Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ ; ఏకాంబర్, నీలాంబర్, వాళ్ళ చెల్లెలు అలివేలు మంగ కూర్చుని మాట్లాడుకుంటూండగా ఏకాంబర్ కోసం ఎవరో ఒక స్త్రీ వచ్చి ఇంటి ముందు నిలబడి పిలుస్తుంది.. రైల్వే ఉద్యోగి రామారావు భార్యనని చెప్తుంది..తన భర్తకు ఆరోగ్యం ఏమీ బాగా లేదనీ, పాలసీ విషయం ఎలా అని అడుగి వివరాలు కనుక్కుని వెళ్ళిపోతుంది............

............................................

" మీరూ ఇంటిపని కాగానే ఓసారి ఆఫీసుకి వెళ్ళిరండి. అమ్మావాళ్ళు రేపు వచ్చేస్తారు కదా " అన్నాడు ఏకాంబర్.

" నీకు ఫోన్ చేసారా అన్నయ్యా?" ఆనందంగా అంది మంగ.

" విజయనగరంలో ఉన్నారు. అక్కడ అందరికీ కార్డులు ఇచ్చెయ్యగానే వచ్చేస్తామన్నారు. నేను వెళ్తాను." అంటూనే వీధి గుమ్మం లోకి వచ్చాడు ఏకాంబర్.

గదిలోకి వెళ్ళిన నీలాంబర్ కూడా వీధి గుమ్మం దగ్గరకు వచ్చాడు.

" వస్తావా అన్నయ్యా? నేను మీ షాపు కేసే వెళ్తున్నాను." బైక్ స్టార్ట్ చేస్తూ అన్నాడు ఏకాంబర్.

" ఆ..ఆ..వచ్చేస్తాను.. ఉండు " అంటూ లోపలకు పరుగున వెళ్ళి తన లాప్ టాప్ భుజాన తగిలించుకుని వచ్చాడునీలాంబర్.

ఇద్దరన్నదమ్ములూ ఏమీ జరుగనట్లు నవ్వుకుంటూ బైక్ మీద వెళ్తుంటే నూకరత్నం ఆశ్చర్యపోయింది.

" ఇది మా ఇంట్లో ఎప్పుడూ మామూలే వదినగారూ! పదండి ! మీరూ ఆఫీసుకు వెళ్ళాలి కదా! తొందరగా ఇంటిపని ముగించేద్దాం " నవ్వుతూ నూకరత్నం భుజం మీద చెయ్యి వేసి లోపలకు తీసుకెళ్తూ అంది మంగ.

" ఈరోజు నువ్వూ నాతో మా ఆఫీసుకు వస్తున్నావు అంతే" అంటూ మంగని గట్టిగా కౌగిలించుకుని అంది నూకరత్నం.

" అయ్యబాబోయ్! ఈ ఉక్కు కౌగిలి మా బక్కన్న ఎలా తట్టుకుంటాడు " పకపకా నవ్వుతూ అంది మంగ.

" చీ! పో! " అంటూ వంటగదిలోకి పరుగు తీసింది నూకరత్నం.

ఆరోజు...

వైజాగ్ నుంచి నేరుగా గోపాలపట్నంలో ఉన్న సర్వీస్ సెంటర్ కి చేరుకున్నాడు ఏకాంబర్. చెల్లెలి పెళ్ళి దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళన పడుతున్నాడు. అన్ని పనులూ సక్రమంగా జరుగుతున్నాయో, లేదో..అని ఆలోచిస్తూనే అఫీస్ లోకి అడుగుపెట్టాడు ఏకాంబర్. నూకరత్నంతోబాటు ఉన్న ఇద్దరమ్మాయిలు కంప్యూటర్ల ముందు కూర్చుని ఏదో పనిలో ఉన్నారు. ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే ఏకాంబర్ ఈరోజు ఇంత తొందరగా ఆఫీసుకు వచ్చేసరికి ఆశ్చర్యపోయింది నూకరత్నం.

" రండి అంబర్ సార్. ఈరోజు ఇంత వేగంగా వచ్చేసారు. ఏదైనా విశేషమా?" నవ్వుతూ పలకరించింది.

" పెళ్ళి దగ్గర పడుతూంటే ఎందుకో మనసంతా ఆందోళనగా ఉంటోంది. కేటరింగ్ చేసే అతన్ని రమ్మన్నాను. వచ్చాడా?" అడిగాడు ఏకాంబర్." వచ్చాడు. మీ అన్నని కలవమని పంపించాను." చెప్పింది నూకరత్నం." అయ్యో! నాన్నకీ విషయం తెలిస్తే తట్టుకోలేడు..." ఆందోళనగా అన్నాడు ఏకాంబర్.

" ఏ విషయం?" ఆశ్చర్యంగా అంది నూక రత్నం.

" మూడు వేలమందికి భోజనాలకి ఆర్డర్ ఇచ్చాను. ఆ కేటరింగ్ ఆయనేమో 'మూడున్నర లక్షలూ అడుగుతున్నాడు. కూర్చుని మాట్లాడదామని ఇక్కడికి రమ్మని చెప్పాను" తలమీద చెయ్యి వేసుకుని కుర్చీలో కూలబడిపోయాడు ఏకాంబర్." మీ బంధువులంతమంది వస్తారా?" మరింత ఆశ్చర్యంగా అంది నూకరత్నం.

" మన కస్టమర్లందరూ మన బంధువులు కాదా?" ఈ అయిదేళ్ళలో నాకు 'పాలసీ' ఇచ్చిన వాళ్ళందరికీ పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తున్నాను." అన్నాడు ఏకాంబర్.

" మంచి పని చేస్తున్నారు..ఈ విషయం మీ నాన్నగారికి చెప్పలేకపోయారా?" ఏకాంబర్ పక్కకు వచ్చి నిలబడి లాలనగా భుజం మీద చెయ్యి వేసి అంది నూకరత్నం.

" చెప్పలనే అనుకున్నాను. అన్నిటికీ లెక్కలు వేసుకుని 'అమ్మో' అని భయపడిపోతున్నారు. పెళ్ళి కార్డులు కూడా ఆయన చేతికి మూడు వందలే ఇచ్చాను. కళ్యాణమండపం బుక్ చేస్తే ఇంత పెద్దది ఎందుకురా అని తినేసాడు. ఇంకేం చెప్తాను?" చిరాగ్గా అన్నాడు ఏకాంబర్.

ఇంతలో కేటరింగ్ అతన్ని వెంటబెట్టుకుని పీతాంబరం అక్కడికి వచ్చాడు.

వస్తూనే గాబరాగా ఏకాంబర్ దగ్గరకు వచ్చాడు.

"ఏరా! ఇతనితో మూడువేలమందికి భోజనాలు ఏర్పాటు చెయ్యలన్నావట, నిజమేనా? నీకసలు మతుందా? మనం పంచింది మూడువందల కార్డులే కదా! కాదూ కూడదంటే ఓ ఆరొందలమంది పెళ్ళికొస్తారు..అంతే కదా!" కొడుకుతో అన్నాడు పీతాంబరం.

" నువ్వు పంచిన కార్డులే కాదు కదా! నేను కూడా మా ఆఫీసు స్టాఫ్ కి, ఇన్స్యురెన్స్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆఫీసర్లకి ఇంకా నా కస్టమర్లకి చాలామందికి కార్డులు ఇచ్చాను." తల దించుకునే అన్నాడు ఏకాంబర్.

" మీ కస్టమర్లకి, ఆఫీసర్లకి ఇచ్చావా? మంచిపని చేసావ్...మీ చెల్లి పెళ్ళి కదా వాళ్ళందరికీ ఎందుకులే అనుకున్నాను. ఎలాగూ ఎదర నీ పెళ్ళి, అన్న పెళ్ళి ఉంది కదా అప్పుడు చెప్తావేమో అనుకున్నాను., మంచిపని చేసావ్" ఆనందంగా అన్నాడు పీతాంబర్.

" నాన్నా..." ఆనందంగా తల ఎత్తి తండ్రి కళ్ళల్లోకి చూసాడు ఏకాంబర్.

" నిజమేరా! మన ఇంట్లో మొదటి పెళ్ళి మన బాగు కోరుకున్న వాళ్ళందరినీ పిలవడం మంచిదేగా, అయితే ఈ కేటరింగ్ కుర్రాడితో నువ్వు మాట్లాడు నేను షాపుకెళ్తాను..." అంటూ వెళ్ళిపోయాడు పీతాంబరం.

కేటరింగ్ కుర్రాడ్ని తీసుకుని తన కేబిన్ లోకి వెళ్ళాడు ఏకాంబర్.

కేబిన్ లో కూర్చుని కేటరింగ్ కుర్రాడితో మాట్లాడుతున్న ఏకాంబర్ కేసి చూస్తూ మనసులోనే నవ్వుకుంది నూకరత్నం.

'తండ్రీ కొడుకులిది ఒకరిమీద ఒకరికి ఎంత వాత్సల్యం..?!" మనసులోనే అనుకుంది.

ఇంతలో ఒకతను గాభరాగా పరిగెడుతున్నట్టే ఆఫీస్ లో అడుగు పెట్టాడు. క్షణం ఆయాసపడుతూ నిలబడ్డాడు.

" ఎవరు కావాలండీ?" ఆఫీసులో వాళ్ళకి ట్రే లో టీ లు తీసుకొస్తున్న పద్మ అతన్ని చూస్తూ అడిగింది.

పద్మ గొంతు విని కంప్యూటర్లలో మునిగి ఉన్న నూకరత్నం, ఇద్దరమ్మాయిలు ఒక్కసారే తల ఎత్తి చూసారు.

పద్మ ట్రే లో టీలు పట్టుకుని ఏకాంబర్ చాంబర్ లోకి వెళ్ళింది.

" ఎవరు కావాలండీ?" నూకరత్నం అతన్ని దగ్గరకు రమ్మని సైగ చేస్తూనే అడిగింది.

"ఏజెంటుగారు లేరామ్మా?" ఆతృతగా అన్నాడతడు.

"ఏకాంబర్ గారేనా?" అంది నూకరత్నం.

"అవునమ్మా"అన్నాడతడు.

"అదిగో! ఆ కేబిన్ లో ఎవైతోనో మాట్లాడుతున్నారు. విషయం ఏంటో మాకు చెప్పండి...ఫర్వాలేదు.."అడిగింది నూకరత్నం.

" నన్ను ఎమ్మెల్యే మేడిపండు అబద్ధాలరావు  గారు పంపించారమ్మా" నూకరత్నం ఎదర ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడతడు.

"ఎమ్మెల్యేగారా?" ఆశ్చర్యంగా అంటూనే చటుక్కున నిలబడి గబాలున ఏకాంబర్ కేబిన్ దగ్గరకు వెళ్ళింది నూకరత్నం.

కేబిన్ లో కూర్చున్న ఏకాంబర్ టీ సిప్ చేస్తూనే నూకరత్నాన్ని చూస్తూ గబాలున లేచి బయటకు వచ్చాడు.

" ఎవరతను?" కౌంటర్ దగ్గర కూర్చున్నతన్ని చూస్తూనే అడిగాడు ఏకాంబర్.

"ఎమ్మెల్యే గారు పంపించారట..మీతో ఏదో చెప్పాలని  వచ్చినట్టున్నాడు" ఆనందంగా అంది నూకరత్నం.

"ఏం చెప్పాలట?" అనుకుంటూ కౌంటర్ వైపు నడిచాడు ఏకాంబర్.

ఏకాంబర్ వెనకే దగ్గరగా నడుస్తూ రహస్యంగా అతని చెవిదగ్గర అంది నూకరత్నం...

"ఏమో మళ్ళీ ఓ నలభై, ఏభై పాలసీలు రాయిస్తారేమో నాకు చాలా ఆనందంగా ఉంది " అంది నూకరత్నం.

"అంతలేదు...కొంపదీసి మొన్న పాలసీలు కట్టిన వాళ్ళల్లో ఎవడికైనా ఏదైనా ప్రమాదం జరగలేదు కదా!" మనసులోని అనుమానాన్ని నూకరత్నం ముందు బయటపెట్టాడు ఏకాంబర్.

"పాలసీలు కట్టి ఆర్నెల్లు కూడా అయినట్టు లేదు కదా " సాలోచనగా అంది నూకరత్నం.

ఇద్దరూ అలా గుసగుసలాడుకుంటూండగానే కౌంటర్ దగ్గరకు చేరుకున్నారు.

"ఎమ్మెల్యే గారేం చెప్పారు బాబూ?" ఆప్యాయంగా అతన్ని అడిగాడు ఏకాంబర్.

"మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మన్నారండీ" అన్నాడతను.

"ఇప్పుడా?" ఆలోచిస్తూ అన్నాడు ఏకాంబర్.

"అవునండయ్యా" అంటూ నిలబడ్డాడు అతను.

"వెళ్దాం..ఒక్క అయిదు నిముషాలు ఆగు...." అంటూ వెంటనే కేబిన్ లో ఉన్న కేటరింగ్ కుర్రాడి దగ్గరకు వచ్చి ఏదో చెప్పి పంపించేసాడు.ఆ కేటరింగ్ కుర్రాడు వెళ్తూ వెళ్తూ "సార్ ! భోజనాల మెనూ కోసం మీ నాన్నగార్ని కలవమంటారా?" అడిగాడు.

"అబ్బ, చెప్పిందంతా వదిలేసి మళ్ళీ మొదటికొచ్చావా? కాస్త చీకటి పడ్డాక మా ఇంటికి రావయ్యా! అక్కడ అందరం ఉంటాం..అందరి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు కదా!"

"అవును సార్! అయితే, ఈరోజే ఏడు గంటలకి మీ ఇంటిదగ్గరుంటాను." అంటూనే ఆ కేటరింగ్ కుర్రాడు వెళ్ళిపోయాడు."పదవోయ్..మనం వెళ్దాం..రత్నం గారూ నేనిక మళ్ళీ ఇటు రాను...మీరు ఆఫీస్ చూస్ మూసేసి వెళ్ళిపోండి.." అంటూ అతన్ని తీసుకుని వెళ్ళాడు ఏకాంబర్." మీరు టీ త్రాగండమ్మా! చల్లారిపోతున్నది..పాపం ఏకాంబర్ బాబు టీ కూడా సరిగ్గా త్రాగలేదు" నొచ్చుకుంటూ అంది పద్మ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్