Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

నాట్య భారతీయం - కోసూరి ఉమా భారతి

..ఆ ఆశీస్సులు, అభిమానమే, నాకు కొండంత బలమయ్యాయి......  

“సంగీత జ్ఞానంతో పాటు నాట్యం నేర్చుకోవాలన్న ఆసక్తి,  ఆ పెద్దదానికి ఉంది.......దానికి చెప్పించు కూచిపూడి, భరతనాట్యం.  మిగతా వాళ్ళని చదువుకోనివ్వు,  సత్యనారాయణా,”  అనేది అమ్మమ్మ,  మా నాన్నతో........

అమ్మమ్మపేరు ముంతా కోటేశ్వరమ్మ. సంగీతంలో నిష్ణాతు రాలు.   గుంటూరులో మహిళాసంఘం అధ్యక్షురాలుగా వ్యవహరించేది. ఆమె దేవుని గది చాలా ప్రత్యేకంగా ఉండేది. తమ పెద్ద భవంతిలో పొగడపూవుల చెట్టుకింద అరుగు మీద కూర్చుని, మాకు తరంగాలు, కృతులు పాడి వినిపించేది ... ఎన్నో కథలు కావ్యాలు చెప్పేది. కృష్ణుని భక్తురాలు...శ్రీ కృష్ణుడి కథలు ఎక్కువగా చెప్పేది.  చాలా అందంగా ఉండేది కూడా....

అమ్మమ్మ  మంచి పేరున్న వ్యక్తి.  స్థితిమంతురాలు.  సినిమాహాలు వోనర్.  ఓ వీధంతా ఆవిడ బంగళాలు ఉండేవి... తను నివశించే భవంతి మాత్రం, తానే దగ్గరుండి, శ్రద్దగా కట్టించుకుందని అంతా చెప్పేవారు... తాతగారు తహసిల్దారుగా చేసి రిటైర్ అయ్యారు.

నేనంటే అమ్మమ్మకి ఇష్టమే.   ‘ఉమ్మీ’ అని పిలిచేది.  అమ్మా వాళ్ళతో మాట్లాడేప్పుడు నన్ను ‘ఆ పెద్దది’ అని  సంబోధించేది.  డాన్సు నేర్చుకొనే అర్హత, మా అందరిలో  నాకొక్కదానికే ఉందని  భావించేది అమ్మమ్మ.  ఇంట్లో, మేము ముగ్గురం ఆడపిల్లలం.

ఆ తరువాత మేము మద్రాసు వెళ్ళి,వరంగల్లో కొన్నేళ్లుండి,  తిరిగి  హైదరాబాదు చేరినప్పుడు, 

అమ్మమ్మ కొంతకాలం  మా దగ్గరే ఉండేది.  వేదాంతం జగన్నాధశర్మ గారు  ఇంటికే వచ్చి నాకు కూచిపూడి నేర్పే ఏర్పాటు చేసారు నాన్న.  నా....క్లాస్ జరుగుతుండగా, ఎదురుగా కూర్చుని,  నా డాన్స్  ప్రాక్టీసులు చూసేది అమ్మమ్మ...

’తరంగం’ నేర్చుకునే సమయానికి, ఆ నాట్యాంశకి  అవసరమైన  ‘ఇత్తడి పళ్ళెం’ తానే ఇచ్చింది నాకు... ఆమె పేరు కూడా వేయించి ఉంటుంది దాని మీద.పూజ సామగ్రి, పువ్వులు పెట్టుకునే పళ్ళెం అది..

ఆ ‘పళ్ళెం’ దేశావిదేశాలు తిరిగింది నాతో పాటు..  ఇప్పటివరకు, జీవితకాలం పాటు నా ప్రతి ప్రదర్శనలో అదే నా ‘తరంగం పళ్ళెం’... కొన్ని మార్లు వెల్డింగ్ చేయించాము కూడా... అమ్మమ్మిచ్చిన ‘తరంగం పళ్ళెం’ మాత్రం మార్చలేదు...

అమ్మ నవ్వుతూ, ‘మహత్తు గల పళ్ళం ఇచ్చింది మా అమ్మ,” అనేది.

నేను ‘Hyderabad Lions Club’ వారి statewide  dance competitions లో పాల్గొని, క్లాసికల్ మరియు జానపద విభాగాల్లో మొదటి ప్లేస్ గెలుచుకున్నప్పుడు,  ఎంతో గర్వపడి, ఆశీర్వదించింది అమ్మమ్మ. అక్కడక్కడ  నృత్య ప్రదర్శనలివ్వడం  కూడా మొదలుపెట్టాక,,  ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని’ ఎప్పుడో చెప్పానుగా! చక్కగా చేస్తుంది,”  అని సంతోషపడేది...

నా గురించి నాకు తెలియని విషయాలు కొన్ని చెప్పేది.

బాగా చిన్నపటి నుండి - అంటే, నాలుగేళ్లప్పుటి నుండే, డాన్స్ చేయాలని స్వతహాగా నాకే చాలా ఇంట్రస్ట్  ఉండేదిట. ఏ మ్యూజిక్  విన్నా దానికనుగుణంగాడాన్సు  చేసేదాన్నట. ఆ  విషయం ‘ఔనని’ అమ్మ  ధృవీకరించింది కూడా.ఇంకా చెప్పమని, వివరాలు అడిగి తెలుసుకొనే దాన్ని...

ఊహ తెలిసాక మాత్రం, నా డాన్స్ పాఠాలు ఎలా మొదలయ్యాయో  గుర్తు చేసుకొనేదాన్ని......

మరువలేని నా చిన్ననాటి జ్ఞాపకాల్లో కూడా అంతా నా డాన్స్ విషయాలే మరి....

నేను కూచిపూడి శిక్షణ  మొదలుపెట్టినప్పుడు  నాకు ఆరేళ్ళు. మద్రాస్ నగర్ లో మేమున్న ఆవరణ లోనే, వెంపటి చినసత్యం గారి డాన్సు స్కూల్ ఉండడం నా అదృష్టమే అనుకోవచ్చు.  కళల పట్ల మా నాన్నగారికి అమ్మకి కూడా అభిమానం మెండుగా ఉంది. అయినా, నా ఆసక్తి  వల్లే  ఆరేళ్ళప్పుడు  డాన్స్  క్లాసుకి పంపడానికి  ఒప్పుకున్నారు.  నాకు బాగా గుర్తు... మొదట్లో,  అమ్మని ఒప్పించడానికి  కాస్త కష్టమే అయింది... ఓ రోజు,  డాన్స్ క్లాస్ మొదలయ్యే టైం కి, వాళ్ళ క్లాస్ ముందున్న  వరండాలో తచ్చాడుతున్న నన్ను మాస్టారు చూసారు.   ధైర్యంగా నేనే ఆయన వద్దకు వెళ్ళి,  క్లాస్లో కూర్చోడానికి అనుమతి అడిగాను.అలా వారం రోజుల పాటు డాన్స్ పాఠాలు అయ్యేంత వరకు చూసి ఇంటికి వెళ్ళడం చేసాను.  ప్రతిరోజు ఇంటికి వెళ్ళేప్పటికి అమ్మ తప్ప అందరూ భోంచేసేసేవారు. నన్ను పిలవడానికి మా ఆర్డర్లీ కన్నన్ వచ్చినా,  క్లాస్ బయటనే ఉండిపోయేవాడంట. వరసగా ఆ వారమంతా నేను అలా చేసేప్పటికి, అమ్మకి కోపం వచ్చింది. “ఒకటో, రెండో  రోజులు  అక్కడ  ఏం  జరుగుతుందో  చూసొస్తావులే  అనుకున్నాను.  వారం  రోజులుగా  రాత్రి వరకు అక్కడే పడుంటున్నావు. 

ఇంట్లో తమ్ముడితో, పనితో నాకు ఊపిరాడటంలేదు.  స్కూల్ వర్క్ చేస్తున్నట్టు కూడా లేవు,” గట్టిగా కోప్పడింది అమ్మ, ఆ రాత్రి అన్నం వడ్డిస్తూ... అమ్మ కోపానికి భయమేసి, మరునాడు, ఆ తరువాత కూడా ఎక్కడికీ వెళ్ళలేదు.  డాన్స్ క్లాస్ వంక కన్నెత్తిచూడలేదు.  పుస్తకాలు ముందు పెట్టుకొని కూర్చున్నాను.  దిగులుగా అయిపోయాను. ‘ఎలాగైనా నాన్నతో మాట్లాడి, అమ్మ కోపం పోగొట్టి, డాన్స్ చూడ్డానికి  వెళ్ళాలి.  అసలు డాన్స్ నేనెందుకు నేర్చుకోకూడదు? అమ్మావాళ్ళని  అడగాలి’ అనుకున్నాను. మరునాడు  డిన్నరయ్యాక,  నా గదిలో హోంవర్క్ చేసుకుంటున్నాను. “ఉమా  ఇలా రా,” పిలిచారు నాన్న.  డాన్స్ క్లాస్ ఆలోచనలోనే ఉన్న నేను మెల్లగా వెళ్లాను.  సిటింగ్ రూములో అమ్మా, నాన్నలతో కూర్చుని మాట్లాడుతున్న సత్యం  మాస్టారుని చూసి ఆశ్చర్యపోయాను.  భయం కూడా వేసింది. క్లాసులో అంతమందికి డాన్స్ నేర్పించే ఆయన, మా ఇంట్లో మా అమ్మావాళ్ళతో వచ్చి ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు. సత్యం  మాస్టారు మొన్న నన్ను పిలిచి, నా గురించి వివరాలు కనుక్కుని, “డాన్స్ నేర్చుకోవాలని ఉందా?” అని అడిగినప్పుడు,  నేను  ఔనని చెప్పడం గుర్తొచ్చింది.నాన్న దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను. 

“రేపటి నుంచి నువ్వు కూడా కూచిపూడి నేర్చుకో,” అన్నారు. చెప్పలేనంత సంతోషమనిపించింది.“మీ మాస్టారు, ఆయనే వచ్చి,  నిన్ను తప్పక డాన్సుకి పంపమని అడుగుతు న్నారు .  నీకు డాన్సెంత ఇష్టమో మాకు తెలుసుగా,” అన్నారు నాన్న నా  భుజాల చుట్టూ చేతులు వేస్తూ. నేల చూపులు చూస్తూ ఉండిపోయాను.“ఉమా,మరి ఇంకా అలకెందుకు? మాస్టారు గారి ఆశీర్వాదం తీసుకో,” అంది అమ్మ. గుర్తొచ్చింది.   పెద్దవాళ్ళ పాదాలు తాకి నమస్కరించాలని.  అదే చేసాను. మాస్టారు ఆశీర్వదించారు.

కూచిపూడి  డాన్స్ నేర్చుకోబోతున్నందుకు గొప్పగా ఫీల్అయ్యాను.  కొత్తగా నాలో ముందు తెలియని ఓ కొత్త  ఎనర్జీ  తోచింది. చదువులో మార్కులు, క్లాస్ ర్యాంక్ బాగానే ఉంటే, నా డాన్స్ క్లాసుకి అడ్డం ఉండదని చెప్పింది అమ్మ.

డాన్స్ క్లాస్ లో అప్పటికే ప్రదర్శనలిస్తూ పేరున్న కొందరు డాన్సర్స్ ఉన్నారంది  అమ్మ.  వాళ్ళు యడవల్లిరమ, నటి చంద్రకళ, కొత్తపల్లి పద్మ. మా సీనియర్స్.   వాళ్ళ క్లాస్  టైమ్స్ వేరే,  రూం వేరే...అప్పుడప్పుడు, మాక్లాస్ అవుతూనే, వాళ్ళ ప్రాక్టీసు చూడ్డానికి వెళ్ళేవాళ్ళం.

వాళ్ళనలా చూస్తూ ఎంతో స్ఫూర్తి పొందేదాన్ని.  వాళ్ళలా అందంగా ఎదగాలని,  అలా డాన్సు చెయ్యాలనిచాలా ఆసక్తిగా ఉండేది.

హోలీ ఏంజెల్స్’ లోచదువుతున్న నాకు,  క్లాస్ మేట్ రాధ (హిందీ నటి రేఖచెల్లెలు) నాతో పాటే నేర్చుకోనేది. రేఖ, మాల (సింగపూర్), సీత వింజమూరి కూడా అక్కడ క్లాసుల్లో డాన్స్ నేర్చుకోనేవాళ్ళు.   కొందరైతే, మాస్టారి గారి ఫామిలీతో, వాళ్ళ ఇంట్లోనే ఉండి, డాన్స్ నేర్చుకునేవాళ్ళు. అంత ఉత్సాహంగా మొదలైంది, మాస్టారి వద్ద నా శిష్యరికం....నా మొట్టమొదటి నాట్యాచార్యులైన వెంపటి సత్యం గారి పట్ల,  శిష్యురాలిగా  నాకు ప్రత్యేక గౌరవాభిమానాలు, అనుబంధం ఉన్నాయి.......అమ్మమ్మ ఆశీస్సులు,  మాస్టారి గారి చొరవ,  అమ్మావాళ్ళ అంకితభావం – నా కళా జీవితానికి పునాదిరాళ్ళు....

మరిన్ని శీర్షికలు
chillara