Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekambar

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ :  తల్లి దగ్గరికి వెళ్ళిన హరి అక్కణ్ణుంచి బయల్దేరి తన ఫ్లాట్ కి చేరుకుంటాడు. అతడి మనసంతా ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టనిపిస్తుంది. సూపర్ మార్కెట్ కి వెళ్ళిన అతడికి మేఘన కనిపించి పలకరిస్తుంది. ఆమెను బస్సెక్కించడానికి వెళ్ళేసరికి బస్సు క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది...

ఆ తర్వాత......

కోపం రావాల్సింది పోయి నవ్వు మొలిచింది హరి మోముపైన... ఏం మాట్లాడకుండా, మేఘన దగ్గరకు వచ్చి అదే చిరునవ్వుతో ఆ కొక్కిరాయి గాడు చెప్పింది చెప్పి, టికెట్టు ఆమె చేతిలో పెట్టాడు.

‘‘అదేంటండీ... మీకు కోపం రావడం లేదా?’’ అందామె.

‘‘కోప్పడే స్టేజ్‌దాటిపోయిన తర్వాత వచ్చేది నవ్వే’’ అన్నాడు హరి.

‘‘ఎలా?’’

‘‘ఈ మధ్యన లోకాస్ట్‌ఎయిర్‌లైన్స్‌రూపాయికే విమాన ప్రయాణం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం విమాన ప్రయాణం ఇలాంటి పథకాలతో అడ్వర్‌టైజ్‌మెంట్లతో ప్రజలను ఆకర్షించి, టికెట్లు అమ్మేసారు. అలాగే నాకు కూడా రెండుమూడు సార్లు హాస్పిటల్ వాళ్లు ఢిల్లీ  లో కాన్ఫరెన్స్‌కు, బెంగళూరులో కాన్ఫరెన్స్‌కూ టికెట్లు బుక్‌చేసారు. ఎయిర్‌పోర్టుకెళ్లి 7 గంటల సాయంత్రం ఫ్లయిట్‌ ఏదని అడిగితే గంటలేటన్నారు... అది నెమ్మదిగా తొమ్మిదిన్నర అయింది... సరే తొమ్మిదిన్నరకి బూత్‌దగ్గరకు వెళితే అక్కడ మనిషే లేడు. మాయం.... చేపల మార్కెటల్‌లో గొడవ చేసినట్లుగా ప్రయాణీకులందరూ గొడవ చేయగా చేయగా... ఆఖరికి ఎవడో ఒకడొచ్చి అనివార్య కారణాల వలన రాత్రి పన్నెండున్నర గంటలకు ఫ్లయిట్‌ వస్తుందని చెప్పాడు. ఆఖరుకు ఎప్పటికో ఫ్లయిట్‌ రావడం, వెళ్లడం జరిగింది. అలాగే ప్రైవేట్ బస్సులు కూడా... సిటీలో దిగాల్సిన చోట కాకుండా వాడిష్టం వచ్చిన చోట దించేసి పొమ్మంటాడు...

ఈ లోకాస్టు విమాన ప్రయాణాలకీ, ప్రైవేటు బస్సు ప్రయాణాలకీ పెద్దగా తేడా లేదు... దొందూ దొందే... అందుకనే నాకు వినోదంగానే ఉంది తప్ప, వింతగా లేదు.’’ అంటూ వివరించాడు హరి.

మేఘన టెన్షన్‌నుంచి తేరుకుని చిరునవ్వు నవ్వింది. ‘‘మీరు వివరించే విధానం బాగుంటుంది డాక్టర్‌గారూ...’’ అంది.

‘‘మరిప్పుడెలా?’’

‘‘మా ఇల్లు ఇక్కడే... ఒక కప్పు కాఫీ తాగి, ఆ తర్వాత ఎటు వెళ్లాలో ఆలోచిద్దురు గాని, మీకున్న బాధ్యతలు నాకు తెలుసుకదా.’’ అన్నాడు హరి.

ఇద్దరూ కలిసి అపార్ట్‌మెంట్‌ దగ్గరకు వచ్చారు..

ఇదెప్పుడో చూసినట్లుంది అంది మేఘన.

నవ్వుతూ అన్నాడు హరి. ‘‘అన్ని అపార్ట్‌మెంట్లూ దరిదాపు ఇలాగే ఉంటాయి. కొద్దిపాటి మార్పు చేర్పులు తప్ప.’’

హాల్లో మేఘనని కూర్చోబెట్టి కాఫీ కలిపి తెచ్చాడు హరి. హాల్లో గోడల మీద ఉన్న ఫోటోలను చూస్తున్నదామె...

కాఫీ సిప్‌ చేస్తూ పొడిగా అంది మేఘన... ‘‘ఆ ఫోటోల్లో మీతో పాటు....’’

‘‘సౌమ్య... సౌమ్య నా భార్య...’’

‘‘మరి...’’

‘‘ప్రస్తుతం ఇంట్లో లేదు...’’

‘‘మార్కెట్‌కెళ్లిందా..? లేదా వేరే ఊరు వెళ్లిందా..?

‘‘ప్రస్తుతం వేరే ఉర్లో ఉంది...’’

‘‘బహుశా...  డెలివరీ...?’’

‘‘డెలివరీ కాదులెండి... ఇతర కారణాలు...’’

‘‘అంటే గొడవలు... విడిపోవడం...’’

‘‘మా ఇద్దరి మధ్య ఉన్న అంగీకారం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, పరస్పర ప్రేమాభిమానాలు చాలా గొప్పవి... నన్ను విడిచి తను క్షణం కూడా ఉండలేదు.’’

‘‘మరి... మరి... అందం, ప్రేమ, అభిమానం, అనురాగం, ఆలనా, పాలనా, ముద్దు, మురిపెం... అన్నీ ఉన్న సౌమ్యని మరిచిపోయి నన్ను ఎలా దగ్గరకు తీసుకోగలిగారు...?’’

..................... .....................

‘‘క్షమించండి... బాధపెట్టానా..?’’

‘‘నా మీద జాలితోనా..? దయతోనా..? నా కష్టాలకు కరిగిపోయా...? నన్నెందుకు దగ్గరకు తీసుకున్నారో చెప్పండి...?’’ నెమ్మదిగా నిశ్శబ్దం లోంచి బయటపడ్డాడు హరి.

‘‘జాలి, దయలతో ఒక మగవాడు ఒక స్త్రీని దగ్గరకు తీసుకుంటాడనే దానిపై నాకు నమ్మకం లేదు. సహజ సిద్దంగా స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ వాళ్లని దగ్గరకు చేరుస్తుంది. అయితే సమాజం ఈ ఆకర్షణను కట్టుబాట్ల రూపంలో చాలా వరకు తగ్గించి, వివాహ పద్ధతి ద్వారా, లేదా చదువనీ, సాధించాల్సింది ఎంతో ఉందనీ నూరిపోసి ఒక సరియైన బాటలో స్త్రీ పురుషులను ప్రయాణించేలా చేస్తుంది. సమాజం అన్ని కట్టుబాట్లు, రూల్స్‌ పెట్టినా గానీ కొన్ని సమాజపరిధి దాటి జరిగేవి జరుగుతూనే ఉంటాయి.

మన విషయంలో జరిగింది ఇదమిద్ధంగా, ఇదీ అని తేల్చి చెప్పలేను కానీ మన సాంగత్యం వలన సౌమ్య మీద నా మమకారం, అభిమానం, గౌరవం, ప్రేమల్లో ఒక డిగ్రీ కూడా తక్కువ కాలేదు, కాబోదు కూడా.’’

‘‘మరి, నా మీద...’’

‘‘హ...హ్హ... తెలుగు సినిమాలు బాగానే చూస్తారనుకుంటా మీరు. తెలుగు సినిమాల్లో చూపించేటట్లుగా ప్రతీ మగవాడు ప్రతీ పరాయి ఆడదాన్ని నీచ దృష్టితో చూస్తాడు అనుకోవడం ఎంతో పొరపాటు...

ఆడ, మగ, స్త్రీ, పురుష అనేవి కేవలం పైకి కనబడే లక్షణాలు...

అంతర్గతంగా... నిద్ర, ఆకలి, నొప్పి, ఆనందం, బాధ ఇవన్నీ మనుషుల లక్షణాలు.. ఇది ఆడవారికైనా ఒకటే మగవారికైనా ఒకటే... మనిషిని మనిషిగా చూడలేనివాడు పశువుతో సమానం ... భార్యని గౌరవించలేని వాడు తనని తాను గౌరవించుకోలేడు. అలాగే భర్తని గౌరవించలేని ఆడది తనను తాను గౌరవించుకోలేదు. ఎవరైనా కావచ్చు... ప్రతి మనిషికీ ... చివరకు చిన్న పిల్లలకి కూడా ఎవరైనా ప్రేమగా, గౌరవంగా పలకరిస్తే, ఆదరిస్తే ఎంతో సంతోషపడతారు...

ఇవన్నీ కనీస మానవతా విలువలు...

ఇవి లేని వారి గురించి మాట్లాడుకోవడం అనవసరం... ఈ విలువలు లేనంత నీచుణ్ణీ, నికృష్టుణ్ణీ కాదు నేను.’’ ముగించాడు హరి.‘‘హ్హ... మరి ఇంతకాలం ఈ విలువలు లేని మనిషితోనే జీవించాను నేను...’’

‘‘క్షమించాలి... వినయ్‌ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో నేనీ మాటలు చెప్పలేదు... మీరడిగిన ప్రశ్నకి నాకు తోచిన సమాధానం చెప్పానంతే.’’ అంటూ పెద్దగా నిట్టూర్చింది మేఘన...

‘‘ఇన్ని విషయాలున్నాయని నాకు తెలియదు ... ఎప్పుడూ ...  ఛీతార్కాలూ చిన్నబుచ్చే మాటలు ... డబ్బు ... కష్టాలు...’’

‘‘ఆగండాగండి... మళ్లీ మీ పూర్వకాలంలోకి వెళ్లవద్దు. బలవంతపు బ్రహ్మచారి వంట తిని వెళ్దురు గాని.’’ అన్నాడు హరి.

‘‘పూర్వకాలంలోనికి కాదు గానీ, నేను ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఇక బయల్దేరతాను... పిన్ని వాళ్ల ఇంటికని బయల్దేరాను... బస్సు దొరక్కపోతే ఇంటికి తిరిగి వెళ్లక తప్పదు కదా.’’ అంది మేఘన.

‘‘బస్సు దొరికిందే అనుకోండి ... ఇప్పుడు మీరు మీ పిన్ని గారింట్లోనే ఉన్నారనుకోండి... తిరిగి రావడం ఒక రోజు ఆలస్యం కావచ్చు... మీ పిన్ని గారికి ఆరోగ్యం బాగుండి ఉండకపోవచ్చు.’’ గబగబా పాఠం అప్పజెప్పినట్లుగా అన్నాడు హరి.

ఫక్కున నవ్వింది మేఘన.... ముత్యాలు రాలినట్లున్నాయి అంటే ఇదేనేమో అనుకున్నాడు హరి.

‘‘డాక్టరు గారు ‘భావ కవి’ కూడానూ...’’ అందామె.

‘‘భావ కవి’’ అంటే...?

‘‘ఏమో... నాకూ తెలియదు. నోటికొచ్చింది అనేసాను..’’

---------------                ---------------                ---------------

హరి-మేఘనల మధ్య అంతకంతకూ పెరుగుతోన్న సాన్నిహిత్యం ఎలాంటి పరిణామాలకు దారితీయబోతోంది...? అసలెందుకామె హరికి తారసపడుతోంది..? కావాలనా, యాదృచ్చికమా..???
వచ్చేవారం దాకా ఆగాల్సిందే.........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti