Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ: సహస్ర  కోసం విరాట్           సృ ష్టించిన ప్రకటనల దుమారం ఎంత దూరం వెళ్తుందోనని భయపడుతుంటాడు చందు. అతడు అనుకున్నంతా అవుతుంది. అమ్మాయిలిద్దరూ నేరుగా వాళ్ళింటికి వచ్చేస్తారు. ప్రకటన చూసిన సహస్ర  తండ్రి తీవ్రం గా స్పందిస్తాడు.

ఆ తరువాత........................

ఉత్తమురాలు.  ప్రేమా దోమా దానికి తెలీదు అన్నావ్ గా.  ఇప్పుడేమంటావ్.  చెన్నైలో ఉంది.  వాడెవడ్నో ప్రేమించి వదిలేసినట్టుంది.వాడు

ఏకంగా పత్రికా ముఖంగా  ‘కన్పించటం లేదు’  అని ప్రకటనే ఇచ్చేసాడు.  పట్టిస్తే కోటి రూపాయలు బహుమానం అట.  ఎవడో కోటీశ్వరుడయి ఉండాలి....’’

‘‘అది కాదండీ...’’
|
‘‘ఇంకేం చెప్పకు.  నా కూతుర్ని వెనక్కి తెచ్చుకొని ఎలా పెళ్ళి జరిపించాలో నాకు తెలుసు.  నీ సలహా సంప్రదింపులేమీ అక్కర్లేదు’’  అంటూ బాల్కనీ వద్దకెళ్ళి కిందకు చూసాడు.

కాంపౌండ్ లో  అతని మనుషులు చాలా మంది ఉన్నారు.

‘‘అరేయ్ కదిరేశన్, వడివేలు ఎక్కడ్రా.... వాళ్ళిద్దర్నీ రమ్మని చెప్పండి’’  అంటూ ఆర్డర్  వేసాడు.

సరిగ్గా పావు గంట తర్వాత వాళ్ళిద్దరూ మహ దేవనాయకర్  ముందున్నారు.  ఆయన చెప్పింది జాగ్రత్తగా విన్నారు. మరో గంట తర్వాత తమ సహచరులు మరో ఆరుగురు గూండాలతో కదిరేశన్ వడివేలు ప్రయాణిస్తున్న జీపు మధురై వదిలి చెన్నై మార్గంలో దూసుకుపోనారంభించింది.

మహా దేవనాయకర్  ఆ పూటకి బయటకు పోకుండా ఫోన్  స్విచ్ఛాప్  చేసి సహస్ర ఫోటోనే చూసి బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోయాడు.

ఈ              ఈ                     ఈ

విశాలమైన టేక్ వుడ్ టేబుల్ మీద...ఆ రోజు దినపత్రికలన్నీ వరసగా పరిచి ఉన్నాయి.

అన్నిటిలోనూ ప్రకటనతో బాటు అందమైన సహస్ర ముఖం కన్పిస్తోంది.  టేబిల్  వెనక రివాల్వింగ్  ఛేర్ లో మధ్యవయసు భారీ కాయుడు ఒకరు కూచున్నారు. పక్కన సిల్వర్  డిష్ లోని ఆపిల్  ముక్కల్ని ఒక్కోటీ నములుతూ సహస్ర ఫోటోని దీక్షగా చూస్తున్నాడు.టేబుల్ ముందు ఎదురుగా అతడి ముఖ్య అనుచరులు నలుగురు చేతులు కట్టుకుని నిలబడున్నారు.

అది మధురై శివార్లలోని సువిశాలమైన టేకు తోటలోని ఎస్టేట్  బంగళా.  ఎస్టేట్ ను చుట్టి ఎత్తయిన కాంపౌండ్ వాల్  ఉంది.  ఎస్టేట్ కు పటిష్టమైన కాపలా ఉంది. పర్మిషన్ లేకుండా చీమ కూడా లోన ప్రవేశింపలేదు.

ఆయన పేరు త్యాగరాజన్.

ఆయన తండ్రి పేరు దేవరాజన్.  సెంట్రల్ మినిస్టర్. ఆయన తాతగారి పేరు మణివణ్ణన్.  ఆయన తమిళనాడు మాజీ సి యం. గత ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోవటంతో అంతవరకు ప్రతిపక్షంగా వున్న పార్టీ అధికార పార్టీ అయింది.  ప్రస్తుత సి యం శిల్విచెందామరై.  ప్రతిపక్ష నాయకుడు మణివణ్ణన్.

తాతగారు మణివణ్ణన్  సి యం గా ఉండగా త్యాగరాజన్  తన వ్యాపారాలను భాగా విస్తరించుకున్నాడు.

ఆయనకున్న ప్రధాన వ్యాపారాల్లో ఒకటి రియల్ ఎస్టేట్ .  రెండు మైనింగ్  కార్పోరేషన్.  తాత స్టేట్ సియం, తండ్రి దేవరాజన్  సెంట్రల్ మినిస్టర్ గావటంతో అడ్డగోలుగా లైసెన్సులు పొంది మైనింగ్  కార్పోరేషన్  స్థాపించి ఇష్టానికి భూమిని తవ్వి పారేసి విలువైన ఖనిజాలను విదేశాలకు తరలిస్తూ కోట్లు సంపాదించాడు. ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు.

త్యాగరాజన్  మనుషులు మధురై జిల్లాతో బాటు పక్క జిల్లాల్లోను సంచరిస్తూ రియల్  ఎస్టేట్ కు అనుకూలంగా ఉన్న భూముల్ని గుర్తిస్తుంటారు. అలాగే ఎక్కడ విలువైన ఖనిజాలున్నాయో సమాచారం సేకరించి రిపోర్ట్  తయారుచేసి ఇస్తుంటారు.  ఇక తర్వాత అతడి ముఖ్య అనుచరగణం రంగంలోకి దిగుతుంది. అవసరమైతే తనూ ముందుంటాడు త్యాగరాజన్.గుర్తించినవి ప్రయివేట్  భూములయితే రైతుల్ని బెదిరించి తక్కువ ధరకే తమ కంపెనీ పేర రాయించేసుకుంటారు.  ఎదురు తిరిగితే కిడ్నాప్ చేయించి బలవంతంగా రాయించుకుంటారు. ఈ క్రమంలో అనేక హత్యలు కూడ జరిగాయి.  ఇక గవర్నమెంటు భూములయితే లంచాలు కట్టి పర్మిషన్  సంపాదించి ఇష్టం వచ్చినట్టు తవ్వి పారేస్తుంటారు.

మధురై జిల్లా నుండి ఆ బెల్టు మొత్తం ఎనిమిది జిల్లాల్లో త్యాగరాజన్  మాటకు తిరుగులేదు.  అతని అక్రమాల గురించి తెలిసినా జనం నోరు విప్పరు.

ఈ నేపథ్యం లోఎవరయినా తనను వేలెత్తి చూపినా,  తన గురించి తన కంపెనీల గురించి పత్రికలకు వ్రాసినా,  తన మీదా లేదా తన కంపెనీల మీద కేసులు వేసినా, పోలీసు రిపోర్టిచ్చినా అలాంటివారిని క్షమించే అలవాటు త్యాగరాజన్ కు లేదు. నిర్ధాక్షణ్యంగా వారికి మరణదండన విధించేస్తాడు. మనిషి ఎంత సాఫ్ట్ గా ప్రశాంతంగా చెరగని చిరునవ్వుతో పరామర్శిస్తాడో అంతకంత మహా ప్రమాదకరమైన వ్యక్తి.  తనేమీ చేయడు.  అంతా అతని మనుషులే చూసుకుంటారు.  స్కెచ్  అతడిది.  అమలుపరిచేది అతడి మనుషులు.  ఎక్కడికక్కడ తన చేతులకు మట్టి అంటకుండా జాగ్రత్త పడతాడు. అందుకే తెలీనివాళ్ళు అతడ్ని చాలా మంచి వాడనుకొంటారు.  తెలిసిన వాళ్ళు అతని కంటపడకుండా తప్పించుకుంటారు.  లేదా దూరంగా ఉంటారు.అటువంటి చరిత్ర కలిగిన త్యాగరాజన్ని సమీప కాలంలో పునాదులు కదిలిపోయేలా చేసిందో యంగ్ జర్నలిస్టు.  ఆ జర్నలిస్టే మధురైకు చెందిన లహరి. స్థానికంగా ఉంటున్నఈ లహరి ఎవరో స్థానికులు ఎవరికీ తెలీదు.  కాని సమకాలీన రాజకీయాల మీద విశ్లేషణలతో సహా పత్రికలకు వార్తా కథనాలు రాస్తుంటుంది. అది యిది అనకుండా ఏ పార్టీనయినా ఏ పార్టీకి చెందిన వారినయినా తప్పుచేస్తే కడిగి పారేస్తుంది. ఆమె దృష్టి క్రమంగా త్యాగరాజన్్  మీద పడింది.  త్యాగరాజన్ బాధితుల గోడు వింది. రహస్యంగా ఆయా ప్రాంతాల్లో సంచరించి అతని అక్రమ మైనింగ్ కు సంబంధించిన ఫోటోలు తీసి పేపర్లకెక్కించటం ఆరంభించింది.  అలాగే అనేక సాక్ష్యాధారాలను సేకరించి రికార్డులు తయారుచేసింది.

రోజుకో కథనం దినపత్రికల్లో వస్తుంటే త్యాగరాజన్ కి కంపరం మొదలైంది.  డిల్లీ నుంచి తండ్రి దేవరాజన్  ఫోన్ లో కొడుకును హెచ్చరించనారంభించాడు. ఇటు ప్రతిపక్ష నాయకుడిగా వున్న తాత ఆందోళన చెందుతూ ఆ జర్నలిస్టు ఎవరో తెలుసుకొని తగిన చర్య తీసుకోమంటూ ఫోన్లు చేస్తున్నాడు. అయితే లహరి ఎవరో తెలుసుకోవటం అంత సులువు కాలేదు.ఈ లోపల లహరి త్యాగరాజన్  నేర చరిత్రను పత్రికలకెక్కించటంతో వూరుకోలేదు.  తన వద్ద ఉన్న రికార్డులను కాపీలు తీసి ఒకటి సుప్రీం కోర్టుకి,  ఒకటి చెన్నై హై కోర్టుకి, ఒక కాపీని మధురై కోర్టుకు పంపిస్తూ ఒక కాపిని మధురై పోలీస్ కంట్రోల్ రూమ్ లోని ఎ యస్ పి ప్రకాష్ కు పంపించి కేసు ఫైల్  చేయమని కోరింది.ఇంతకీ లహరి ఎవరో ఎలా ఉంటుందో పత్రికాఫీసుల్లోని కొందరికి తప్ప బయట ఎవరికీ తెలీదు ఏ ప్రాంతమో ఎక్కడుంటుందో తెలీదు. ఆమె ఇచ్చిన అడ్రసుకు వెళ్ళిచూస్తే అది ఒక ఫామ్ హౌస్  అడ్రసు. ఆ ఫామ్ హౌస్ మహదేవనాయకర్ కి చెందింది. ఆయన్ని అడిగితే లహరి ఎవరో తనకు తెలీదని తమ ఫామ్ హౌస్ అడ్రసు ఎందుకిచ్చిందో అర్థంకావటం లేదన్నాడు.  నిజంగా ఆయనకు తెలీదు.  ఆయన తన కూతురు సహస్రకు తన మిత్రుడైన ఎం పి కొడుకుతో పెళ్ళి జరిపించే ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు.

లహరి ఫైల్  చేతికందిన గంటలోనే ఆ ఫైల్ తో సహా త్యాగరాజన్  ముందు హాజరై ఫైల్ అతడి చేతికిచ్చాడు ఎ యస్ పి ప్రకాష్. ఆ ఫైల్ తిరిగేయగానే అతనికి కళ్ళు గిర్రున తిరిగినంత పనైంది.  తన కొంపముంచే అనేక నిజాలు ఆ ఫైల్ లో ఉన్నాయి.  ఎంక్వయిరీ కమీషన్  వేసినా ఎలాగో మేనేజ్ చేయొచ్చేమోగాని సి బి ఐ రంగంలోకి దిగితే కొంప కూలినట్టే.‘‘ఈ ఫైల్ నా చేతికి రాబట్టి సరిపోయింది. వేరే ఎవరి చేతికెళ్ళినా మీ పునాదులు కదిలేవి’’ అన్నాడు ఎ యస్ పి ప్రకాష్.‘‘మీరు చదువుకున్నారుగాని బుర్రపని చేయదయ్యా.  ఫైల్ ని సరిగా గమనించావా? మొదట పేజీలోనే స్పష్టంగా రాసుంది ఎ కాపీ టు సుప్రీంకోర్టు, ఎ కాపీ టు హైకోర్టు, ఎ కాపీ టు మధురై కోర్టు, ఇంకేముంది? ఈ లహరి ఎవరో గాని అజ్ఞాతంలో ఉండే నన్ను పూర్తిగా ఇరికించేయాలని చూస్తోంది. దీని అంతు చూడకుండా వదలను’’ అనరిచాడు త్యాగరాజన్.

స్థానిక కోర్టుకు ఆ ఫైలు చేరగానే త్యాగరాజన్ మేనేజ్ చేసాడు.  ఇటు ఎ యస్ పి ప్రకాష్ ఫైల్ అందుకున్నా కేసు ఫైల్ చేయలేదు.  పోలీస్ కేస్ పుటప్ చేయకుండా డైరెక్ట్ గా కోర్టు నాశ్రయించటం రూల్స్ కు విరుద్ధం కాబట్టి ఈ ఫైల్లోని సమాచారాన్ని అంగీకరించలేదు.  అంటూ ఫైల్ ని రిజక్ట్ చేసారు జడ్జి.అయితే ఇదే సమయంలో సుప్రీం కోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అడ్డగోలుగా పర్మిషన్లు యిచ్చినందుకు కేంద్రప్రభుత్వం మీద అక్షింతలు వేస్తూ ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ కేసును సీరియస్ గా పరిశీలించి విచారణ చేపట్టవలసిందిగా హైకోర్టుని ఆదేశించగా హైకోర్టు స్థానిక కోర్టు కి ఆదేశాలు జారీచేసింది. దాంతో జడ్జి ఈ కేసును రీ ఓపెనింగ్ చేసి ఇటు వారికి అటు త్యాగరాజన్ కూడ కోర్టుకు హాజరు కావలసిందిగా సమన్లు జారీచేసారు.ఇదీ ఒకందుకు మంచిదే అనుకున్నాడు త్యాగరాజన్్ . ఫైల్ లో ఉన్న సాక్షుల్ని,  బాధితుల్ని బెదిరించో భయపెట్టో,  ఒకరిద్దర్ని ఫినిష్  చేసో మేనేజ్  చేయటం కష్టం కాదు. కాని ప్రధాన కక్షిదారు బ్రతికుండ కూడదు.  లహరిని అంతంచేస్తే కేసులన్నీ వీకయిపోతాయి.  కాని లహరి ఎలా ఉంటుందో తెలుసుకోవటం ఎలా? కోర్టు మెట్లు ఎక్కకముందే హతమయిపోవాలి. వెంటనే త్యాగరాజన్  మనుషులు రంగంలోకి దిగారు.  హిందూ దినపత్రికలో సి సి కెమెరాల్ని ఆపరేట్  చేసే వ్యక్తిని అతి కష్టం మీద మేనేజ్ చేసి లహరి అక్కడికి వచ్చి వెళ్ళినప్పటి దృశ్యాల క్లిప్పింగ్స్  కొన్ని సంపాదించగలిగారు.  కెమెరా విజువల్స్  సరిగా లేకపోయినా ఆఫీసులోకి వచ్చిపోతున్న లహరిని గుర్తించటం కష్టం కాలేదు.

‘‘చాలా చిన్న వయసులా ఉంది గదరా.  చాలా అందంగా కూడ ఉంది.  ఏ వూరు..?  ఎవరి తాలూకు?’’  అడిగాడు.‘‘తెలీదు సార్’’  బదులిచ్చారు అనుచరులు.‘‘కత్తిలా ఉండే ఇలాంటి అమ్మాయిలెప్పుడూ పక్కలో బళ్ళాలేరా.  ఉంచకూడదు.  ఈ పొగరు బోతు అమ్మాయికి నేను మరణదండన విధిస్తున్నాను. కోర్టు మెట్లు ఎక్కక ముందే ఫినిష్ చేయండి’’  అంటూ ఆదేశించాడు త్యాగరాజన్త్యాగరాజన్  మనుషులు కోర్టు వాయిదా రోజున లహరి రాగానే వేసేయటానికి కోర్టు బయట రెడీగా ఉన్నారు. జర్నలిస్టు లహరికి తనెలా ఉంటుందో త్యాగరాజన్ కి గాని అతని మనుషులకి గాని తెలీదని గట్టి నమ్మకం.  ఆ నమ్మకంతోనే సాదాసీదాగా ఆటోలో కోర్టు వద్ద కొచ్చేసింది. కోర్టులో హాజరు కాగానే తనకు రక్షణ కల్పించమని అడగాలనుకుంది కాని...

ఆటో దిగి మెట్ల వైపు అడుగులేస్తుండగానే ఆమెకు అనుమానం వచ్చేసింది.  అక్కడ తచ్చాడుతున్న కొందరు మనుషుల్ని గుర్తుపట్టేసింది.వాళ్ళ కదలికల్ని గమనించగానే తనను కవర్  చేయబోతున్నారని తెలిసిపోయింది.  తను వాళ్ళకు ఎలా తెలిసిపోయిందో తెలీదు కాని ఆలోచించే సమయం లేదు, ప్రమాదం మీద పడకముందే తప్పించుకోవాలి .గిరుక్కున వెను తిరిగింది లహరి.తిరిగీ తిరక్కముందే ఆమె వెనక ప్రత్యక్షమయ్యాడో గుండా.  వాడి చేతిలో కత్తి తళతళా మెరుస్తోంది.  ఆమె వెనుతిరగ్గానే నిర్ధాక్షిణ్యంగా పొడవపోయాడు. వెంట్రుకవాసిలో వేటును తప్పించుకున్న లహరి లాఘవంగా వాడి చేతిని బ్లాక్ చేసి చివ్వున గాల్లోకి ఎగిరింది.  ఆమె కుడి పాదం సూటిగా ప్రత్యర్ధి చెవి పక్కన దారుణంగా తాకింది.  ఏం జరిగిందో తెలిసే లోపే పెద్ద కేకపెట్టి విరుచుకు పడిపోయాడు వాడు. పడ్డవాడు తిరిగి లేవలేదు.వాడు ఏమయ్యాడో కూడ చూడలేదు లహరి. వాడి కత్తిని సొంతం చేసుకొన్న మరుక్షణం దూసుకొస్తూ కత్తుల్ని ప్రయోగించబోతున్న ఇద్దరు గుండాల దాడి నుంచి మెరుపు వేగంలో తప్పించుకొంటూ మరోసారి గాల్లోకి ఎగిరింది.  కరాటేలో గాని కుంఫ్ లోగాని ప్లైయింగ్ కిక్ ఎంత ప్రమాదకరమైందో మార్షల్ ఆర్ట్స్ గురించి తెలిసిన వాళ్ళకే తెలుసు. లహరి మార్షల్ ఆర్ట్ స్లో మాస్టరని ఆమె కదలికల్ని గమనిస్తున్న ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది.

కన్ను మూసి తెరిచే లోపు మరోసారి ఆమె కుడి పాదం ఒకడి తలకు కనక్టయింది.  గాల్లో ఉండగానే రెండోసారి తల మీద ఆమె మోచేయి తాకింది. ఆమె పాదాలు నేలమీద అనే సరికి గుండాలిద్దరూ మట్టి కరిచారు.ఈ లోపల మిగిలిన గుండాలు ఆరుగురు ఒకరినొకరు హెచ్చరించుకొంటూ ఐరన్  రాడ్స్ తో కమ్ముకొచ్చారు. హరికి తను ఎక్కువసేపు ఇక్కడుండటం మంచిదికాదని అర్ధమైపోయింది.  మీడియా వాళ్ళ దృష్టిలో పడినా పబ్లిక్ తనను గుర్తించినా చాలా సమస్యలొస్తాయి.  అందుకే ఇక ఆలోచించలేదు. వేగంగా మధ్యకు జొరపడిపోయి ఒకడి నుంచి ఇనుపరాడ్ ను సొంతం చేసుకుంది అంతే.

చెరకు తోటలో పడిన మత్తేభంలా ఎడా పెడా గుండాలను విరగదీసి దారిచేసుకొని వేగంగా కోర్టు పక్కవీధిలోకి పరుగుతీసి మాయమైంది. ఈ సంఘటన జరిగినప్పుడు త్యాగరాజన్  కోర్టు బయటలేడు.  లోపలున్నాడు.  బయట అరుపులు గోల విన్నాకే బయటకొచ్చాడు.  అప్పటికే లహరి ఎస్కేప్ అయింది కాబట్టి ఆమె ఎలా ఉంటుందో డైరెక్ట్ గా అతను చూసే అవకాశం కలగలేదు

ఆడపిల్ల ప్రాణం తీయాలని పథకం వేసి వచ్చిన గుండాలు చెల్లా చెదరుగా పడిపోయారు.  వాళ్ళలో  ఎవరి పరిస్థితి ఏమిటో వాళ్ళకే అర్ధంకాలేదు. అక్కడికీ కాస్త కాలు చెయ్యి బాగున్న నలుగురు గుండాలు ఇనుపరాడ్లు వూపుకుంటూ లహరి పారిపోయిన వీధీలోకి చూసారు.  వీధి చివర మలుపుతిరగటం వరకే వాళ్ళకి కన్పించింది. ఆ తర్వాత ఆమె ఎటుపోయిందో జాడ తెలీలేదు. లహరినయితే త్యాగరాజన్  అంతం చేయించలేకపోయాడు కాని కేసును వాయిదా వేయించుకోడంలో సక్ససయ్యాడు. ప్రధాన కక్షిదారు అయిన లహరి కోర్టుకు హాజరు కాలేకపోయినందున కేసును వచ్చే నెల ఇదే తేదీకి వాయిదా వేయడమైనది.  లహరి అనే జర్నలిస్టుకు తిరిగి సమన్లు పంపించమని ఆదేశించడమైనది. అంటూ ప్రకటించారు జడ్జి.

ఆ రోజు లహరిని అటాక్ చేసిన గుండాల్లో ఇంచు మించు అంతా హాస్పిటల్లో అడ్మిటయ్యారు.  వాళ్ళలో ముగ్గురు ఇంకా హాస్పిటల్  బెడ్ మీదే ఉన్నారు.ఈ లోపల ఒక అద్భుతం జరిగింది...|

అక్కడ సెంట్రల్  మినిస్టరయిన దేవరాజన్  చక్రం తిప్పాడు.  సెంట్రల్  గవర్నమెంట్ అధికార పార్టీకి మణివణ్ణన్  పార్టీ అలియన్స్ గా ఉంటూ వస్తోంది. స్టేట్ లో ఓడిపోయిన వాళ్ళ పార్టీ ఎంపిలు పదిహేను మంది డిల్లీ లో ఉన్నారు.  కాబట్టి కేసు నుంచి తన కొడుకు త్యాగరాజన్ ను ఎలాగయినా గట్టెక్కించాలనే ఉద్దేశంతో పార్టీ మీద, ప్రధానమంత్రి మీద వత్తిడి తీసుకొచ్చి ఈ కేసు మీద ఒక ఎంక్వయిరీ కమీషన్ ను నియమింప చేసాడు.ఆ ముగ్గురు సభ్యులతో కూడిన ఎంక్వయిరీ కమీషన్ ను నియమించి తమిళనాడు ప్రభుత్వానికి పంపిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ సుప్రీం కోర్టుకు అందజేస్తూ ఆరు మాసాల్లో ఎంక్వయిరీ కమిటీ తన రిపోర్టును సబ్ మిట్  చేసే వరకు ఈ కేసును తాత్కాలికంగా నిలిపి ఉంచాల్సిందిగా అభ్యర్ధించింది. ఆ విధంగా ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంచబడిం`ది.జగన్మోహన్ కి ఇలాంటి వాటిని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు.  కాబట్టి కమీసన్  సభ్యులు ముగ్గురు అడుగుపెట్టినప్పుడే ముడుపులు ముచ్చట్లు జరిగిపోయాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ కేసుల గురించి భయం లేదు.  కాని జర్నలిస్టు లహరి బ్రతికుంటే ఎప్పటికైనా ప్రమాదమే.  ఆమెను అంతం చేసే వరకు తనకు మనశ్శాంతి లేదు.  ఆమె గురించి మధురై లోను చుట్టు పక్కల అతని మనుషులు చాలా గాలించారు. కాని ఆ రోజు కోర్టు వద్ద తన మనుషుల్ని చావు దెబ్బ కొట్టి తప్పించుకున్న లహరి జాడ ఆ తర్వాత ఎవరికీ అంతు చిక్కకుండా పోయింది.ఇది జరిగి నాలుగు మాసాలు పూర్తయి అయిదో మాసం వచ్చేసింది.  ఇంకో రెండు మాసాల్లో ఎంక్వయిరీ కమీషన్  గడువు పూర్తి కావస్తుంది. కావాలంటే కాలాతీతం చేయటానికి మరో మూడు మాసాలు గడువు పెంచుకునే అవకాశం ఎలాగూ ఉంది.  ఈ పరిస్థితుల్లో గతం వదిలేస్తే ప్రస్తుతం...

వూహించని విధంగా అన్ని పత్రికల్లోను ఫోటోతో సహా వచ్చిన కోటి రూపాయల బహుమతి ప్రకటన సంచలనం సృష్టించింది.  అందుకే న్యూస్  పేపర్లను టేబుల్ మీద వుంచి పరిశీలిస్తున్నాడు త్యాగరాజన్్.  చాలా సేపటి తర్వాత తలెత్తి ఎదురుగా వున్న అనుచరుల వంక అనుమానంగా చూసాడు.

‘‘ఏరా...... ఈ ఫోటో చూస్తే ఈ అమ్మాయే లహరి అన్పిస్తోంది.  కాని చూస్తే సహస్ర అని ఉందేమిట్రా?  ఈమె లహరి కాదంటారా?’’  అంటూ సందేహం వెలిబుచ్చాడు.

‘‘పేరు మార్చుకుందేమో సార్’’  అన్నాడొకడు.

‘‘కాని ఇదే అమ్మాయి సార్,  డౌట్ లేదు’’  అన్నాడు మరొకడు.

త్యాగరాజన్  ఇల్లీగల్  కార్యకలాపాలకు ఈ టేకు తోట ఏస్టేట్  బంగళా వేదికగా ఉంటూ వస్తోంది.  గతంలో కొందర్ని చంపి ఆ తోటలోనే పాతిపెట్టి అడ్రస్ గల్లంతు చేసిన సంఘటనలూ ఉన్నాయి.

విరాట్ ఇచ్చిన ప్రకటన సహస్రని కలిసేందుకు ఉపయోగపడుతుందా,

లేక ఆమెను కొత్త ఇబ్బందుల్లోకి తీస్కెళుతుందా....???

ఏమో...!  తెలుసుకోవాలంటే వచ్చేవారం దాకా ఆగాల్సిందే......!!


[email protected]

www.suryadevararammohanrao.com

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekambar