Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ: ఎమ్మెల్యే ఇంటి నుండి వస్తున్న ఏకాంబరానికి ఎదురుగా లారీ రావడంతో అదుపుతప్పి యాక్సిడెంట్ అవుతుంది.

ఆ తరువాత.......................................

 

గాబరాగా ఏకాంబర్ దగ్గరకు వెళ్ళింది. ప్రక్కనే కూర్చుని ఆందోళనగా చూసింది. అప్పటికే  కళ్ళల్లో కన్నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.

" ఏమైంది అంబర్?" అంటూ రెండు చేతుల్తో ఒళ్ళంతా తడిమింది.

" చిన్న యాక్సిడెంట్. ఎమ్మెల్యేగారింటినుంచి వస్తూంటే లారీ ఎదురొచ్చింది. తప్పించబోయి డివైడర్ ని గుద్దేసాను. అదృష్టం కొద్దీ పెద్దగా గాయాలేమీ కాలేదు. ఇదుగో, హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం తప్పింది. కాలికి, చేతులకు చిన్నచిన్న గాయాలయ్యాయి." అంటూ చేతి ముడుకులకు, కాళ్ళకు తగిలిన రక్కులు చూపించాడు ఏకాంబర్.

"ఎక్కడ జరిగింది? ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు? " దు:ఖాన్ని   దిగమ్రింగుకుంటూ అంది రత్నం.

" బీచ్ రోడ్ లోనే ఏదో ఆలోచిస్తూ బైక్ డ్రైవ్ చేస్తున్నాను. నెమ్మదిగా  నడపడం వలన సేవ్ అయ్యాను . ఎవరో ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు వచ్చి హెల్ప్ చేసారు. బైక్ ఏం పాడవలేదు. నేనే అక్కడనుండి నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను." చెప్పాడు ఏకాంబర్.

" నువ్వలా ఫోన్ లో నీరసంగా మాట్లాడి యాక్సిడెంట్ అని చెప్పేసరికి నా గుండె జారిపోయింది. " దాదాపు ఏడుస్తున్నట్టే అంది రత్నం." చ..చ...నీకు చెప్పేవాడినే కాదు. ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని ఇంటికెళ్ళిపోదామని అనుకున్నాను. ఈ దెబ్బలు రేపటికి ముదిరి లేవలేనేమోననుకున్నాను. అందుకే నిన్ను పిలిచాను. ఈ బ్యాగ్ లో ఎమ్మెల్ల్యే అనుచరుడి క్లెయిం ఫారాలు ఉన్నాయి. రేపు ఉదయం ఎలాగైనా మా ఆఫీసుకు పంపించెయ్యాలి నీకు తెలిసిందంతా నింపెయ్యి. తెలియనిది ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చెయ్యి." చెప్పాడు ఏకాంబర్." అలాగే" అంటూ ఏకాంబర్ దగ్గరున్న బ్యాగ్ లోనుండి క్లైం ఫారాలు తీసింది. అన్నీ సరి చూసుకుని తన బ్యాగ్ లో పెట్టుకుంది.

ఇంతలో ఫ్రాంచైజీ కలక్షన్ బోయ్ లు వచ్చారు. అందరూ శర్మ హాస్పిటల్ లోపలకు వచ్చి రిసెప్త్షన్ కౌంటర్ ప్రక్కనే కూర్చున్న ఏకాంబర్, నూకరత్నం లను చూసి వారి దగ్గరకు వచ్చారు.

" ఏమైంది మేడం? అంత ఆతృతగా రమ్మని చెప్పారు? సార్ కి ఏమైంది? " ఆతృతగా అడిగారందరూ.

" మీ మేడం మీ అందర్నీ కంగారెత్తించారా? ఏం కాలేదు. చిన్నచిన్న గాయాలు. అంతే. " నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

" అదేంటి సార్? కాళ్ళు. చేతులకి దెబ్బలు బాగా తగిలినట్టున్నాయే?" ఒక అబ్బాయి అన్నాడు.

ఇంతలో కాంపౌండర్ వచ్చి డాక్టర్ గారు రమ్మన్నారనేసరికి ఏకాంబర్ నెమ్మదిగా లేవబోయాడు. గబాలున చెయ్యి పట్టుకుని నూకరత్నమే దగ్గరుండి డాక్టర్ గదిలోకి తీసుకెళ్ళింది.

ఏకాంబర్ ని పరీక్షించిన డాక్టర్ తేలికగా నూకరత్నంతో అన్నాడు.

" మీరంతా కంగారు పడాల్సినంత గాయాలు కావు మేడం ఇవి. చిన్నచిన్న గాయాలు. రెండురోజులు రెస్ట్ తీసుకుంటే మానిపోతాయి. మీరు పరధ్యాన్నంగా బైక్ డ్రైవ్ చెయ్యకండి సార్. మీ ప్రాణం మీ చేతుల్లోనే ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనకే ప్రమాదం." అంటూ నవ్వి ఇంజెక్షన్ చేసారు.

" థాంక్యూ డాక్టర్..వస్తాం." అంటూ తన బ్యాగ్ లో అయిదొందల నోటు తీసి డాక్టర్ చేతికి ఇచ్చింది నూకరత్నం.

****************                 ******************             **********

ప్రాంచైజీ కుర్రాడు బైక్ నడుపుతూంటే వెనక కూర్చుని వస్తున్న ఏకాంబరాన్ని చూస్తూనే ఉలిక్కిపడ్డారు ఏకాంబరం తల్లిదండ్రులు. జరిగిన
విషయం ఫ్రాంచైజీ కుర్రాడి ద్వారా, ఏకాంబరం ద్వారా విని, ఇంకా పెద్ద ప్రమాదమేం జరక్కుండా తప్పిపోయినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

********* ********* ***********

ఆ మర్నాడు.

ఉదయం పదవుతుండగా మెల్లిగా లేచి బుజానికి బ్యాగ్ తగిలించుకుని బయల్దేరబోతున్న ఏకాంబరాన్ని వారించి, ఈరోజు రెస్ట్ తీసుకోమన్నాడు తండ్రి పీతాంబరం.నువ్వొక్కడివే ఉన్నావా ఇంట్లో? మీ నాన్న, అన్న లేరా? వాళ్ళు చేస్తారు... నువ్వీరోజు బయటకెళ్ళడానికి వీల్లేదు" అంటూ వారించింది తల్లి పర్వతాలు.

మీ అమ్మ చెప్పింది తలకెక్కిందా? ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో" అంటూ ఏకాంబర్ దగ్గనుంచి బ్యాగ్ తీసుకున్నాడు తండ్రి పీతాంబరం.


వచ్చేవారం..............

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana