పాట‌లు బాగున్నాయి. అయితే ఉయ్యాల జంపాలా స్టాండ‌ర్డ్ కాస్త త‌గ్గింది. స్వామి రారాకి వంద మార్కులేస్తే, ఉయ్యాల‌కి ఎన‌భైనే వేశా.

* పాత పాట‌ల్ని రీమేక్ చేసే సంప్ర‌దాయం మ‌రీ ఎక్కువ అవుతోంది. అలాంట‌ప్పుడు సంగీత ద‌ర్శ‌కుడికి మ‌ళ్లీ రెమ్యున‌రేష‌న్ ఇస్తారా?
- ఆ నిబంధ‌న‌లు నాకూ కాస్త కొత్త‌గానే అనిపిస్తున్నాయి. ఒకొక్క‌సారి ఒక్కోలా మారుతున్నాయి. మ‌గ‌ధీర‌లో బంగారు కోడి పెట్ట అనే పాట రీమిక్స్ చేశాం. పాత పాట రాసిన భువ‌న చంద్ర‌గారికి మ‌ళ్లీ పారితోషికం చెల్లించాం. సంగీత ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత‌, ఆడియో కంపెనీ, నిర్మాత‌. ఇలా వాటాలు పంచుకోవాల్సి ఉంటుంది.

* ఆడియో కంపెనీ పెట్టారుగా.. ఎలా ఉంది.?
- ఓ జ‌న‌ర‌ల్ స్టేట్‌మెంట్ ఇస్తా.. రాసుకోండి. క‌ళాకారులెవ‌రూ వ్యాపారానికి ప‌నిచేయ‌రు. ఈ స్టేట్‌మెంట్ ని మీరెలా అర్థం చేసుకొన్నా ఫ‌ర్లేదు.

* బాహుబ‌లి పాట‌లెంతవ‌ర‌కూ వ‌చ్చాయి..?
- ఇంకా రికార్డింగ్ మొద‌లెట్ట‌లేదు. ప్ర‌స్తుతం పాట‌లు రాస్తున్నారు..

* ఒకే.. ఆల్ ది బెస్ట్‌
- కృత‌జ్ఞ‌త‌లు....

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Bannu