Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

మొద‌టి కాంప్లిమెంట్ ఇచ్చింది చిరంజీవి గారే.. - ఆది

first compliment from chiru sir-adi

కుర్రాడు చూడ్డానికి బాగుంటాడు. మంచి క‌ల‌ర్‌. డాన్సులు ఇర‌గ‌దీస్తాడు. ఫైట్లు చెప్ప‌క్క‌ర్లెద్దు. పైగా వాయిస్ సూప‌ర్‌. సాయికుమార్ త‌న‌యుడు క‌దా.. ఆ మాత్రం లేక‌పోతే ఎలా...???  ఇన్ని ల‌క్ష‌ణాలుంటే హీరోగా ఎందుకు అవ‌కాశాల్రావు..?  ప్రేమ కావాలి, ల‌వ్‌లీల‌తో దూసుకుపోయాడు. సుకుమారుడు ఫ్లాప్ అయినా, గాలిప‌టం మ‌ళ్లీ హోప్ ఇచ్చింది. ఇంత‌కాలం ల‌వ‌ర్‌బోయ్‌గా క‌నిపించిన ఆది ఇప్పుడు మాస్ అవ‌తారం ఎత్తాడు. యాక్ష‌న్ హీరోగా ఓ అడుగు వేస్తున్నాడు.. ర‌ఫ్‌తో. ఈ శుక్ర‌వారం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్న ఆదితో గో తెలుగు డాట్‌కామ్ ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. ఆ క‌బుర్లు ఇవీ..

* ర‌ఫ్.... పేరే మాంఛి ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంది.
- సినిమా కూడా అలానే ఉంటుందండీ. గ్యారెంటీ నాది.

* మ‌క్కా మాస్ మ‌సాలా సినిమా క‌దా..
- అవునండీ. ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా ఉండే ఓ అబ్బాయి త‌న ప్రేమని గెలిపించుకోవ‌డానికి  ప‌డే తాప‌త్ర‌యం ఈ సినిమా. అందుకే.. ఈ పేరు పెట్టాం.

* పక్కా మాస్ అంటే.. క్లాస్ ఆడియ‌న్స్ దూర‌మ‌వుతారేమో..?
- ఆ భ‌యం లేదండీ. ఎందుకంటే ఈ సినిమా ఎంత మాస్ మ‌సాలా అయినా.. ఓ క్లాస్ ట‌చ్ ఉంటుంది. యాక్ష‌న్ సీన్స్‌ని స్టైలీష్‌గా తీర్చిదిద్దారు. దాంతో పాటు మంచి ల‌వ్ స్టోరీ ఉంది. త‌ప్ప‌కుండా మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్‌ని కూడా కూర్చోబెడ‌తాం.

* ఈ వ‌య‌సులో ఆయుధం లేకుండా చంపేస్తా.. అంటూ భారీ డైలాగులు చెప్తున్నారు..
- త‌ప్ప‌దు క‌దండీ. సినిమాలో అంత ఎమోష‌న్ ఉంది. యాక్ష‌న్ సీన్‌కి ముందు ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు చెబితే... ఆ యాక్ష‌న్ మ‌రింత పండుతుంద‌ని ఓ న‌మ్మ‌కం.

* ఈ వ‌య‌సులో ల‌వ్ స్టోరీలు చేయ‌కుండా ఈ యాక్ష‌న్ గోలేంటి?
- ల‌వ్‌లీ, ప్రేమ‌కావాలి, సుకుమారుడు.. ఇవ‌న్నీ ల‌వ్‌స్టోరీలే క‌దా. ఇలాంటి క‌థ‌లు చేస్తే స్పాన్ పెరుగుతుంది. నా సినిమాలు చూసి `మీరు ల‌వ్ స్టోరీలే చేయాలి. కాక‌పోతే అందులోనూ యాక్ష‌న్ ఉండేలా జాగ్ర‌త్త తీసుకోండి` అనే చాలామంది చెప్పారు. సో... ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నం చేశా.

* సిక్స్  ప్యాక్ వెనుక ఉన్న క‌థేంటి?
- ఈ సినిమా ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌లో ఓ భారీ ఫైట్ ఉంది. అది చాలా బాగా వ‌చ్చింది. పెద్ద ఎత్తున ఖ‌ర్చు పెట్టాం. ఆ సీన్ చూశాక‌... క్లైమాక్స్‌లో ఇందుకు ప‌దింత‌లు ఓల్టేజ్ ఉన్న ఫైట్ చేయాలి. లేదంటే మాస్ నిరుత్సాహ‌ప‌డ‌తారు అనిపించింది. అలా చేయాలంటే సిక్స్ ప్యాక్ చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌నిపించింది. ఎందుకంటే ఒక్క‌డే ప‌దిమందిని కొట్టాడంటే జ‌నం న‌మ్మాలి. సిక్స్ ప్యాక్‌తో జ‌నాన్ని ఈజీగా న‌మ్మించ‌గ‌లం.

* మీ బ‌లం డాన్స్. ఆ విష‌యంలో  కొత్త ప్ర‌య‌త్నాలేమైనా చేశారా?
- ఆది డాన్సులు బాగా చేశాడు అనే న‌మ్మ‌కం జ‌నాల‌కు వ‌చ్చింది. దాన్ని కాపాడుకోవ‌డానికి ఎంత క‌ష్ట‌మైనా ప‌డ‌తా. ఈ సినిమాలోనూ కొత్త స్టెప్పులు వేశా. అంద‌రికీ న‌చ్చుతాయ‌న్న న‌మ్మ‌కం ఉంది.

* డాన్సుల‌పై మోజు ఎప్ప‌టి నుంచీ..?
- చిన్న‌ప్ప‌టి నుంచీ ఉంది. నాకు చిరంజీవిగారంటే చాలా ఇష్టం. ఆయ‌న డాన్స్‌లో గ్రేస్ మ‌రెవ్వ‌రికీ రాదు. ఇప్ప‌టికీ డాన్సుల విష‌యంలో నా ఫేవ‌రెట్ ఆయ‌నే. గ్యాంగ్‌లీడ‌ర్‌లో పాట‌ల‌కు స్టెప్పులు వేసేవాడ్ని. నా ఆస‌క్తి గ‌మ‌నించి నాన్న‌గారు లారెన్స్ మాస్టారు ద‌గ్గ‌రకు పంపారు. ఆయ‌న ద‌గ్గ‌ర రెండేళ్లు డాన్స్ నేర్చుకొన్నా. ఓసారి చెన్నైలో ఓ డాన్స్ పోగ్రాం ఏర్పాటు చేశారు. అక్క‌డ చిరంజీవిగారు ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఆయ‌న ముందు ఠాగూర్ సినిమాలోని కొడితే కొట్టాలిరా పాట‌కు డాన్స్ చేశా. అది చూసి చిరు అంకుల్ న‌న్ను హ‌గ్ చేసుకొన్నారు. చాలా బాగుంది కిప్ ఇట్ అప్‌.. అన్నారు. అలా నాకు డాన్స్ విష‌యంలో మొద‌టి కాంప్లిమెంట్ ఇచ్చింది చిరు అంకులే.

* సుకుమారుడు - ర‌ఫ్.. మ‌ధ్య‌లో చాలా గ్యాప్ వ‌చ్చేసిందేంటి?
-  మ‌ధ్య‌లో గాలిప‌టం చేశా క‌దా.. కాక‌పోతే మ‌రిం స్పీడుగా సినిమాలు చేయాల్సింది..సుకుమారుడు సినిమా ఫ‌లితం న‌న్ను నిరాశ ప‌రిచింది. ఆ సినిమాతో జాగ్ర‌త్త వ‌చ్చింది. సిక్స్ ప్యాక్ చేయ‌డం కోసం ర‌ఫ్ సినిమాని కొన్నాళ్లు ఆపాం. అందుకే.. ఆల‌స్యంగా వ‌స్తున్నా.

* ఈ సినిమాలో శ్రీ‌హ‌రి న‌టించారు. అయినా ఆయ‌న్ని ప్ర‌చార చిత్రాల్లో చూపించ‌డం లేదు.. ఆ పేరు బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదు. కార‌ణం ఏంటి?
- శ్రీ‌హ‌రి గారు.. గొప్ప న‌టుడు. ఆయ‌న మా సినిమాలో న‌టించార‌ని గ‌ర్వంగా చెప్పుకొంటాం. అయితే ఇదే ఆయ‌న చివ‌రి సినిమా అంటూ చెప్ప‌డం మాకు ఇష్టం లేదు. దానికి తోడు ఆయ‌న‌ది ఈ సినిమాలో ఓ ప్ర‌త్యేక‌మైన పాత్ర‌. అది తెర‌పై చూస్తేనే థ్రిల్. అందుకే ఆయ‌న్ని దాచేశాం.

* ర‌కుల్ ప్రీత్ సింగ్ మాటేంటి?
- త‌ను చాలా ప్రొఫెష‌న‌ల్‌. నాకంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతుంది. ఎప్పుడూ న‌ట‌న‌పైనే దృష్టి. త‌ను ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది.

* ఓ లిప్ లాక్ కూడా ఉన్న‌ట్టుంది..
- అవునండీ.. అది క‌థ‌కు అవ‌స‌రం. అందుకే పెట్టుకోవాల్సివ‌చ్చింది.

* మీ కాబోయే శ్రీ‌మ‌తి ఇబ్బంది ప‌డుతుందేమో..?
- (న‌వ్వుతూ) త‌న‌కు సినిమాల గురించి బాగా తెలుసు. ఇక్క‌డి వాతావ‌ర‌ణం గురించి అవ‌గాహ‌న ఉంది. ఈ సినిమా క‌థంతా ఆమెకు ఫోన్‌లోనే చెప్పా. త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది అని విష్ చేసింది.

* మీది ప్రేమ వివాహ‌మా?
- అదేం లేదు. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లే.  మా ఇంట్లో ఎప్ప‌టి నుంచో సంబంధాలు చూస్తున్నారు. `అప్పుడే పెళ్లేంటి నాన్నా..` అని చాలాసార్లు చెప్పా. కానీ చిత్ర‌సీమ‌లో సెటిల్ అవ్వ‌డం అంటూ వేరేగా ఉండ‌దు. దేని దాని దానిదే... అని చెప్పారు. అందుకే ఈ పెళ్లి ఒప్పుకొన్నా.

* రాబోయే సినిమా ఏంటి?
- గ‌ర‌మ్ అనే సినిమాలో న‌టిస్తున్నా. దాదాపుగా పూర్త‌య్యింది. ర‌ఫ్ బ‌య‌ట‌కు వ‌చ్చాకే... మిగిలిన సినిమాల గురించి ఆలోచిస్తా.

* ప్ర‌స్తుతానికి మీ ర‌ఫ్‌.. బాగా ఆడాల‌ని కోరుకొంటున్నాం..

- థ్యాంక్యూ....

-కాత్యాయిని


 

మరిన్ని సినిమా కబుర్లు
movie review - Yamaleela2