Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ : పబ్లిక్ ఫోన్ నుండి పోలీస్ కంట్రోల్ రూం కి ఫోన్ చేసి జరిగినది వివరిస్తాడు, హరి. మరణానంతరం దేహం అంతరించి భూమిలో కలిసిపోయే పరిణామ క్రమాన్ని విద్యార్థులకు బోధిస్తున్న డా.సుధారాణి ( డా. హరి తల్లి ) క్లాస్ రూం ముందు నిల్చుంటాడు. ఆమె పాఠం చెప్పడం పూర్తయిన వెంటనే ఇద్దరూ కల్సి ఆమె ఫ్లాట్ కి బయలుదేరతారు...

ఆ తర్వాత

ఉస్మానియా యూనివర్సిటీ క్వార్టర్స్‌లోకి పరుగుతీసింది వారి వాహనం.

ఇంట్లోకి అడుగుపెడుతూనే ఎదురుగా  కనబడ్డ నాన్నగారి ఫోటోకి అలవాటు ప్రకారం దండం పెట్టుకున్నాడు హరి. అమ్మ చేసిన కమ్మని వంటకాలను ఎంతో ఆనందంగా ఆరగించాడు. ఆ తర్వాత... నెమ్మదిగా... హరిని అడిగింది సుధారాణి.

‘‘హరీ... నాయనా... ఏమైంది..?

ఏమయ్యిందసలు? ఏదో విషయంలో డల్‌గా ఉన్నావు. ఫోన్‌లో కూడా నీ వాయిస్‌ డల్‌గా ఉంది. నాకు కాకపోతే ఎవరికి చెపుతావు? చెప్పు హరి.’’

‘‘ఏం లేదు మమ్మీ... ఏవో హాస్పిటల్‌ గొడవలు... ఎప్పుడూ ఉండేవే...’’

‘‘నేన్నమ్మను హరీ... సౌమ్యకేమన్నా సీరియస్‌ అయిందా..? నా దగ్గరెందుకు దాస్తావు? మీ ఇద్దర్నీ నా దగ్గరే ఉండమన్నాను. కాదన్నావు. నీ మాట నేను కాదనలేదు మీరు ఇక్కడే ఉంటే నాకు ఎంతో ఆలంబన, ఆనందంగా ఉండి ఉండేది. వేరు కాపురమన్నావు... సౌమ్య ఆరోగ్యం పాడయ్యింది... అంత అవసరమా... ఇదేమన్నా అమెరికానా? పెళ్లయినా ఇంకా భార్యతో సహా తల్లిదగ్గరే ఉంటున్నాడు అని ఎవరో ఏదో అనుకోవడానికి...? నాన్న గారు పరమపదించిన తర్వాత నాకింకెవరున్నారు? కొడుకు నీవు, సౌమ్య నా కూతురు, కోడలు కాదు... ఇదేమీ సొంతిల్లు కాదు... యూనివర్సిటీ క్వార్టర్సు... సరే ప్రస్తుతానికి సౌమ్య ఆరోగ్యం నిమిత్తం దూరంగా ఉంది... రేపు గాక ఎల్లుండి చక్కగా నయమయి వచ్చేస్తుంది. నా మాట విని మీ ఇద్దరూ ఇక్కడే ఉండిపోండి.’’

‘‘ఓహ్... మమ్మీ...’’

‘‘అదే... అదే... నేను చెప్పే ప్రతిమాట, ఎప్పుడూ వినేదే... వినీ.. వినీ బోరు కొట్టేసిందంటావు అంతేగాని, తల్లి మనసు అర్థం చేసుకోనంటావు అంతేనా.’’

‘‘అమ్మా.. పొద్దుపోతుంది. నేను రేపు మళ్లీ ఉదయాన్నే హాస్పటల్‌కి వెళ్లాలి. ఈరోజు డుమ్మా కొట్టేసాను. నీతో ఆర్గ్యుమెంట్‌పెట్టుకుంటే నాకు కుదరదు. ఈ విషయాలన్నీ తర్వాతెప్పుడైనా తీరిగ్గా మాట్లాడుకుందాం.’’

‘‘సరే... ఓకే... నీమాట నీదేకదా... అమ్మమాట ఎప్పుడు విన్నావు గనుక? సరే... బయలుదేరు... అవునూ... హరీ... గడ్డం చేసుకుని ఎన్ని రోజులయ్యింది? కళ్ళు లోపలికి పోయిన ముఖం డొక్కుపోయి      ఉంది... నీ అంతట నీవు చెప్పేవరకు నేను నిన్ను బాధపెట్టను... పంచుకోవడానికి ఈ అమ్మ ఉందని మర్చిపోవద్దు... ఓకే...?’’ అంది చివరగా.

X                 X                X

అమ్మ దగ్గర సెలవు తీసుకుని తన అపార్ట్‌మెంట్స్‌కు చేరుకున్నాడు హరి. సరిగ్గా తన అపార్ట్‌మెంట్‌లోపలకి వెళ్లేంతలో పోలీసులు, అంబులెన్స్‌వాళ్లు హడావుడిగా నాల్గవ అంతస్తులోని నడివయసు మనిషి వెళ్లి గడియ వేసుకున్న రూమ్‌లోపలికి, బయటకి తిరుగుతున్నారు.

నెమ్మదిగా ఎంక్వైరీ చేసాడు హరి.

‘‘ఎవరో ధర్మాత్ముడు... ఫోన్‌చేసి ఏదేదో చెప్పాడంట పోలీసులకు. వాళ్లు వచ్చి తలుపులు కొడితే సమాధానం లేదంట... తలుపులు పగలగొట్టి చూస్తే గుండెపోటుతో చివరి క్షణాల్లో ఉన్న ఒక ముసలాయన కన్పించాడట... వెంటనే హాస్పిటల్‌ తరలించారట... ఔట్‌ ఆఫ్‌ డేంజరట.  ఆ ముసలాయన అదృష్టం... ఆ మహానుభావుడెవరో సమయానికి ఇన్‌ఫర్‌మేషన్‌ ఇవ్వబట్టి బతికిపోయాడు.’’ అన్నారొకరు.

నిర్ఘాంతపోయాడు హరి...

హాస్పిటల్‌లో సీట్లో కూర్చుని పేషంట్లని చూస్తున్నడే గానీ అన్యమస్కంగా ఉన్నాడు హరి.

అలవాటు ప్రకారం పేషంట్లని చూడడం, వారికి సరిపడా సలహాలు, సేవలు, మందులు ఇవ్వడం మెకానికల్‌గా చేసేస్తున్నాడు కానీ...

మనసంతా ఎక్కడో ఉంది...

ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లున్నది.

ఎవరికోసం ఎదురు చూడాలి..?

ఎవరొస్తారని? ఎందుకొస్తారని?

ఏమిటి వెర్రి నిరీక్షణ... ఎందుకీ నిరీక్షణ...

ఎవరన్నా చుట్టాలింటికి వస్తున్నారంటే కాకులు అరుస్తాయంట...

ఇది ఇల్లు కాదే... హాస్పిటల్‌...

ఇక్కడకి కాకులెందుకు వస్తాయి? ఇక్కడకు చుట్టాలెలావస్తారు? ఇంతలో ఫోన్‌...

‘‘సార్‌... ఎవరో కొత్త పేషెంట్‌, అపాయింట్‌మెంట్‌ లేదు... పేరు చెప్పడం లేదు... షి వాంట్స్‌టూ సీ యూ.’’

‘‘పంపించండి.’’

‘‘ఇంకెవరు? ఖచ్చితంగా మేఘన అయి ఉండాలి.’’ అనుకున్నాడు హరి...

ఇంతలో విద్యుల్లత మేఘన రానే వచ్చింది. రావడం, రావడం రివాల్వింగ్‌ స్టూల్‌పై కూర్చుంది.

మెడ, మణికట్లు ఇతర గాయాలు అన్నీ చెక్‌చేసాడు...

‘‘గాయాలు తగ్గుముఖం పట్టాయి. మందులు సరిగ్గా వాడుతున్నారా?’’ అన్నాడు.

సమాధానం అదే సన్నని చిరునవ్వు...

ఎన్నో అడగాలనీ, ఎంతో కోప్పడాలనీ... ఉంది హరికి. కానీ ప్లేస్‌గాని ప్లేస్‌... అందరూ ఉన్నారు. ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఇంతలోనే వెళ్లివస్తానన్నట్లుగా నవ్వి, తళుక్కున మాయమైపోయింది మేఘన.

డ్యూటీలన్నీ అయిపోయాక, అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేముందు తల్లి మాటల్ని గుర్తు చేసుకున్నాడు హరి. ఒక్కసారి కుడిచేత్తో గడ్డాన్ని సవరించుకున్నాడు. బాగానే పెరిగింది. జిలెట్‌ గిలిట్‌లతో పోయేది కాదు... అవన్నీ అడ్వర్‌టైజ్‌మెంట్‌ల వరకే... షాపింగ్‌సెంటర్‌లో ‘టోపాజ్‌’ బ్లేడ్‌కొనుక్కుంటే పోలా..? షాపింగ్‌సెంటర్లో అటూ ఇటూ తిరుగుతండగా... రేడీస్‌సెక్షన్‌లో ‘లిప్‌స్టిక్కు’లు పరిశీలిస్తున్న మేఘన కన్పించింది. దగ్గరగా వెళ్లి పలకరించాడు.

ఆశ్చర్యం... ఆనందం... రెండూ తళుక్కున మెరిసాయి మేఘన కళ్ళల్లో... హరి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు... ఇద్దరూ ఆత్మీయంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇదే ఫీలింగ్‌ఇందాక హాస్పిటల్‌లో లేదేమిటి? అందుకే కదా... సమయం, సందర్భం అన్నారు పెద్దలు... అనుకున్నాడు హరి.

ఇంతలో మేఘన తనే ముందుగా అన్నది... ఈ రోజు నేను మా పిన్ని దగ్గరకు బయల్దేరాలి... బస్సు కోసం ఇక్కడికి వచ్చాను.

‘‘బస్సా...! ఇక్కణ్ణించా..?’’ ఎంతో ఆశ్చర్యంగా అన్నాడు హరి.

‘అంత ఎక్కువగా ఆశ్చర్యపోకండి డాక్టర్‌గారూ... ఈ షాపింగ్‌కాంప్లెక్స్‌వెనకాల నుండే రకరకాల ప్రదేశాలకు బస్సులు సాయంత్రం 6 గంటల నుండి మొదలుకుని రాత్రి 12 గంటల వరకు బయలుదేరు తుంటాయి. ఇంతకీ మీరెందుకిక్కడికి వచ్చారు?’’ ప్రశ్నించింది మేఘన.ఈ ప్రక్కనే మా గ్లైడర్‌అపార్ట్‌మెంట్స్‌, ఏదో చిన్న షాపింగ్‌కోసం వచ్చాను. మీ దర్శన భాగ్యం కలిగింది.’’ చిన్నగా నవ్వుతూ అన్నాడు హరి.

‘‘మరి నేను వెళ్తాను డాక్టర్‌గారూ... టైమయ్యింది బస్సుకి...’’

‘‘ఓకే... పదండి... నాకేం పెద్ద లేట్‌కాలేదు.. మిమ్మల్ని బస్సెక్కించి నేను వెళ్తాను... రండి.’’

‘‘అయ్యో మీకెందుకా శ్రమ డాక్టర్‌గారూ...’’

‘‘ఫర్వాలేదు. రండి...’’

ఇద్దరూ కలిసి షాపింగ్‌కాంప్లెక్స్‌వెనక్కి వెళ్లగానే రణగొణ ధ్వనులతో వెళ్లే బస్సులు, వచ్చే బస్సుల హంగామాతో గందరగోళంగా ఉన్న ప్రదేశం కానవచ్చింది.

‘‘ఏదీ... మీ రిజర్వ్‌డ్‌ టిక్కెట్‌ ఇవ్వండి...’’ అంటూనే, ఆమె ఇచ్చిన టికెట్‌తో ఒక బూత్‌ దగ్గరకు వెళ్లాడు.కొక్కిరాయి లాగా ఉన్నవాడొకడు టికెట్‌ తీసుకుని, ఎగాదిగా చూసి ‘‘ఈ బస్సు  నిన్ననే కాన్సిల్‌ చేసేసాం మీకు తెలీదా? రేపు అబిడ్స్‌లో కంపెనీ దగ్గరికి పోయ్యి మీ పైసలు  తీసుకపోండి.’’ అన్నాడు...

బస్సు కాన్సిల్ అయిందని తెలియగానే హరి-మేఘన ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారా ? 

ఎక్కడికెళ్ళారు?? ఏం జరిగింది???

వచ్చేవారం.........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti