Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ: బస్సు కాన్సిలయిందని తెలియగానే ఇంటికి తిరిగి వెళ్ళిపోతానన్న మేఘనను వారించి తన ఫ్లాట్ జు తీసుకొస్తాడు హరి. మాటల మధ్యలో హరి భార్య సౌమ్య ప్రస్తావన వస్తుంది.

ఆ తరువాత......

‘‘సరే... ఒక్క నిమిషం ఉండండి... రైస్ కుక్కర్ లో రైస్ ఈపాటికి అయిపోయే ఉంటుంది. దగ్గరే ఉన్న కర్రీపాయింట్నుంచి వాచ్ మన్ చేత కర్రీలు తెప్పిస్తాను. నిమిషంలో డిన్నర్ రెడీ.’’ అన్నాడు హరి.

భోజనాంతరం, సడన్ గా అంది మేఘన... మీ గురించి సౌమ్య గురించి తెలుసుకోవాలని ఉంది నాకు.

‘‘ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు.’’

‘‘మీది లవ్ మ్యారేజా..?’’

‘‘హూ... లవ్ మ్యారేజ్ అనలేం, అరేంజ్ డ్ మ్యారేజ్ అనలేం...’’

‘‘ఇదేం విచిత్రం..!’’

‘‘నా చిన్నతనమంతా యూనివర్సిటీ క్యాంపస్ లోనే గడిచింది. నాన్నగారు ఆర్కియాలజిస్ట్...’’

‘‘ఆర్కియాలజిస్ట్ అంటే..’’

‘‘భూమిలో తవ్వకాలు జరిపి, పాత కాలం ప్రజల ఇళ్లు, వస్తువులు, పాత్రలు ఒకటేమిటి? ఏది దొరికితే దాన్ని వెలికి తీసి, దాన్ని బాగా స్టడీ చేసి, ఏదన్నా కనిబెడతారు.’’

‘‘ఉపయోగమేముంది.’’

‘‘తవ్వకాలలో... పాతకాలం ప్రజలు ఏం చేసారో, ఎలా చేసారో తెల్సుకుంటాం. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో ఎలా చేయాలో నిర్ణయించుకోవచ్చు..’’

‘‘ఇంకా...?’’

‘‘పాతకాలం వాళ్లు మూకుమ్మడిగా చనిపోయారనుకుందాం... వాళ్ల ఎముకలు స్టడీ చేస్తే... వాళ్లు ఏదన్నా తినకూడనిది తిని చనిపోయారా? లేదా ఏదన్నా వ్యాధి సోకి చనిపోయారా? లేక ఎవరన్నా మారణ హోమం చేసి వాళ్లని చంపారా? లేక ప్రకృతి విలయతాండవానికీ, ఉల్కనో దెబ్బకి చనిపోయారా? ఇవన్నీ తెలుసుకుని, ప్రస్తుత ప్రజలకు ఉపయోగపడేలా ఏదో ఒకటి కనిపెట్టవచ్చు.’’

‘‘ఓహ్... చాలా ఉందండీ..’’

‘‘ఇంకా ఎంతో ఉంది... చెబుతానుండండి.’’

‘‘డాక్టరు గారు మీకు దారి తప్పడం బాగా అవాటు.’’

‘‘దారి తప్పించింది మీరు.’’

‘‘అది కాదు... నేనడిగింది మీ ‘లవ్ స్టోరీ’. మీరు నాకు చెబుతున్నది  హిస్టరీ.’’

‘‘ఓకే... ఓకే.. నాన్నగారు, మా మమ్మీ ఇద్దరూ పూణే యూనివర్సిటీలో ఆర్కియాలజీ స్టూడెంట్స్ గా     ఉన్నప్పుడే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. తర్వాత నాన్నగారికి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం రావడంతో ఇక్కడే సెటిలయ్యారు. యూనివర్సిటీ క్వార్టర్స్ లో నివాసం.’’

‘‘నేనడిగింది మీ మమ్మీడాడీల లవ్ స్టోరీ గురించి కాదండీ.’’

‘‘అక్కడికే వస్తున్నాను. నేను స్కూలుకు వెళ్లేటప్పటినుంచీ సౌమ్య నాకు పరిచయం.’’

‘‘టెన్త్ క్లాస్ లవ్వా?’’

‘ఊ...హూ... ఇంకా ముందునుంచే..’’

‘‘దేవదాసు... పార్వతిల్లాగానా...?’’

‘‘మేఘన... నీ చిలిపితనం చాలా ఎక్కువవుతోంది.’’

‘‘నిజమే... డాక్టర్ గారూ... నేను మనస్ఫూర్తిగా నవ్వి ఎంత కాలమయ్యిందో నాకే తెలియదు... సరదాగా, చిలిపిగా మాట్లాడి ఇంకెంత కాలమయ్యిందో అసలే గుర్తులేదు. మీ సమక్షంలో నన్ను నేనే మరచిపోయి, ఎలా ప్రవర్తిస్తున్నానో నాకే తెలీడం లేదు, అర్థం కావడం లేదు. కానీ జీవితం అనేదాంట్లో ఇంత ఆనందం ఉంటుందని మొదటిసారిగా ఇప్పుడే తెలుస్తున్నది నాకు. ఒక పురుషుడు, ఒక స్త్రీని తన దగ్గరకు తీసుకుని, ఒక మల్లెపువ్వు లాగా సుతారంగా, సున్నితంగా గౌరవించగలడనీ ఆ స్త్రీని దగ్గరకు తీసుకోకపోయినా, సరదా సంభాషణలతో ఇంకా ఎంతో ఆనందపరచగలడనీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను.’’‘‘మేఘనా... నీవు అన్నందుకు కోపం వచ్చిందా..?’’‘‘కోపం రాలేదు... నచ్చింది.’’

‘‘అయితే నన్ను కూడా హరీ అని పిలువు.’’

‘‘ఓకే... రా... హరీ...’’

పెద్దగా నవ్వాడు హరి.

‘‘ఇంతకీ సౌమ్య...?’’

‘‘ఏమో... ఎవరో తెలీదు. ఎక్కడుంటుందో తెలీదు... కానీ క్యాంపస్ లో రోజు కలిసే వాళ్లం... తరవాత ఇంటర్మీడియట్, డిగ్రీ... నాది మెడికల్ కాలేజీ... తనేమో బియ్యే... కలుసుకోవడం, మాట్లాడుకోవడం, కలిసి మెలిసి తిరగడం అంతే... ఎప్పుడు ప్రేమభాషణలు, భాషలు, బాసలు...చేసుకోలేదు. ప్రత్యేకంగా పార్కులకెళ్లింది లేదు... క్యాంపస్ పార్కులే మాకు ప్రకృతి వాతావరణం... పార్కుకు వెళ్లి మాట్లాడుకునేవారా? అంటే ఇద్దరం లేదనే చెబుతాం.’’

‘‘సినిమాలు... షికార్లు...’’‘‘ఎప్పుడూ వెళ్లింది లేదు. కానీ తనెక్కడుంటుందో నాకు తెలిసిపోయేది. నేనెక్కడున్నానో తనకు తెలిసిపోయేది... ఏదో విధంగా కలిసి మాట్లాడుకునే వాళ్లం...’’

‘‘ఏం మాట్లాడుకునే వాళ్లు?’’

‘‘ఏమో... ఏం మాట్లాడుకునే వాళ్లమో... ఏం టాపిక్కులో ఏమిటో... ఏదీ చెప్పలేను.’’

‘‘స్వీట్ నథింగ్సా...’’

‘అయ్యుండవచ్చు.’’

‘ఇదీ ఒక లవ్ స్టోరీయేనా..?’’

‘‘ఔను... చాలా చప్పగా ఉంది కదూ...’’

‘‘ఎవరెక్కడ ఉన్నారో ఎలా తెలిసిపోయేది? టెలిపతీనా..?’’

‘‘ఏమో... టెలిపతీనో, హోమియోపతీనో, ఆల్లోపతీనో మాకే తెలియదు. కానీ అదే విధంగా... ఈరోజు నీవు వస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు మేఘనా... అలాగే నువ్వు వచ్చావు. మరి ఇదేం మాయో... మంత్రమో... నాకైతే తెలియదు.’’

‘‘సరే... మీ ఇద్దరూ ఒకరికొకరు ఐ లవ్యూ చెప్పుకోలేదా..?’’

‘‘నెవ్వర్... ఎప్పుడూ చెప్పుకోలేదు.’’

‘‘పువ్వులివ్వడం... పీచు మిఠాయిలు ఇప్పించడం?’’

‘‘తెలుగు సినిమా పైత్యం... ఎక్కువౌతున్నట్లుంది..?’’

‘‘మీ లవ్ స్టోరీని ఫాలో కావడం నా తలకి మించినపనే గానీ, ఇంతకూ ఎలా పెళ్లి చేసుకున్నారు?’’

‘‘ఒకరోజు చాలా దిగాలుగా, ముఖం వేళ్లాడేసుకుని, దీనంగా, సర్వం కోల్పోయిన దానిలాగా నన్ను కలిసింది... ఏమైంది ఏమైందని అడగ్గా తన పెళ్లి ఏర్పాట్ల జరుగుతున్నాయని చెప్పింది.

నీకు ఇష్టమేనా.... అని అడిగాను. నీకు తెలీదా... అని ఒకే ఒక మాట అన్నది... తన ముఖంలోకి  సూటిగా చూసాను... తనూ నా వైపు అలాగే చూస్తున్నది..

రేపు మీ ఇంటికి వస్తాను అన్నాను...మీ కోసం ఎదురు చూస్తుంటాను. అని వెళ్లిపోయింది.

నేను మా అమ్మానాన్నలకి చెప్పాను. అమ్మాయి పేరడిగారు, సౌమ్య అని చెప్పాను.

తరవాతి రోజు నాన్నగారు నన్ను ట్యాంక్ బండ్ మీదకి తీసుకెళ్లి ప్రశాంతంగా ఉన్నచోట కూర్చోబెట్టారు.మేఘన-

డా.హరి మధ్య అంతకంతకూ పెరుగుతున్న సాన్నిహిత్యం వారి భావ సారూప్యత వల్లనా?

లేక శారీరక సౌఖ్యం కోసమేనా?? మరి సౌమ్య సంగతేమిటి....???
వచ్చేవారం.....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti