Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jeevana satyam

ఈ సంచికలో >> కథలు >> సంచలనం

samchalanam

'బ్రేకింగ్ న్యూస్ ... బ్రేకింగ్ న్యూస్"

టీ వీ ల ముందు కూర్చుని 'సంచలనం" ఛానల్ చూస్తున్న వారంతా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు.

“మరో సంచలనం ... మరి కాసేపట్లో ....  చూస్తూనే ఉండండి మీ  టీ వీ “సంచలనం” లో ... చిటికెలో వచ్చేస్తాం.  చూస్తూనే ఉండండి.”     "నిను వీడని నీడను " సీరియల్  1996వ ఎపిసోడ్ చూస్తున్న మూడు తరాల ఆంధ్ర ప్రేక్షకులు గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నారు.  మాటా మంతీ; వంటా వార్పూ అన్నీ  ఆపేసి టీ వీ ల ముందు కూర్చుని చూస్తూనే ఉన్నారు.

ఆరు నిమిషాల వాణిజ్య ప్రకటనల అనంతరం మళ్ళీ ""నిను వీడని నీడను " మొదలయింది.

"ఇలా ఎందుకు చేశావు బామ్మా?"

'' ఏం చేయమంటావే తల్లీ! .... అలా జరిగిపోయింది "

ఇరవై ఎపిసోడ్ లుగా టీ వీ లకు అతుక్కుపోయిన జనానికి "ఆమె ఎందుకు అలా చేసిందో ... అది అలా ఎందుకు జరిగిపోయిందో అర్థం కాక సస్పెన్స్ భరించలేక ఊపిరి బిగపట్టుకొని చూస్తూనే ఉన్నారు.

మరో ఐదు నిమిషాలు బామ్మ ఇంట్లో ఉన్న జనాల మొహాలను మార్చి మార్చి  చూపించాడు కెమెరామేన్ ఉమాపతి. వాళ్ళ  ముఖాళ్ళో అయోమయమో ... ఆందోళనో  అర్థం కాని భావాన్ని చాలా నేర్పుగా ప్రదర్శించారు నటులు. అంతే చాకచక్యంగా కెమెరాలో  బంధించాడు ఉమాపతి.

వీక్షకులు ఎవరికి తోచినట్లుగా వారు వూహించుకోసాగారు. చర్చించుకోసాగారు. తీవ్ర ఉద్విగ్నతకు లోనై పోతున్నారు.

ఇంతలో మళ్ళీ  ...  బ్రేకింగ్ న్యూస్

“ సంచలనానికే సంచలనం సృష్టిస్తున్న మీ ” సంచలనం”  లో మరో సంచలనం.

'సుజాత ఆత్మహత్య చేసుకోబోతోందా? సేవ్ ఎ లైఫ్ ... మరి కాసేపట్లో ... చూస్తూనే ఉండండి. కదలకండి.  చిటికెలో వచ్చేస్తాం.  చూస్తూనే ఉండండి. '’

వంట చేయడానికి లేవబోయిన మహిళా   వీక్షకులు  మళ్ళీ కదలకుండా కూర్చున్నారు. ఒక ప్రక్క సీరియల్ సస్పెన్స్ భరించలేక టెన్షన్ పడిపోతున్న జనానికి ఈ సంచలనం బ్రేకింగ్ న్యూస్ ఏమిటో త్వరగా తెలుసుకోవడానికి తెగ టెన్షన్ పడిపోతున్నారు.

మరో ఏడు నిమిషాల వాణిజ్య ప్రకటనల తర్వాత మళ్ళీ సీరియల్ మొదలయింది.

"బామ్మా?"

"మల్లీ"

బామ్మ, మల్లీ ఒకర్నొకరు గట్టిగా కౌగలించుకొన్నారు. ఏడుపు మొదలెట్టారు.  కాస్ట్లీ మేకప్ చెదరిపోకుండ మల్లీ చాలా జాగ్రత్తగా ఏడవడం మొదలెట్టింది.  బామ్మ మాత్రం గ్లిజరిన్ వేసుకొని మరీ జీవించారు.  వాళ్ళ మొహాళ్ళో  ఆందోళనో ...ఆవేదనో మరే భావమో అర్థం కాక   వీక్షకులు  ఊపిరి బిగబట్టి ఎవరికి తోచినట్లు వారు ఊహించుకోసాగారు.

“మరో బ్రేకింగ్ న్యూస్ ...సంచలనానికి సంచలనం మీ ” సంచలనం” లో

'''సేవ్ ఎ లైఫ్ ... యూ ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న వీడియో.  సుజాత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానని ...కారణం తన తండ్రేనని పోస్ట్ చేసింది.  ఇంతకీ ఎవరా తండ్రి? ఎవరా సుజాతా...మరి కాసేపట్లో ... చూస్తూనే ఉండండి.'

తొమ్మిది నిమిషాల ప్రకటనల అనంతరం మళ్ళీ సీరియల్ మొదలయింది.

ఈసారి బామ్మ ముక్కు గట్టిగా చీది "మల్లీ!" అని మళ్ళీ బావురుమంది.  మల్లి మాత్రం ఎలాంటి భావం అర్థంకానీయకుండా బామ్మను కావిలించుకుంది.  ఆమెకు ఎలాంటి డైలాగులు లేవు. ఎందుకంటే హింది మాత్రమే  తెలిసిన బాంబే ఇంపోర్టెడ్ సీరియల్ హీరోయిన్ ను ఇబ్బంది పెట్టడం దర్శకునికి ఇష్టం లేదు.

ఇంతలో పోలీస్  జీప్ వీధిలో ఆగింది.  సీరియల్ ముగిసింది  ...సారీ ... ఆ రోజు టికి ముగిసింది.

' సేవ్ ఎ లైఫ్ ...సంచలనం సృష్టిస్తున్న వీడియో  యూ ట్యూబ్ లో ... సుజాత ఆత్మ హత్య చేసుకుంటానని  ఎందుకు పోస్ట్ చేసింది.  ప్రేమ విఫలమైందా?  పెళ్ళి ఆగిపోయిందా... ఇంతకీ ఆ కసాయి తండ్రి ఎవరు? త్వరలో మీ “సంచలనం”లో ... కదలకండి. కాసేపట్లో లైవ్ డిస్కషన్ ... మీరూ పాల్గొనండి. "

వీక్షకుల్లో విపరీతమయిన టెన్షన్ మొదలయింది.

అంతక్రితమే వచ్చిన చుట్టాలు ఇక లాభం లేదని చల్లగా జారుకొన్నారు.

ఎనిమిది నిమిషాల వాణిజ్య ప్రకటనల అనంతరం లైవ్ మొదలయింది.

ఈసారి డిస్కషన్ ఫ్యానెల్ తో రెడీ అయింది  “సంచలనం” - యాంకర్ కవిత తో.

"మీ “ సంచలనం” సృష్టిస్తున్న మరో సంచలనం... ఫస్ట్  యిన్ “ సంచలనం” ...ఎక్స్ క్లూజివ్లీ సంచలనం ఓన్లీ.    సుజాత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ... ఇందుకు కారణం తన తండ్రేనని యూ ట్యూబ్ లో పోస్ట్ చేసింది.  ఈ వీడియో యూ ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో అర్థం కావడం లేదు.  నిజమే ఐతే ఒక ప్రాణం ఆపదలో ఉంది.  నిగ్గదీసే పనిలో మా ప్రతినిధులున్నారు. మీరు కూడా పాలుపంచుకోండి .  ఒక ప్రాణాన్ని రక్షింక్షండి. సమాచారం ఏదైనా మాతో షేర్ చేసుకోండి. మా ఫోన్ నంబర్లు 9999999999 మరియు 8888888888 .  ఆ అమ్మాయి మీ పక్కనే ఉండొచ్చు.  మీ వాడలోనే ఉండొచ్చు.  మీ వూరులోనే ఉండొచ్చు.  మీకు తెలిసిన  వారై ఉండొచ్చు. వివరాలు అందించండి.  ఒక ప్రాణాన్ని నిలబెట్టండి. ఒక ఆడకూతురి ప్రాణాన్ని కాపాడండి.  సమాజ సేవకు మీ వంతు సహాయం అందించండి.  ఆ కసాయి తండ్రికి తగిన గుణపాఠం చెప్పండి.

ఇక ఈ విషయాన్ని  లైవ్ షో లో చర్చించడానికి మన స్టుడియో లో ప్రముఖ మహిళా నాయకురాలు శ్రీమతి  వనిత గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్  శ్రీ పట్టాభి గారు మరియు ప్రముఖ లాయర్ శ్రీ భగత్ గారు ఉన్నారు.  చర్చ ప్రారంభిద్దాం. "

“చె ప్పండి ! వనిత గారు !  సంఘంలో మహిళల పట్ల అన్యాయాలు పెచ్చు మీరి పోతున్నాయి.  మహిళా సంఘాలు, మేధావులు నిత్యం ఖండించినా, ధర్నాలు చేసినా ఆగడం లేదు.  ఇలాంటివి  పునరావృతం కాకుండా ఏం చేయాలంటారు?"

"అవునండీ! దేశంలో ఆడపిల్లలకు భద్రత కరువైంది. ఆడపిల్ల ఎదగడాన్ని, తమతో పాటు వృద్దిచెందడాన్ని ఈ పురుషాహంకార ప్రపంచం గుర్తించడం లేదు. కాకపోతే ప్రేమించాను ...  పెళ్ళిచేసుకుంటాను ..అంటేనే ఇంత అకృత్యమా?

అండగా నిలబడాల్సిన తండ్రే ఇంత నీచానికి దిగజారడమా? ఎక్కడికి పోతున్నాం మనం? ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా? ఇది సహించలేని సంఘటన.  ప్రతి ఒక్కరూ ఖండించి తీరాల్సిందే. సమాజంలో ప్రతి ఒక్కరూ సుజాతకు అండగా  నిలబడాలి."  ఆవేశంగా వూగిపోతోంది వనిత.

' ట్రింగ్ ... ట్రింగ్ ... ట్రింగ్ ''

'ఒక్క నిమిషం వనిత గారూ! కాల్ తీసుకొందాం ...హలో ఎవరు?"

నా పేరు విజయ  మచిలీపట్నం  నుంచి"

"చెప్పండి మేడం! ఇలాంటి విషయాలపై మీ స్పందనేమిటి?"

' చాలా దారుణమండీ ... పదేళ్ళ క్రితం మా వీధిలోనే ఇలాంటి సంఘటనే జరిగింది.  ప్రేమ పెళ్ళి ఇష్టం లేని తండ్రి కూతుర్ని నిర్భంధించి ఇలానే చిత్రహింస చేశాడు.  ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలియడం లేదు.  ఇలాంటివారిని కఠినంగా శిక్షించాలి.మళ్ళీ మళ్ళీ జరగ కుండా చూడాలి."

"థ్యాంక్సండీ! మీ స్పందన తెలియజేసినందుకు.   …   పట్టాభి గారూ! మీరు ప్రముఖ సైకియాట్రిస్ట్ గదా...ఇలాంటి విషయాల్లో సైకిలాజికల్ గా ఆ అమ్మాయి పరిస్థితి ఎలాంటిది? ఇంతకీ నేటి యువతరం ఎందుకు ఇలా ఆలోచిస్తోంది? ప్రేమ విఫలమైనంత మాత్రాన ఆత్మహత్యే శరణ్యమని భావించే నేటి యువతరం  ఆలోచనా విధానం సరి అయిందేనా? దీనికి మీరేమంటారు?"

'అవునండీ!  ఇలాంటి విషయాల్లో యువతరం ఆలోచనా విధానాల్లోనే మార్పు రావాలి!"

"ట్రింగ్ ...ట్రింగ్...ట్రింగ్.."

"ఒక్క నిమిషమండీ! కాలర్ లైన్లో ఉన్నారు... హలో! చెప్పండి."

" నా పేరు మూర్తి.  కాలేజ్ స్టూడెంట్ నండి. మా కాలేజ్ లో సుజాత అనే అమ్మాయి, సుధాకర్ని  ప్రేమించిందండీ.  బహుశా ఈమె ఆ సుజాతే అని అనుమానంగా ఉంది."

" అవునా?"

"చెప్పండి.  మీ కాలేజ్ పేరేంటి? వారెన్నేళ్ళుగా ప్రేమించుకున్నారు.  మీకు తెలిసిన విషయాలు పూర్తిగా చెప్పండి."

"నాకు అంతమాత్రమే తెలుసండి.  వారిద్దరూ ప్రేమించుకున్నారు.  పెళ్ళివరకు వెళ్ళి ఎందుకో ఆగిపోయిందని మా ఫ్రెండ్స్ అంటుంటే విన్నాను.  అంతే."

'పూర్తి వివరాలు కనుక్కోండి మూర్తిగారు! మీ ఫ్రెండ్స్ ను విచారించండి.  ప్లీజ్ సేవ్ ఎ లైఫ్."

"తప్పకుండానండీ.  ప్రయత్నిస్తాను."

"ఇప్పుడు చెప్పండి భగత్ గారూ! ఇలాంటివి పునరావృతం కాకుండా చట్టంలో ఎలాంటి మార్పులు చేయాలి?"

"అవునండీ.  చట్టాలు మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  శిక్షలు కఠినంగా అమలు చేయాలి."

''ట్రింగ్ ...  ట్రింగ్...ట్రింగ్"

''హలో చెప్పండి"

"నా పేరు శేఖరండీ.  ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను"

''చెప్పండి శేఖర్ గారూ!"

'మా పూర్వ విద్యార్థిని సుజాత అని ఒక అమ్మాయి ఉండేదండీ!  ఆమె ఎవర్నో ప్రేమించిందని; పెళ్ళికి అమ్మా, నాన్న ఒప్పుకోలేదని వార్తలేవో కార్లు చేసేవి ఆ రోజుళ్ళో.."

" మీరు లెక్చరర్ కదండీ.  ఒకసారి పూర్తి వివరాలు చెప్పండి?"

"అంతకు మించి వివరాలు తెలియవండి."

"మీ పూర్వ విద్యార్థిని అంటున్నారు.  వివరాలు కనుక్కోండి ప్లీజ్.. ఒక ప్రాణాన్ని నిలబెట్టండి."

ష్యూర్ ష్యూర్ ... ప్రయత్నిస్తాను."

"ట్రింగ్ ...ట్రింగ్...ట్రింగ్.."

''హలో''

"హలో నా పేరు శ్రీనివాసండి.  ఇంతకీ పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఈ హడావుడి ఎందుకో అర్థం కావడం లేదు.  ఆ అమ్మాయి ఎవరో ...ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందో...దానికి తండ్రి బాధ్యత  ఎంతో తెలుసుకోకుండా వన్ సైడ్ గా చర్చించుకోవడం సముచితం కాదేమో అనిపిస్తుంది."

''చాలా థ్యాంక్సండీ!   మీ అభిప్రాయం చెప్పినందుకు.  మా ఆందోళనంతా  ఒక ప్రాణాన్ని రక్షించడం కోసమే  మరే ఉద్దేశ్యం లేదు.  అర్థం చేసుకోండి!'

"ట్రింగ్ ...ట్రింగ్...ట్రింగ్.."

"హలో చెప్పండి!''

"ఇలాంటి శ్రీనివాస్ లు ఉండబట్టే దేశం ఇలా తగలడిపోతోంది.  ఒక ఆడకూతురు ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటుంటే మనకేం పట్టనట్లు ఉండడం సబబు కాదు.  వారు కాస్త  సామాజిక స్ప్రుహతో వ్యవహరించడం మంచిది.  ఆయన కూతురికే అలా జరిగితే ... ఇలా ప్రవర్తిస్తాడా?"   మరో కాలర్ ఆక్రోషం.

ఇలా ప్రేక్షకులంతా విశేషంగా స్పందించారు.  వారికి తోచినట్లు విశ్లేషించారు.  తమకు తోచినట్లు వ్యాఖ్యానించారు.  "సుజాత" అన్న పేరుతో ఉన్న తమకు తెలిసిన/పరిచయం ఉన్న వారందరీ వివరాలు డిస్కషన్ లో వివరిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.  తమకు తెలిసిన వారికి ఫోన్  చేసి వాకబు చేశారు.  మీ అమ్మాయేనా?  మీరేనా? అని కుశల ప్రశ్నలు వేశారు.

అందరిలో ఒకటే ఉత్కంఠ ...అందరికంటే ముం దు తామే కనుక్కోవాలని; సంచలనం సృష్టించాలని ఎందరో  ముందుకురికారు.  ఎప్పటికప్పుడు తమ సంచలనాలను టీ వీ తో పంచుకొన్నారు.

సంచలనం ప్రతినిధులంతా వీధిన పడ్డారు.

రోడ్లో నడుస్తున్నవారిని ... వాహనాల్లో వెళ్తున్న వారిని ... బస్సులను ...ఆటోలను ఆపి

ఆఫీసుల్లో  దూరి  ....షాపుల్లో  చేరి --మొహాల్లో మైకులు పెట్టి మరీ అడిగారు.

'దీనికి మీ స్పందనేమిటి ?  ఈ వీడియో పై మీ స్పందన చెప్పండి ....స్పందించండి"

ఉలిక్కి పడ్డ జనం ... మొహం పైన మైకులు చూసి ... ఉక్కిరి బిక్కిరి అయ్యారు.  బిత్తర పోయారు.  అవాక్కయ్యారు.     లైవ్ లో స్పందిస్తే ఏమవు తుందో ... స్పందించకపోతే ఏమవు తుందో అని బిక్క చచ్చి పోయారు.

ఏదో ఒకటి స్పందించకపోతే మొహం పైన్నుంచి మైకు తీసేట్లుగా లేదని ...జనం స్పందించారు ఎవరికి తోచినట్లు వారు.

ఇలా లైవ్ ఇంటర్వ్యూ,  లైవ్ డిస్కషన్, ఫ్యానెల్ డిస్కషన్ లలో; విద్యావంతులు,  మేధావులు,  విద్యార్థులు,  అధ్యాపకులు ...అన్ని వర్గాల ప్రజలు స్పందించారు.  స్పందించేట్లుగా కూడా చేశారు.  అందరూ చీల్చి చెండాడారు.  అమానుషం అన్నారు.  అనాగరికత అన్నారు.

మారాలన్నారు.  మార్చాలన్నారు.  ఆవేశ పడ్డారు. ఆవేదన పడ్డారు.

ఛోటా  మోటా రాజకీయ నాయకులైతే 'మీ పాలనలోనే ఇలా జరిగింది.  బాధ్యత   మీదంటే మీద"ని  వాదించుకున్నారు.  కీచులాడుకున్నారు.

ఇంతలో యాంకర్ గొంతు సవరించుకుంది.

"మరో సంచలనం.  మాకు చాలా చాలా అనందంగా ఉంది.  ఇంకా మానవత్వం మిగిలే ఉందని మీరు మరో సారి నిరూపించారు.  'సేవ్ ఎ లైఫ్" మేమిచ్చిన పిలుపుకు మీరందరూ స్పందించిన తీరుకు మాకు మహదానందంగా ఉంది.  ముఖ్యంగా నేటి యువత స్పందించిన తీరు అద్భుతం.  అపూర్వం.  చారిత్రాత్మకం."

"ఈ వీడియో ఇద్దరి స్నేహితురాళ్ళ బెట్టింగ్ లో భాగంగా  పోస్ట్ చేయడం జరిగిందని - ఇలాంటి వార్తలకు యువత స్పందించరని ... లేదు... గా స్పందిస్తారని బెట్టింగ్ చేసుకొని ఇలా యూ  ట్యూబ్ లో పోస్ట్ చేశామని  శ్యామల అనే  విద్యార్థిని కొద్ది సేపటి క్రితమే మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది.  స్పందించినవారికందరికీ థాంక్స్.  ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం."

మరుసటి వారంలో ఆలస్యంగా అందిన వార్తలు  అంటూ ఇద్దరి ఆత్మహత్యల ఉదంతం కొన్ని పత్రికల్లో మాత్రమే కనిపించాయి.  వారిద్దరి పేర్లు "సుజాత" లు గా గుర్తించడం జరిగిందని, సంచలనం సృష్టించడానికి 'అతిగా' ఆరా తీయడానికి ప్రయత్నించిన భాగంలో అమాయకులైన ఇద్దరు సున్నిత మనస్కులు సున్నితంగా లోకం విడిచి వెళ్ళిపోయారని చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆడపిల్లలంటే అదుపులో ఉండాలని మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్న ఆ అమాయక తలిదండ్రులు  భోరుమని ఏడుస్తూనే ఉన్నారు.

మరో సంచలనం కోసం”సంచలనం” వీధుల్లో సంచలనం సృష్టిస్తోంది -  యధావిధిగా .

మరిన్ని కథలు
sardukupote samtosham