Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ : ఏకాంబర్ చెల్లెలు అలివేలు మంగ ఎంగేజ్ మెంట్ వేడుకలకి నూకరత్నం, ఆమె బావలు కూడా వస్తారు. నీలాంబర్ ఒక అమ్మాయితో చనువుగా ఉండడం గమనించి నూకరత్నం ఏకాంబర్ తో చెప్తుంది. ఆ అమ్మాయి తమకి వరసకి మరదలు అవుతుందని, నీలాంబర్ ఆ అమ్మాయిని ఇష్టపడితే మంచిదేనని అంటాడు ఏకాంబర్.

"రాత్రంతా మీరు పడుకోనిచ్చార్రా?! ఆలస్యంగా పడుకోవడం వలన లేవలేకపోయాను.." సోఫాలో కూర్చుంటూ అన్నాడు నీలాంబర్.

" రోజూ అయిదు గంటలకే వెళ్తావు కదా అన్నయ్య !  ఈ రోజు ఆలస్యమైతే షాపు ఎవరు తీస్తారు? " కుతూహలంగా అడిగింది చెల్లెలు మంగ."

ఇద్దరబ్బాయిలు ఉన్నారు కదమ్మా ! వాళ్ళూ వచ్చేస్తారు. ఒక తాళాల జత వాళ్ళ దగ్గర కూడా ఉంది." చెప్పాడు నీలాంబర్.

" రత్నం గారూ! అన్నయ్యకి టీ కావాలి " హాల్లో నుంచే అరిచాడు ఏకాంబర్.

" ఇదిగో తెస్తున్నా" అంటూ వంట గదిలోనుంచే కేక వేసింది నూకరత్నం.

అన్నదమ్ములిద్దరూ చెల్లెలితో సరదాగా కబుర్లాడుకుంటూ కూర్చున్నారు. నూకరత్నం కూడా టీ గ్లాసు నీలాంబర్ చేతికిచ్చి తనూ బాతాఖాణీలో పాలుపంచుకుంది.

ఇంతలో ఎవరో ఒకామె ఇంటిముందుకొచ్చి 'ఏకాంబర్ బాబూ' అని గట్టిగా పిలిచేసరికి నలుగురూ కబుర్లలోనుండి బయటపడ్డారు.

' అన్నయ్యా! నీకోసమే ఎవరో వచ్చారు. వాకిట్లో నిలబడి పిలుస్తున్నారు.' సోఫాలో నుండి లేచి గుమ్మం దగ్గరకు వచ్చి చూస్తూ అంది అలివేలుమంగ.

" నాకోసమా?" ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు నీలాంబర్.

" అబ్బ నీ కోసం కాదురా అన్నయ్యా! చిన్నన్నయ్య కోసం " చిరాగ్గా అంటూ వాళ్ళదగ్గరకు వచ్చింది.

" అయ్యో! ఎవరో ఏమో! లోపలకు రమ్మనకపోయావా?" గభాలున లేచి నిలబడి అన్నాడు ఏకాంబర్.

" ఎవరో ఏమో వెళ్ళి చూడరా!" అన్నాడు నీలాంబర్.

అన్న మాట వింటూనే వీధి గుమ్మం దగ్గరకు వచ్చాడు ఏకాంబర్.

వీధి వాకిట్లో నిలబడి ఉంది ఒకామె.

"మీరు" సంశయంగా అడిగాడు ఏకాంబర్.

" నేను రైల్వే గార్డు రామారావు గారి భార్యను బాబు.మీతో మాట్లాడాలని వచ్చాను." అంది ఆమె గొంతులో నుండి తన్నుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకుంటూ.

'రైల్వే గార్డు రామారావూ పేరు వింటూనే క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాడు ఏకాంబర్.

రైల్వేగార్డు  రామారావు! ఎస్. గుర్తొచ్చింది.ఏజెంటుగా చేరిన కొత్తలో తనే పిలిచి పాలసీ రాసిన మంచి మనిషి దాదాపు అయిదేళ్ళు దాటి పోయింది. ఆ తర్వాత ఆయన్ని కలవడం కుదరలేదు. రైల్వే ఉద్యోగి కావడం వలన నెలెనెలా పాలసీ మొత్తం జీతంలో వసూలు అయిపోతుంది.

మొదటి రెండు వాయిదాలే కట్టి పాలసీ రాయించాడు. అయితే ఆ రెండు వాయిదాల మొత్తం అయిదు వేలు రూపాయలు బలవంతంగా తను వద్దన్నా వినకుండా ఇచ్చేసాడు.

అలాంటి మంచి మనిషి గుర్తుకు రాకపోవడమేమిటి?!" అనుకుంటూనే ఆమెను ఆనందంగా ఇంట్లోకి ఆహ్వానించాడు ఏకాంబర్." రండి! రండమ్మా! సార్ బావున్నారా?" యధాలాపంగా అడిగాడు.

" ఏం బాగు బాగు బాబూ ఆర్నెల్లుగా రైల్వే ఆసుపత్రిలో ఉన్నారు. ఏ క్షణాన ఏమౌతుందోనని ఆందోళనగా ఉంది" దాదాపు ఏడుస్తూనే మెట్లెక్కుతూ గుమ్మం అరుగు మీద అచేతనంగా కూర్చుండిపోయింది ఆమె.

"అయ్యో! ఏమైందమ్మా!" అంటూ ఆమెని రెండు చేతులతో పొదివి పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్ళాడు ఏకాంబర్."

రత్నం గారు కొంచెం మంచినీళ్ళు తీసుకురండి" ఆతృతగా చెప్పాడు ఏకాంబర్.

"అలాగే" అంటూ గబాలున వంటగదిలోకి వెళ్ళి నీళ్ళగ్లాసుతో వచ్చింది నూకరత్నం.

"తీసుకోండమ్మా" నూకరత్నం చేతిలో ఉన్న నీళ్ళగ్లాసుని తీసుకుని ఏకాంబర్ కేసి కృతజ్ఞతగా చూసింది ఆమె.

"చెప్పమ్మా! నేనెలా సహాయపడగలను?" ఆమె ప్రక్కనే సోఫాలో కూర్చుంటూ అన్నాడు ఏకాంబర్.

ఆమెతో ఏకాంబర్ మాట్లాడుతుంటే నీలాంబర్, అలివేలుమంగ, నూకరత్నం ఉత్సుకతతో చూస్తూ నిలబడిపోయారు.

"ఏంలేదు బాబూ! ఆయన నీ దగ్గర ఇన్స్యూరెన్స్ ఏదో కట్టారట కదా! ఆయన ఆసుపత్రిలో చేరి ఆర్నెల్లు కావస్తోంది. జీతం రావడం లేదు. ఆ విషయం నీతో చెప్పి రమ్మని నా కూతురు పంపించింది బాబూ" నెమ్మదిగా చెప్పింది ఆమె.

" ఆర్నెల్లయిపోతోందా...అయ్యో మంగా నా గదిలో ల్యాప్ టాప్ ఉంది కదా ఇలా పట్టుకుని రా" చెల్లెలికి చెప్పాడు ఏకాంబర్.

"అలాగే అన్నయ్యా" అంటూ గబాలున గదిలోకి వెళ్ళి, అరక్షణంలో ల్యాప్ టాప్ పట్టుకుని వచ్చింది అలివేలుమంగ.

"రత్నం గారూ ల్యాప్ టాప్ తెరిచి నా కోడ్ తో ల్యాప్స్ అయిన పాలసీల లిస్ట్ లో సార్ పేరు, పాలసీ నంబరు ఉందేమో చూడండి. " ఆతృతగా అన్నాడు.

"అలాగే" అంటూనే అలివేలు మంగ చేతిలో ల్యాప్ టాప్ తీసుకుని సోఫాలో కూర్చుంది నూకరత్నం.

"భోగాపురపు రామారావు, సాలరీ సేవింగ్స్ స్కీం లో ఉంటుంది " చెప్పాడు ఏకాంబర్.

నూకరత్నం కూడా ఆతృతగా కంప్యూటర్ లో ఫైల్స్ అన్నీ వెతికింది.

" లేదు సార్, ఇంకా పాలసీ ల్యాప్స్ అయినట్టు లేదు. సార్ పేరు ఎక్కడా కనిపించడం లేదు. " చెప్పింది.

" ప్రస్తుతానికి పాలసీ ల్యాప్స్ కాలేదమ్మా. ఆరు నెలలు వరుసగా వాయిదా చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. పొరపాటున ఏదన్నా జరిగితే క్లైం ఒక్క రూపాయి కూడా రాదు." ఆమెతో చెప్పాడు ఏకాంబర్.

" అంటే...?" అయోమయంగా ఏకాంబర్ కేసి చూస్తూ అంది ఆమె.

" సార్ కి జీతంలో కదమ్మా పాలసీ ప్రీమియం కట్ అయి కంపెనీకి చేరేది, అలా ప్రతీ నెలా రికవరీ అయి పాలసీ ప్రీమియం కంపెనీకి చేరితేనే సార్ పేర కట్టిన పాలసీ నడుస్తుంది. ఒకవేళ ఎవరైనా వరసగా ఆరునెలలు కట్టకపోతే ఆ పాలసీ ల్యాప్స్ అయిపోతుంది." చెప్పాడు ఏకాంబర్."అదే..ల్యాప్స్ అంటే నాకర్థం కావడంలేదు బాబూ..." అంది ఆమె ఆందోళనగా.

" పాలసీ చనిపోతుందని అర్థమమ్మా...అప్పుడు ఆ పాలసీ వలన ఎలాంటి లబ్ది చేకూరదు. జరగరానిది ఏదన్నా జరిగితే అయిదు లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ ఇవ్వరు." ఆమెకి అర్ధమయ్యేలా చెప్పాడు ఏకాంబర్.

" మరి ఇప్పుడెలా బాబూ" ఆందోళనగా అంది ఆమె.

" సార్ కి జీతం రావటం లేదు కదమ్మా వాళ్ళ ఆఫీసు వాళ్ళు కూడా కట్టలేరు కదా? మనమే ఆ వాయిదాలు నేరుగా ఇన్స్యూరెన్స్ కంపెనీకి వెళ్ళి కట్టుకోవడం మంచిది" చెప్పాడు ఏకాంబర్.

"అమ్మో జీతం రాక, ఇంటి పోషణే దినదినగండంగా ఉంది బాబూ. ఆయన ఆసుపత్రిలో పడ్డ దగ్గర్నుండి నానా యాతన పడుతున్నాం బాబూ.

రైల్వే ఆసుపత్రి కనక ఆయన మందులూ గట్రా వాళ్ళే ఇస్తున్నారు." బాధగా అంది ఆమె.

" అయ్యో " అంటూ గబాలున తన జేబులో నుండి వెయ్యి రూపాయల నోట్లు పది తీసి ఆమెకి ఇవ్వబోయాడు ఏకాంబర్.

"వద్దు బాబూ. భగవంతుడి దయవలన ఏదో నడుస్తోంది. ఈ పాలసీ విషయమై నీకు చెప్పి పోదామని వచ్చాను బాబు. ఎవరి దగ్గరన్న చేబదులు అడిగి నాలుగైదు రోజుల్లో వచ్చి నిన్ను కలుస్తాను బాబు." అంటూ ఆమె సోఫాలో నుండి లేచి నిలబడింది." మీకు ఎలాంటి సహాయం అవసరమైనా నాకు ఫోన్ చెయ్యండమ్మా" అంటూ తన విజిటింగ్ కార్డ్ తీసి ఆమెకి ఇచ్చాడు ఏకాంబర్.

" వస్తానమ్మా, వస్తాను బాబూ" అంటూ అక్కడ ఉన్న నలుగురికీ చెప్పి ఆమె నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయింది."ఎవర్రా చిన్నన్న?!" ఏకాంబర్ ప్రక్కకు వస్తూ అడిగింది మంగ.

" వాళ్ళాయన నా కస్టమర్. పాపం చాలా మంచాయన. మంచాన పడ్డాడట." బాధగా అన్నాడు ఏకాంబర్.

" ఇలా అందరికీ డబ్బు సాయం చేస్తూంటావా?" ఆశ్చర్యంగా అడిగింది మంగ.

"అవసరమైన వాళ్ళకి..తప్పేముంది..?" ఆశ్చర్యంగా అడిగాడు ఏకాంబర్.

"తప్పులేదు. డబ్బులొస్తున్నాయి కదాని ఇలా దానమిస్తూ పోతే నాలా రోడ్డున పడాల్సి వస్తుందిరా.!" గబాలున అన్నాడు నీలాంబర్.

" నీ సంగతి వదిలెయ్ అన్నయ్యా! నేను ఊరికే ఎవరికీ ధారపోయడంలేదు. కష్టాల్లో ఉన్నవాళ్ళకి ఏదో నాకు చేతనైన చిన్న సహాయం. అయినా ఎవరూ అంత తొందరగా తీసుకోరు కూడా."

" నువ్వు పడ్డ కష్టం ఇంకేం మిగులుతుందిరా." అంది మంగ.

" కస్టమర్లందరూ నా దగ్గర పాలసీలు కట్టబట్టే కదా నేనీరోజు ఇలా ఉన్నాను.వాళ్ళుంటేనే నేనుంటాను. ఆ విషయం మీకు తెలుసా" కోపంగా అన్నాడు ఏకాంబర్.

" అవునులేరా, నీ తెలివి కన్నా వాళ్ళ తెలివితక్కువే ఎక్కువగా కనిపిస్తోంది  చస్తేగానీ చేతికందని డబ్బు కోసం అప్పులు చేసి తిప్పలు పడుతూంటారు. " గబుక్కున అనేసాడు నీలాంబర్.

" అన్నయ్యా" ఆశ్చర్యంగా..ఆందోళనగా అంది అలివేలుమంగ.

" అదేంటన్నయ్యా, అలా మాట్లాడుతున్నావ్. ఆలోచించే మాట్లాడుతున్నావా?" నీలాంబర్ కేసి చూసి అన్నాడు ఏకాంబర్.

" ఈ ఇన్స్యూరెన్స్  అంటే నాకు ఎలర్జీరా. ఐ డోంట్ లైక్ దిస్ బ్లడీ ఎంబ్రాసింగ్ సేవింగ్స్." అంటూ లేచి వెళ్ళిపోయాడు నీలాంబర్.

" మీ పెద్దన్నయ్య అలా మాట్లాడుతున్నారేంటండీ?" ఆశ్చర్యంగా అంది నూకరత్నం.

"మావాడి మనస్తత్వం అంతే లెండి రత్నం గారూ. నేనన్నా, నా పనులన్నా మా అన్నయ్యకు ఎలర్జీ. వదిలెయ్యండి నేనలా వీధిలోకి వెళ్ళివస్తాను " అంటూ తన బ్యాగ్ సర్దుకుని నిలబడ్డాడు ఏకాంబర్.

" సరేలే వెళ్ళిరండి. అలా వీలైతే మన ఫ్రాంచైజీ ఒకసారి చూసి రండి " ల్యాప్ టాప్ బ్యాగ్ లో పెడుతూ అంది నూకరత్నం.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana