Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kurukshetram telugu story

ఈ సంచికలో >> కథలు >> అవకాశవాదం

avakasavadam telugu story

‘‘వ్వాట్...  గొంతుచించుకుని అరిచాడు కులకర్ణి. తన ఎదురు కుర్చీలో ఉన్న వ్యక్తినే చూస్తూ.

అతను విలాసంగా నవ్వాడు.

కులకర్ణికి ఒళ్లు మండింది.

ఒకప్పుడు తన ఎదురుగా నిలబడటానికే భయపడే వాడు .. ఇప్పుడు ధీమాగా కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు.

‘‘ సంస్థ అవసరం.  ఖచ్చితంగా తనతో కాళ్లబేరానికి దిగుతుంది. కోరినంత ఇచ్చి మరీ పని పూర్తిచేసుకుంటుందని గ్రహించాడేమో...  అందుకే లెక్కలే నట్టుగా ప్రవర్తిస్తున్నాడు... ఈడియెట్ ...మనసులోనే  తిట్టుకున్నాడు.

తన అహం దెబ్బతిన్నా ముఖం మీద నవ్వు చెదరనివ్వలేదు.

ఓ మెట్టు దిగి అడిగాడు.

‘‘ మిస్టర్ రంజాన్ ఆలీ...  ఇంతకీ మెషిన్ బాగుపడుతుంటారా?  ’’

‘‘ ఆ... తప్పకుండా...’’ అతను కూల్ గా సమాధానం చెప్పాడు.

‘‘ నేనడిగిన మొత్తం  మీరు చెల్లిస్తే ...’’ అర్ధోక్తితో ఆగిపోయాడు.  ‘‘ రిపేరుకు ఎంత సమయం పడుతుంది?’’ మళ్లీ అడిగాడు కులకర్ణి.  
‘‘ సరిగ్గా గంట..’’

‘ఓ గంటలో పూర్తయ్యేపనికి ఆలీ ఇంత మొత్తం అడుగుతున్నాడూ అంటే తన విలువను గుర్తించాడన్నమాట...’ అనుకున్నాడు కులకర్ణి.అంత  డబ్బుఇవ్వకుండా ఆలీని ఎలా దారికి తెచ్చుకోవాలా అని  ఆలోచిస్తున్నాడు.  పాతికేళ్ల అనుభవంలో అతను ఎందరో ఉద్యోగులను  చూశాడు.

కొందరిని ఓసారి పలకరిస్తేచాలు.. ఉబ్బితబ్బిబ్బయిపోతారు.

బాగా పనిచేస్తున్నావన్న చిన్న ప్రశంసకే లొంగిపోతారు కొందరు.

కొంత మంది పనిలో లోపాలు ఎత్తి చూపకుండా ఉంటే చాలని సర్దుకుంటారు.

చిన్న మొత్తం ఇన్సెంటివ్ గా పడేస్తే చాలు... గొడ్డుచాకిరీ చేసేవాళ్లు  మరి కొందరు.

ఉద్యోగుల అంతర్గత విషయాలు తెలుసుకోటానికి  ఇన్నాళ్లూ  రకరకాల ఎత్తులు వేశాడు తను. సాధారణంగా అవన్నీ మంచి ఫలితాలనే ఇచ్చాయి. 

సామ,దాన, భేదోపాయాల్లో ఏదో ఒకటి ప్రయోగించి దారికి తెచ్చుకోవాలనుకున్నా.. ఎందుకో గానీ  అవన్నీ ఇతని ముందు పనికిరాని ఆయుధాలేనని అనిపిస్తోంది.

తను ఎందుకింత నిస్సహాయంగా మారిపోయాడు.

అతని ఆలోచనలు నాల్రోజులు  వెనక్కి మళ్లాయి.

‘‘ఇప్పుడెలా?  ఏం చేద్దాం’’ అందరూ తలలు పట్టుకున్నారు.

కులకర్ణి ఛాంబర్లో  అన్ని విభాగాల అధిపతులు  సమావేశమయ్యారు.

జపాన్ నుంచి తెచ్చిన మెషిన్ మొరాయించటం... దాన్ని తిరిగి దారిలో పెట్టటానికి ఏం చేయాలి అన్న ఒకే అంశం అజెండాగా   అక్కడ చర్చసాగుతోంది. 

‘‘  ఆర్డర్స్ ప్లేస్ చేసిన వాళ్లు ప్రోడక్టు పంపమని తెగ ఒత్తిడి చేస్తున్నారు’’ మార్కెటింగ్ మేనేజర్ చెప్పటం ప్రారంభించాడు. ‘‘ మనం తక్షణం స్పందించకపోతే ఆర్డర్లు వెనక్కిపోతాయి. రెండు మూడ్రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని మార్కెటింగ్ వాళ్లందరికీ నచ్చచెబుతున్నాం. ’’ అన్నాడు పరిస్థితిని వివరిస్తూ.

‘‘ ఆర్డర్ల సంగతి పక్కన పెట్టు. మూడ్రోజులుగా ప్రొడక్షన్ ఆగిపోయింది. లక్షల్లో నష్టం వస్తోంది. ఇదిలాగే కొనసాగితే... కొంప కొల్లేరవుతుంది’.. ప్రొడక్షన్ మేనేజర్ చెప్పుకొచ్చాడు.

‘‘ మేం చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాం. సిటీలో ఉన్న టాప్ ఇంజనీర్లందరినీ పిలిపించి చూపించాం. ఎవరి వల్లా కాలేదు. ఆర్ అండ్ డీ వాళ్లు తమ ప్రయత్నాలు చేశారు. ఇప్పడేం చేయాలో పాలు పోవటం లేదు’’ డిప్యూటీ మేనేజర్ తలపట్టుకున్నాడు.

‘‘మీ అందరికీ జీతాలిచ్చేది సమస్యలొచ్చినప్పడు పరిష్కరించటానికే అంటాడు ఛైర్మన్.  అసలు ఇన్ని రోజులూ విషయం ఆయన  దృష్టికి తేనందుకు మనల్నందరినీ శంకరగిరి మాన్యాలకు పంపుతాడేమో’’ సందేహం వ్యక్తం చేశాడు ఇంకో డిప్యూటీ మేనేజర్.

‘‘ ఆయనకి తెలియకుండా ఉండదు. నువ్వొక్కడివి చెప్పనంత మాత్రాన విషయం తెలియకుండా  ఉంటుందంటావా? మనం ఎలా ఈ సమస్యనుంచి బయటపడతామా అని వేచి చూస్తూంటాడు బహుశా...’’ అన్నాడు పక్కనున్న స్టోర్సు డిపార్టుమెంట్  అధికారి.‘‘ ఏడాదిన్నర క్రితం జపాన్ నుంచి ఈ సెకండ్ హాండ్ మిషన్ తెచ్చారు. అప్పటికే అది వాడి పారేసింది. తక్కువ ఖర్చుతో వచ్చింది కదా అని తెచ్చుకొచ్చి ఇక్కడ తగలేశారు. పనిచేయకపోతే దీన్ని ఉంచుకోలేం. అలాగని వదిలించుకోలేం’’...   చికాకుపడుతూ చెప్పాడు  క్వాలిటీ కంట్రోల్ అధికారి. ‘‘ ఆ సంస్థని వేరేవెరో టేకోవర్ చేశారు.  ఈ ప్రోడక్టును పక్కన పడేశారు.  ఇప్పుడు దీని గురించి పట్టించుకునే నాధుడే లేడు. ఓ పనికిరాని మెషిన్ తెచ్చి వ్యవహారం నడుపుతున్నాం అని బయటికి పొక్కితే  మన ప్రతిష్ఠకూడా మంట గలుస్తుంది’’

కులకర్ణి అందరూ చెప్పింది సావధానంగా విన్నాడు.

‘‘ మన సంస్థలో ఏ ఉద్యోగయినా సమస్యను పరిష్కరించగలరేమో తెలుసుకున్నారా? అలా మంచి సలహా ఇచ్చిన వాళ్లకి నగదు బహుమతి ఇద్దాం’’  సూచించాడు.

చాలా మందిని  తొలగించారని సంస్థ పట్ల ఉద్యోగులు గుర్రుగా ఉన్న విషయం అతనికి తెలుసు.. చిన్నదో, పెద్దదో... ప్రోత్సాహకాలతో ఏ ఉద్యోగినయినా దారిలోకి తెచ్చుకోగలనన్న నమ్మకం అతనిది.  అందుకే ఆ మాట చెప్పాడు.

‘‘ సీనియర్ ఉద్యోగులందరినీ మనం తొలగించి, ఆయా స్థానాల్లో కొత్తవాళ్లని నియమించుకున్నాం కదా... ఉన్న వాళ్లలో  ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. వారికి అనుభం లేదు.  నైపుణ్యాలూ అంతంత మాత్రమే. ’’ హెచ్ ఆర్ మేనేజర్  బదులు చెప్పాడు.

‘‘ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా సంస్థలున్న చోటకు ఉద్యోగులెవరినయినా పంపితే... కులకర్ణి ఆలోచిస్తున్నాడు. 

ఆ సమయంలో ఠక్కున ఆర్ అండ్ డి మేనేజర్ చెప్పాడు.

‘‘పోనీ... రంజాన్ ఆలీని పిలిపిస్తే..’’

‘‘ అదే మంచిది...’’ ముక్తకంఠంతో అందుకున్నారంతా.

‘‘ ఈ మిషన్ బిగించినప్పడు అతనే కీలకపాత్ర పోషించాడు. ఖచ్చితంగా అతను దీన్ని దారిలో పెట్టగలడన్న నమ్మకం మాకుంది.’’     ‘‘ మనం సంస్థ నుంచి తొలగించాం కదా... ఇప్పడు పిలిస్తే వస్తాడంటారా?’’ కులకర్ణి సందేహం వ్యక్తం చేశాడు.

‘‘ అదంతా మేం చూసుకుంటాం. రేపు ఉదయం మీరు ఆఫీసుకు వచ్చేటప్పటికల్లా మీ ముందు హాజరుపరుస్తాం’’ అన్నాడు హెచ్ ఆర్ మేనేజర్.

‘‘ సరే’’ అనుమతించాడు కులకర్ణి.

సమావేశం ముగిసింది.

అప్పటికప్పుడే రంజాన్ ఆలీకి కబురువెళ్లింది.

ఒక్కసారి ఆలోచనల నుంచి బయటకొచ్చి చెప్పాడు కులకర్ణి.

‘‘ మీరడిగింది చాలా పెద్ద మొత్తం..

అదీ ఓ గంట పనికి’’  కోపాన్ని తమాయించుకుని సాధ్యమైనంత  మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు.

‘‘ అదేం కాదు. మీ పని విలువ నాకు తెలుసు.

అది స్తంభిస్తే మీ కొచ్చే నష్టం కోట్లల్లో అని కూడా తెలుసు’’ అదే ధీమాతో చెప్పాడు రంజాన్ ఆలీ.

‘‘ మీ ఇష్టం. మీకు నచ్చితేనే  చెల్లించండి’’ అన్నాడు తనే మళ్ళీ.

ఎలాగయినా కంపెనీ తన దారికొచ్చి కోరింది చెల్లిస్తుందని అతనికి తెలుసు. ‘‘ఇదేమయినా న్యాయంగా ఉందా? ఏ వెయ్యి రూపాయలో తీసుకుని పని పూర్తి చేయవలసింది  పోయి మరీ ఇంత మొత్తం అంటే...’’ బేరం ఆడటం ప్రారంభించాడు కులకర్ణి.  ‘‘ నేను కోరిందానిలో... కేవలం 20 శాతం నా శ్రమకి ఫీజు. మిగిలింది అదెలా చేయాలో నాకొక్కడికే తెలియటం వల్ల  ఆ పరిజ్గానానికి, అనుభవానికి  మీరు చెల్లించవలసిన  ఖరీదు.... ’’ 

ఆలీ మెత్తగా మాట్లాడుతున్నా ఒక్కో మాట  శూలాల్లా గుచ్చుతున్నాయి. తన ఎదురుగా కూర్చున్న సాధారణ ఉద్యోగి ప్రవర్తన, మాట్లాడుతున్న తీరు రెండూ కులకర్ణికి భరించరానివిగా మారుతున్నాయి. అసహనం కట్టలుతెంచుకుంటోంది.

‘‘ ఇది  పచ్చి అవకాశవాదం...’’ అన్నాడు కోపంతో.

‘‘ఉద్యోగిని వాడుకుని వదిలేసే నైజం ఈ  యాజమాన్యానిది. నాది కాదు ’’ అన్నాడు ఆలీ స్వరం పెంచి మరీ. ఆ తర్వాత చెప్పాడు దూకుడుగా.

‘‘ జపాన్ మెషిన్ ఇన్ స్టాల్ చేసేవరకూ నన్ను ప్రేమగా దువ్వారు. రేయింబవళ్లు పనిచేయించారు.

ఆ తర్వాత .. సీనియర్ నన్న మిషతో మిగతా అందరితో పాటు నన్నుకూడా బయటకి పంపారు.

ఒక్క నిముషం కూడా కంపెనీపైన నా కున్న చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని మీరు పట్టించుకోలేదు.

మేమిచ్చే జీతం రాళ్లకోసం పనిచేశావు. సిన్సియారిటీ అని దానికి పెద్ద పేరు అవసరమా? అంటూ నా శ్రమని, పనితనాన్ని చిన్నబుచ్చారు. ఇంత కంటే మరెవరయినా ఎక్కువ జీతం ఆఫర్ చేస్తే వెళ్లకుండా ఉంటారా? ’’ అని వ్యాఖ్యలు చేశారు.  ఇదే కంపెనీని దాదాపు పాతికేళ్లు అంటిపెట్టుకుని ఉన్న నేను అసమర్ధుణ్ణని, గతిలేకే  ఇన్నాళ్లూ ఇక్కడ కొనసాగానని అర్ధం వచ్చేలా మాట్లాడారు. 

మీ తీరు వల్ల ఎంత మంది ఉద్యోగుల మనసులు గాయపడుతున్నాయో ఏనాడయినా ఆలోచించారా? సాధారణంగా పనిచేసేవాడికి, ప్రతిభ చూపించేవాడికి మధ్య తేడాను సంస్థను గుర్తించనంత కాలం.. ఇదిలాగే కొనసాగుతుందిసార్..’’

కులకర్ణికి ఏలా స్పందించాలో అర్ధం కాలేదు.

ఆలీ కోరింది  పెద్ద మొత్తమే. అదికాదంటే మెషిన్ గాడిన పడదు. ప్రొడక్షన్ ఊపందుకోదు.

బోర్డు ఆఫ్ డైరక్టర్సు అందరి ద్వారా మాట్లాడి ఛైర్మన్ ని  ఎలాగయినా ఒప్పించవచ్చు. ముందు  ఈ గండం నుంచి గట్టెక్కాలి.   గబగబా చెక్ రాసి  సంతకం చేశాడు.  

‘‘ ఒకప్పుడు  చేతులు కట్టుకుని ఒక్క మాటయినా మాట్లాడని వాడు.. ఇలా ఎందుకు పేట్రేగిపోతున్నాడు  అని ఆలోచిస్తున్నారు కదూ..’’ఆ మాటలకు కులకర్ణి ఉలిక్కిపడ్డాడు. తన మనసులో విషయాన్ని ఇతను ఎలా గ్రహించాడో అనుకున్నాడు.

‘‘ఒక్కసారి ఆ ఆలోచనని పక్కనపెట్టండి.

మీరూ నా లాంటి ఉద్యోగే.. మా లాంటి పరిస్థితే రేపు మీకూ ఎదురుకావచ్చు. అప్పుడు ఏం చేస్తారు? మీ భార్యాబిడ్డలకు ఏం సమాధానం చెబుతారు?

బాగాపనిచేయటంలేదని కంపెనీ నన్ను తొలగించిందని చెప్పుకోగలరా?

తలెత్తుకు జీవించగలరా?  ఒక్క నిముషం మానవత్వంతో ఆలోచించి చూడండి.’’

ఆలీ మాటలు పరుషంగా ఉన్నా... అందులో నిజం ఉందనిపించింది కులకర్ణికి

‘‘ ఏ సంస్థకయినా అనుభవం ఉన్న ఉద్యోగులు  అవసరం. అనుభవం ఉన్న ఒక ఉద్యోగిని ఇంటికి పంపేస్తే ఆ వేతనంతో నలుగురు కొత్త వాళ్లను తీసుకోవచ్చన్న ధోరణి ఎప్పటికయినా చేటు తెస్తుంది.

మీ క్షేమం కోరుకుంటూ..  సంస్థను ప్రాణప్రదంగా భావించే వాళ్లని ...  మీరు నెత్తిన పెట్టుకోకపోయినా ఫరవాలేదు... కనీస గౌరవ మర్యాదలతో చూడండి... అందరినీ వదులుకుంటే  చివరికి ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఆపత్కాలంలో ఆదుకునే వాడే ఉండడు.

మారుతున్న సాంకేతిక పరిజ్గానాన్ని అందుకోలేక.. ఎన్నో పేరొందిన కంపెనీలు కాలగర్భంలో కలిసిపోయాయి.  మీ రెంత?నేను శాపనార్థాలు పెట్టటంలేదు సర్ . ఉద్యోగాలు కోల్పోయిన వారి ఉసురు మీకు తగులుతుందన్న హెచ్చరికలూ చేయటంలేదు.  పరిస్థితిని చెప్పానంతే...’’ఇక తను చెప్పదలుచుకున్నది పూర్తయినట్టు లేచి నిలబడ్డాడు రంజాన్ ఆలీ.

టేబుల్ మీదున్న చెక్ ను అందుకుని జేబులో పెట్టుకున్నాడు.

స్ప్రింగ్ డోర్ తెరుచి బయటకు వెళుతూ ..

ఒక సారి వెనక్కితిరిగి చూసి చెప్పాడు.

‘‘ ఈ డబ్బు మా అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుకి ఉపయోగపడుతుంది.

ధ్యాంక్యూ సర్...  ’’

నోటి మాటరాక మాన్పడిపోయాడు కులకర్ణి.

మరిన్ని కథలు
parivartana telugu story