Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : దిక్కులు చూడకు రామయ్య

Movie Review - Dikkulu Choodaku Ramayya

చిత్రం: దిక్కులు చూడకు రామయ్య
తారాగణం: అజయ్‌, నాగశౌర్య, సనా మక్బూల్‌, ఇంద్రజ, బ్రహ్మాజీ, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు
చాయాగ్రహణం: రాజశేఖర్‌
సంగీతం: ఎంఎం కీరవాణి
నిర్మాణం: వారాహి చలన చిత్ర
దర్శకత్వం: త్రికోటి
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేదీ: 10 అక్టోబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని కలలుగనే గోపాలకృష్ణ (అజయ్‌)కి అనుకోకుండా చిన్న వయసులోనే పెళ్ళయిపోతుంది. ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుంటాడతను. గోపాలకృష్ణ కొడుకుల్లో ఒకడైన మధు (నాగశౌర్య) సరదా సరదాగా లైఫ్‌ని లీడ్‌ చేసే కాలేజీ అబ్బాయి. గోపాల కృష్ణకి వయసు మీద పడ్డా, ప్రేమ మీద మాత్రం మోజు తగ్గదు. పెళ్ళీడుకొచ్చిన కొడుకున్నాడని తెలిసీ, ఓ అమ్మాయిని లైన్‌లో పెట్టాలనుకుంటాడు గోపాలకృష్ణ. అదే అమ్మాయి సంహిత (సనా మక్బూల్‌)ని మధు తొలి చూపులోనే ఇష్టపడతాడు. తండ్రీ కొడుకులిద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడతారన్నమాట. ఇంతకీ సంహిత ఎవర్ని పెళ్ళాడుతుంది? అన్నది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే :
కుటుంబాన్ని నడిపే పెద్దగా హుందాతనం నిండిన పాత్రలో కన్పిస్తూనే, ‘ప్రేమ’ మీద ప్రేమని చంపుకోలేని వ్యక్తి పాత్రలో అజయ్‌ అద్భుతంగా నటించాడు. అతని నటన సినిమాకి హైలైట్‌. డీసెంట్‌గా వుంది అజయ్‌ పెర్ఫామెన్స్‌. నాగశౌర్య కూడా సందర్భానికి తగ్గ నటనతో ఆకట్టుకుంటాడు. సనా మక్బూల్‌ క్యూట్‌గా వుంది. నటన పరంగానూ మంచి మార్కులేయించుకుంది. తన పాత్రకు అవసరమైన మేర నటనను ప్రదర్శించింది. ఇంద్రజ రీ`ఎంట్రీతో తన ఉనికిని చాటుకుంది. ఆలీ కాస్సేపు నవ్వించాడు. పోసాని, బ్రహ్మాజీ మామూలే. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర ఫర్వాలేదన్పించారు.

డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో దర్శకుడు ఈ సినిమాని డీల్‌ చేశాడు. కథ కొత్తగా వుండటంతోపాటు, కథనాన్ని కూడా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. డైలాగ్స్‌ బావున్నాయి. స్క్రీన్‌ప్లే కూడా బాగానే వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి అదనపు ఆకర్షణ. పాటలు బావున్నాయి. రెండు పాటలు తెరపై మరింత అందంగా కన్పించాయి. సినిమాటోగ్రఫీ ఓకే. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ పరంగా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బావుండేది. కాస్ట్యూమ్స్‌ సినిమాకి, అందులోని పాత్రలకు తగ్గట్టు వున్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి సహజత్వాన్ని తీసుకురావడంలో సపలమయ్యింది.

ఫస్టాఫ్‌ స్మూత్‌గా సాగిపోతుంది. కొంచెం రొమాన్స్‌, కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌, కొంచెం డ్రామాతో ఫస్టాఫ్‌ బాగానే ముందుకు వెళుతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఓకే. సెకెండాఫ్‌లో మాత్రం ఎమోషనల్‌ సీన్స్‌ ఎక్కువయ్యాయి. అయితే ల్యాండింగ్ జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవడంతో ఆ ఎమోషన్‌ సినిమాని ఇబ్బందుల్లోకి నెట్టేయకుండా వుంది. ఓవరాల్‌గా ఫీల్‌ గుడ్‌ మూవీ అనే ఇంప్రెషన్‌ ఇస్తుంది సినిమా చూసినవారికి.

ఒక్క మాటలో చెప్పాలంటే : ఫీల్‌గుడ్‌ మూవీ ‘దిక్కులు చూడకు రామయ్య’

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with  M.M. Keeravaani