Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekambar

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ : తన కథ చెప్తూ ఫీలైన మేఘనతో దగ్గరవుతాడు హరి. అర్ధరాత్రి మెలకువ వచ్చి చూస్తే ఆమె కనిపించదు. కంగారుగా వెతికిన అతడికి చూరుకు వేళ్ళాడుతూ కనిపించేసరికి హడలిపోయి ఆమెని దింపి ప్రధమ చికిత్స చేసి మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పుతాడు......

.....................................................

ఏదో డిఫరెంట్‌ ఫ్లేస్‌కెలా  వచ్చాను? కన్‌ఫ్యూజన్‌.... నెమ్మదిగా....  తెరలు తెరలుగా జరిగినదంతా ఒకదాని కొకటిగా మస్తిష్కంలో సాక్షాత్కారించాయి.  తను కారులో ఒంటరిగా బయల్దేరడం.. కారు మధ్యలో ఆగిపోవడం, ఇంతలో మేఘన మెరుపులా మెరవడం, ఆమె ఆత్మీయత, ఆదరణ, ప్రేమ, అనురాగం, ఆమె కష్టాలు, కన్నీళ్లు అన్నీ స్ఫురించాయి. అప్పుడనుకున్నాడొక్కసారిగా....

మేఘన.....

ఏదీ మేఘన... ఏమైపోయింది?

ఎక్కడి కెళ్లిపోయింది...?  మళ్లీ ఉరిపోసుకుందా ఏమిటి? ఆమెని బతికించడానికి పడిన కష్టం, ఆవేదన, ఆతృత అన్నీ వృథాయేనా..?కనీసం మాటైనా చెప్పకుండా ఎలా వెళ్లిపోయింది? తన కష్టాలనీ, కన్నీళ్లనీ అంతలోనే ఆనంద క్షణాలుగా మధురానుభూతులుగా మార్చి, మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా వెళ్లిపోవడం సబబేనా?

ఏమిటీ ఈమె ఆంతర్యం..?

ఏమీ అంతుబట్టడం లేదు....

కానీ ఒక విషయం మాత్రం అర్థమయింది... అదొక కాంప్లెక్స్‌పర్సనాలిటీ...ఆలోచిస్తూ చుట్టూ చూస్తున్న హరికి మంచం కోడు అంచున ఒక కాగితం రెపరెపలాడుతూ కన్పించింది.‘‘ఈజ్‌ ఇట్‌ ఏ నోట్‌?’’

ఆ నోట్‌ని చటుక్కున చేతుల్లోకి తీసుకున్నాడు.

‘‘నేస్తం... నా ప్రాణం... అతి తక్కువ కాలంలోనే నన్ను నీదాన్నిగా చేసుకున్నావు... నా ఆవేదన, నా కష్టం, నష్టం... సుఖం, దుఃఖం... అన్నీ పంచుకుని అండగా ఆలంబనగా నిలిచావు. నా హరీ... నీకేవిధంగా ధన్యవాదాలు తెలపాలి? అయినా, అయినవారి మధ్య ఈ ధన్యవాదాలెందుకు?

చెప్పకుండా వెళ్లినందుకు కోపం తెచ్చుకోకు. వెళ్లాల్సి వస్తున్నది కాబట్టి వెళ్తున్నాను. నిన్ను విడిచి వెళ్లడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? నా కాళ్లు భూమిలో స్థంభాల్లా కూరుకుపోయి ఒక అంగుళం కూడా కదలనని మొరాయించాయి. కానీ తప్పనిసరియై వెళ్తున్నాను. ఎల్లప్పుడూ నీ సాన్నిహిత్యంలోనే... సదా నీతోనే ఉండాలని కోరుకుంటూ... ఈ అభాగ్య జీవితానికి ముక్తిని ప్రాప్తించమని కోరుతూ... నీ మేఘన.’’

‘‘ప్రపంచంలో దేన్నయినా అర్థం చేసుకోవచ్చు. ఈ ఆడవాళ్లని తప్ప. ఆందోళన, దుఃఖం, బాధల్లో        ఉన్న ఒక ఆత్మ.... ఛ... ఛ... ఆత్మేమిటీ మనిషి, జీవికి ఒక మంచి మిత్రుడిగా, ఆసరగా, బాసటగా నీకు నేనున్నాను బాధపడకు అని తోడుగా ఉన్నందుకు... ఏదేదో రాసేసింది... ముక్తి, భక్తి... సరే... సంసార బాధలు తప్పవు కదా... భర్తనీ, పిల్లవాడినీ చూసుకోవాలని కదా... అందుకే హడావుడిగా వెళ్లిపోయుంటుంది... ఐనా నేనే డ్రాప్‌చేసి ఉండేవాడిని కదా’’ అనుకున్నాడు హరి.

ఇంతలో కారు గుర్తుకొచ్చింది. ‘‘కారు  అయ్యో నా కారు... ఏం పార్ట్స్‌పోయాయో... స్టార్ట్‌ ఔతుందో లేదో... షోరూం వాళ్లకి ఫోన్‌చేస్తే వాళ్లొచ్చి తీసుకెళ్తారేమో? సమయం ఎంతయిందో.... ఓహ్ 10.30 గంటలు... ఎప్పుడు మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లాలి? రఘు గాడికి ఫోన్‌చేసి మెకానిక్‌నిపంపిచమనాలా? లేక క్యాబ్‌పిలిపించుకోవాలా? హాస్పటల్‌వాళ్లకు ముందుగా చెపితే బాగుంటుంది. లేకపోతే అంతా గందరగోళమై పోతుంది... సరే... ఒకసారి లెట్‌మీ ట్రై దిస్‌డర్టీ కార్‌’’ అనుకుంటూ... ఇగ్నీషన్‌తో ట్రై చేసాడు. మనిషి ప్రాణం పోసుకుని జీవంలోకి వచ్చినట్లుగా వ్రుయ్‌... వ్రుయ్‌మంటూ స్మూత్‌గా శబ్దం లేకుండా ఇంజన్‌స్టార్ట్‌అయింది. మరిక ఆలస్యం చేయక... హైదరాబాద్‌వైపు కారు పరిగెత్తించాడు హరి.

డ్రైవ్‌ చేస్తూనే... తను వెళ్లే హాస్పిటల్స్‌కి అన్నింటికీ చకచకా ఫోన్లు కొట్టి, అనివార్య కారణాల వలన తను రాలేకపోతున్నానని వేరే ఏర్పాట్లు చేసుకోవల్సిందిగా చెప్పేసాడు.

ఇంతలో....

హరి సెల్‌ఫోన్‌ మోగింది...

‘‘మమ్మీ కాలింగ్‌...’’

మమ్మీతో కాసేపు మాట్లాడితే మనసు నెమ్మదిస్తుంది. కారుని రోడ్డుకు బాగా పక్కకి తీసుకెళ్లి, ఆపేసి సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆన్‌ చేసాడు.‘‘ఏం... నాయనా.. హరీ.. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులయిందో మమ్మీకి ఫోన్‌చేసి? అని ఏమన్నా గుర్తు ఉందా...? అసలు నన్ను మర్చిపోయావా...?’’

వేరే వాళ్ల గొంతుల్లో నిష్టూరత ఉంటుంది. కానీ తల్లి గొంతులో ప్రేమే ఉంటుంది. నిష్టూరత మచ్చుకు కూడా కాన రాలేదు హరికి. ఏదో బాధలో ఉన్న మనిషికి ఎవరైనా ప్రేమ చూపిస్తే చలించిపోతాడు. అందునా తల్లి ప్రేమ..! గొంతులో ఏదో అడ్డుబడినట్లయ్యింది హరికి. నోట మాట రావడం లేదు... గుండె బరువెక్కింది.

‘‘ఏం... నాయనా... ఏమన్నా బిజీలో ఉన్నావా..? మాట్లాడటం లేదు..? డ్రైవింగ్‌లో ఉన్నావా..? ఇంట్లో ఉన్నావా? లేక హాస్పిటల్‌ థియేటర్‌లో ఉన్నావా..? ఓ..కే.. నీకు వీలయ్యినప్పుడే ఫోన్‌చేస్తాను.’’ అంటున్నదామె....

ఫోన్‌చేసేసి, వాడెవడో చెప్పకుండా, మనమే పరిస్థితుల్లో ఉన్నామో తెలుసుకోకుండా, లబడబా, లొడలొడా వాగేసే వాళ్లున్న ఈ రోజుల్లో... చల్లని తల్లికి తన బిడ్డ మీద ఎంత ఆపేక్ష...? ముసురుకుంటున్న ఆలోచనల్ని పారద్రోలుతూ... వెంటనే అన్నాడు  హరి...

‘‘అమ్మా...!’’ఎప్పుడూ చిరాగ్గా ఫోనెత్తి...ఆఁ... అసలెందుకు ఫోన్‌చేసావు? నన్నెందుకు విసిగిస్తావు? ఏం పనో తొందరగా చెప్పు... చెప్పు మమ్మీ... అంటూ మాట్లాడే హరి.... అమ్మా! అనడంతో...

ఒక్కసారిగా కడుపులో పేగు కదిలింది సుధారాణి’కి . ఆమె హృదయానికర్ధమైపోయింది కన్నకొడుకు ఏదో బాధలో ఉన్నాడని...ఆతృతతో.... నాయనా... హరీ... అన్నది.

‘‘ఏం లేదమ్మా... కొద్దిగా పని ఒత్తిడి... అంతే’’ అన్నాడు పొడిపొడిగా....

‘‘హరీ, నేనందుకే నిన్ను దూరంగా, బంటరిగా ఉండవద్దన్నది, నాతో పాటే ఉస్మానియా క్వార్టర్స్‌లో ఉండమన్నది...’’

‘‘మరేం లేదమ్మా...’’

‘‘ఓకే... ఓకే... సాయంత్రం ఆరుగంటలకల్లా నా ఆఫీసుకు వచ్చెయ్యి... రాత్రికి డిన్నర్‌ నా దగ్గరే... సరేనా..’’

హరి ఏం మాట్లాడలేకపోయాడు.

‘‘నువ్వేం మాట్లాడతావు? ఎప్పుడూ చెప్పేదే... గానీ నీ కోసం మా ఆఫీసులో సాయంత్రం ఎదురు చూస్తుంటాను. వచ్చెయ్యి హరి.’’ గబగబా ఆర్డర్‌ వేసేసి ఫోన్‌ పెట్టేసింది సుధారాణి.

రావడం, రావడం తన అపార్ట్‌మెంట్‌కు వచ్చేసి, గబగబా స్నానం చేసాడు హరి.ఈలోగా వాచ్‌మేన్‌ తెచ్చిచ్చిన రెండు ఇడ్లీలు తిని, ఒక కప్పు చాయ్‌ తాగాడు.

ఇక అంతే...

నిద్ర ముంచుకు వచ్చింది...

ఎలా ఉన్నవాడు అలానే మంచం మీద విరుచుకుపడిపోయాడు. లీలగా... ఎక్కడో దూరంగా పసివాడి ఏడుపు వినబడుతున్నది... సన్నగా వినబడుతున్నదల్లా... బాగా దగ్గరకు వస్తున్నది... ఆ ఏడుపు సాధారణంగా లేదు... అసాధారణంగా ఉంది... కర్ణకఠోరంగా ఉంది... ఇంకా ఇంకా దగ్గరగా... మరింత దగ్గరగా... బిగ్గరగా... ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు... క్షణంసేపు పరిస్థితి అర్థం కాలేదు. కానీ మరుక్షణంలో తేరుకున్నాడు. ఆ శబ్దం క్లియర్‌గానే వినబడుతున్నది, మాయో మంత్రమో కాదు, హాలు తలుపు తీసుకుని, మెయిన్‌డోర్‌తలుపు తీసాడు....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti