Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

శాస్త్ర‌వేత్త‌ను అవుదామ‌నుకొన్నా... కానీ...- సాయిధ‌ర‌మ్ తేజ్‌

interview with sai dharm tej
చిరంజీవి ఇంట్లోంచి మ‌రో హీరో వ‌స్తున్నాడ‌నే మాట వింటే చాలు.. అంచ‌నాలు మొద‌లైపోతాయి.
చిరంజీవిలా డాన్సులు చేస్తాడా?
ప‌వ‌న్ క‌ల్యాణ్‌లా ఫైటింగులు ఇర‌గ‌దీస్తాడా?
బ‌న్నీలా స్టైల్‌గా ఉంటాడా?
చ‌ర‌ణ్‌లా ప్ర‌తాపం చూపిస్తాడా? 
అభిమానులంతా ఇలాంటి ఆశ‌ల ప‌ల్ల‌కిలోనే ఊరేగుతుంటారు. వాళ్ల అంచ‌నాల‌ను అందుకోవ‌డం, `ఓకే` అనిపించుకోవ‌డం సామాన్య‌మైన విష‌యం కాదు. కానీ.. సాయిధ‌ర‌మ్‌తేజ్ మాత్రం నూటికి ఒక్క శాతం కూడా నిరాశ ప‌ర్చ‌లేదు. తెర‌పై సాయి ఈజ్ చూస్తుంటే.. ప‌ది సినిమాల అనుభ‌వం ఉన్న హీరోలా క‌నిపించాడు. అభిమానుల్ని అల‌రించాడు. మొత్తానికి బాక్సాఫీసుని మెప్పించాడు. పిల్లా నువ్వు లేని జీవితంతో తొలి అడుగులోనే పాసైపోయిన సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో మాట క‌లిపింది గో తెలుగు. ఈ సంద‌ర్భంగా సాయి చెప్పిన క‌బుర్లు..

* ఏంటి రిలాక్స‌యిపోయారా?
- భ‌లేవారే. రిలాక్స‌యిపోతే ఎలా..? ప‌్రేక్ష‌కులు జ‌డ్జిమెంట్ ఇచ్చేశారు. ఇక మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఈ విజ‌యాన్ని కాపాడుకోవాలంటే ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని క‌థ‌లు ఎంపిక చేసుకోవాలి..

* సినిమా విడుద‌ల రోజు టెన్ష‌న్ ప‌డ్డారా?
- చాలా అండీ. మాట‌ల్లో చెప్ప‌లేను. థియేట‌ర్లో న‌న్ను నేను చూసుకొన్న క్ష‌ణం ఎప్ప‌టికీ మ‌ర్చిపోను. నోట మాట రాలేదు.

* హీరోగా పాసైపోయా అనుకొన్నారా?
- ప్రేక్ష‌కుల చ‌ప్ప‌ట్లు ఆశీర్వ‌చ‌నాలుగా అనిపించాయి. పాసైపోయా, డిస్టెక్ష‌న్ వ‌చ్చింది... ఇలాంటి క‌బుర్లు చెప్ప‌ను. మా అమ్మ‌కిచ్చిన మాట నిల‌బెట్టుకొన్నా అది చాలు.

* ఇంత‌కీ అమ్మ‌కు ఇచ్చిన మాటేంటి?
- సినిమాల్లోకి వెళ్లా అన‌గానే ''మావ‌య్య పేర్లు చెడ‌గొట్ట‌కు'' అని ఓ కండీష‌న్ పెట్టింది అమ్మ‌. నేనూ మాటిచ్చేశా. ఇప్పుడు నిల‌బెట్టుకొన్నా.

* మావ‌య్య‌లు ఏమీ అన‌లేదా?
- ముందు అమ్మ‌కి నా మ‌న‌సులోని మాట చెప్పా. ఆ త‌ర‌వాత మావ‌య్య‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లా. `ఓకే.. గో హెడ్‌` అన్నారు.

* ముందు నుంచీ సినిమాల‌పైనే గురా?
- అదేం లేదండీ. డాక్ట‌ర్ని, లాయ‌ర్ని, ఇంజ‌నీర్ని, క్రికెట‌ర్ని ఇలా ఎన్నో అవుదామ‌నుకొన్నా. చివ‌రికి శాస్త్ర‌వేత్త‌ని కావాల‌నుకొన్నా. కానీ నో.. నావ‌ల్ల కాదు అనిపించింది. తొమ్మిదింటికి ఆఫీసుకి వెళ్లి, ఆరింటి వ‌ర‌కూ బుద్దిగా కూర్చోవ‌డం నావ‌ల్ల కాద‌ని ముందే ఫిక్స‌య్యా. ఇక సినిమాలు త‌ప్ప మ‌రో దారి క‌నిపించ‌లేదు.

* అప్ప‌ట్లో బాగా లావుగా ఉండేవార‌ట‌..
- అవునండీ. చెబితే న‌మ్మ‌రు.. 130 కిలోలు. ముద్ద‌పప్పు, ఆవ‌కాయ‌, నెయ్యి రోజూ ఇవే వేసుకొని తింటే ఏమ‌వుతుంది?  పైగా ఇంట్లోవాళ్లంద‌రికీ స్వీట్స్ అంటే పిచ్చి. తెగ తినేవాడ్ని.

* మ‌రి ఎలా త‌గ్గారు?
- నాలుగైదేళ్లు కేవ‌లం త‌గ్గ‌డ‌మే ప‌నిగా పెట్టుకొన్నా దాదాపు 50 కిలోలు త‌గ్గ‌డం అంటే మాట‌లు కాదు. ఇక నా వల్ల కాదు బాబోయ్ అంటే.. మా ట్రైన‌ర్ విన‌లేదు. ఒళ్లంతా హూనం చేశాడు.

* కృత్రిమ ప‌ద్ధ‌తులున్నాయి క‌దా..?
- ఉన్నాయి. అంద‌రూ ఇదే స‌ల‌హా ఇచ్చారు. కానీ ఇప్పుడు క‌ష్ట‌ప‌డ‌క‌పోతే ఎలా..?? అన్నింటికీ అడ్డ‌దార్లు ఉండ‌వు క‌దా..?

* తొలి సినిమా విడుద‌ల కాకుండానే బాగానే అవ‌కాశాలు ద‌క్కించుకొన్నారు. ర‌హ‌స్యం ఏమిటి?
- నాపై వాళ్ల‌కున్న న‌మ్మ‌కం.

* మీ కెరీర్ ప్లానింగ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నార‌ని చెప్తుంటారు..
- అదేం లేదు. చిరు మావ‌య్య‌, నాగ‌బాబు మావ‌య్య‌, క‌ల్యాణ్ మావ‌య్య ఆశీస్సులున్నాయి. క‌ల్యాణ్ మావ‌య్య డ‌బ్బులు పెట్టార‌న్న వార్త‌ల్లొనూ నిజం లేదు.

* క‌నీసం క‌థ‌ల ఎంపిక‌లోనూ జోక్యం చేసుకోలేదా?
- లేదండీ. నేనూ.. నా ద‌ర్శ‌కులు అనుకొన్న క‌థ‌లే. మావ‌య్య‌ల‌కు ఎలాంటి సంబంధం లేదు.

* డాన్స్ నేర్చుకొన్నారా?
- అమ్మ క్లాసిక‌ల్ డాన్స‌ర్‌. మావ‌య్య‌లు డాన్స్‌లో మాస్ట‌ర్స్‌. మావ‌య్య పాట‌ల‌కు చిన్న‌ప్పుడు డాన్సులు చేసేవాడ్ని. నా శిక్ష‌ణ అంత వ‌ర‌కే.

* పిల్లా నువ్వు లేని జీవితంలో రొమాన్స్ త‌గ్గింది అంటున్నారు..
- క‌థ‌లో దానికి అంత స్కోప్ లేదు.

* రొమాన్స్ అంటే మొహ‌మాట‌మా?
- ఏవండీ.. చుట్టూ రెండు కెమెరాలు పెట్టి, వంద‌మంది సిబ్బంది ఉండి.... రొమాన్స్ చేయ‌మంటే అప్పుడు తెలుస్తుంది.. (న‌వ్వుతూ)

* జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి.. ఇలా సీరియ‌ర్ల‌తో న‌టించారు. ఎలా ఉంది అనుభ‌వం?
- సూప‌రండీ. రేయ్‌లో సీనియ‌ర్ల‌తో న‌టించే అవ‌కాశం రాలేదు. రెండో సినిమాకి ప్ర‌కాష్‌రాజ్‌, జ‌గ‌ప‌తిబాబుల‌తో న‌టించ‌డం... గొప్ప అనుభూతి. చాలా నేర్చుకోగ‌లిగా. శ్రీ‌హ‌రిగార్ని మిస్ అయిపోయాం. ఆయ‌న న‌న్ను సొంత బిడ్డ‌లా చూసుకొన్నారు. జ‌గ‌ప‌తిబాబుగారైతే సెట్లో జోకులే.. జోకులు. ప్ర‌కాష్ రాజ్ ఓ ఎన్‌సైక్లోపిడియా.

* రేయ్ ఎప్పుడు?
- ఏమో. నాకు తెలీదు. కానీ ఒక్క‌టి మాత్రం చెబుతా. ఆ సినిమా ఎప్పుడొచ్చినా త‌ప్ప‌కుండా హిట్ట‌వుతుంది.

* సుబ్ర‌హ్మ‌ణ్యం ప‌రిస్థితేంటి?
- ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా అది. అలాంటి క‌థ నా ద‌గ్గ‌ర‌కు రావ‌డం నా అదృష్టం.

* ఓకే.. ఆల్ ది బెస్ట్ ..
- థ్యాంక్యూ వెరీమ‌చ్‌....
 
- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka