Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ: చందూకి చక్కటి ఆతిధ్యం ఇచ్చి పంపుతుంది దీక్ష.  సహస్ర కనిపించక ఆమె జాడ తెలియక విరాట్ బాధపడిపోతుంటాడు. ఆఫీసునుండి  ఆఫ్ డే పర్మీషన్ తీసుకుని బయలుదేరిన చందూ అనుకున్న ప్రకారం ఒక చోట దీక్షని కలుసుకుంటాడు. ఇద్దరు కలిసి అదే ఆటో లో వెళ్తుంటారు. 

ఆ తరువాత......................................  

‘అక్కర్లేదు.  నువ్వు కొనిస్తావ్  సహస్రతో ఏం చెప్పాలి?  ఏం కొన్నా ఇద్దరం కలిసి తీసుకోవటం అలవాటు, ఒకటికి పది అబద్ధాలాడటం కన్నా అసలు సమస్యే రాకుండా జాగ్రత్త పడటం మంచిది కదా.  నేరుగా దేవి థియేటర్ కి పో’’  అంది ఆటోవాలాతో .ఆటో కదిలింది. ఇక ఆమెతో వాదించ లేదు చందూ.

‘జాస్మిన్  సెంటు నీకంత ఇష్టమా?  మీరు మా ఇంటి కొచ్చిన వెళ్ళిన రోజు కూడా మా గదుల్లో ఇదే సువాసన’’  అడిగాడు దారిలో.

‘‘ఇది నా ఇష్టం కాదు.  సహస్ర రాక ముందు అస్సలు సెంటు వాడే దాన్ని కాను.  సహస్రకు జాస్మిన్  అంటే ఇష్టం.  దాన్నుంచి నాకూ అలవాటైపోయింది.’’ అంటూ అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంది. చేయి వెనక్కి తీసుకోబోయాడు. వదల్లేదు.

‘‘ఇవాళ నీతో లంచ్  చేసి సినిమా చూడాలను కున్నాను. దేవి కాంప్లెక్స్ లో రజనీకాంత్  సినిమా వుంది.’’ అంది దీక్ష. థియేటర్ సమీపంలోని రెస్టారెంట్ లో లంచ్ చేసి దేవిలో రజనీకాంత్  సినిమా చూసారు. అయిదున్నర కి సినిమా వదలగానే తిరిగి ఆటో ఎక్కి మెరీనా బీచ్ కి చేరుకున్నారు దీక్ష చందూలు. ఆమెతో ఇలా తిరగటం చందూకి ఎంతో సంతోషంగాను పరవశంగానూ వుంది.

సాయంకాల సమయం.

మెరీనా బీచ్  సందడిగా ఉంది.

కెరటాల వెలుతురుతో బాటు సముద్రం మీదుగా వస్తున్న గాలి ఆహ్లదపరుస్తున్నాయి.  దూరంగా నడి సముద్రాన లంగరు వేసిన నాలుగు ఓడలు, చీకటి పడకముందే తీరానికి వచ్చేస్తున్న చేపల బోట్లు కనువిందు చేస్తున్నాయి.

కాస్త ముందుకెళ్ళి అంతగా జనం లేని చోట కెరటాలకు సమీపంలో పక్క పక్కన కూచున్నారిద్దరూ.  మిగిలిన రోజుల కన్నా ఆదివారం మరీ జన సందోహంగా ఉంటుందిక్కడ.  బీచ్ లోంచి చూస్తుంటే బీచ్ రోడ్ తో బాటు అవతల ఎత్తైన భవనాలు,  హైకోర్టు,  రోడ్ ఎగువున వంకీల వంతెన చూడ్డానికి చాలా బాగుంటుందా దృశ్యం.

అప్పటికే కనుచీకటి పడుతోంది.

బీచ్ లో లైట్లు వెలిగాయి.

సముద్ర గాలికి ఆమె పైట చెంగు...

గాల్లోకి ఎగురుతోంది...

‘‘దీక్షా!’’ పిలిచాడు.

‘‘వూ!’  అంటూ సడన్ గా మరింత దగ్గరగా జరిగి అతడి చేతిని వెనక నుంచి లాగి నడుం మీద వేసుకుంటూ ఛాతి మీదకు వాలిపోయింది.  ఆమె హఠాత్ పరిణామానికి ఉద్వేగపడ్డాడు.  ఆమె స్పర్శ అతడిని పులకరింపజేసింది.

‘‘కాస్సేపు నన్నిలా ఉండనీ’’  అంది దీక్ష.

‘‘నా డౌటు చెప్పు మనం ఇప్పుడు ఎవరం?  స్నేహితులమా,  ప్రేమికులమా?’’  అడిగాడు చందూ తేరుకొంటూ.‘‘రెండోది కరెక్ట్. మన స్నేహం రాత్రికి రాత్రే ప్రేమగా మారిపోయిందిగా’’ నవ్వింది.

‘‘మరి వాళ్ళిద్దరి సంగతేమిటి?  విరాట్  సహస్రలు ఒకటి గాకుండా మనమిలా దగ్గరవటం కరక్ట్ కాదనుకుంటాను. ఆ పైన నాకు కొన్ని బాధ్యతలున్నాయి అవి తీరే వరకూ పెళ్ళి వద్దనుకున్నాను...’’

ఉన్నట్టుండి లేచి సర్దుకు కూచుంది దీక్ష.

‘‘ఇపుడు నీ అభ్యంతరాలేమిటి?  అక్కడ నువ్వు ఇక్కడ నేను ఏదో విధంగా వాళ్ళ మనసు మార్చి ఒకటి చేయటం కష్టం కాదు. ఇక నీకున్న బాధ్యతలంటావా! అమ్మ నాన్న చెల్లెలు. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి.  చిన్న చెల్లెలికి మంచి సంబధం చూసి పెళ్ళి చేయాలి. ఇవేగా?’’‘‘అవుననుకో..’’

‘‘ఏంటి అవును.  వరల్డ్  బ్యాంక్ లా పక్కన నేనుంటే బాధ్యత గురించి ఇంకా భయం దేనికి?  నేన్నీదాన్నాయ్యక నీ బాధ్యతలు నావి కావా? నీకు అమ్మానాన్నయినా నాకు అత్తా మావయినా  వాళ్ళేగా..?  నేను చూసుకోనా..? నీ చదువుల కోసం అమ్మేసిన మూడెకరాల పొలంతో బాటు ఇంకో రెండెకరాలు కలిపి అయిదెకరాలు వాళ్ళకి కొనిచ్చేస్తాను.  ఓపిక ఉన్నంతవరకు వ్యవసాయం చేసుకుంటూ హేపీగా ఉంటారు.  ఓపిక తగ్గితే కౌలుకిచ్చేసి మన దగ్గర కొచ్చేస్తారు.

ఇక నీ చెల్లెలి పెళ్ళంటావా మంచి సంబంధం చూడు.  కట్నం ఎంతయినా ఫరవాలేదు.  పెళ్ళి ఖర్చులతో సహా అంతా నేనిస్తాను.  గొప్పగా పెళ్ళిచేసి పంపిద్దాం. ఇక్కడ నాకు సొంత యిల్లు ఉంది.  మనిద్దరం ఉద్యోగం చేసి సంపాదించుకునేది మనకి చాలదా?

ఇక నిన్నే ఎందుకు ఇష్టపడుతున్నానని సందేహం రావచ్చు.  మీ కుటుంబం పట్ల,  తల్లిదండ్రులు, చెల్లెలి పట్ల ఇంత బాధ్యతగా ఉన్నావంటే కట్టుకున్న భార్యను కూడా అంత బాధ్యతగానూ చూసుకుంటావనీ నా నమ్మకం.  ఆ పైన నువ్వు నీ పద్ధతులు నాకు నచ్చాయి.  ఇంకేం కావాలి?  ఐ లవ్యూ చందూ.’’ అంటూ ఒళ్ళోకి వాలిపోయింది అతడి ముఖాన్ని తన ముఖం మీదకు వంచుకుంటూ ...  ‘‘కిస్ మీ చందూ’’ అంది హస్కీ వాయిస్ తో. ఎంతలో ఎంత మార్పు...?  అనుకున్నదేమిటి...?  జరుగుతున్నదేమిటి...?  మనిషి స్క్రీన్ ప్లే కన్నా భగవంతుడి స్క్రీన్ ప్లే చాలా చాలా చాలా గొప్పది.

వాళ్ళిద్దరూ కలిస్తే బావుండని వీళ్ళిద్దరూ అనుకొంటే,  వీళ్ళిద్దరూ కలిసారు.  వాళ్లిద్దరూ ఎప్పుడు కలుస్తారో..?  ఎలా కలుస్తారో తెలీదు. వాళ్ళున్న ప్రదేశం కను చీకటిగా ఉంది.  సమీపంలో ఎవరూ లేరు. ఇక సందేహించకుండా ఆమె అధరాలు చుంబించి ముఖమంతా ముద్దులిచ్చాడు. ఎన్నో కబుర్లు ఎన్నో వూసులు టైం తెలీలేదు.

సుమారు ఏడు గంటల ప్రాంతలో ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. అది మొదలు వాళ్ళిద్దరూ తరచు ఫోన్లో మాట్లాడుకొంటూ వీలు చిక్కినప్పుడంతా సినిమాలు షికార్లతో ప్రేమపక్షుల్లా విహరించ సాగారు.  ఈ పరిస్థితుల్లో ఓ రోజు...

                    I                       I

చందూ నిద్రలేచి బయటకొచ్చేసరికే విరాట్  ఇంట్లో కన్పించలేదు.  స్నానాదికాలు ముగించుకొని అప్పటికే బైక్ మీద బయటకెళ్ళిపోయాడు.  చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళడు. ఇంత పొద్దుటే ఎక్కడికెళ్ళాడు?  పైగా సెల్  గదిలో వదిలేసి వెళ్ళాడు. అనుకుంటూనే తనూ స్నానాదికాలు ముగించుకొని రెండు స్టౌలు వెలిగించి ఒకదాని మీద టీ రెండో దాని మీద టిఫిన్ కి ఇడ్లీ ఎక్కించి హాల్లోకి వచ్చాడు.

అంతలో విరాట్ బైక్ పోర్టికోలో ఆగింది.

కొన్ని దినపత్రికల కట్టను చంకనెట్టుకొని విరాట్  లోపలకొస్తూ కన్పించాడు.

‘‘ఇంత పొద్టుటే ఎక్కడికెళ్ళావ్...?  ఆ పేపర్లేమిటి...?’’  అడిగాడు చందూ.

విరాట్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు.

‘‘చెప్తా ఇలా రా కూచో’’  అంటూ సోఫాలో కూచొని పేపర్లను టీపా మీద పడేసాడు విరాట్.

చందూ కిచెన్ లోకి వెళ్ళి టీ కప్పులతో తిరిగొచ్చాడు.  ఒకటి విరాట్ కిచ్చి తనొకటి తీసుకొని ఎదురుగా పోఫాలో కూచుంటూ...  ‘‘ఇవన్నీ ఈ రోజు పత్రికలేనా..? కొంపదీసి ఏ రైలు ఆక్సిడెంటో విమాన ప్రమాదమో జరిగిందా?  లేక రాత్రికి రాత్రి గవర్నమెంట్  కూలి పోయిందా..? ఎందుకిన్ని కొన్నావ్..?’’  టీ సిప్ చేస్తూ అడిగాడు.

‘‘అవేం కాదులే’’  అన్నాడు రిలాక్స్ గా టీ తాగుతూ విరాట్.

‘‘మరింకేమిట్రా?  భూకంపం గాని సునామీ గాని ఏర్పడి ఎక్కడన్నా దారుణంగా జననశింపు జరిగిందా?’’

‘‘అదేం కాదు.  సహస్ర కోసం నేను వేసిన ఫస్ట్ స్టెప్ ఫెయిలయింది గదా...?’’

‘‘అవును రెండో స్టెప్  ఏం చేద్దామని?’’

‘‘ఆల్ రెడీ చేసేసాను’’

‘‘చేసావా...  ఏం చేసావ్?’’  కంగారు ఆణచుకుంటూ అరిచాడు చందూ.

‘‘ప్రకటన..  అన్ని దిన పత్రికల్లోనూ ప్రకటనిచ్చాను.  ఈ దెబ్బతో స్టేట్ లో సునామి ఏర్పడి సహస్ర నా ముందుకొచ్చి పడాల్సిందే’’విరాట్  మాటలు వినగానే పొలమారి పెద్దగా దగ్గుతూ సగం తాగిన టీ కప్పును పక్కన పెట్టేసాడు చందూ.  ‘ఓర్నాయనో వీడేదో కొంప ముంచినట్టున్నాడు. సహస్రకి తెలిస్తే ఎలా స్పందిస్తుందో ఏమిటో ఖర్మ’  అనుకుంటూ ఒక దినపత్రిక అందుకుని తెరిచాడు.ఫస్ట్ పేజీ డౌన్ లో రైట్  కార్నర్ లోనే ఉందా ప్రకటన. బాక్స్ కట్టి మరీ వేసారు.  పైన సహస్ర ఫోటో అందంగా ప్రింటయింది.  దిగువన ప్రకటన ఉంది.  దాని సారాంశం...

‘‘నా ప్రియురాల్ని పట్టిస్తే కోటి రూపాయలు’’

పై ఫోటోలోని యువతి పేరు సహస్ర.  ఈమె నా ప్రియురాలు.  నా ప్రాణం అయిన సహస్ర అలిగి చెన్నైలో మిస్సయి జాడ తెలీటం లేదు. ఈమెను పట్టిచ్చిన వారికి అక్షరాల కోటి రూపాయలు బహుమతిగా యివ్వబడును.  సహస్ర జాడ తెలిసిన వారు దిగువ సెల్ నంబర్ ను కాంటాక్ట్  చేయగలరు.

ఆ విధంగా వున్న ప్రకటన దిగువన...

విరాట్ పర్సనల్ సెల్ నెంబర్ యివ్వబడింది.

ఆ ప్రకటన చూసిన మరుక్షణమే చందు గుండెల్లో రాయిపడినట్టయింది.  కనీసం తనతో మాట మాత్రమైనా చెప్పకుండా పిచ్చి పని చేసాడు. ఇప్పుడీ ప్రకటన చూస్తే సహస్ర ఏం చేస్తుందో ఏమిటో మొత్తం గందరగోళమయ్యే పరిస్థితి కన్పిస్తోంది.

కళవళపడి పోతూ గబగబా మొత్తం పత్రికలన్నీ తిరగేసాడు.  అన్నిటా అదే ప్రకటన.  తమిళం ఇంగ్లీషు పత్రికలతో బాటు తెలుగు దిన పత్రికల్లో కూడా వేయించాడు.

‘‘కొంప ముంచావ్ గదరా.  ఎందుకిలా చేసావ్?’’  అనడిగాడు చివరికి.

‘‘కొంపలేం మునగవు లేరా. అంతగా అయితే సహస్రకు నేను నచ్చజెప్పుకుంటాలే.  ఇంతకు మించి నాకు తోచలేదు.  ఇంతవరకు ఫోన్ చేయలేదు. తనెక్కడుందో ఏమిటో.. ఈ దెబ్బతో తను రాకపోయినా ఎవరో ఒకరు తీసుకొచ్చి అప్పగిస్తారు.’’  అంటుంటే చందూ పిచ్చి పట్టినట్టు చూసాడు.  ఇంకా దాచి ప్రయోజనం లేదనిపించింది. ఒకరు తీసుకు రానక్కర్లేదు ప్రకటన చూడగానే తనే పోట్లాటకి వచ్చేస్తుంది.‘‘ఒరే ఒరే ఆపరా బాబు’’ అనరిచాడు చందూ.

విరాట్  ఆశ్చర్యంగా చూసాడు.

‘‘సహస్ర ఎక్కడో ఉండటం ఏమిట్రా.  సహస్ర దీక్ష ఇద్దరూ మన కాలనీలోనే ఉన్నారు’’  అంటూ బయటపడిపోయాడు చందు.

‘‘ఇక్కడుంటం ఏమిట్రా?  ఉంటే కనబడరా?  పొద్దుటే వెధవ జోకులేయకు’’

‘‘ఇది జోకు కాదురా నిజం.  వాళ్ళు నీకు కనబడరురా.  నాకు కనబడ్డారు.  దీక్షతో మాట్లాడాను.

ఆ మాట వింటూనే అదిరిపడి...

లేచి నిలబడ్డాడు విరాట్.

‘‘ఏమిట్రా నువ్వంటున్నది?  నిజమా...’’  నమ్మలేనట్టడిగాడు.

‘‘నిజంరా బాబు. ఆ రోజు మనింట్లో పడ్డ ఆడ దొంగలు ఎవరనుకుంటున్నావు..?  సహస్ర దీక్షలిద్దరూ మన వివరాల కోసం ఇంట్లోకి దొంగతనంగా వచ్చి పోయారు’’

‘‘ఓ షిట్...  నువ్వు చెప్పేదంతా...’’

‘‘ఇంకా నమ్మకం లేదా?  ఇదే కాలనీ మూడో వీధి చివర నూట ఎనభైయ్యో ఇల్లు దీక్షది.  నేన్నీ దగ్గరున్నట్టే సహస్ర ఆ యింట్లో దీక్షతో ఉంటోంది.  వాళ్ళిద్దరూ లజ్ కార్నర్ లోని అభిరామి షాపింగ్ మాల్లో జాబ్ చేస్తున్నారు.’’

‘‘నిజంగానే కొంప ముంచావ్రా. ఇంత తెలిసిన వాడివి నాతో ఎందుకు చెప్పలేదు?’’

‘‘ఎలా చెప్పమంటావ్..?  దీక్ష నా నోరు కట్టేసింది.  నీకు తెలిస్తే సహస్ర తనతో కూడా చెప్పకుండా వెళ్ళిపోతుందట.  చెప్పొద్దని ప్రామిస్  తీసుకుంది. సహస్ర కు నువ్వంటే ఇష్టమే కాని తన సమస్యల్లోకి నిన్ను లాగటం ఇష్టం లేక మౌనంగా ఉంటోంది’’

‘‘డామిట్  సమస్యలేమిటి బోడి సమస్యలు.  తను నన్ను ఇష్టపడాలే గాని ఎలాంటి సమస్యలయినా చూసుకోడానికి నేను లేనా?  అసలు నువ్వు సహస్రతో మాట్లాడావా?’’

‘‘లేదు దీక్ష అంతా చెప్పింది.  నువ్వింకొద్ది రోజులు ఓపిక పట్టాల్సింది.  ఓ మాట నాతో చెప్పినా ఆపేవాడ్ని అనవసరంగా ప్రకటనిచ్చి ఘోరమైన తప్పుచేసావ్. తనేం చేస్తుందో ఏమిటో...’’  అంటూనే గేటు వైపు చూసి ఉలిక్కిపడ్డాడు.

‘‘ఈ ప్రకటనతో సునామి వస్తుందన్నావ్ గా...? అదో వచ్చేస్తోంది. ఎలా నచ్చ చెప్పుకుంటావో చెప్పుకో’’  అంటూ వేగంగా కిచెన్ లోకి పారిపోయాడు చందూ.

అప్పటిగ్గాని తను చేసింది కరక్టు కాదు అని అర్థంకాలేదు విరాట్ కి.  నిజంగానే తొందరపడ్డాడు. బయట ఆగిన స్కూటీ మీది`  అమ్మాయిల్ని వెంటనే గుర్తుపట్టేసాడు.

దీక్ష స్కూటీ ఆపగానే వెనక కూచున్న సహస్ర  ‘ది హిందూ’  ఇంగ్లీష్  దినపత్రిక చేత్తో పట్టుకొని రోషా వేశంతో పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చేస్తోంది.  స్కూటీ లాక్ చేసి దీక్ష కూడా వస్తోంది.  ఇద్దరూ ఇంకా నైటీల్లోనే ఉన్నారు.  సహస్ర మాత్రం ఎప్పటిలాగే చున్నీతో ముఖం తెలీకుండా చుట్టుకునుంది.

ఆమె యింటి వద్ద ఒకటి రెండుయిళ్ళ వాళ్ళకి తప్ప కాలనీలో ఇంత వరకూ ఎవరికీ ఆమె ముఖం ఎలా ఉంటుందో తెలీదు. వస్తున్న అమ్మాయిలిద్దర్నీ చూస్తూ...

స్థాణువులా ఉన్న చోటే నిలబడిపోయి...

అలా చూస్తుండిపోయాడు విరాట్.

I                 I                  I

ఒక్కోసారి మనం చేసే పనులు ఎదుటి వాళ్ళనే కాదు.  మనల్నీ ఇరుకున బెట్టి ఇబ్బందుల్లో పడేస్తాయి.తెలిసి వేసినా తెలీక వేసినా తేనెతుట్టె మీద రాయి పడితే కదిలి తేనేటీగలు వెంటపడి తరుముతాయి.

విరాట్  ఇచ్చిన ప్రకటన తేనెతుట్టెను కదిపింది.  సహస్ర ఎవరు బ్యాగ్రౌండ్  ఏమిటి గతం ఏమిటి ఏమీ తెలీకుండానే ఆమె ఫోటోతో సహా ప్రకటనిచ్చి నిజంగానే తప్పు చేసాడు. ఇంతవరకు విరాట్  ఎక్కడున్నాడో సహస్ర ఎక్కడుందో వాళ్ళ స్వస్థలాల్లో ఎవరికీ తెలీదు.  ఇప్పుడు తెలిసిపోయే పరిస్థితి ఏర్పడింది.

మధురై....

సహస్ర తండ్రి మహాదేవ నాయకర్ కి ఉదయం లేవగానే బెడ్ కాఫీ తాగి దినపత్రిక చదవటం అలవాటు. నాయకరాజుల వంశస్థుడు గావటంతో అందుకు తగ్గట్టే మనిషి ఎత్తుగా కాస్త లావుగా దృఢంగా ఉంటాడు.  నిమ్మకాయలు నిలబెట్టగల గుబురు మీసాలు ఆయన ముఖానికి ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికీ ఉదయం రెండు గంటలు వ్యాయామం చేయటం ఆయన అలవాటు.  చాలా గంభీరంగా సీరియస్ గా ఉంటాడు మనిషి.  కంటి చూపులు చాలా షార్ప్ గా ఉంటాయి.

ఆ రోజు ఉదయం పేపర్  తెరవగానే అన్నాడియంకె తన పార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురుని పార్టీ నుంచి సస్పెండ్  చేసిన విషయం ప్రముఖంగా ప్రచురించబడిరది. వివరాలు చదవబోతూ దిగువకు చూసిన మహాదేవ నాయకర్  అక్కడ రైట్  కార్నర్ లో తన కూతురు సహస్ర ఫోటో చూసి ఉలిక్కిపడ్డాడు.

వెంటనే దిగువకొచ్చి...

ప్రకటన చదివాడు.

అంతే` ఆయన ముఖం కోపంతో కందగడ్డలా అయిపోయింది.  వెంటనే గొంతు పెంచి `  ‘‘ఇదిగో ఇంటావిడ ఎక్కడున్నావ్..?  త్వరగా రా’’  అనరిచాడు.

‘‘వస్తున్నానండి.  ఏం కావాలి?’’  అంటూ లోపల్నుంచి ఆయన భార్య మూగాంబిగై పరుగులాంటి నడకతో వచ్చింది. ఆయన ఉగ్రరూపాన్ని చూస్తూనే బాల్కానీ డోర్ వద్దే ఆగిపోయింది.  భయం భయంతో చూస్తు  ‘‘ఏమైందండీ...?  ఎందుకంతకోపం?’’ అనడిగింది.

‘‘కోప్పడక సంతోషపడమంటావా?  ఒక్కగానొక్క కూతురని నెత్తికెత్తుకున్నందుకు తలకు నీళ్ళు పోసింది. నా పరువు తీయడానికే పుట్టినట్టుంది. చూడు మన గారాల కూతురు ఫోటో పత్రికలో వచ్చింది.  నువ్వయినా చూసి సంతోషపడు’’  అంటూ పేపర్ను కోపంతో ఆమె వైపు విసిరికొట్టాడు.

దాన్ని అందుకుని ప్రకటన చూసి నిశ్చేష్టురాలయిందావిడ.

‘‘బంగారంలాంటి సంబంధం చూసాను.  పెళ్ళిచేసుకోమంటే పారిపోయి పరువు తీసింది.  ఇన్ని రోజులూ ఎంత వెతికించినా ఎక్కడ ఉందో తెలీలేదు.  ఇప్పుడు చూడు ఏమైందో... నా కూతురు అలాంటిది కాదు.

విరాట్ సృష్టించిన  ప్రకటనల సునామీ వాళ్ళిద్దరినీ కలిపిందా? కలిపినట్టే కలిపి ప్రత్యక్ష వైరానికి నాంది పలికిందా? తెలుసుకోవాలంటే వచ్చే వారం దాకా అగాల్సిందే...

[email protected]

www.suryadevararammohanrao.com

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్