Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevnam

ఈ సంచికలో >> శీర్షికలు >>

“ బాపూ బొమ్మ “ - రచన : భమిడిపాటి ఫణిబాబు.

bapu bomma

ఈ వారం నేను వ్రాస్తూన్న వ్యాసం, చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ఉన్నమాటేదో చెప్పాలిగా. శ్రీ బాపు గారు  ఆడపిల్ల అంటే ఓ నిర్వచనం వారి బొమ్మలద్వారా పరిచయం చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. ఓ అందమైన అమ్మాయంటే ఇలా ఉండాలీ , పైగా “ బాపు బొమ్మ” లాగ ఉందీ అనిపించేటంత స్థాయిలో , బొమ్మలు గీశారు. ప్రస్థుతపు రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలు శ్రీ “బాపుబొమ్మ” కి దగ్గరలో ఉంటున్నారూ, అన్నది ఆలోచింపదగ్గ విషయమే అని చాలామంది ఒప్పుకుంటారనుకుంటాను.

ఓ వాలుజడ, నుదిటిమీద ఓ గుండ్రటి బొట్టు, సన్నని నడుమూ… ఇలా వర్ణించుకుంటూ పోతే, ఓ అందమైన అమ్మాయిని ఊహించుకోవచ్చు. కానీ అలాటి బొమ్మలు ఈరోజుల్లో చూడగలుగుతున్నామా అంటే, ఎక్కడో అక్కడక్కడ, గ్రామీణ ప్రాంతాల్లో తప్ప, లేదనే సమాధానమే వస్తుంది. ఔనంటారా, కాదంటారా? సమాధానం అందరికీ తెలుసు, కానీ ఒప్పుకోడానికి కొద్దిగా సిగ్గుపడతారు. అదేం చిత్రమో కానీ, ఈరోజుల్లో నుదిటిమీద బొట్టూ, వాలుజడా “ చరిత్ర” లోకి వెళ్ళిపోయాయి.. ఎవరి కారణాలు వారివే. మరీ అంతంత జుట్టుంటే, ఈరోజుల్లో ఆ జుట్టుకి “జడ” వేయడానికి టైమెక్కడుందండీ అంటారు. పైగా ఉన్న జుట్టునికూడా, అదేదో “ బాబ్డ్” లేదా “ పోనీ టైల్” ( శుధ్ధ తెలుగులో గుర్రపు తోక అనొచ్చు) లోకి మార్చేశారు. స్కూలుకి వెళ్ళేపిల్లలకి జడవేయాలంటే , అదో పెద్ద కార్యక్రమం. నిద్రలేపి, దంతధావనం చేయించి, టిఫిన్ పెట్టి స్కూలు బస్సెక్కించడానికే టైము సరిపోని ఈ రోజుల్లో, జడవేయడానికి టైముండదు. ఒప్పుకుంటాము, కానీ నుదుటిన బొట్టు పెట్టడానికి , అభ్యంతరం ఎందుకో అర్ధం అవదు. నుదుటిన బొట్టనేది, ఏదో హిందూసాంప్రదాయ వాదన కింద తీసికోకుండా, ఆ నుదుట బొట్టనేది, మొహానికి సంపూర్ణత్వం తెచ్చిపెడుతుందని , అందంగా ఉంటుందనీ అనుకోవాలి. చిత్రం ఏమిటంటే , మనదేశంలో హిందూ మతేతరులకి, నుదుట బొట్టు పెట్టుకోవడంలో అభ్యంతరం లేకపోవడం ! కానీ చాలామంది  నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది, ఓ పంచమహా పాతకం గా భావిస్తారు. అందరూ అని కాదు, చాలామంది.

గుర్తుండే ఉంటుంది, ఆరోజుల్లో చిన్నపిల్లలకి “ వ్యాధినిరోధక టీకాలు” అనేవి వేసేవారు. ఆ వేసిన టీకా “పచ్చి” తగ్గి, ఎండిన తరువాత ఓ పెద్ద మచ్చ మిగిలిపోయేది. పాతకాలపు  స్త్రీపురుషుల జబ్బలమీద వీటిని చూడొచ్చు. మగపిల్లలకి ఎలా ఉన్నా ఫరవాలేదూ, ఆడపిల్లలకి మరీ జబ్బలమీద మచ్చ కనిపిస్తే బావుండదూ, అనే సదుద్దేశ్యంతో, ఏ తొడ మీదో వేయించేవారు, మరీ తొడలు కనిపించేలా బట్టలు వేయరుకదా అని !! ఇప్పుడు నగరాల్లో  చాలామంది  so called modern ఆడపిల్లలు ధరిస్తూన్న దుస్తులు ఎలా ఉంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. పైగా ఏదైనా అంటే కోప్పడతారు. అయినా విషయం అది కాదు—ఆ “టీకా మచ్చల” విషయంకదా. శరీరంమీద మచ్చ అందులోనూ ఆడపిల్లలకి, ఉండకూడదని తల్లితండ్రులు, ఎంత తాపత్రయ పడ్డారో, దానికి విరుధ్ధంగా, ఈరోజుల్లో ఎవరిని చూసినా, శరీరంనిండా, అక్కడా, ఇక్కడా అనిలేకుండా, అవేవో “టాటూ” (tattoo) లుట , వాటినే “ పచ్చబొట్టు” అనేవారు. ఓ అర్ధం పర్ధం ఉండడంలేదు. వయసుతో పనిలేదు, కోడలు వేయించుకుంటే , పనిలోపనిగా అత్తగారూ, కూతురు వేయించుకుంటే, తల్లీ, పోటీపడి మరీ వేయించుకుంటున్నారు. ఏమీ అనే ధైర్యం లేదు,ఓపికుంటే చూస్తూ ఊరుకోవడం లేదా తూర్పుకి తిరిగి దండం పెట్టడం ! వాళ్ళెవరో వేయించుకుంటే, మీ సొమ్మేంపోయిందీ అనొచ్చు.  బయటకెళ్ళినప్పుడు, ఎవరైనా స్త్రీని, అందులోనూ, ఒకవయసు దాటినవారిని చూడగానే , ఓ “హుందాతనం “ కనిపించాలికానీ, వెగటుగా కనిపిస్తే పలకరించాలనికూడా అనిపించదు. ఈ “నీతిబోధలు” అన్నీ “ పాత చింతకాయ పచ్చడి” లా అనిపించొచ్చు. కానీ ఉన్న విషయమేగా !

దేశంలో చాలా ప్రాంతాల్లో , వివాహం అయిన స్త్రీలు , మెడలో తాళి, పాపిట సింధూరం ( కొన్ని ప్రాంతాల్లో), నుదుట బొట్టు,  రెండుకాళ్ళవేళ్ళకీ వెండి మట్టెలూ పెట్టుకోవడం  ఓ ఆచారం. వీటిలో చాలా వస్తువులు, అందరికీ కనిపించేలా పెట్టుకోవడం అంత ఇష్టంగా ఉండడం లేదు. ఎవరి కారణాలు వారివీ. పై చెప్పిన ప్రతీదానికీ, సాంప్రదాయ కారణాలే కాక, శాస్త్రీయపరమైన ఉపయోగాలుకూడా ఉన్నట్టు, పుస్తకాల్లో చదువుతున్నాము, టీవీల్లో వింటున్నాము. అయినా చాలామంది ఈ విషయం పట్టించుకోరు.

అలాగే తిండి విషయంలో కూడా—బయట దొరికే పిజ్జాలే బావుంటాయి. ఇంట్లో తినే తిండిలో,  పప్పూ అన్నంలో నెయ్యి వేసికోవడం తప్పు. అదేదో “ కొలెస్ట్రాల్” పెరిగిపోతుందిట.  పాతకాలం వారు అన్నంలో నేతి చుక్క లేకుండా భోజనం చేసేవారా? వాళ్ళకి మాత్రం తెలియదా, ఇన్ని సంవత్సరాలు అంత “ నెయ్యి” వెళ్ళినా, గుండ్రాయిల్లాగ ఉన్నారు.  అలాగే జుట్టుకి నూనె పెట్టడం “ మహాపాపం” లోకి వస్తుంది. ఎక్కడో ఎవడో యాంటీ నూనెల లాబీ వాడెవడో చెప్పేడని, ఏదో నెలకో, రెండునెలలకో ఆ జుట్టుకి నూనె పట్టించడం. మొక్కలకి నీళ్ళుపోసినట్టే, జుట్టుకి నూనె ఓ పోషక పదార్ధం. ఈ నూనె పట్టించకపోవడంతో జరుగుతున్నదేమిటంటే, ఇరవై ఏళ్ళొచ్చేసరికే జుట్టు “నెరవడం”, మళ్ళీ ఆ “బాల నెరుపు” కనిపించకుండా ఆ జుట్టుకో రంగు.

రోజురోజుకీ ఫాషన్లు మారిపోతున్న ఈ రోజుల్లో “ బాపూ బొమ్మలు” కనిపించాలంటే, ఎలా కనిపిస్తారు మరీ ?

మరిన్ని శీర్షికలు
for you