Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ:
ఒక పసిబిడ్డ ఏడుపు హరిని బాగా డిస్ట్రబ్ చేస్తుంది.  ఎవరో ఆ పసిబిడ్డను ఎత్తుకుని తన కళ్ళ ముందు నుంచే వెళతాడు. భయంకరంగా వున్న అతడ్నీ, నెత్తురోడు తున్న పాదాల ని చూసి ఏదోక విధం గా పోలీసులకు ఇంఫార్మ్  చేయడానికి పబ్లిక్ ఫోన్ దగ్గరకు వెళతాడు. ..........................................................

ఇదేం రెస్పాన్స్‌రా దేవుడా..’’ అనుకున్నాడు హరి.

ఇంతలో మళ్లీ అవతలి వైపు నుంచి... ‘‘అల్ల... అల్ల...’’ అంటూ తొందరగా కట్టివేసే హడావుడి అర్థమయ్యింది హరికి...

కంగారుగా.... ‘‘రాజయ్య... రాజయ్య...’’ అన్నాడు.

‘‘ఎవురా రాజయ్య.... ఏంగావాల? ఇది బోలీజు గంట్రోల్‌రూమ్‌.’’ అని వినబడిరది.

ఇక ఆలస్యం చేయకుండా... గబగబా... నవీన్‌నగర్‌ఏరియా... గ్లైడర్‌అపార్ట్‌మెంట్‌... నాల్గో అంతస్తు... అంటూ పిల్లవాడి విషయం... గాయపడిన గార్డియన్‌విషయం... అంతా చెప్పేసాడు... ‘‘నువ్వేం చేస్తావు రాజయ్యా...’’ అని మళ్లీ అవతలి నుంచి ప్రశ్న... ‘‘ఆ అపార్ట్‌మెంట్స్‌దగ్గరి షాపింగ్‌సెంటర్‌ఎదురుగా చెప్పులు కుడతాను.’’ అన్నాడు.... ‘‘జెప్పులు కుట్టెటోన్లా లేవు నీ మాటలు... మనజుల్ని గుట్టేటోన్లా ఉన్నాయి.’’ ఠపీమని ఫోన్‌పెట్టేసాడు హరి.

******                  **************                     **********                   **************              
‘‘మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరము రకరకాల మార్పులకు గురికాబడుతుంది. అందులో ఒకటి మార్టిన్‌దశ. ఈ మార్టిస్‌దశల్లో మొదటి అంకం ‘లైవర్‌మార్టిస్‌’. రక్తం వివిధ భాగాలకు సరఫరా కావడం మానివేస్తుంది. వర్షం కురిసినంతసేపూ నీరు వరదలై పారుతుంది. ప్రాణం ఉన్నంతసేపూ రక్తం కూడా మనిషి శరీరంలో పరిగెడుతుంది. వర్షం కురవడం ఆగిపోయిన తర్వాత గుంటలలో నీరు నిలుస్తుంది. మిగిలిన ప్రదేశాల్లో నీరుండదు. అలాగే మనిషి శరీంలోని రక్తం కూడా కొన్ని ప్రదేశాల్లో ఆగిపోతుంది. శరీరమంతా ప్రవహించదు. తత్ఫలితంగా మనిషి కండరాలు మెత్తదన్నాన్ని కోల్పోయి బిగుసుకుపోతాయి. దీన్ని ‘‘రిగర్‌మార్టిస్‌’’ అంటారు. ఇది రెండవది. మూడో అంకం ఆల్గర్‌మార్టిస్‌...ఈ దశలో శరీరంలోని    ఉష్ణోగ్రత పడిపోయి శరీరం చల్లబడిపోతుంది. అందుకనే గ్రామవాసులు తెలిసో తెలియకో ఎవరికయినా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి చల్లబడుతుంటే.. రకరకాల సపర్యలు చేస్తారు. శరీరాన్ని అరచేతులతో రుద్దుతూ వేడి పుట్టించడానికి ప్రయత్నిస్తారు.

మార్టిన్‌దశల తర్వాత దశలో శరీరం ఉబ్బిపోతుంది. దీనికి కారణం రకరాల సూక్ష్మక్రిములు మానవ శరీరాన్ని తిని, శరీరంలోపే గుట్టలు గుట్టలుగా పెరిగిపోతాయి. ఆ తర్వాతి దశలో మాంసం అంతా తినివేయబడుతుంది. శరీరంలోని ద్రవాలన్నీ హరించుకుపోతాయి. నాల్గవ దశలో శరీరం

రక్తం, మాంసం అన్నీ మాయమైపోతాయి. ఆఖరుకి మిగిలేవి ఎముకలు. అక్కడితో అంతా అయిపోయిందనుకుంటారు  సామాన్యులు. కానీ...అక్కడి నుంచే మన పని మొదలౌతుంది.

ఎముకలు నెమ్మది నెమ్మదిగా అరిగిపోతుంటాయి. ఒక్కసారే మాయమైపోవు.ఈ పరిణామ ప్రక్రియను అధ్యయనం చేయడాన్ని ‘‘టేఫోనమీ’’ అంటారు.

పురావాస్తు శాస్త్రజ్ఞులమైన మనకు ‘‘టేఫోనమీ’’ని అధ్యయనం చేయడం ఎంతో అవసరం, ముఖ్యం. పూడ్చి పెట్టబడిన తర్వాత కొన్ని ఎముకలు త్వరగా నశించిపోతాయి. మట్టిలో కలిసిపోతాయి. కొన్ని ఎముకలు సంవత్సరాల తరబడి, అంటే పది సంవత్సరాలు కావచ్చు, వందల, వేల సంవత్సరాలు కావచ్చు... నశించిపోకుండా నిలిచే ఉంటాయి.

ఎందుకలా..?ఒకే దేశంలో, ఒకే శ్మశానంలో రెండు శవాలు పూడ్చిపెట్టబడ్డాయి. మొదటి సమాధి తవ్వితే ఒక్క ఎముక కూడా మిగల్లేదు కానీ ఆ మనిషితో పాటు పూడ్చిపెట్టబడ్డ వస్తువులు మట్టిలో కలిసిపోకుండా మిగిలివున్నాయి. ఆ మనిషిని గురించి తెలుసుకోవడానికి ఆ వస్తువులే ఆధారం.

రెండో సమాధిలో ఎముకలు పూర్తిగా పాడవకుండా కొంతవరకు ఆ మనిషి గురించి సమాచారాన్ని ఇవ్వగలిగాయి. ఎందుకంటే...పూడ్చి పెట్టే ముందు ఆ శరీరానికి పూసిన పూతలు, రసాయనాలు, కట్టిన కట్లు ఆ తేడాకు కారణం. ఉదాహరణకు ఈజిప్టులో చనిపోయిన వారి దేహాలకు రకరకాలైన పూతలు, చేతలు చేసినందువలన ఆ దేహాలు (మమ్మీలంటారు) ఇప్పటి వరకు పాడవకుండా ఉన్నాయి.

వాటిని పరిశీలించడం వలన మనకు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తాయి.

ఇప్పుడున్న మనుషులకు మనం ఏ విధంగా సహాయపడగలమో ఆ పాత పాత ఎముకలు మనకు తెలియజేస్తాయి. పోయిన సంవత్సరం ఇదే క్లాసులో ఒక గ్రామీణ విద్యార్థి ‘‘నక్కల్లాగా బొక్కలు (ఎముకలు) తవ్వి సాధించేదేముంది? దీనికి సంత్సరాలబడి చదువులు అవసరమా?’’ అన్నాడు.

అలా అన్న విధ్యార్థే ఈ రోజు ఎన్నో రకాలైన ఎముకల రోగ నిర్ధారణలకు కారణమైన అమెరికాలోని మిషిగాన్‌విశ్వవిద్యాలయంలో ప్రధాన ఆచార్యుడిగా మన్ననలందుకుంటున్నాడు.

గాలి ఎక్కువగా ఆడే ప్రదేశలో పూడ్చిపెట్టిన ఎముకలు త్వరగా పాడవుతాయి. గాలి ఆడని ప్రదేశంలో పూడ్చిపెట్టిన ఎముకలు త్వరగా నశించిపోవు.

ముసలివాళ్ల, చిన్న పిల్లల ఎముకలు యవ్వనస్తుల కన్నా త్వరగా నశించిపోతాయి. అలాగే...భూమిలోని రసాయనాలు కూడా ఎముకల మన్నికకు వినాశనానికీ కారణమవుతాయి. కొన్ని రసాయనాలు మేలు, కొన్ని రసాయనాలు కీడు చేస్తాయి.

పాతిపెట్టబడిన ప్రదేశంలో ఉన్న రసాయనాలని బట్టి మనకు దొరికే ఎముకల నాణ్యత ఉంటుంది. ఇక ఈ రోజుకి ముగిస్తున్నాను....మీరంతా మళ్లీ నెక్ట్స్‌క్లాస్‌కి ప్రిపేరయి రావల్సి ఉంటుంది...

పరీక్షల్లో ఏమాత్రం తేడా వచ్చినా... నేను చెప్పనవసరం లేదు... మీ సీనియర్లని అడగండి... ఫెయిల్‌చేయడానికి ఏ మాత్రం సంకోచించను నేను.

విష్‌ యు  ది బెస్ట్‌.సీ యూ లేటర్‌..’’ గంభీరమైన కంఠంతో లెక్చర్‌ముగించింది డాక్టర్‌సుధారాణి.స్టూడెంట్స్‌అందరూ వెళ్లిపోగానే, ఆఖర్న ఉన్న హరిని గమనించింది.

‘‘హరీ... వచ్చిన వెంటనే నాకు చెప్పవచ్చుగా...’’ అంది.

‘‘లేదు మమ్మీ... నీ లెక్చరు బాగుంది... ఇంకా వినాలనిపిస్తుంది. అంతకు ముందు కూడా చాలాసార్లు విన్నాను. ఎప్పటికప్పుడు కొత్త టాపిక్‌లు వింటుంటే నాక్కూడా ఇంటరెస్టింగ్‌గా ఉంటున్నది.’’

‘‘సరే... సరే... ఇంటికి వెల్దాం పద. ఆగు... ఒక్క నిమిషం... గిరీ... గిరీ... ఇటురా. నా టేబుల్‌కింద ఉన్న బాక్స్‌తీసుకెళ్లి కారు డిక్కీలో పెట్టు. జాగ్రత్త. కింద పడనివ్వకు... చాలా జాగ్రత్త... ఇవిగో కారు తాళాలు... పక్కనున్న బటన్‌నొక్కితే డోరు తెరుచుకుంటుంది. డిక్కీలో పెట్టగానే మళ్లీ అదే బటన్‌నొక్కితే డోరు క్లోజ్‌అయిపోతుంది. తెలుసు కదా...’’ గబగబా అన్నది.

‘‘ఏందమ్మా... డాక్టరమ్మా... ఎన్నిసార్లు నేను ఇలాంటి బాక్సులు మీ కార్లో పెట్టలేదు? ఎనక్కి తీసుకురాలేదు? ఏందో వజ్రాల మూటల్లెక్క జెబుతావు. ఇంతకీ బాక్సులు బాక్సులు నిండా ఇరిగిపోయిన బొక్కలు (ఎముకలు) అయిపాయె. కారు తాళం నాకెరుక నేనమ్మా... ఎన్నిసార్లు చెబుతారు? ఏం హరి బాబూ... చక్కగున్నవా...’’ అంటూ హుషారుగా బాక్సు తీసుకుని కారు తాళాలు తీసుకుని వెళ్లిపోయాడు గిరి.

తల్లీ కొడుకులిద్దరూ నవ్వుకుంటూ లిఫ్ట్‌లోంచి కిందకి దిగగానే ఎదురుగా వచ్చి సుధారాణికి సాల్యూట్‌కొట్టి ‘‘ఇదిగోనమ్మా... మీ కారు తాళం... గుడ్‌నైటమ్మా... గుడ్‌నైట్‌హరి బాబు...’’ నవ్వుతూ అంటూ వెళ్లిపోయాడు గిరి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti