Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ. : సహస్ర, దీక్షలను తాను తీసిన ఫోటోలను విరాట్ కి చూపించడమే కాక తాను సేకరించిన ఇంఫర్మేషన్ కూడా చెబుతాడు చందు...ఆమె ఫోటో చూస్తూనే మైమరచిపోతాడు విరాట్. ఇక ఇంటి నుంచి స్కూటీ మీద బయల్దేరిన సహస్ర, దీక్షలిద్దరూ ఆగుతారు....

...................................

‘‘ఏమి మర్చిపోలేదు గాని స్కూటీ వెనక్కి తిప్పు చెప్తాను’’  అంది దీక్ష.

‘‘అసలే టైమవుతుందంటే మళ్ళీ యిదేమిటి?  ఎక్కడికెళ్ళాలి ఇంటికా...?’’

‘‘కాదు ముందు స్కూటీని వెనక్కి తిప్పు చెప్తాను.’’

గో స్వామి కాలనీ గేటు నుంచి ఎగువకుపోతున్న రోడ్లో మధ్యలో ఎడం పక్క ఒక పాల డిపో వుంది.  ఆ డిపోను దాటి ముందుకొచ్చాక ఆగింది స్కూటీ. విసుక్కుంటూనే స్కూటీని వెనక్కి తిప్పింది సహస్ర.

‘‘వెళ్దాం ఆగు. అటు పాల డిపో వంక చూడు. పాల పాకెట్లు తీసుకొని రోడెక్కి కాలనీ వైపుకొస్తున్నాడో యువకుడు. వాడ్ని గమనించు’’ అంటూ వేలెత్తి అటు చూపించింది దీక్ష.

‘‘మనకి టైమవుతోందే బాబు,  వాడెవడైతే మనకేంటి..?’’

‘‘ఒసే మొద్దు వాడ్ని  సరిగా చూడు. వాడు చందూ.’’

‘‘చందూ ఎవడు?’’

‘‘అప్పుడే మర్చిపోయావా?  నిన్ను వరించిన వాడి ఫ్రెండు’’

ఆ మాటతో ఒక్కసారిగా... ఉలికిపడింది సహస్ర. ‘‘ అంటే...  విరాట్...  ఆ రోజు రైల్లో విరాట్  పక్కనుంది?’’

‘‘వీడే...  విరాట్ ఫ్రెండు చందూ.’’

‘‘ఓ మైగాడ్’’  అంటూ హెల్మెట్  తీయబోయింది సహస్ర.

‘‘హెల్మెట్  తీయకు. వాడు మనల్ని గుర్తుపడతాడు’’

‘‘చందు ఇక్కడేం చేస్తున్నాడు?  వాళ్ళీ ప్రాంతంలోనే ఉన్నారా..?’’  అనుమానంతో అడిగింది సహస్ర.

‘‘ఒక్కడే ఉంటున్నాడో ఇద్దరూ ఉంటున్నారో ఎవరికి తెలుసు.  ఇద్దరిలో ఎవరు మనల్ని చూసినా గుర్తుపట్టేస్తారు.’’

‘‘ఇప్పుడేం చేద్దాం,  టైమవుతోంది.’’

‘‘కొంపలేం మునగవు కాని ముందీసంగతి తేల్చుకోవాలి వాడ్ని మనమే చూసాం గాబట్టి మంచిదయింది.  వాడ్ని ఫాలోచెయ్యి.  నెమ్మదిగా పోనీ...’’

సహస్ర స్కూటీని నెమ్మదిగా పోనిచ్చింది.

దీక్ష చూసింది చందూనే.  అందులో సందేహం లేదు.  ఆదివారం ఆఫీసుకు సెలవు,  భారీ వర్షం గాబట్టి వీధులింకా జలమయం గానే ఉన్నాయి. తెల్లవారు జామున వాన తగ్గినా ఆకాశం ఇంకా మబ్బులు కమ్ముకునే ఉంది.  చలిచలిగా ఉంది వాతావారణం.

టైం ఎనిమిదయినా ఇంట్లో ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు విరాట్. ముందుగా లేచిన చందూ బ్రష్  చేసుకొని పాల ప్యాకెట్ల కోసం బయటకు రావటంతో అనుకోకండా దీక్ష కంటపడ్డాడు.

తన వెనక దూరంగా ఫాలో అవుతున్న స్కూటీని అతను గమనించలేదు.  కాలనీ గేటు దాటగానే ఎడం పక్కకు తిరిగాడు, సహస్ర వేగంగా స్కూటీని గేటు దాటించింది. చందూ మొదట వీధి లోకి తిరుగుతూ కన్పించాడు.

స్కూటీని వీధి మొదట్లోకి పోనిచ్చి ఆపింది.

మూడో ఇంటి గేటు తీస్తూ కన్పించాడు చందూ.

‘‘ఏం చేద్దాం...?’’  దీక్షను అడిగింది సహస్ర.

‘‘మనకు కావలసింది వీడు కాదు. విరాట్.  వాళ్ళిద్దరూ అదే విల్లాలో ఉంటున్నారని నా డౌట్.  చందూని లోనకు పోనివ్వు.  ముందుకు పద చూద్దాం’’  అంది దీక్ష.

స్కూటీని పోనిచ్చింది సహస్ర.

ఆ యింటిని గమనిస్తూ వీధి ఎగువ వరకు వెళ్ళారు.  చందూ ఇంట్లోకి పోతూ కన్పించాడు.  ఎగువ నుంచి రిటనవుతూ మరోసారి గమనించారు.  ఈ సారి లక్కీగా విరాట్ కన్పించాడు. అప్పుడే లేచినట్టున్నాడు ఇంగ్లీష్ న్యూస్  పేపర్ తో బయటికొస్తున్నాడు. తమను గమనించక ముందే స్కూటీని వేగంగా పోనిచ్చి కాలనీ గేటు దాటాక ఆపింది సహస్ర.

‘‘ఓ మైగాడ్,  ఇదేమిటే వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు.  ఇప్పుడేం చేద్దాం’’  అంది కంగారు అణచుకొంటూ సహస్ర. ‘‘ఉన్నారని తెలిసిందిగా.... వాళ్ళే మీ పక్షులు కాదు చప్పట్లు కొట్టి తరిమేయడానికి. వాళ్ళ కంటపడకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే సరి.’’‘‘ఎంత జాగ్రత్తగా ఉన్నా మనది వాళ్ళదీ కూడ ఒకటే కాలనీ.  ఏదో రోజు తెలిసిపోతుందేమో...!’’

‘‘తెలీనీ నష్టం ఏమిటి? నిన్ను మెచ్చినవాడు నీకు నచ్చితే ప్రాబ్లం సాల్వ్డ్.’’

‘‘నీ ముఖం ఇప్పుడు నాకు లవ్వొక్కటే తక్కువ’’

‘‘ఎక్కువో తక్కువో పక్కనపెట్టు.  ఇవాళ ఆదివారం వాళ్ళకు సెలవు అయి ఉంటుంది.  మంగళవారం మనకు సెలవు,  ఆ రోజు తేల్చేద్దాం.’’‘‘ఏం చేద్దాం.?’’

‘‘వాళ్ళింట్లోకి దొంగతనానికి వెళ్దాం సరేనా...  ఇక టైమవుతోంది పోనీ’’  సహస్ర స్కూటీని ముందుకు దూకించింది.

ఉదయం సుమారు పది గంటలకు మబ్బులు చెదిరిపోయి సూర్యుడు చెన్నై నగరం వంక తొంగిచూసాడు .అప్పటికి విరాట్  చందూలు స్నానాలు ముగించి టిఫిను, కాఫీలు అవగానే తిరిగి రిలాక్స్ గా హాల్లో సెటిలయ్యారు. ఆదివారం సెలువ రోజయినా ఇద్దరూ సినిమాలకు షికార్లకు వెళ్ళేది చాలా అరుదు.  చందూ టివి ఆన్ చేసాడు.

విరాట్ టివి చూడ్డం లేదు.

రాత్రి తీసిన ప్రింటవుట్స్ లోని సహస్ర ముఖాన్ని దీక్షగా చూస్తున్నాడు. పావుగంట తర్వాత ఈ విషయం గురించి పక్కకొచ్చి కూర్చున్నాడు చందూ.

‘‘ఫోటోలు బాగా వచ్చాయా...?’’ అడిగాడు.

‘‘సెల్ ఫోన్ తో కూడా ఇంత బాగా ఫోటోలు తీయొచ్చని వీటిని చూసాకే అర్ధమైంది.  నీలో కళాకారుడున్నాడురా.  ఒప్పుకుంటాను.  ఆల్ రెడీ మిమిక్రి ఆర్టిస్టువి. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ వని తెలిసింది‘‘  అన్నాడు విరాట్.

‘‘తెలిసిందిగా ఓ మంచి కెమెరా కొన్వివ్వొచ్చుగా’’

‘‘సహస్ర దొరకనీ బెస్ట్  కెమెరా కొనిస్తాను’’

‘‘థాంక్స్ రా ఇంతకీ సహస్ర ఎప్పుడు దొరుకుతుంది.’’

‘‘దొరకదనుకుంటున్నావా...?  రెండు వారాల్లో తప్పకుండా నా ముందుంటుంది.’’

‘‘మూడు రోజులయినా ఫోన్  చేయలేదంటే...’’

‘‘అందుకు కారణాలేమిటో రాత్రి నువ్వే విశ్లేషించావు గా...’’

‘‘రెండు వారాల్లో ఫోన్  చేయలేదనుకో...  అప్పుడు..?’’

‘‘సస్పెన్స్  అప్పుడేం చేస్తానో నువ్వే చూద్దూవు గాని.’’

‘‘ఒకె............... కాని నాకో సందేహం మనసులో ఉండిపోయింది.  నీతో కూడ చెప్పలేదు.’’

‘‘చెప్పు.’’

‘‘ఏం లేదు ఆ రోజు ఆ అమ్మాయి రైలెక్కినపుడు గమనించావా..?  ముస్లిం అమ్మాయిలా ఘోషాస్టయిల్లో ముఖం తెలీకుండా చున్నీ తో కళ్ళు మాత్రం వదిలి ముఖానికి చుట్టుకొని వుంది .  సీట్లో కూర్చున్నాకే తీసింది గుర్తుందా?.’’

‘‘యస్  అఫ్ కోర్స్  యు ఆర్  రైట్.  నేనూ ముస్లిం అనుకున్నాను.  ముఖాన బొట్టు చూసాకే కాదని గుర్తించాను.  రైలు దిగే ముందు తిరిగి చున్నీ ముఖానికి చుట్టుకుంది.’’

‘‘కదా?...  ఆలోచించు. పబ్లిక్ లో అలా ముఖం తెలీయకుండా దాచుకోవలసిన అవసరం ఏమిటి?

‘‘నిజమే...?’’

ఈ విషయం గురించి తనూ సీరియస్ గా ఆలోచించలేదు. కాని అలాగని సందేహించాల్సిన అవసరం కూడ లేదు.  ఎందుకంటే ఉన్నత కుటుంబాలకు  చెందిన లేడీస్ ముఖం తెలీయకుండానే ముసుగుతో బయటకు రావటం తరతరాలుగా హైందవ ఆచారం.  ఈ అమ్మాయి కూడా అలాంటి కుటుంబానికి చెందిఉండొచ్చు. కాకపోతే ఇప్పుడంతా పంజాబీ డ్రస్లు,  చుడీదార్లు ఫ్యాషనై పోయింది గాబట్టి ఆచారాన్ని పాటిస్తూ చున్నీని అలా చుట్టుకునుండొచ్చు.  ఇదే అభిప్రాయాన్ని చందూతో చెప్పినపుడు మొదట అంగీకరించాడు. తర్వాత ఒక డౌటు కూడా బయటపెట్టాడు.

‘‘ఏమో ఏవో సమస్యల వల్ల తెలిసిన వాళ్ళు తనను గుర్తించకుండా కూడా అలా ముఖాన్ని కవర్  చేసుకోవచ్చు.’’ అన్నాడు.‘‘సహస్ర ముఖం తెలీకపోయినా ఫ్రెండు దీక్ష ముఖం మామూలుగానే వుందిగా,  దీక్షను బట్టి సహస్రను గుర్తించటం కష్టంకాదు. ఆమె ఏదో ఉన్నత కుటుంబానికి   చెందిన సాంప్రదాయ యువతి.  అందుకే అలా చేస్తోంది.’’  అన్నాడు విరాట్.‘‘నీ మాటే కరెక్టు కావచ్చు.  ఇంతకీ భోం చేసాకా మధ్యాహ్నం  మన ప్రోగ్రాం ఏమిటి? దేవి థియేటర్ లో షారూక్ఖాన్  సినిమా వచ్చింది. ఉదయం థియేర్ లో రజనీకాంత్  సినిమా ఉంది. ఇవాళ ఏదో ఒక మూవీకి మనం వెళ్ళాల్సిందే’’  అన్నాడు.

‘‘సారీ రా నాకు మూడ్ లేదు. కావాలంటే బైక్ ఇస్తాను. వెళ్ళిచూసిరా’’  అంటూ సహస్ర ఫోటోలు తీసుకుని తన బెడ్రూం లోకి వెళ్ళిపోయాడు విరాట్.

‘‘అవున్లే  నీకు మూడ్  ఎందుకుంటుంది? సహస్ర ఫోటోలున్నాయిగా చూసుకుంటూ సమయం గడిపేస్తావ్  నువ్వింట్లోనే ఉండరా బాబు.  నేను సినిమాకి పోయొస్తాను’’ అన్నాడు వెనక నుంచి చందూ.

ఆ రోజు మంగళవారం.

సహస్ర దీక్షలకు సెలవు రోజు...

లేవటమే ఆలస్యంగా ఏడు గంటలు దాటాక నిద్ర లేచారు.  అదీ పని పిల్ల వస్తూ వస్తూ పాల క్యాకెట్లు తెచ్చి తలుపుకొడితే ముందుగా దీక్ష తర్వాత సహస్ర లేచారు. ఇక ఉదయం ఇంటి పనులు ఆరంభమయ్యాయి. నీళ్ళు పట్టి ఇల్లు వాకిలి శుభ్రం చేసి అంట్లు తోమితనే కాఫీ పెట్టి ఇద్దరికీ ఇచ్చి తను తాగి వెళ్లిపోతుందామె. ఈ లోపల స్నానం చేసి పూజ ముగిసాక కిచెన్ లోకి చేరతారు ఇద్దరూ.

పన్నెండు గంటల వరకు ఇంట్లోనే కాలక్షేపం చేసారు.  పన్నెడు తర్వాత ‘‘ఇక బయల్దేర్దాం ’’ పద అంది రెక్కలాగుతూ దీక్ష.

‘‘ఎక్కడికి...?’’  అంది సహస్ర.

‘‘మర్చిపోయావా,  మూడో నంబరు ఇంట్లో మనం దొంగతనానికెళ్ళాలి.’’

‘‘వ్వాట్?  నిజంగానే వెళ్ళాలా...?  మొన్న ఏదో మాటవరసకలా అన్నావనుకున్నాను.  వద్దు ఎవరన్నా చూస్తే బాగుండదు,  పట్టపగలు’’   ‘‘చూడకుండానే వెళ్ళొద్దాం, వెళ్ళకపోతే వాళ్ళ జాతకాలు మనకెలా తెలుస్తాయి?’’

‘‘అంతేనంటావా?’’

‘‘ముందు త్వరగా రెడీ కా,’’

‘‘మరి వంట?’’

‘‘వచ్చాక చూద్దాంలే’’  పావుగంటలో రెడీ అయి బయలుదేరారిద్దరూ.

గోస్వామి కాలనీ మొత్తం నూట ఎనభై విల్లాల్ల నూ ట ఏభై వరకు యిళ్ళలో అంతా ఉద్యోగస్తులే,  ఉదయం ముందుగా పిల్లలు కాన్వెంటులకు,  కాలేజీలకు వెళ్ళిపోతారు. భార్యభర్తలు రెడీ అయి ఇళ్ళకు తాళం పెట్టి ఎవరి దారిన వారు ఆఫీసులకు వెళ్ళిపోతారు . మిగిలిన ముప్పై ఇళ్ళలో మగాళ్ళు ఆఫీసులకుపోతే స్త్రీలు,  వృద్దులు ఇళ్ళలో ఉంటారు.

ఉదయం పది గంటలు దాటితే కాలనీ వీధులన్నీ నిర్మానుష్యమైపోతాయి. తిరిగి సాయంత్రం నాలుగు గంటల తర్వాత నుంచి గాని వీధుల్లో జనం కన్పించరు. ఆ ధైర్యంతోనే అమ్మాయిలిద్దరూ ఆ వీధి కొచ్చారు.

స్కూటీని మొదట వీధి మొదట్లోనే ఒక చెట్టు నీడన లాక్ చేసింది దీక్ష.

వీధి మొత్తం నిర్మానుష్యంగా ఉంది.

చిన్న ప్లాస్టిక్ బ్యాగ్  అందుకుని...

ముందుకు దారి తీసింది దీక్ష...

ఆమెను అనుసరించింది సహస్ర...

ప్రతి యింటికి గేటుతో సహా తాళాలు వేసున్నాయి.  పదిహేను యిళ్ళ వరకూ చూసుకుంటూ ముందుకెళ్ళారు.  ఒకటి రెండు యిళ్ళలో ఆవరణాలో కట్టేసిన కుక్కలున్నాయి. పదిహేనో ఇంట్లో టివి సౌండ్ తో బాటు ఏవో మాటలు విన్పిస్తున్నాయి. ఆ ఇంట్లో ఆడాళ్ళెవరో ఉన్నారు.

ఇద్దరూ వెనుతిరిగారు

‘‘లోన కుక్కలుంటాయంటావా..?’’  మూడోనంబరు ఇంటిని సమీపిస్తుండగా అడిగింది సహస్ర.‘‘ఉన్నాఉండొచ్చు. అయినా ది గ్రేట్  జర్నలిస్టువి. నీకు భయమేమిటి..?’’ అంది నవ్వుతూ దీక్ష.

‘‘కుక్కలంటే నాకు భయం’’

‘‘భయపడక నాలుగు బిస్కట్లు పడేస్తే అవే నోరుమూస్తాయి.  క మాన్ అంది’’ దీక్ష.

గేటుకి తాళం వేసుంది,

ఎవరూ చూడ్డం లేదని గమనించి ముందుగా గోడ దూకి సహస్రకు చేయందించింది దీక్ష.

అవన్నీ ఒకే డిజైన్ తో నిర్మించిన విల్లాలు గాబట్టి పెద్దగా మార్పుండే అవకాశం లేదు,  విశాలమైన ఆవరణలో చక్కటి పూల మొక్కలతో బాటు నీడినిచ్చే మూడు ఫల వృక్షాలున్నాయి.

‘‘ఫరవాలేదే?  నీ ప్రేమను ఆశిస్తున్నవాడు మంచి టేస్ట్  ఉన్నవాడే,  ఇద్దరూ మగాళ్ళే ఉంటున్నా ఇల్లు ఎంతో నీట్ గాను అందంగాను ఉంచుకున్నారు చూడు’’ అంది పోర్టికో వైపు అడుగులేస్తూ దీక్ష.

‘‘వాడెవడో తెలుసుకోవాలనేగా  మనమొచ్చింది.  ఇంతకీ ఈ విల్లా విరాట్ దా చందూ దా మనకి తెలీదు’’  అంది సహస్ర.‘‘ఇప్పుడు తెలుసుకుంటాంగా’’

‘‘ఎలా..?  కిటికీలతో సహ మూసేసున్న ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తాం?’’ ‘‘డోన్ ట్ వర్రీ తడితే తలుపులు తెరుకుంటాయి. ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది అన్నారు. ఇంటి చుట్టూ ఓ రౌండ్కొడితే మనకి ఏదో మార్గం కన్పిస్తుంది’’ అంది దీక్ష.

పోర్టుకో నుంచి కుడి పక్క ఉత్తరంగా వెళ్ళి పశ్చిమం వైపు తిరిగారు, పదడుగులు వేసారో లేదో..... ఇంతలో చెవులు పగిలేలా దగ్గర లో భౌ.........మని మొరిగిందో కుక్క అంతే అదిరిపడిన దీక్ష కెవ్వుమని వెనక్కి దూకి సహస్రను వాటేసుకుంది.  తిరిగిచూసిన సహస్రకు సరిహద్దు గోడ మీద తలెత్తిచూస్తూ మొరుగుతున్న ఆల్సేషియన్  డాగ్ తల కన్పించింది. కిసుక్కున నవ్వింది సహస్ర.

‘‘ఎందుకే నవ్వుతావ్..?’’ అంది సహస్రను వదిలి.

‘‘ఎందుకా నాకు ధైర్యం చెప్పి నువ్వు భయపడ్డందుకు, అంది పక్క కాంపౌండ్ లో కుక్క అటు చూడు’’  అంటూ బేగ్ లోంచి నాలుగు బిస్కట్లు తీసి గోడ అవతలికి విసిరింది సహస్ర,  అంతే టక్కున నోరు మూసి గోడ వదలి బిస్కట్ల కోసం పరుగు తీసింది కుక్క.‘‘చీ పాడు కుక్క . చూస్తుంటే అది తన యింటి కన్నా పక్కింటికే కాపలా ఉన్నట్టుంది’’  అంది ధైర్యం తెచ్చుకుంటూ దీక్ష.

‘‘అయినా అంత భయపడిపోయావేమిటే...  నీకూ కుక్కలంటే...?

‘‘నీలాగే... చచ్చేంత భయం.’’

‘‘నాకంత భయం లేదులే,’’

మాట్లాడుతూనే పశ్చిమం వైపు ఇంటి వెనక్కి చేరుకున్నారు.  ఇల్లంతా తలుపులు కిటికీలు మూసి వున్నాయి వెనక డోర్ కూడ బలంగా బంధించి ఉంది.

వాయువ్య మూలన మాత్రం కిటికీ రెక్క మూయటం మర్చి పోయినట్టున్నారు.  సగం తెరుచుకొని లోన ఐరన్  ఫ్రేం కనిపిస్తోంది.‘‘మార్గం దొరికింది’’  అంది ఉత్సాహంగా దీక్ష.

‘‘ఎలా..?’’ వెనక నుంచి అడిగింది సహస్ర.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekambar