Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ:
చెల్లెలి పెళ్ళి పనుల్లో ఆఫీసు బిజీలో తలమునకలై వున్న ఏకాంబర్ దగ్గరకి ఎమ్మెల్యే అనుచరుడొకడు వచ్చి తీసుకెళతాడు. ....................................................... 

"ఆయన గారికి టీ త్రాగేంత వీలుందా! ఇటు వాళ్ళ చెల్లెలి పెళ్ళి....అటు కస్టమ్ర్ల సర్వీసు..రెండూ ముఖ్యమేగా" టీ త్రాగుతూ అంది నూకరత్నం.
నలుగురితో కలిసి టీ త్రాగుతోందే గానీ నూకరత్నం మనసంతా ఏకాంబర్ చుట్టే తిరుగుతోంది.

"ఆ ఎమ్మెల్ల్యే గారు ఎందుకు ఇంత అర్జెంటుగా కబురు పెట్టారో..? ఏం జరిగిందో.." ఆలోచిస్తూనే ఉంది...

బైక్ మీద ఎమ్మెల్ల్యే అనుచరుడ్ని వెనక ఎక్కించుకుని రివ్వున బీచ్ వైపు దూసుకుపోతున్నాడు ఏకాంబర్.

ఆరోజు రాత్రి

ఏకాంబర్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ఇంటిల్లిపాది. కేటరింగ్ కుర్రాడు వచ్చి అరగంటపైనే అయింది. ఇంటికొస్తే అందరం మాట్లాడుకుని మెనూ ఖరారు చేస్తామని చెపాడు ఏకాంబర్. అందుకే సాయంత్రం ఆరో గంటకే ఏకాంబర్ వాళ్ళ ఇంటికి వచ్చాడు అతను. ఏడున్నరవుతుండగా ఇల్లు చేరుకున్నాడు ఏకాంబర్.

"ఏరా ! ఇంత ఆలస్యమైందేం? ఈ కేటరింగ్ కుర్రాడ్ని ఇంటికి పిలిచి ఆలస్యం చేయడం భావ్యం కాదు కదరా!" కొడుకు గుమ్మంలో అడుగు పెట్టగానే ఎదురెళ్ళి అన్నాడు పీతాంబరం.

" ఆఫీసుకెళ్ళాల్సొచ్చింది నాన్నా. చెల్లెలి పెళ్ళయ్యేంత వరకు వెళ్ళకూడదనుకున్నాను..తప్పింది కాదు.." భుజాన వున్న బ్యాగ్ సోఫాలో పెడుతూ అన్నాడు ఏకాంబర్.

"సరి సరి.. ముందు ఈ కేటరింగ్ కుర్రాడితో మాట్లాడి పంపించెయ్యండి.." వంటగదిలో నుండి వస్తూ అంది పర్వతాలు.

" మీరు మాట్లాడారు కద నాన్నా! నాకోసం ఆలోచించకండి...కూరలెన్నో, స్వీట్లు ఎన్నో..ఏదో చెప్పెయ్యండి..." అన్నాడు ఏకాంబర్.

"నువ్వు ఉదయంబ్ చెప్పావటకదరా! ఆ మెనూ బాగానే ఉంది..నాకు నచ్చింది. నాన్న కూడా ఆ ఐటంస్ అయితే బాగానే ఉంటాయన్నారు. కాకపోతే, రేటు ఎక్కువ అయిపోతుందని భయపడుతున్నాను.." అన్నాడు నీలాంబర్.

"మెనూ నచ్చింది కదన్నయ్యా...ఓకే చెయ్యండి... డబ్బు సంగతి నేను చూసుకుంటాను. మా ఆఫీసులో వాళ్ళంతా వస్తారు.కస్టమర్లు కూడా పెద్దపెద్దవాళ్ళు వస్తారు. మెనూ ఇంత రిచ్ గా లేకపోతే బావుండదు." చెప్తూనే బ్యాగ్ తీసుకుని గదిలోకి వెళ్ళాడు ఏకాంబర్.

"బాబూ! మా చిన్నబ్బాయి చెప్పిన మెనూనే ఖాయం చేసెయ్యండి. మిగతా విషయాలన్నీ రేపు ఉదయం వాడూ, మీరూ మాట్లాడుకోండి.." కేటరింగ్ కుర్రాడితో చెప్పాడు పీతాంబరం.

"సరే సార్! నేను రేపు ఏకాంబర్ సార్ని కలుస్తాను..వస్తాను.." అంటూనే లేచి వెళ్ళిపోయాడు కేటరింగ్ కుర్రాడు.

"ఇన్నివేల మందికి భోజనాలంటే నాకెందుకో భయంగా ఉంది నాన్నా..ఏకాంబర్ గాడేమో ఆలోచన...పాలోచన లేకుండా తొందరపడుతున్నాడు." తండ్రి ప్రక్కనే కూర్చుంటూ అన్నాడు నీలాంబర్.

"నీకు చేతనైన సహాయం నువ్వు చెయ్యరా ! మిగతాదంతాతమ్ముడే చూసుకుంటాడు. పదిమందిలో తిరుగుతున్నాడు కదా, ఈమాత్రం హోదాగా చెయ్యకపోతే బావుండదు " పెద్ద కొడుక్కి చెప్తూ పెళ్ళాం కేసి చూసాడు పీతాంబరం.

"నిజమేకదరా పెద్దోడా..! చెల్లి పెళ్ళి ఘనంగా చేద్దామని తమ్ముడి ఆశ...చెయ్యనీ.."ఆనందంగా అంది పర్వతాలు.

"మీ అందరి మాట ఒకటైనప్పుడు నాదేముంది? కానివ్వండి.." అంటూ అక్కడినుండి లేచి వెళ్ళిపోయాడు నీలాంబర్.

"వాడంతేలెండి..మీరు కానివ్వండి....రండి..భోజనాలు చేద్దాం..." అంటూ పర్వతాలు వంటగదికేసి వెళ్ళింది.

ఇంతలో టీవీ దగ్గరున్న సెల్ ఫోన్ మ్రోగింది. పర్వతాలు డైనింగ్ టేబుల్ దగ్గర వంటసామాన్లు సర్దుతోంది. "చిన్నన్నయ్యా! నీ సెల్ ఫోన్ మ్రోగుతోంది. " పెరట్లోకి వెళ్ళిన ఏకాంబర్ ని పిలుస్తూ సెల్ తీసి చూసింది అలివేలుమంగ.

"రత్నం వదిన ఫోన్ చేస్తోందే?! ఎందుకో! " అని మనసులోనే అనుకుంటూ సెల్ చెవి దగ్గర పెట్టుకుంది అలివేలుమంగ.

"హలో వదినగారూ ! అన్నని ఇంట్లో కూడా హాయిగా ఉండనివ్వరా!" నవ్వుతూ అంది అలివేలు మంగ.

" నీ పెళ్ళయ్యేవరకూ మమ్మల్ని కూడా మీ అన్న గారు నిద్రపోనివ్వడం లేదమ్మా తల్లీ !  భోజనాలు అయ్యాయా!" కుశల ప్రశ్నలు అడిగింది అట్నుండి నూకరత్నం.

రెడీ అవుతోంది...అన్నయ్య ఇప్పుడేగా వచ్చాడు.." అంది అలివేలుమంగ.

"ఉన్నారా, ఒకసారి ఫోన్ ఆయనకిస్తావా?" అంది రత్నం.

"పెరట్లో ఉన్నాడు. అదిగో వస్తున్నాడు...ఇస్తానుండు. " అంటూనే సెల్ పట్టుకుని ఏకాంబర్ కి ఎదురెళుతూ "నీకేరా చిన్నన్న" అంటూ సెల్ ఫోన్ ఏకాంబర్ చేతికిచ్చింది మంగ.

"ఎవరూ?!" అంటూనే సెల్ చేతిలోకి తీసుకుని 'హలో' అన్నాడు ఏకాంబర్.

"ఎమ్మెల్యే గారింటికి వెళ్ళారు కదా, ఏమైంది..?" ఆతృతగా అడిగింది రత్నం.

"నేను ముందే చెప్పాను కదా ! ఎమ్మెల్యేగారి అనుచరుడొకరు చనిపోయాడు. ఆ విషయం చెప్పడానికే పిలిచాడాయన." చెప్పాడు ఏకాంబర్."అయ్యో, ఎలా..?" ఆశ్చర్యంగా అంది రత్నం.

"ఎవరో చంపేసి బీచ్ లో పడేసారు" చెప్పాడు ఏకాంబర్.

భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబోతున్న పీతాంబరం, భర్తకి అన్నం వడ్డించబోతున్న పర్వతాలు ఆ మాట వింటూనే అదిరిపడ్డారు."ఎవర్రా? ఎవర్ని చంపేశారు?" ఆతృతగా అడిగాడు పీతాంబరం.

ఎవరో....ఎమ్మెల్యేగారి అనుచరుడ్ని చంపేసి సముద్రం ఒడ్డున పడేసారు.." సెల్ చేత్తో పట్టుకుని తండ్రితో చెప్పాడు ఏకాంబర్."ఫోన్ లో ఎవర్రా? ముందు వాళ్ళతో మాట్లాడి ఆ సెల్ ఆపరా! భోజనం చెయ్యవా?" కొడుక్కేసి లాలనగా చూస్తూ అంది పర్వతాలు.

"రత్నం మాట్లాడుతోందమ్మా!" అంటూనే సెల్ చెవి దగ్గర పెట్టుకుని ' రేపు మాట్లాడుదాం, ఉంటా రత్నం. గుడ్ నైట్ " అంటూ కాల్ కట్ చేసాడు ఏకాంబర్.

"ఎమ్మెల్యే నిన్నెందుకు రమ్మన్నాడు?" అడిగింది తల్లి పర్వతాలు.

"వాళ్ళ అనుచరులందరికీ నా దగ్గరే ఇన్స్యూరెన్స్ చేయించాడమ్మా! అందులో చనిపోYఇనతను కూడా ఉన్నాడు " విచారంగా అన్నాడు ఏకాంబర్.

"అయ్యో పాపం...అయినా వాళ్ళీమధ్యేకదరా నీ దగ్గర పాలసీలు కట్టింది..?" అన్నాడు తండ్రి పీతాంబరం."ఆర్నెల్లవుతోంది.."అన్నాడు ఏకాంబర్.

"క్లైం వస్తుందా?" ఆశ్చర్యంగా అడిగాడు పీతంబరం."ఎందుకు రాదు నాన్నా, సహజ మరణమైతే ఎంక్వైరీ ఉంటుంది. ఇది అనుకోని 'ప్రమాదం' కదా!

పోస్టుమార్టం   రిపోర్ట్, మిగతా అన్ని ఫారాలు సరిగ్గా సబ్మిట్ చేస్తే వారంలోపే వారంలోపే క్లైం సెటిల్ అవుతుంది. " డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అన్నాడు ఏకాంబర్.

"ఎంతొస్తుందేమిటి?" కొడుకు ఏకాంబర్ ముందు కంచం పెడుతూ అడిగింది పర్వతాలు. ఇంతలో నీలాంబర్, అలివేలు మంగ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు.

"ఎంతొచ్చినా ఏముందమ్మా పాపం, అతని భార్యని చూస్తే జాలేసిందమ్మా..చిన్న పిల్లలు..చదువుకున్న పిల్లలానే ఉంది...భరత శవం మీద పడి ఏడుస్తూంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయమ్మా" బాధగా అన్నాడు ఏకాంబర్.

"అక్కడకు నువ్వెందుకెళ్ళావన్నయ్యా?" చిన్నన్న కళ్ళల్లో కన్నీటి ఛాయ  చూసి బేలగా అడిగింది మంగ.

" వాళ్ళందరి పేర పాలసీలు కట్టారు కదమ్మా! చనిపోయిన శవాన్ని కూడా నాకు చూపించాలేమోనని ఎమ్మెల్యేగారు నాకు కబురు పెట్టారట....పాలసీ క్లైం కి ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికట " నిర్లిప్తంగా అన్నాడు ఏకాంబర్.

"అందుకే అంటారు, ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట అంటించుకుంటాను నిప్పు ఇవ్వమన్నాడట ఎవడో...అలా ఉంది," చీదరింపుగా అన్నాడు పీతాంబరం.

"అవున్నాన్నా...ఎమ్మెల్ల్యే ఆరాలన్నీ క్లైం కోసమేగానీ కనీసం చనిపోయిన అనుచరుడి కోసం రెండు కన్నీటిబొట్లు కూడా జారవిడిచాడో, లేదో?" బాధగా అన్నాడు ఏకాంబర్.

"సరిసరి, ఆ గొడవ ఆపి భోజనం చెయ్యండి.." అందరికీ కూరలు వడ్డిస్తూ అంది పర్వతాలు.

" ఈ గొడవల్లో పడి పెళ్ళి ఏర్పాట్లు మర్చిపోగలవు జాగ్రత్త " చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు పీతాంబరం.

"లేదు నాన్నా! ఎలా మర్చిపోతాను..కానీ కస్టమర్ల కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవాలి కదా! అందులో అర్జెంటు పనులుంటే తప్పదు." భోజనం చేస్తూ అన్నాడు ఏకాంబర్.

"అంతేకదండీ!" అంది పర్వతాలు.

అందరూ ఒకేసారి మౌనంగా ఉండిపోయారు. ఎవరి మానాన భొజనాలు కానిచ్చేసారు.

ఆ మర్నాడు సాయంత్రం ఇంటికొస్తున్నప్పుడు ఎమ్మెల్ల్యే మేడిపండి అబద్ధాలరావు నుండి ఫోన్ వచ్చింది. హడావుడిగా ఉన్న ఏకాంబర్ తర్వాత వస్తానన్నా వినకుండా వెంటనే రమ్మని హుకుం జారీ చేసేసరికి ఇక తప్పదన్నట్లు వెళ్ళాడు ఏకాంబర్.

ఏకాంబర్ వెళ్ళేసరికి ఎమ్మెల్యే గారింటి దగ్గర వరండాలో దిగాలుగా నిలబడి ఉంది చనిపోయినతని భార్య. పిల్లలు ఇద్దరూ ఆమెని చుట్టుకుని రెండు చేతుల్తో పట్టుకుని ఉన్నారు.

ఎమ్మెల్యే గారి అనుచరులంతా తలోమూల మిలట్రీ జవాన్ల లాగా స్టడీగా నిలబడి ఉన్నారు.

ఏకాంబర్ ఎమ్మెల్యేగారింటిముందు ఆగేసరికి గేటు దగ్గరున్న గూర్ఖా సలాం చేసి గేటు బార్లా తెరిచాడు.లోపలకు అడుగు పెట్టీపెట్టగానే ఎమ్మెల్యేగారి పీయే ఎదురొచ్చి మరీ లోపలకు తీసుకెళ్ళాడు.

ఎమ్మెల్యేగారిని కలవడానికి హాల్లోకి వెళ్తూనే వరండాలో తన ఇద్దరు పిల్లల్ని పట్టుకుని నిలబడ్డ ఆమెని ఓరకంట చూస్తూనే లోపలకు వెళ్ళాడు ఏకాంబర్.

"రండి రండి ఏజెంట్ ఏకాంబర్ గారూ! మీకు శ్రమ కలిగిస్తున్నాను " అంటూ నవ్వుతూ పలకరించాడు ఎమ్మెల్యే.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్