Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : 

ఆఫీస్ లనుండి వచ్చి తాళం తీసిన చందు, విరాట్ లు  డైనింగ్ టేబుల్ మీద సీనంతా చూసి దొంగలొచ్చారనుకుంటారు. ఆ తరువాత  ఎక్కడి సామాన్లక్కడ వుండడం తో ఇదంతా  ఎవరో ఆకతాయిల పనే అయి వుంటుందనుకుంటారు. మార్కెట్లో అనుకోకుండా  చందూకి ఎదురైన దీక్ష అతన్నుంచి తప్పించుకోవడానికి విఫల యత్నం చేస్తుంది. అక్కడ  ఇద్దరి మధ్య ఊహించని విధంగా కొత్త నాటకమాడుతుంది దీక్ష... ఆ తరువాత

......................................

తెరిచిన నోళ్ళు మూయటం మర్చిపోయారంతా.  చందూ అయితే ఓరి దేవుడో ఈ ట్విస్టేమిట్రా నాయనో..?  అసలిది తనని ఎక్కడ ఎలా ఇరికించాలని చూస్తోందో అర్ధమై చావటల్లేదు అని జుత్తు పీక్కున్నాడు చుట్టూ ఉన్న జనం పక్కున నవ్వుకున్నారు.

‘‘ఓహో... బావ మరదళ్ళ సరసాలయితే ఇంట్లో బాగుంటది, పబ్లిక్ లో ఇదేం బాగలేదు గాని ఎల్లండెల్లండి’’  అనరిచింది మరో స్త్రీ.

‘‘అది కాదత్తా బావకి నేనంటే చాలా యిష్టం.  కాని నాకే...  అస్సలు ఇష్టం లేదు.  చేసుకోనని ఎప్పుడో చెప్పేసాను.  అయినా వినకుండా ఇదో.... యిలా ఎక్కడబడితే అక్కడ ఆపి పెళ్ళికి ఒప్పుకోమ నివిసిగిస్తున్నాడు. ఇష్టం లేని పెళ్ళి చేసుకుని ఏం సుఖ పడతాను చెప్పండి.

మనిషి మంచోడే...  నాకిష్టం లేదంతే ఏం చేయను,  మీరయినా ఇక నా వెంటపడొద్దని బావకి నచ్చ చెప్పండి ప్లీజ్ ’’  అంటూ ఎంతో సహజంగా, దీనంగా దీక్ష అర్థిస్తుంటే చందూకి గింగిరాలు తిరిగి బొంగరంలా వాలి పోయినంతపనైంది. ‘‘ఇదేం చోద్యమమ్మా, అతను నీ బావంటున్నావు. లక్షణంగా వున్నాడు.  నువ్వంటే యిష్టపడుతున్నాడు. చేసుకోవచ్చుగా. ఎందుకిష్టం లేదేమిటి..?’’ అంటూ బుగ్గులు నొక్కుకుంది పరిమళం.‘‘ఎలా చేసుకోను చెప్పండి..?  ఏనాడన్నా ఓ ముద్దూ ముచ్చటా ఉందా..?  చేతులకి గాజులేయించాడా కట్టుకోడానికో చీర కొనిచ్చాడా, ఎప్పుడు చూడు అమ్మా నాన్న చెల్లెళ్ళంటూ సంపాదనంతా వాళ్ళకే పెట్టేస్తున్నాడు.  పెద్దచెల్లెలు పెళ్ళి తనే చేసాడు,  అంత ప్రేమే వుంటే నాకో నగానట్రా కొనివ్వచ్చుగా!  నావల్ల కాదు బాబూ నేను చేసుకొనంతే. కాస్త మీరయినా నచ్చచెప్పి పంపించేయండి’’  అంది. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా చందూకి కళ్ళ ముందు చుక్కలు కన్పించాయి.  కర్ర విరక్కుండా పాము చావకుండా మధ్యే మార్గంగా తను తప్పించుకు పోవటానికి భలే ఎత్తు వేసింది.  డౌటు క్లియరై పోయింది.  తమ ఇంట్లో పడి మెక్కిపోయిన ఆడ గొంగలు వీళ్ళే. ఇల్లంతా చక్క బెట్టి డైరీ చదివేసి ఎక్కడివక్కడ సర్దేసి చక్కగా వెళ్ళిపోయారు, లేకపోతే దీక్షకి ఇన్ని విషయాలు తన గురించి తెలిసే ఛాన్సే లేదు. చందూ ఆలోచనల్లో చందూ ఉండగానే చుట్టూ చేరిన వాళ్ళు తలో మాట చందూకి బుద్ది చెప్పటం ఆరంభించారు. తిరిగి చూసిన చందూకి అక్కడ దీక్ష కనిపించ లేదు. అప్పటికే తను రోడ్డు వరకు వెళ్ళిపోయి ఆటో ఎక్కేస్తోంది.  చందూ పరుగెత్తుకొచ్చే లోపు ఆటో వెళ్ళిపోసాగింది.  అది తమ కాలనీ గేటు వైపే వెళ్ళటం చూసి షాక్  తిన్నాడు చందూ. ఆటో నంబరు గుర్తు పెట్టుకుంటూ కాయగూరల సంగతి మరిచిపోయి వడివడిగా ఆటో వెళ్ళిన వైపుగా నడక ఆరంభించాడు. అంత వరకూ మౌనంగా ఉన్న కారు మబ్బులు ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో సందడి ఆరంభించాయి. తిరిగి తడి పొడి చినుకులతో వాన జల్లు ఆరంభమైంది.

తమ గోస్వామి కాలనీ గేటుకి కొంచెం దూరంలో ఉండగానే కాలనీలోకి వెళ్ళిన ఆటో తిరిగొస్తు కన్పించింది. అది తమ మొదటి వీధిలోకి గాని గేటు ఎదురుగా వున్న రెండో వీధిలోకి గాని పోకుండా కుడి పక్క వీధిలొకెళ్ళి తిరిగి రావటం చూస్తుంటే ఖచ్చితంగా దీక్ష మూడో వీధిలో దిగుంటుంది.  ఎక్కడ దిగిందో తెలిస్తే చాలు.

తనను సమీపించగానే ఆటోని ఆపాడు...

‘‘ఎక్కడి కెళ్ళాలి సార్...?’’ అడిగాడు ఆటో వాలా.

‘‘వెళ్ళక్కర్లేదుగాని ఆటో ఎక్కిన అమ్మాయిని మూడో వీధిలో ఎక్కడదించావో చెప్పుచాలు’’  అడిగాడు చందూ.

‘‘చెప్పబడదు సార్ ’’ అన్నాడు వాడు.

‘‘అదేంటయ్యా కాస్త చెప్పి సాయం చేయొచ్చుగా’’

‘‘నాకూ చేయాలనే ఉంది సార్,  కాని ఫ్రీ సర్వీస్  చేసే అలవాటు నా ఆటోకి లేదు.’’

‘‘అర్ధమైంది, ఇప్పుడుంటుంది చెప్పు’’  అంటూ ఏభై రూపాయల నోటు ఒకటి చేతిలో పెట్టాడు.

‘‘థాంక్యూసార్, మీరే మెరుగు సార్  చెప్పగానే అర్ధం చేసుకొని ఏభై యిచ్చారు.  ఆ పిల్ల మహా పెంకి సార్ .  పది రూపాయలు చేతిలో పెట్టి పైన పైసాయివ్వను పొమ్మంది.  వెళ్ళండి సార్,  మూడో వీధిలో చిట్ట చివరి విల్లా.  ఇంటి నంబరు నూట ఎనభై.  ఆయిల్లు దీక్ష మేడందే సార్.  అన్నట్టు మీరుండేదీ యిదే కాలనీ గదా.  మీకు తెలీకపోడం ఏంటి సార్..?’’

చందూ చిన్నగా నవ్వి ‘‘ఏదైనా అవసరంపడినప్పుడే గదా తెలుసుకోవాలనుకుంటాం. ఇప్పుడు అవసరం పడిరది. థాంక్యూ బ్రదర్. వెళ్ళిరా’’ అన్నాడు.

‘‘వర్షం పెరిగేలా ఉంది సార్, ఆటో ఎక్కండి.  అక్కడ దించేస్తాను డబ్బులివ్వద్దులే’’

‘‘వద్దులే నువ్వెళ్ళు’’

ఆటో వెళ్ళిపోయింది.

రెండు నిముషాల నడక తర్వాత దీక్ష ఇంటిని సమీపించాడు చందూ

తడిపొడి చినుకులు అప్పటికే బట్టల్ని కాస్త తడిపేసాయి.  ఇంటిని సమీపిస్తుండగా ఉన్నట్టుండి వాన ఎక్కువైంది. ఇక ఆలస్యం చేయకుండా పరుగెత్తి గేటు  తీసుకొని లోనకెళ్ళి పోర్టికోలో అడుగుపెట్టాడు.

‘‘ఛ! పాడువాన..... ఇప్పుడే కురవాలా..?’’ విసుక్కొంటూ ముఖ ద్వారం వంక చూసాడు చందూ.  అంచనా మరోసారి ఘోరంగా తప్పింది.వీధిగుమ్మంతలుపులుమూసిఉంటాయని, లోనబోల్టుబిగించుకొన్నదీక్షతనెంతఅరిచినా బ్రతిమాలినా తలుపు తీయదనీ అనుకున్నాడు.

కాని అందుకు భిన్నంగా...

తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి. లోన దీక్ష ఒక్కతే ఉందో సహస్ర కూడ ఉందో అర్ధం కాలేదు.  కర్చీఫ్  తీసి తలతుడుచుకొంటూ పోర్టికో లోంచి మెట్ల మీదకు వెళ్ళాడు.  ఇంతలో...

‘‘నువ్వు వదలవు.  ఇల్లు వెదుక్కొంటూ వచ్చేస్తావని వూహించాను.  తడిసినట్టున్నావు. మెట్ల మీద బకెట్లో నీళ్ళున్నాయి. తాడు మీద టవలుంది. కాళ్ళ కడుక్కొని తల తుడుచుకొని లోనకురా!’’ అంటూ లోపట్నుంచి దీక్ష మాటలు విన్పించాయి.మళ్ళీ సందేహం...లోనకు పిలిచిబడితె పూజ చేయదు గదా...?

‘‘హలో.......... అశరీరవాణిలా మాటలు విన్పిస్తున్నాయి. నువ్వెక్కడున్నావ్..?’’ ఉన్నచోట నిలబడి అడిగాడు.‘‘నీ కోసం హారతి పళ్ళెం సిద్దం చేస్తున్నా.  బుద్ది లేకపోతే సరి.  వీధి గుమ్మంలోంచి ఏంటా అరుపులు..?  వచ్చి కూచో!’’  ఈ సారి దీక్ష మాటల్లో కమాండిరగ్ ధ్వనించింది.

‘ఓరి దేవుడా,  ఇది పిల్ల కాదురా బాబు పిడుగు,  ఎన్ని నాటకాలాడుతోంది..?  ఇంతదాకా వచ్చాక తప్పుతుందా చూద్దాం’  అనుకుంటూ కాళ్ళు కడుక్కొని, చెప్పులు పక్కన వదిలితాడు మీద టవల్  అందుకున్నాడు. తల తుడుచుకొంటూ గడప దాటి హాల్లోకెళ్ళాడు.కిచెన్లో బిజీగా కన్పించింది దీక్ష. స్టౌ మీద టీ మరుగుతున్నట్టుంది. కమ్మటి టీ వాసన మజాగా వుంది. ‘‘ ఒక్క నిముషం సోఫాలో కూచో.  వచ్చేస్తున్నా!’’  అంది అతడ్ని చూసిన దీక్ష.

మౌనంగా సోఫాలో కూచున్నాడు.

ఈ అమ్మాయిలేమిట్రా బాబు ఓ పట్టాన అర్ధంకారు.

మార్కెట్లో చూసిన దీక్షకి ఇపుడు ఇంట్లో చూస్తున్న దీక్షకి ఎంత తేడా వుంది!  పైగా తన ఆలోచనలింత షార్ప్ గా ఉంటాయా..?  అక్కడ పోట్లాడి పారిపోయి వచ్చింది. ఇక్కడ తన రాకను ముందే వూహించి చుడీదార్ నుంచి చీరకట్టు లోకి మారిపోయి, బయట బకెట్ తో నీళ్ళు, దండెం మీద టవలు రెడీగా ఉంచింది.

అతడి ఆలోచనల్ని చెదరగొడుతూ బిస్కట్లు ఉంచిన ట్రే తో అక్కడి కొచ్చింది దీక్ష.  చిరునవ్వులు చిందుస్తూ... ‘‘సారీ మొదటి సారిగా మా యింటి కోచ్చావ్.  స్వీట్  పెడదామంటే టీ చప్పగా  ఉంటుంది.  అందుకే సాల్ట్  బిస్కట్లు తెచ్చాను.  తింటూ ఉండు టీ తెస్తాను’’  అంది ట్రే ని టీపాయి మీద ఉంచి.

‘‘మర్యాదలెందుగ్గాని,  సహస్ర ఎక్కడుంటుందో అడ్రసు చెప్పు.  వెళ్ళిపోతాను’’ అన్నాడు కాస్త బింకం ప్రదర్శిస్తూ.‘‘చెప్పనంత వరకు ఉంటావ్ గా.  ఉండు.  చెప్పాకే వెళ్ళు.  ఓ పక్క వాన పడుతుంటే వెళ్ళిపోతాట్ట. ముఖం చూడు’’ అంటూ కసురుకుంది మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళింది.వెళ్తున్న దీక్షను వెనక నుంచి చూసి కాస్సేపు తనను తాను మర్చిపోయాడు చందూ.  కాస్త రంగు తక్కువగాని దీక్షకేం తక్కువ..?  తనూ అందంగానే ఉంది అన్పించింది. మాటకారి, చలాకీతనం, తెలివి తేటలు, ఎందులోనూ తక్కువకాదు.

బయట వర్షం జోరు ఇంకా పెరిగింది.

దానికి కాస్త గాలివిసురు కూడ తోడైంది.

ఇంట్లో దీక్ష తప్ప ఇంకెవరూ ఉన్నట్టు లేదు.  ఇలాంటి వాతావరణంలో వయసులో జంట ఒకే ఇంట్లో ఉంటే పిచ్చి ఆలోచనలొస్తాయి.  ఆపైన ఎవరన్న చూస్తే పెడార్దాలు తీస్తారు,  ‘‘దీక్షా...  త్వరగా రా,  నే వెళ్ళాలి...’’  తనలో తను విసుక్కుంటూనే రెండు సాల్ట్  బిస్కట్లు తిన్నాడు. ఇంతలో అందమైన రెండు పెద్దసైజు చైనా కప్పుల్లో పొగలుకక్కుతున్న వేడి టీ పోసి ట్రే లో ఉంచి తెచ్చింది దీక్ష.  ట్రే ని టీపాయి మీద ఉంచి ఎదురుగా సోఫాలో కూచుంది.  చందూ టీ కప్పు అందుకోబోతే చనువుగా చేతి మీద కొట్టింది దీక్ష.  ‘‘ఇంత వేడి టీ...  తాగేస్తావా...? టీ కి తొందరముంది...? బిస్కట్లు ఎవరు తింటారు...? ముందివి తీసుకో’’ అంటూ తనూ తీసుకుంది. ఆమె ముందు తను పసివాడై పోతున్నట్టుంది చందూకి.

‘‘నాకేమీ అర్థంగావటం లేదు.  పిచ్చిపట్టేలా ఉంది.  ఓరి దేవుడో..  అసలు నువ్వు గయ్యాళివా...  తిక్కదానివా... మంచి దానివా..’’‘‘తెలివైనదాన్ని...’’ అతడి మాటల్ని ఖండిస్తు నవ్వింది దీక్ష.

‘‘ఆ సంగతి నాకు ఇప్పుడేగా తెలిసింది.  ఖర్మ అక్కడేమో పోట్లాడావ్.  తన్నించబోయి బావనంటూ తప్పించావ్.  పారిపోయివచ్చేసావ్.  తీరా ఇంటికొస్తే మంచిగా కూచోబెట్టి మర్యాద చేస్తున్నావ్.  ఓర్నాయనో... నిన్నెలా అర్థం చేసుకోవాలి?’’

‘‘నువ్వు నాకు అర్థమయ్యావ్  లేరా.  నేన్నీకు అర్థంగాక పోయినా ఫరవాలేదు.’’‘‘ అదిగో...  మళ్ళి నన్ను రా అంటున్నావ్.  ఇలా పరిచయమయ్యాయో అరేయ్... ఒరేయ్... అంటున్నారు..’’ అయోమయానికి లోనవుతూ అన్నాడు చందు.

‘‘ఏవండీ...  ఏంటండి అనటానికి టైమ్  కావాలి.  అరేయ్...  ఒరేయ్  అనటానికి టైమెందుకు?

‘‘నువ్వు నన్ను అలాగే పిలు..  ఒసే...  రావే..  పోవే..  బాగుంది.  ఇలా పిలుచుకోవటం కొత్తగా చాలా బాగుంది.  ఫ్రండ్స్  అలాగే పిలుచుకుంటారుగా. నీకు తెలుసా..? ఇంత వరకు నన్ను ఏ మగాడు అలా పిలిచింది లేదు.  అఫ్ కోర్స్  పిలిస్తే పళ్ళూడగొట్టేదాన్ననుకో.  అందరితో అంత చనువుగా ఉంటామా ఏంటి?’’

‘‘అందుకేనా నన్ను బావని చేసేసావ్..?  ఏంటి..? నీకు గాజులు వేయించ లేదా..?  చీర కొనివ్వలేదా.. నగా నట్రా... అందుకే నేనంటే ఇష్టం... లేదా...’’ అంటూ ఇక ఆపుకోలేక పెద్దగా నవ్వేసాడు చందూ. తనూ నవ్వేసింది దీక్ష.

‘‘నేనలా చెప్పకపోతే వాళ్ళు నిన్ను తన్నే వాళ్ళు తెలుసా?  అందుకే అలా చెప్పాను’’ అంది నవ్వాపుకొంటూ.

బయట వర్షం మరీ ఎక్కువైంది.

భారీ వర్షం.

పట్ట పగలే చీకట్లు ముసురుకుంటున్నట్టుంది.

హాల్లో ట్యూబ్ లైటు ఆన్ చేసి వచ్చి కూచుంది దీక్ష.  బిస్కట్లు తింటూ కబుర్లు చెప్పుకొని టీ తాగారు.

‘‘ఇంతకీ సహస్ర గురించి చెప్పలేదు’’  గుర్తు చేసాడు.

‘‘ఏరా మా సహస్ర నీ ఫ్రండు విరాట్ కి అంత నచ్చిందా..?  ఏకంగా రైల్వేస్టేషన్ల లోనే పోస్టర్లు వేయించేసాడు?’’  అంది నవ్వుతూ.‘‘అవును మావాడికి నచ్చకపోతే పట్టించుకోడు.  నచ్చితే ప్రాణంపోయినా వదులుకోడు.  సహస్రని చూడాలని తన ప్రేమని చెప్పాలని తపించి పోతున్నాడు’’

‘‘నాకు తెలుసు.  సహస్ర నేను మీ యింట్లోకి దొంగతనంగా వచ్చినప్పుడే ఆ విషయం అర్థమైంది.  పడగ్గదిలో ఏకంగా మా సహస్ర వాల్ పోష్టర్లే అంటించుకున్నాడుగా’’

‘‘మేం ఇక్కడే ఉంటున్నట్టు ఎలా తెలిసింది?’’

‘‘ఎలా ఏంటి..?  ఒకే కాలనీలో ఉంటున్నప్పుడు ఏదో రోజు దొరికిపోకుండా ఉంటామా..? మేము స్కూటీ మీద షాపింగ్ మాల్ కి వెళ్తుండగా నువ్వు పాలకి పోతూ కన్పించావ్’’ అంటూ జరిగింది క్లుప్తంగా వివరించిది దీక్ష.

‘‘సహస్ర ఎక్కడ?’’ ఆత్రుతగా అడిగాడు.

‘‘డ్యూటికి వెళ్ళిపోయింది.  తన గురించి చెప్పాలంటే నువ్వు నాకో మాటివ్వాలి’’

‘‘ఏమని?’’

‘‘మేము ఈ కాలనీ లోనే ఉంటున్న సంగతి నువ్వు విరాట్ తో చెప్పకూడదు’’

‘‘మళ్ళీ ఇదేం మెలిక...? ఇంత కష్టపడిరది వాడి కోసమే గదా’’

‘‘ఆ కష్టం వేస్ట్ కాకూడదనే ముందుగా హెచ్చరిస్తున్నాను.  విరాట్ కి తెలిస్తే సహస్ర ఇక్కడుండదు.  నాతో కూడా చెప్పకుండానే వెళ్ళిపోతుంది’’

చందూకి ఏం మాట్లాడాలో తెలీక...

కాస్సేపు మౌనంగా ఉండిపోయాడు.

‘‘ఎంతకాలమిలా...?  అసలీ సహస్ర ఎవరు...?  ఎక్కడ్నించి వచ్చింది?’’  సూటిగా చూస్తు అడిగాడు.

‘‘విరాట్ తో చెప్పనని ప్రామిస్ చెయ్యి. అన్నివిషయాలుచెప్తాను’’ అంటూ చేయి చాపింది దీక్ష.

‘‘ఓకే. చెప్పను ప్రామిస్’’  అంటూ చేతిలో చేయి వేసాడు.  అతడి చేతిని బిగించి పట్టుకుంది దీక్ష.  చందూకి నరాలు జివ్వుమన్నాయి.  ఒళ్ళంతా ఒక్కసారిగా కరెంట్ షాక్ తిన్నట్టయింది. చేతిని లాక్కోబోయాడు. వదల్లేదు దీక్ష.

‘‘ఈ క్షణం నుండి మనం ఫ్రెండ్స్. చెప్పరా. ఒకేనా?’’ కళ్ళలోకి చూస్తూ అడిగింది.

‘‘ఒకే ఒకే..  ముందు చెయ్యి వదలవే బాబూ.  అసలే బ్రహ్మచారిని.  నువ్వు ఇలాంటి టచింగ్లిస్తే మాడిమసైపోతాను.  వాతావరణం చూస్తే బాగాలేదు’’  అంటూ చేయి వెనక్కి తీసుకున్నాడు.

ఫక్కున నవ్వింది దీక్ష.

‘‘మరీ అమాయకుడిలా ఫోజులివ్వకు.  ఇంతకీ మా సహస్ర ఎవరుకుంటున్నావ్?’’  అంది.

‘‘నువ్వింకా చెప్పలేదుగా. నాకెలా తెలుస్తుంది’’ అన్నాడు.

‘‘ఇప్పుడు చెప్తాను. కాని విరాట్ తో నిజంగా చెప్పవు గదా?’’

‘‘నీకు మాటిచ్చాను. చెప్పను సందేహించక్కర్లేదు.’’

‘‘నీకు తెలియదు చందూ.  మీలాగే సహస్త్ర నేనూ ప్రాణ స్నేహితులం. మాది స్వస్థలం మధురై.  మమ్మీ,  డాడి ఆక్సిడెంట్ లో పోయారు. ఆడ పిల్లకు ఆస్థి పంచకుండా మా అన్నలయిదుగురూ కాజేయాలని చూసారు.   కోర్టుకెళ్ళి గెలిచాను. ఆ కష్టసమయంలో సహస్ర నాకు ఎంతో అండగా నిలబడిరది.

నా వాటాగా వచ్చిన అయిదు కోట్లు తీసుకొని మా వాళ్ళ ముఖం చూడ్డం ఇష్టంలేక చెన్నై వచ్చేసి ఈ ఇల్లు కొనుక్కుని జాబ్ చేసుకుంటున్నాను. నేనిక్కడున్న సంగతి సహస్రకు తప్ప మధురై లో గాని, మా బంధువుల్లోగాని ఎవరికీ తెలీదు.  నిజానికి నేను ఉద్యోగం చేయాల్సిన పని లేదు. బ్యాంకుల్లో నా డబ్బు మీద వచ్చే వడ్డీ చాలు హాయిగా బ్రతికేయొచ్చు. మనిషై పుట్టాక ఓపికున్నంతవరకూ కష్టపడుతూనే ఉండాలి. సోమరితనం అంటే నాకసహ్యం. అందుకే ఉద్యోగం.

సహస్ర నా వద్దకి రాక పూర్వం ఒంటరితనం నన్ను ఎంతో భయపెట్టేది. నా అనే వాళ్ళు లేరు. ఒంటరి బతుకు. ఇంటికొస్తే పలకరించే దిక్కులేదు.  ఇదేమి జీవితంరా భగవంతుడాని ఏడ్చేదాన్ని..’’ అంటూ బాధతో గొంతు మూగ పోగా కన్నీళ్ళు పెట్టుకుంది దీక్ష.ఆమె మాటలు వింటూ చందూ కూడా బాధపడ్డాడు.

‘‘రిలాక్స్ దీక్ష ప్లీజ్’’  అన్నాడు.

పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంది.

‘‘సారీ చందూ.  నా గతం చెప్పి నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. నిజానికి సహస్ర వచ్చాకే తిరిగి నాలో ధైర్యం వచ్చింది.  జీవితం మీద విసుగుపోయింది. కొత్త ఉత్సాహం ఏర్పడిరది. ఇదంతా నీతో ఎందుకు చెప్తున్నానంటే విరాట్  మూలంగా సహస్ర తిరిగి నాకు  దూరంగా వెళ్ళిపోతేనేను మళ్ళి ఒంటరిదాన్నయిపోతాను..’’

‘‘ఒకే..  నాకు అర్థమైంది.  నేనుగా చెప్పనని మాటిస్తున్నాగా.. మనలాగే వాళ్ళిద్దరూ ఒకరి కొకరు తారసపడితే అప్పుడు సంగతి ఏమో.  నన్నునమ్ము. నా అంతట నేను చెప్పను సరేనా?’’

‘‘ఒకే!’’ అంటూ మరోసారి చెమర్చిన కళ్ళు తుడుచుకుంది.

బయట వాన జోరు ఇంకా తగ్గలేదు. ఈదురు గాలి ఆగి ఆగి వీస్తోంది.

‘‘మా స్వస్థలం మధురైయని చెప్పా గదా.  సహస్ర సాధారణ కుటుంబానికి చెందిన యువతి కాదు.  మధురైను ఒకప్పుడు పరిపాలించిన తెలుగు నాయక రాజుల వంశానికి చెందిన అమ్మాయి.  ఆమె తండ్రి మహాదేవ నాయకర్  తల్లి మూగాంబిగై,  మధురైలో సగం లిక్కర్  షాపులు నాయకర్వే. ఇతర వ్యాపారాలూ అనేకం ఉన్నాయి. మల్టీమిలియనీర్. అటువంటి నాయకర్  దంపతులకు ఏకైక కుమార్తె సహస్ర’’  అంటూ చెప్పటం ఆపింది దీక్ష.

దీక్ష చెప్పిన ఆసక్తికరమైన సహస్ర వివరాలేమిటి...?

విన్నాక చందు ఏం చేయబోతున్నాడు...?????
.............................................వచ్చేవారం

                                                       [email protected]

www.suryadevararammohanrao.com

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekambar