Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Deepavali

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ

ఇటు విరాట్, అటు సహస్ర, దీక్షలు పెద్ద పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందినవారే. కొన్ని కారణాల వలన గోస్వామి కాలనీలో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూంటారు. రైళ్ళో కలిసినప్పుడు దీక్ష తీసిన విరాట్ ఫోటోలను సహస్రకి చూపిస్తుంది.....

...................................................

సహస్ర దీక్షలు పనిచేస్తున్న షాపింగ్ మాల్  ఉదయం తొమ్మిది గంటలకు తెరుస్తారు.  సరిగ్గా అప్పటికి స్టాఫ్  రెడీగా వుండాలి కాబట్టి ఉదయం ఇంట్లో టిఫిను మాత్రం చేసుకుని టీ తాగి హడావుడిగా ఎనిమిదిన్నర గంటలకే బయలుదేరి వెళ్ళిపోతారు.

షాపింగ్ మాల్లో వెనక పక్కవాళ్ళదే చిన్న కాంటీన్ ఉంది. మధ్యాహ్నం లంచ్ అక్కడే. లైట్ టిఫిను టీ కాఫీలు అందుబాటులో ఉంటాయి. షాపింగ్ మాల్లో సుమారుగా ఏభై మందికి పైగా మూడు అంతస్థుల్లో పనిచేస్తున్నారు. రాత్రి పది గంటలకు మూసేస్తారు. లేడీస్ ని ఒక గంట ముందుగా అంటే రాత్రి తొమ్మిది గంటలకు ముందుగా పంపించేస్తారు. కాబట్టి ఉదయం వెళ్తే తిరిగి ఇంటికి చేరేది తొమ్మిది గంటల తర్వాతే.

ఇక విరాట్ చందూలు పనిచేస్తున్న కంపెనీ ఉదయం పది గంటలకు ఆఫీసు తెరుస్తారు. సాయంత్రం ఆరు గంటలకు క్లోజ్ చేస్తారు. అయిదు గంటల తర్వాత ఆ రోజు పని ముగించుకుని స్టాఫ్ వెళ్ళిపోవటం ఆరుంబావు అవుతుంది.  ఏడు గంటల లోపే విరాట్  చందూలు ఇంటి కొచ్చేస్తారు.  ఆదివారం ఆఫీసుకు శెలవు రోజు. షాపింగ్ మాల్ కి మంగళవారం శలవు రోజు. ఇలా టైమింగ్స్ వేరు వేరు కావటం వలన కాలనీలో ఒకరికొకరు ఎదురుపడే అవకాశం గాని పక్కింట్లో ఎవరుంటున్నారో తెలుసుకునే అవసరం గాని వాళ్ళకి లేదు. అందుకే ఒకే కాలనీ లో ఉంటున్నా ఒకరికొకరు తెలీని పరిస్థితి.

సహస్ర దీక్షలు ఒకరి మీద ఒకరు జోకులేసి నవ్వుకుంటూ చాల సేపు మెలుకువగానే ఉన్నారు. బయట వర్షం తగ్గే సూచనలు కన్పించటం లేదు. చాలా రాత్రవటంతో ఎవరి గదిలో వాళ్ళు నిద్రకుపక్రమించారు.

ఇక్కడ ఈ ఇంట్లో లైట్లు ఆఫయినా

అక్కడ విరాట్  ఇంట్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి.  కిచెన్ లో పనిచేస్తూనే వికృతంగా ఏదో పాడేస్తున్నాడు చందూ.తొంగి తొంగి దొంగ చూపులు చూడ్డం బట్టి తనను ఉడికించడానికే పాడుతున్నాడని విరాట్ కి అర్ధమైంది.  అర్ధమైనా ఆవేశపడకుండా ఓపిగ్గా టీవి లో ఇంగ్లీష్ సినిమా చూస్తూ కూర్చున్నాడు విరాట్.

అంత క్రితమే బయట వర్షం మొదలైంది. చలి చలి వాతావరణం హాయిగా ఉంది.  లోపట్నుంచి జీడిపప్పు దోరగా వేపుతున్న కమ్మని వాసనొస్తోంది. చందూ ఏం చేయబోతున్నాడో అర్ధం కాలేదు. ఇంతలో మరో పాట అందుకున్నాడు చందూ.

‘‘రావా... కనరావా... కరుణ మానినావా చెలియా... ఫోను చెయ్యలేవా...  రావా...!

తనను వెక్కిరిస్తూ అలా కలగాపులంగా పాట మార్చేసి వికృతంగా పాడుతున్న చందూను చూస్తుంటే విరాట్ కి నవ్వు కోపం కూడా వస్తున్నాయి. ఇక వదిలేస్తే మరీ రెచ్చిపోతాడని ‘‘అరేయ్  పాత పాటల పిచ్చోడా,  మర్యాదగా నోరు మూస్తావా లేదా?  నేను వచ్చానంటే నీ పిచ్చిని,  పట్టిన దయ్యాన్ని కూడా వదలగొట్టేస్తాను. ఆపుతావా లేదా ?’’ అనరిచాడు.

‘‘ఆపుతామండీ. ఆపక ఛస్తామా. అదేదో తమ కోసమే పాడుతున్నట్టు ఫీలయిపోతారేమిటి?’’ అంటూ వేడి వేడి జీడిపప్పు ప్లేటు తెచ్చి ఎదురుగా టీపాయ్ మీద ఉంచి తిరి లోపలకు వెళ్ళాడు చందూ.

కాస్సేపట్లో చేతిలో విస్కీ బాటిల్,  రెండు గ్లాసులతో సహా వచ్చాడు చందు. అది చూసి నొసలు విరిచాడు విరాట్. ‘‘అలా చూడకు.  ఈ చలి చలి వాతావారణంలో రెండు పెగ్గులు వేయకపోతే మన యూత్ కే అవమానం.  అవునూ మర్చేపోయారా.  నువ్వు తాగటం మానేసావు గదూ’’ అంటూ ఓ గ్లాసు తీసేయబోయాడు చందూ.

‘‘దాంతో మందే కాదు మంచినీళ్ళు కూడా తాగొచ్చు దించు’’  అన్నాడు విరాట్  ‘‘ఒ.కె.  ఆ కలన్నావ్  గా టేబుల్  మీద వేడి వేడి రైసు చికెన్ కర్రీ, పప్పు ఆవకాయ పచ్చడి వడియాలు,  పెరుగు అన్ని రడీ. డబుల్ ఆమ్లెట్  తెచ్చిస్తాను, ఈ లోపల భోం చేస్తూండు. నేను కాస్త తీర్థం పుచ్చు కొని వచ్చి జాయినవుతాను’’ అంటూ మాట్లాడుతూనే ఫుల్ బాటిల్ విస్కీ ఓపెన్ చేసి గ్లాసులో ఒక లార్జ్ పెగ్  కలుపు కున్నాడు.‘‘ ఫరవాలేదు.   టీవి చూస్తూన్నాగా.  నువ్వు లాగించెయ్  తర్వాత కలిసే బోం చేద్దాం’’ అన్నాడు విరాట్.

‘‘ఒకె.... ఆమ్లెట్ తిరగేయాలి. ఇప్పుడే వస్తాను’’ అంటూ మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళాడు చందూ...

అతనటు వెళ్ళనిచ్చి...

విస్కీ గ్లాసులేపి గటగటా కాళీ చేసి ఎప్పటిలాగా ఉంచి కొద్దిగా జీడిపప్పు నోట్లో వేసుకొని ఏమీ తెలీనట్టు టివి చూస్తుండిపోయాడు విరాట్.  కాస్సేపటికి ఆమ్లెట్ ప్లేట్ తో వచ్చి కూర్చోని తన గ్లాసు వంక చూసి విస్తుపోయాడు  చందూ.‘‘ఏమిట్రా గ్లాసులో విస్కీ ఏది? అడిగాడు.‘‘తాగేసావ్ గా’’  అన్నాడు విరాట్  సీరియస్ గా

‘‘నేనా....’’ చందూ గొంతులో ఆశ్యర్యం.

‘‘లేకపోతే నేనా?  ఒక పెగ్గు కలుపుకొని తాగేసి లోనకెళ్ళావ్ గా.’’

‘‘నిజంగానా... ఇంత మతిమరుపొచ్చిందేమిటి...?’’  అనుకుంటూ మరో లార్జ్  పెగ్గు కలిపి నాలుగు గుక్కలు సిప్ చేసి ఆమ్లెట్ తుంచి నోట్లో వేసుకుని రెండో ఆమ్లెట్ తేవటం కోసం తిరిగి లోన కెళ్ళాడు చందూ.

ఈ సారి బాటిల్లో విస్కీని ఒక లార్జ్  పెగ్గుకి రెండో గ్లాసులో కలుపుకొని తాగేసి కామ్ గా కూర్చున్నాడు విరాట్.  చందూ రెండో ఆమ్లెట్  తెచ్చినప్పట్నుంచి విరాట్ ఎదురుగా కూర్చున్నాడు.  గ్లాసు కాళీ చేసి జీడిపప్పు చారెడు నోట్లో వేసుకొని విస్కీ బాటిల్ వంక చూసాడు చందు.  అంతే మతిపోయిన వాడిలా కెవ్వున అరిచాడు.

‘‘తేలుకుట్టినట్టు అలా అరుస్తావేరా ఏమైంది?’’ అడిగాడు విరాట్

‘‘విస్కీ ఏదిరా?’’

‘‘అదో...  ఉందిగా’’

‘‘ఏది?  ఫుల్ బాటిల్ ఓపెన్ చేసాను. రెండు పెగ్గులు తాగాననుకో.  దాదాపు సగం కాళీ అయిపోయిందేమిటి?  ఇంత ఎక్కడ తాగాన్రా?  నిజం చెప్పు నువ్వు తాగావు కదూ..? నిజం చెప్పు నువ్వెందుకురా నన్నేడిపిస్తున్నావ్...?’’

విరాట్ చిన్నగా నవ్వాడు.

‘‘అది సంగతి ఇప్పుడర్థమైంది.  మొగమాటమెందుకు వేసెయ్’’  అంటూ తిరిగి రెండు గ్లాసుల్లోనూ విస్కీ కలిపాడు చందూ.‘‘ఏం చేప్తావ్... ? తనని మర్చి పొమ్మాంటావ్. నా వల్ల కావట్లేదు.’’

‘‘అలాగని చేతులు ముడుచుకుంటే పనులు కావండీ.  కాస్త బుర్రపెట్టి ఆలోచించాలి.’’

‘‘ఏమాలోచించాలి? వేలకు వేలు ఖర్చు చేసి పోస్టర్లు వేసినా ప్రయోజనం లేకపోయింది. తను సీటిలోంచి వెళ్ళిపోయుంటుందా..?’’ ‘‘లేదు. ఇక్కడే ఉంటుంది.’’

‘‘ఎలా చెప్పగలవ్?’’

‘‘ఆమెనీ పబ్లిసిటీ చూసే ఉంటుంది. చూసినా ఫోన్ చేయలేదంటే అందుకు మూడు కారణాల్ని మనం వూహించుకోవచ్చు.  ఒకటి నువ్వు తనకి నచ్చకపోవచ్చు. లేదా అప్పుడే ఎంగేజ్ మెంట్ అయిఉండొచ్చు, రెండో కారణం ఇప్పటికే ఎవడితోనో లవ్ లో ఉండి ఉండాలి.  లేదా జాతికులం తమ వాళ్ళు అంగీకరించరన్న భయంతో ఉదాసీనంగా ఉండొచ్చు. ఇకమూడోకారణంలవ్మీదనమ్మకంలేకపోవచ్చు.

ఒక్కసారి ఫోన్ చేస్తే ఆనంబర్ కి తిరిగి తిరిగి నువ్వు ఫోన్ చేస్తావన్నభయంతో మౌనం వహించవచ్చు.’’‘‘ఒకె తను ఫోన్ చేయకపోవటానికి చాలా కారణాలు ఉండొచ్చునుకుందాం. ఇంతకీ తను చెన్నై లోనే ఉందని ఎలా చెప్పగలవ్?.

‘‘ఎలాగంటే నీకు చెప్పకుండా దాచిన ఇన్ఫర్మేషన్  కొంత నా దగ్గరుంది గాబట్టి.’’

‘‘ఏమిటా ఇన్ఫర్మేషన్  ఎందుకు దాచావ్?’’  ఆశ్చర్యపోతూ అడిగాడు విరాట్.

‘‘నువ్వెంత ఘాటుగా ప్రేమిస్తున్నావో తెలుసుకుందామని’’

‘‘తెలిసిందిగా,  ఇన్ఫర్మేషనేమిటో చెప్పు’’

‘‘చెప్తాను. భోంచేసాక.’’

‘‘అయితే ఇక మందు ఆపెయ్.’’ అంటూ బాటిల్  తీసుకెళ్ళి లోన దాచేసి వచ్చాడు విరాట్. అప్పటికే గ్లాసులు కాళీ అయిపోయాయి. డైనింగ్ టేబుల్ వద్ద కెళ్ళి భోజనానికు క్రమించారు.

బయట వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది.

విరాట్ సొంతవూరు కొయంబత్తూరు, చందూది ఆ పక్కన ఉసిలంపట్టి గ్రామం.

కోయంబత్తూరులో వెంకటరత్నంనాయుడు గారంటే తెలీనివళ్ళుండరు. పెద్ద ఇండస్ట్రియలిస్టు. ఆయనకి చాలా ఇండస్ట్రీలు వ్యాపారాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా కావలసింది సిటీలోనే అతి పెద్దదైన బట్టలమిల్లు.  అందులో అయిదు వందల మందికి పైగా కార్మికులు షిప్టు పద్దతిలో ఇరవైనాలుగు గంటలూ పనిచేస్తూనే ఉంటారు. ఆయన వ్యాపారాలు సంవత్సరానికి వెయ్యి కోట్ల టర్నోవరవుతుంటాయి. స్టేట్ నుండి సెంట్రల్ వరకు పలుకుబడి గల వ్యక్తి.  ఆయన భార్య పేరు మంగతాయారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. కూతురి పేరు కనకమహాలక్ష్మీ, ఆమెను ధర్మపురి జిల్లా లోని ఒక పెద్ద ఇండస్ట్రీయలిస్టు కొడుకిచ్చి పెళ్ళిచేసారు. ఆమెకు ఒక కొడుకు, కూతురు.  కనకమహాలక్ష్మి తర్వాత పుట్టిన ఇద్దరు కొడుకుల్లోను పెద్దవాడి పేరు విక్రాంత్, అతనికి పెళ్ళయింది. పిల్లలు వెంకటరత్నం నాయుడికి కుడి భుజంగా ఉంటూ వ్యాపారాల్లో తండ్రికి అన్ని విధాలా సాయ పడుతోంది అతనే. ఇక మిగిలింది ఆఖరి కొడుకు. అతనే విరాట్. ఇంకా పెళ్ళి కాలేదు, పెళ్ళి దగ్గరే అసలు సమస్య మొదలై అతను కొయంబత్తూరు వదిలి వచ్చేసాడు.

విరాట్ అమెరికాలోను, జర్మనీ లోను చదువుకున్నాడు. అయితే చిన్నప్పట్నుంచి అతనివన్నీ స్వతంత్ర భావాలు. అన్నలా తండ్రిని అనుసరించటం అతనికిష్టం లేదు.

అక్క కనకమహాలక్ష్మి కూతురుంది.  ఆమె పేరు సాగరిక.  విరాట్ కి స్వయానా మేనకోడలు. తనకు సాగరికకు వివాహం నిశ్చయం చేస్తూ పెద్దలు మాట్లాడేసుకోవటం విరాట్ కి నచ్చలేదు. అతడ్ని చేసుకోవటం సాగరికకు ఇష్టమే కాని విరాట్ కు మేనరికం ఇష్టం లేదు. కాని ఇటు తండ్రి, అటు అక్క కూడా ఈ విషయంలో పట్టుదలగా ఉండటంతో విరాట్ కి దిక్కు తోచలేదు. సాగరికనైతే ఒప్పంచగలిగాడు కాని మిగిలిన ఎవరినీ మార్చటం సాధ్యం కాలేదు. ఆ విధంగా అభిప్రాయ బేధాలతో కొయంబత్తూరు వదిలి ఎవరికీ చెప్పకుండా చెన్నై వచ్చేసాడు. వచ్చినరెండో మాసంలోనే గోస్వామి కన్స్ ట్రక్షన్ వాళ్ళనుండిఆయింటినికొనుగోలుచేసాడు. అతనిపేరనే సుమారు పది కోట్లు బ్యాంకు బాలెన్స్ వుంది కాబట్టి డబ్బుకి సమస్య లేదు. కాలక్షేపానికి ఇప్పుడు పనిచేస్తున్నా సాఫ్ట్ వేర్  కంపెనీలో చేరాడు. తర్వాత ఫ్రెండు చందూని తన వద్దకు రప్పించుకున్నాడు.

కోయంబత్తూరు వదిలి వచ్చేసినా ఇంటితో సంబంధం వదులుకోలేదు. ఫోన్లు చేస్తూనే ఉంటాడు. తను చెన్నైలో ఉన్నట్టు మాత్రం చెప్పడు. చెప్తే తండ్రి  వెంకటరత్నం నాయుడు బలవంతంగా లాక్కెళ్ళి సాగరికతో పెళ్ళి జరిపిస్తాడని భయం. సాగరిక పెళ్ళైయ్యే వరకు తనకీ అజ్ఞాత వాసం తప్పదు.

ఇక చందూ విషయం...

అతను సాధారణ రైతు కుటుంబం లోంచి వచ్చాడు.

ఉసిలంపట్టి గ్రామంలో అతని తండ్రి అయిదెకరాల రైతు, చందూ తర్వాత ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇంటికి పెద్ద కొడుకని మూడెకరాలు అమ్మి మరీ చందూని బాగా చదివించారు.

చదువైపోయాక సరైన ఉద్యోగం దొరక్క అవస్థ పడుతున్న టైంలో మిత్రుడు విరాట్ అతడ్ని తన వద్దకు రప్పించుకుని ఉద్యోగం వేయించి తన వద్దే ఉంచుకున్నాడు.

చందు భోజన ప్రియుడు.

సరదాగా నేర్చుకొన్నా పాక శాస్త్రంలో అతను ప్రవీణుడు. వంట సంగతి అతనే చూసుకుంటాడు.  విరాట్ తో ఉన్నందు వల్ల అతనికి రూమ్  రెంట్ లేదు,  భోజనం ఖర్చులేదు. ఇంకా చెప్పాలంటే పైసా ఖర్చు లేదు.  వచ్చిన జీతం వచ్చినట్లు ముప్పైవేలు నెల నెలా ఇంటికి పంపించేస్తాడు. ఆ విధంగా తనను చదివించిన తండ్రినీ తమ కుటుంబాన్ని ఆదుకోగలిగాడు. రెండు మాసాల క్రితమే పెద్ద చెల్లెలు పెళ్ళి ఘనంగా జరిపించి వచ్చాడు.  కాని ఉసిలంపట్టి గ్రామంలో ఎవరితో కూడ తను చెన్నైలో విరాట్ తో ఉంటున్న సంగతి చెప్పలేదు.

ఒక్క తన తండ్రితో మాత్రమే చెప్పి ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించాడు.  గ్రామంలో ఎవరడిగినా తను బెంగుళూరులో ఉంటున్నట్టు చెప్తూ వస్తున్నాడు. పై సంవత్సరం రెండో చెల్లెలు పెళ్ళి కూడ జరిపించేస్తే బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత తన పెళ్ళి అనే ఆలోచనతో ఉన్నాడు.‘‘చెప్పరా నీకు ఆ అమ్మాయి గురించి తెలిసిన సమాచారం ఏమిటి..?’’  భోంచేసి తిరిగి తీరిగ్గా హాల్లోని సోఫాలో సెటిలవగానే అడిగాడు విరాట్.

‘‘నువ్వు ఇంతగా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావ్ గాబట్టి చెప్తున్నాను. ఆమె పేరు  సహస్ర. పక్కన ఉన్న ఆమె ఫ్రెండు పేరు దీక్ష’’ అంటూ బయటపెట్టాడు విరాట్.

‘‘సహస్రా?...  నిజమే చెప్తున్నావా..?’’  షాకింగ్ గాఅడిగాడు విరాట్

‘‘కాదు అబద్దం చెప్తున్నాను. ముఖం చూడు’’

‘‘నీకు బుద్ధిలేదురా,  అందుకే జోక్  చేస్తున్నావని డౌటు.’’

‘‘డౌట్ వద్దు, నేను నిజమే చెప్తున్నాను. తన పేరు సహస్ర.’’

‘‘నీకెలా తెలుసు?’’  ఆనందోద్వేగానికి లోనవుతూ అడిగాడు విరాట్.

‘‘ఎలా ఏమిటి? నువ్వు ఆ రోజు ఆమె అందాన్ని చూస్తూ కూర్చున్నావ్. నేను వాళ్ళ సంభాషణ మీద దృష్టి పెట్టాను. వాళ్ళు ఒకరినొకరు అలాగే పిలుచుకున్నారు. చెన్నైలోనే ఎక్కడో వాళ్ళు ఒకే చోట పని చేస్తున్నారు.  ఎగ్మోర్ లో ఎవరిదో సంతకం కోసం వెళ్ళొస్తున్నారు.చందూ మాటలు విన్నాక...  ప్రపంచాన్ని జయించినంత ఆనందానికి లోనయ్యాడు విరాట్.

‘‘ఏమిట్రా ఆలోచిస్తావ్...?  ఇంకా నమ్మకం లేదా...?  పోనీ సహస్ర ఫోటో చూపిస్తాను.  నమ్ముతావా...?’’  అంటూ చటుక్కున తన ఫోన్ అందుకున్నాడు చందూ.’’

ఉత్కంఠ అంచున నిల్చున్న వాడిలా అయిపోయాడు విరాట్.

‘‘ఎవరూ చూడకుండా ఆ అమ్మాయిని సెల్ ఫోన్ తో రెండు ఫోటోలు తీసాను. ఏ మాటకామాట చెప్పుకోవాల్రా బాబు.  మీ జంట అదిరిందనుకో’’ అంటూ సెల్ లోని సహస్ర ఫోటోల్ని చూపించాడు.

సహస్ర ముఖం మంచి ఫోటోజెనిక్ ఫేస్.... హెలెన్ ఆఫ్ట్రాయ్...

అందమంతా తానే అన్నట్టుంది...  క్వీన్ ఆఫ్ రోమ్...  కియోపాట్రాలా ఎంత అద్భుతంగా ఉంది...!రెండు ఫోటోలూ కూడ క్లోజ్ లో చాలా అద్బుతంగా వచ్చాయి చూస్తున్న విరాట్ కి ఆమెను కళ్ళెదుట తిరిగి చూస్తూన్నట్టుంది. ఆనందం పట్టలేక చందూ బుగ్గ మీద ముద్దు పెట్టేసాడు.

‘‘ఫ్రెండువంటే నువ్వు రా చందూ. ఇప్పుడే వస్తానుండు’’  అంటూ లేచి గబగబా గదిలోకి వెళ్ళాడు.  బెడ్రూమ్ లోని తన కంప్యూటర్ కి సెల్ ఫోన్ కనెక్షనిచ్చి సహస్ర ఫోటోల్ని ప్రింటవుట్లు తీసాడు. ఫోటోలో తన అందచందాలతో మతి పోగొడుతోంది. సహస్ర. వాటిని తీసుకొని తిరిగి హాల్లోకి వచ్చేసరికి సోఫాలో గుర్రు పెట్టి నిద్రపోతూ కన్పించాడు చందూ.

అతడ్ని లేపడం ఇష్టం లేక లైట్లార్పి బెడ్రూం లోకి వెళ్ళకుండా తనూ అక్కడే మరో సోఫాలో పడుకున్నాడు. సహస్ర ఫోటోల్ని గుండెల మీద ఉంచుకొని క్షణాల్లో తనూ గాఢ నిద్రలోకి జారిపోయాడు. మరునాడు ఎలాగో ఆదివారం ఆఫీసు సెలవు రోజు.

ఏయ్  సహస్ర ఆగాగు.  స్కూటీ ఆపు’’  వెనక కూచున్న దీక్ష అరిచింది.

ఆమె ఆగమని చెప్పేలోపే...

స్కూటీ రెండు వందల గజాల దూరం ముందుకెళ్ళి ఆగింది

‘‘ఏమైందే? మళ్ళీ ఏం మర్చిపోయావే..?’’ కసురుకుంది సహస్ర.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్