Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

సందీప్ కిషన్ తో ముఖాముఖి

interview with sandeep kishan

ప‌క్కింటి కుర్రాడు, ఎదురింటి అబ్బాయి, వీధిలో పోకిరి, ఊర్లో ఆవారా ఇలాంటి పాత్ర‌ల‌కు స‌రిగ్గా స‌రిపోతాడు సందీప్ కిష‌న్‌. ఈ యువ క‌థానాయ‌కుడిలో మాంఛి ఈజ్ ఉంది. ఎలాంటి పాత్ర‌నైనా మ‌డ‌తెట్టేసే సామ‌ర్థ్యం ఉంది. మెండి పాత్ర‌ల్నీ లొంగ‌దీసుకొనే కెపాసిటీ ఉంద‌న్న విష‌యం ప్ర‌స్థానంతోనే అర్థ‌మైపోయింది. ఫైట్లూ, పాట‌లూ, పంచ్‌లూ అంటూ క‌మ‌ర్షియ‌ల్ బాట‌లో న‌డ‌వ‌కుండా, త‌న ప‌రిథిలోనే ఉంటూ కొత్త క‌థ‌లు ఎంచుకొంటున్నాడు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌తో విజ‌య‌మూ ద‌క్కింది. దాంతో - నిర్మాత‌ల చూపు సందీప్‌పై ప‌డింది. టీనేజ్ ల‌వ్‌స్టోరీల‌కు కాస్త మ‌సాలా, ఇంకాస్త యాక్ష‌న్‌, కొంచెం కామెడీ జోడించిన క‌థ‌ల‌కు బాగా న‌ప్పుతాడ‌ని అర్థ‌మైంది. ఇలాంటి క‌థ‌ల‌తో తెర‌కెక్కిన చిత్రం జోరు. ఈ శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా సందీప్ కిష‌న్‌తో గో తెలుగు సంభాషించింది.

* హాయ్ సందీప్‌...
- హాయ్ అండీ..

* ఈ రోజే మీ జోరు రిలీజ్ అవుతోంది. టెన్ష‌న్ ఏమైనా ప‌డుతున్నారా?
- సాధార‌ణంగా నా సినిమా విడుద‌ల‌కు ముందు చాలా టెన్ష‌న్ గా ఉంటా. ప్రివ్యూ చూసుకొంటున్న‌ప్పుడు కూడా కుదురుగా ఉండ‌లేను. అయితే జోరు విష‌యంలో అలా ఏం జ‌ర‌గ‌లేదు. ఈ సినిమాపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నా.

* అంత న‌మ్మ‌కం దేనిపైన‌?
- ఈమ‌ధ్య లౌక్యం సినిమా థియేట‌ర్‌కి వెళ్లి చూశా. చిన్నా, పెద్దా, ముస‌లీ ముత‌కా అంద‌రూ ప‌డీ ప‌డీ న‌వ్వుతున్నారు. ప్ర‌తీ సీన్‌ని ఎంజాయ్ చేశారు. వాళ్ల న‌వ్వుల్ని చూశాక నా జోరు సినిమాపై మ‌రింత న‌మ్మ‌కం పెరిగింది. ఆడియ‌న్స్ థియేట‌ర్‌కి వచ్చేది ఎంజాయ్ చేయ‌డానికి. బ‌య‌టి ప్ర‌పంచాన్ని మ‌ర్చిపోవ‌డానికి. మా సినిమా కూడా మిమ్మ‌ల్ని మ‌రిపిస్తుంది. ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు, తెర‌పై చూసుకొంటున్న‌ప్పుడు ఎంత న‌వ్వుకొన్నానో. నాకు ప్ర‌తీ స‌న్నివేశం తెలుసు. డైలాగుల‌న్నీ బ‌ట్టీ ప‌ట్టేశా. అయినా స‌రే.. న‌వ్వుకొన్నా. ప్రేక్ష‌కులైతే ప‌డీ ప‌డీ న‌వ్వుతార‌ని న‌మ్మ‌కం ఉంది.

* కేవ‌లం న‌వ్వులేనా, ఇంకేం లేవా?
- నిజానికి ఈ సినిమా మొద‌లుపెట్టిన ఉద్దేశ్యం ఒక్క‌టే నండీ. `ప్రేక్ష‌కుల్ని న‌వ్వించాలి.. అని`. ఎందుకంటే కుమార్ నాగేంద్ర నేనూ క‌ల‌సి గుండెల్లో గోదారి చేశాం. ఆ సినిమా విమ‌ర్శ‌కుల‌కు బాగా న‌చ్చింది. ఓ మంచి ప్ర‌య‌త్నం చేశారు అని మెచ్చుకొన్నారు. అయితే చాలామంది `మీ సినిమాలో కామెడీ త‌గ్గింది` అని కంప్లైంట్ చేశారు. దాంతో `ఈసారి కేవ‌లం న‌వ్వించ‌డానికి సినిమా చేద్దాం` అని డిసైడ్ అయ్యాం.

* అంటే క‌థేం లేదంటారు..
- అయ్యో.. ఎంత‌మాట‌. క‌థ లేక‌పోతే ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫ‌లితం ఉండ‌దు. ఈ సినిమాలో మంచి క‌థ ఉంది. అయితే అదేం కొత్త క‌థ కాక‌పోవ‌చ్చు. కానీ.. మిమ్మ‌ల్ని నిరుత్సాహ‌ప‌ర‌చ‌దు.

* ఈమ‌ధ్య మ‌న క‌థ‌లు ఒకే రీతిన సాగుతున్నాయి. హీరో విల‌న్ ఇంట్లో తిష్ట వేసి వినోదం పంచుతున్నాడు. జోరు క‌థ కూడా అలాంటిదేన‌ట‌..?
- అలాంటిదో కాదో ఇప్పుడే చెప్ప‌ను. సినిమా చూశాక ప్రేక్ష‌కులు డిసైడ్ చేయాలి. అయితే ఒక్క‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను. ఓ విజ‌య‌వంత‌మైన ఫార్ములాలో మ‌న‌మూ వెళ్ల‌డం త‌ప్పు కాదు. అదే ఫార్ములాలో మ‌నం ఏం చెబుతున్నాం? ప‌్రేక్ష‌కుల్ని ఎలా క‌న్వెన్స్ చేయ‌గ‌లుగుతున్నాం అనేదే ముఖ్యం.

* బ్ర‌హ్మానందాన్ని బ‌క‌రా చేసేశారా?
- ఆయ‌న పీకె అనే పాత్ర చేశారు. అంటే పెళ్లికొడుకు అన్న‌మాట‌. ఆయ‌న్ని అంద‌రూ వాడుకొన్నారు. మేమూ వాడుకొంటున్నాం. అయితే బ‌క‌రాని చేసి మాత్రం కాదు.  ఆయ‌న క‌నిపిస్తే చాలు జ‌నాలు న‌వ్వుకొంటున్నారు. ఆ పాత్ర‌ని కాకుండా, ఆయ‌న్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌తీసారీ అలా న‌వ్వించ‌డం దేవుడు ఆయ‌న‌కు ఇచ్చిన వ‌రం. ఆయ‌న న‌న్ను ట్రీట్ చేసిన విధానం నాకెంతో న‌చ్చింది. నన్నూ గౌత‌మ్‌లానే చూసుకొన్నారు.

* వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ విజ‌యంతో మీలో ఉత్సాహం పెరిగి ఉంటుందే..
- హిట్టే క‌దండీ టానిక్కు. ప‌రిశ్ర‌మ‌లో విజ‌య‌మే మాట్లాడుతుంది. ప్ర‌స్థానంతో మంచి న‌టుడిగా గుర్తింపు వ‌చ్చింది. కానీ వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మంచి భ‌రోసా వ‌చ్చింది. వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్‌, గీతాంజ‌లి, స్వామిరారా, కార్తికేయ సినిమాల‌తో క‌థ‌ల‌కు కొత్త త‌లుపులు తెర‌చుకొన్నాయి. ప్ర‌యోగాలు చేయ‌డానికి అంద‌రూ ఉత్సాహం చూపిస్తున్నారు.

* మీ దారెటు.. క‌మ‌ర్షియ‌లా?  కొత్త క‌థ‌ల‌వైపా?
- రెండూ బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకొంటున్నా. అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలంటే నాకు చాలా ఇష్టం. దాదాపుగా ఇప్ప‌టి వ‌ర‌కూ అలాంటి క‌థ‌ల్లోనే క‌నిపించా. అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి చేసిన సినిమా జోరు. నాకూ మార్పు కావాలి క‌దా?

* సినిమా సినిమాకీ మీరూ బ‌డ్జెట్‌లు పెంచుకొంటూ పోతున్నార‌ట్ట‌, ఇంత బ‌డ్జెట్‌తో వ‌స్తేనే సినిమా చేస్తా అంటున్నార్ట‌..
- భ‌లేవారండీ బాబూ. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఎవ‌రైనా కొత్త క‌థ వినిపిస్తే.. నేను నిర్మాత‌ల్ని వెదుక్కొంటున్నా. అలాంట‌ప్పుడు నా సినిమాకి ఇంత బ‌డ్జెట్ పెట్ట‌మ‌ని ఎలా అడుగుతా?  మీకో విష‌యం చెప్పాలి.  రారా కృష్ణ‌య్య సినిమా వ‌ర‌కూ నేను పారితోషికం కూడా తీసుకోలేదు తెల్సా?  వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ త‌ర‌వాత పారితోషికం పెంచేశాన‌న్న వార్త‌ల్లోనూ నిజం లేదు. ఎందుకంటే ఆ సినిమా తర‌వాత నేను చేస్తున్న సినిమాల‌న్నీ ఎప్పుడో ఒప్పుకొన్న‌వి. ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నానంతే.

* ఈ ద‌శ‌లో ఓ పెద్ద ద‌ర్శ‌కుడు ప‌డితే బాగుంటుంది అనిపించిందా?
- ఎందుకు లేదండీ. అలాంటి అవ‌కాశాలొచ్చాయి కూడా. అయితే నేను క‌మిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అవి పూర్తికాకుండా మ‌రో సినిమా ఒప్పుకోవ‌డం భావ్యం అనిపించ‌లేదు.

* డికె బోస్ ఎందుకు ఆగిపోయింది..?
- అవి ఫైనాన్సియ‌ల్ మేట‌ర్‌.. నేను మాట్లాడితే బాగోదు. కానీ నిజంగా అదో కొత్త క‌థ‌. ఎప్పుడొచ్చినా బాగానే ఉంటుంది.

* రా రా కృష్ణ‌య్య‌కి కాపీ వివాదం కూడా అంటింది క‌దా?
- ఈ సినిమా గురించి మీకో విష‌యం చెప్పాలి. రారా కృష్ణ‌య్య కోసం మేం ఓ హాలీవుడ్ సినిమాని స్ఫూర్తిగా తీసుకొన్నాం. షూటింగ్ స‌గంలో ఉండ‌గా ఓ రాత్రి యూ ట్యూబ్‌లో వెదుకుతుంటే. తేరా నాల్ మే ప్యార్ హోగ‌యా అనే హిందీ సినిమా క‌నిపించింది. తీరా చూస్తే మా క‌థ‌కీ, దానికీ పోలిక‌లున్నాయి. గుండెల్లో రాయిప‌డినంత ప‌నైంది. వెంట‌నే ద‌ర్శ‌కుడికి ఫోన్ చేసి విష‌యం చెప్పా. మేమిద్ద‌రం ఒకే సినిమాని స్ఫూర్తిగా తీసుకొన్నామ‌న్న సంగ‌తి అర్థ‌మైంది. సినిమా విడుద‌లయ్యాక తేరే నాల్ మే ప్యార్ హోగ‌యా బృందం మ‌మ్మ‌ల్ని ఇబ్బంది పెట్టాల‌ని చూసింది. మేమేం కాపీ కొట్ట‌లేదు, మ‌నిద్ద‌రం ఒకే ఇంగ్లీష్ సినిమాని స్ఫూర్తిగా తీసుకొన్నామంతే అంటూ వాళ్ల‌కు రుజువుల‌తో స‌హా చూపించాం. దాంతో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది.

* మ‌రి జోరుకు అలాంటి క‌థలేం లేవా?
- (న‌వ్వుతూ) అలాంటివేం లేవండీ బాబూ. ఇది మ‌న‌దైన క‌థ‌. ఈసినిమాలో ఒక్క సీన్ అయినా ఫ‌లానా సినిమాలో ఉన్న‌ట్టుందే అని చెప్పలేరు.

* చివ‌రిగా ఈ సినిమా గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే..
- కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ప్ర‌తీ సీన్ న‌వ్విస్తుంది. అలా న‌వ్వించాల‌నే ఈ సినిమా తీశాం. చూసి ఎంజాయ్ చేయండి.

* ఓకే.. మీ బండి కూడా ఇలానే జోరుగా సాగిపోవాల‌ని కోరుకొంటున్నాం.. ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్సండీ.

-కాత్యాయిని

మరిన్ని సినిమా కబుర్లు
joru movie review