Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ : కలో, నిజమో తెలియని అయోమయంలోనే రాత్రంతా చిత్ర విచిత్రమైన అనుభవాలతో గడిచిపోతుంది హరికి. తనను విడిచి వెళ్ళలేక వెళ్ళినట్టు మేఘన రాసిన ఉత్తరం చూసి, భారమైన మనసుతో  కారు స్టార్ట్ చేసి ఇంటికి చేరుకుంటాడు... తల్లి నుంచి ఫోన్ రిసీవ్ చేసుకోగానే కాస్త తేలికవుతుంది అతడి మనసు తన ఫ్లాట్ లో ఒక కర్ణకఠోరమైన శబ్దం హరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది...........................

..................................ఆ తర్వాత..

థర్డ్‌ఫ్లోర్‌ కారిడార్‌ నిర్మానుష్యంగా ఉంది... కానీ ఆ పసిబిడ్డ ఏడుపు... కొట్టొచ్చినట్లు వినిపిస్తోంది... టైమ్‌ చూసుకున్నాడు హరి.

మధ్యాహ్నం 3.30 గంటలు... అందరూ ఆఫీసుల్లో ఉండే సమయం... గృహిణులు కనుకులు తీసే సమయం....

మెట్ల దగ్గరకు వచ్చాడు. ఎదురుగా లిఫ్ట్‌ పని చేయడం లేదని బోర్డు ఉంది.

మెట్ల స్టెయిర్‌ కేసు పట్టుకుని కిందకి చూసాడు. ఎక్కణ్ణుంచి వస్తున్నాడో తెలీదు... ఒక నడివయసు వ్యక్తి చుట్టూ జుట్టంతా నెరసి ఉంది. మధ్యలో మాత్రం నల్లవెంట్రుకలు, తెల్ల వెంట్రుకలు కలిసి ఉన్నాయి.

అతని చేతుల్లో ఒక పిల్లవాడు...ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాడు...తనొక్కడికేనా ఈ డిస్టర్బెన్స్‌...వేరే ఎవరికీ వినబడి చావడం లేదా..? ఇన్ని అంతస్థుల ఈ బిల్డింగ్‌లో.. ఇన్ని అపార్ట్‌మెంట్లలో ఒక్కడు కూడా బయటకు రాలేదేమిటి? రావడం లేదేమిటి?ఈలోపు ఆ నడి వయస్కుడు రెండో ఫ్లోర్‌మెట్లు ఎక్కి, మూడో ఫ్లోర్‌చేరుకున్నాడు.

సరిగ్గా తన డోర్‌దగ్గరే బయట నిలబడి అతని వైపే చూస్తున్నాడు హరి. అతనొక మాసిపోయిన పాత కోటు ధరించి ఉన్నాడు.

అతని కళ్లు తిరస్కారంగా, కోపంగా, అసహనంగా హరినే చూస్తున్నాయి... దానికి పైగా కర్ణకఠోరంగా పిల్లవాని ఏడుపు...

ఆ మధ్య వయస్కుని ముఖం మరాఠా నుంచి వచ్చి తెలుగువారి ఆదరాభిమానాలు పొంది సెటిలైపోయిన ‘‘సాయాజీ షిండే’’ ముఖంలా ఉంది...

చాలా నిర్లిప్తంగా, భావం లేకుండా, తిరస్కారంగా... హరిని చూస్తూ, నాలుగో అంతస్తు మెట్ల వైపుగా సాగిపోతున్నాడతడు.

అతను వచ్చిన దారివైపే చూసాడు హరి...

దారంతా రక్తం... మెట్టు మెట్టుకీ అతను వేసిన ప్రతీ అడుగూ, రక్తంలో ముంచి తీసినట్లున్నది...

తన ముందునుంచి నడుచుకెళ్తున్న ప్రతీ అడుగూ ప్రస్ఫుటంగా ఎర్రటి నెత్తురులో కనిపిస్తున్నది... అతను హరిని దాటాడు.ఒకొక్క మెట్టూ ఎక్కుతున్నాడు...

అతని పాదాల వైపు చూసాడు హరి...

అతని రెండు పాదాల్లోనూ రెండు వాసం మేకులు కొట్టబడి ఉన్నాయి.

అడుగు కిందకి నొక్కబడినప్పుడు పూర్తిగా లోపలికి దిగి, మళ్లీ అడుగు పైకి లేచి, కిందికి నొక్కేలోపు ఒక అంగుళం బయటకు వచ్చి, రక్తాన్ని చిందిస్తూ మళ్లీ నొక్కుబడిపోతున్నాయి.

ప్రతీ మెట్టుపై అతని రక్తపాద ముద్రికలు... నాలుగో అంతస్తులోని ఒక ప్లాట్‌వద్దకు చేరుకున్నాడతడు. ఒక చేత్తో పిల్లవాడిని పట్టుకుని, ఇంకో చేత్తో తాళం తీసి, తలుపు తోసాడు. లోపలికి వెళ్తూ.. వెళ్తూ ఒక్కసారి చిరాగ్గా... హరివైపు చూసి, లోపలికి వెళ్లి గడియపెట్టుకున్నాడు.కాసేపటికి.... పిల్లవాడి ఏడుపు ఆగిపోయింది...

నిర్ఘాంతపోయి చూస్తున్నాడు హరి...

మల్లు గుచ్చుకుంటేనే అడుగు తీసి అడుగువేయలేము... అటువంటిది... ‘‘వాసం మేకు’’ గుచ్చుకోవడం ఏమిటి? అడుగు తీసి అడుగు వేస్తుంటే రక్తం రావడం ఏమిటి? లెక్క లేకుండా అతను నడిచి రావడం ఏమిటి? ఆ పిల్లవాడేమిటి? ఆ ఏడుపేమిటి? అతన్ని చూస్తే వయసెక్కువే ఉన్నట్లుంది. ఆ వయసులో.... కొడుకు?... కావచ్చు. యాభై... యాభై అయిదు, ఆ తర్వాత కూడా పిల్లలు పుట్టే అవకాశం లేకపోలేదు. ఏమో... అతని పిల్లవాడే కావాల్సిన అవసరమే లేదు. వేరే వాల్ల పిల్లవాడై ఉండవచ్చును.

ఎవరి పిల్లాడయినా, ఏమయినా గానీ ఈ సాయాజీ షిండే గాడి ముఖం చూస్తే నెత్తిమీద రూపాయి పెట్టినా అమ్ముడు పోనట్లుగా ఉన్నాడు. ఇక పిల్లాడికి పాలెక్కడ నుండి తెస్తాడు? పైగా పాదం మధ్యలో వాసం మేకులు, ఎంతో తాగి ఉంటేనే కానీ ఆ బాధ తట్టుకోలేరు. తాగి, ఆ మైకంలోనే ‘టెటానస్‌’తో నిద్రలోనే షిండే గాడు పోతే ఆ అమాయక పసి ప్రాణం ఆకలితో గుక్కపెట్టి, నక నకలాడి, ప్రాణం విడువదా? ఒకవేళ అదే జరిగితే ఆ పాపం నాదే కదా...?

ఆఫ్రికాలోని సూడాన్‌ అనే బహు బీద దేశంలో పట్టించుకునే నాథుడే లేక, ఎముకల గూడు లాగా మారిన ఒక బాలుడు... నడిచే ఓపిక లేక డేకుతూ, పాకుతూ వెళ్తుండగా... ఒక రాబందు ఆ ఎముకల గూడును గమనించి, ఎంతో సంతోషంతో తన విందు భోజనం ముందుకు వచ్చిఇకచాలు... దేకిందీ... పాకిందీ... ఆగక్కడ... అని నిలువచించిన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు కీవిన్‌కార్టర్‌ అనే గొప్ప ఫోటోగ్రాఫర్‌... దాన్ని ప్రచురించగా ఆయనకు పెద్ద పేరు, రకరకాల అవార్డులు, రివార్డులు, సన్మానాలే కాక అత్యున్నతమైన పులిట్జర్‌ అవార్డు కూడా దొరికింది.

ఈలోగా బంధుమిత్రులందరి దగ్గర్నించీ అభినందనలు వెల్లువలెత్తాయట.అయ్యో... ఒక్క కిలోమీటరు దూరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థలో ఆ జీవించివున్న ఆ శవాన్ని పడవేసి ఉంటే బాగుండేదేమో? కానీ నేనాపని చేయలేదే. ఖచ్చితంగా ఆ రాబందు బతికి ఉన్న ఆ జీవిని రాక్షసంగా పొడిచి, పొడిచి, చిత్రహింసలకు గురిచేసి బీభత్స, భయనకంగా ఆ బ్రతికి ఉన్న మనిషి ప్రేవులను బయటకు లాగి, అయినా ప్రాణం పోకుండా అలాగే చూస్తున్న ఆ మనిషి కళ్లల్లో కళ్లుపెట్టి చూస్తూ అతని శరీరాన్ని అతని కళ్లముందే విందు భోజనంలా ఆరగించి ఉంటుంది. పోనీ వేరొకరెవరైనా ఆ అనాథ శరీరాన్ని రక్షించి ఉంటారనే ఊహే అనవసరం. అంత భయానక ప్రాంతాల్లో సంచరించే వారే లేరు. ఎంత పని చేసాను? ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాను? ఎంత పాపం మూట గట్టుకున్నాను అని తనలో మధనపడి, మధనపడి తాను చేసిన పాపానికి పరిహారంగా మూడు నెలల్లోగా కీవిన్‌ ఆత్మహత్య చేసుకున్నాడట.

ఇప్పుడు ఈ విషయం ఎవరికో ఒకరికి తెలియజెప్పకపోతే నా బతుకూ ‘కీవిన్‌’ బతుకులా అయిపోవచ్చు...’’

ఎవరికి చెప్పాలి..?

ఎలా చెప్పాలి..?

ఆలోచిస్తున్న హరికి ఒక ఐడియా వచ్చింది. పోలీసులకు చెప్పడం మంచిది.‘‘పోలీసులతో ఇంకో గొడవ ఉంది... ఎవరు ఇన్‌ఫర్‌మేషన్‌ ఇస్తే వాళ్లనే అనుమానిస్తారు. గౌరవ ప్రదమైన డాక్టర్‌గా బతుకుతూ పోలీసు కేసుల గొడవల్లో తిరగడం ఎంత అప్రదిష్ట.’’

మరెలా..?

నెమ్మదిగా బయటకు వచ్చి దగ్గరే ఉన్న పెద్ద షాపింగ్‌కాంప్లెక్స్‌లోకి వెళ్లాడు.

అక్కడున్న పబ్లిక్‌ఫోన్‌లో కాయిన్‌వేసి ‘100’ డయల్‌చేసాడు. ఫోన్‌రింగ్‌ఔతున్న శబ్ద వినబడుతున్నది. అవతల నుంచి రెస్పాన్స్‌వచ్చేలోగా పరిసరాల్ని పరిశీలించాడు. ఎవరి గొడవలో వాళ్లున్నారు... ఎవరూ ఎవర్నీ పట్టించుకోవడం లేదు...

ఎక్కడో దూరంగా ఉన్న కానిస్టేబుల్‌ ఎవరితోనే ఎంతో ఆనందంగా బాతాఖానీ కొడుతున్నాడు. అతని వాలకం చూస్తే కనీసం గంట నుంచి ఆ బాతాఖానీ నడుస్తున్నట్లుగా ఉంది.

ఎదురుగా ఒకతను రోడ్డుమీద చెప్పులు కుడుతున్నాడు. అతన్నీ, అతని స్థలాన్ని కవర్‌చేస్తూ ఒక చిన్న టార్పాలిన్‌టెంట్‌. ఇంతలో.... ఫోన్‌లో అవతలి వైపు నుండి నిర్లక్ష్యమైన గొంతు....

‘‘ఆఁ... అల్ల (హలో)...’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekambar