Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ: యాక్సిడెంట్ అయిన ఏకాంబర్ ని చూడడానికి హాస్పిటల్ కి వస్తుంది నూకరత్నం. ఇంటికి చేరుకున్న ఏకాంబర్ ని చూసి తల్లితండ్రులు ఆందోళన చెందుతారు.

ఆ తరువాత...............

తండ్రి చెప్పేసరికి మరి మారు మాట్లాడలేక పోయాడు ఏకాంబర్.

" మంగగారు..

నమస్కారం అంకుల్! నమస్తే ఆంటీ " అంటూ హాల్లోకి వచ్చింది నూకరత్నం.

" బాగున్నావా తల్లీ... రారా! " అంటూ ఆహ్వానించింది పర్వతాలు.

" తమరేమిటీ ఆఫీసువదిలి ఇటు వచ్చారు? " ప్రశ్నించాడు ఏకాంబర్.

" ఎలా వున్నారో చూద్దామని వచ్చాను " అంది నూకరత్నం.

" బానే వున్నాను. పెళ్ళి పనులు చూస్తే అలానే వున్నాయి. పెళ్ళేమో ఇంకా నాల్రోజుల్లోనే వుంది. గాబరాగా ఉంది. కాస్త భయం గా వుంది."  నెమ్మదిగా అన్నాడు.

అన్నీ కాంట్రాక్ట్ కి ఇచ్చేసారు కదా! ఇంకా మీకేం పని వుంది అంది నూకరత్నం.

పని సరే మరి మనీ ఏర్పాటు చేసుకోవాలిగా, ఇంకా చిన్న చిన్న ఏర్పాట్లు వున్నాయిలే అన్నాడు ఏకాంబర్.

చిన్న పనులే అయితే మాకూ చెప్పొచ్చు కదా సార్!

బ్యాగ్ తెరచి చెక్కు తీసి ఏకాంబర్ చేతికి ఇచ్చింది నూకరత్నం.

ఇదేమిటీ? ఇంతెందుకు?! అయోమయం గా చెక్కుకేసి చూస్తూ అన్నాడు ఏకాంబర్.

అలివేలిమంగ పెళ్ళికి అవసరమవుతుందేమో కదా! ఈ సమయం లో మీకు ఉపయోగం గా వుంటుందని తల దించుకుని అంది నూకరత్నం.

ఎనిమిది లక్షలా ...? నీ కమీషన్ ఇచ్చేస్తున్నావే?! ఓరకంట నూకరత్నం కేసి చూస్తూ చెక్కులో వున్న మొత్తం చదువుతూ అన్నాడు ఏకాంబర్.

అంతా ఇవ్వలేదు ఇంకా కొంచెం అకౌంట్ లో వుంటుంది. అది కావాలన్నా తీసుకోండి  అంటూ చెక్కు బుక్ తీయబోయింది నూకరత్నం.

నూకరత్నం కళ్ళల్లోకి చూసాడు ఏకాంబర్.

చాలా థేంక్స్ రత్నం! నీకున్న అభిమానానికి నా మనసెంతో సంతోషం గా వుంది. ఇది చాలు. ఈ డబ్బు నాకొద్దు. ఇప్పుడు అంత అవసరం కూడా లేదు అంటూ ఆమె చేతిలో చెక్కు పెట్టి ఆమె రెండు చేతులు ఆప్యాయం గా పట్టుకుని ముద్దాడాడు ఏకాంబర్.

అంత ఇదిగా ఆ అమ్మాయి ఏదో ఇస్తూంటే వద్దంటావేం రా తీసుకో టిఫిన్ ప్లేటుతో గదిలోకి వస్తూ అంది పర్వతాలు.

అలా చెప్పండాంటీ! అంటూ చెక్కు ఏకాంబర్ చేతిలో పెట్టి పర్వతాలు చేతిలో వున్న టిఫిన్ ప్లేటు తీసుకుంది నూకరత్నం.

పెళ్ళి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. ఇంకా రెండు రోజులే వుంది పెళ్ళి.  పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతున్నకొద్దీ ఆందోళనగా వుంది ఏకాంబర్ కి. పెళ్ళి వాళ్ళకి ఇస్తామన్న కట్నకానుకల కోసం తను ఇన్స్యూరెన్స్ కంపెనీలో అప్పు కోసం ధరఖాస్తు చేసాడు. అదీ ఇంకా శాంక్షన్ కాలేదు. నూకరత్నం ఇచ్చిన చెక్కు మార్చబుద్ది కాలేదు. తన చెల్లి పెళ్ళి తన కష్టం తోనే చెయ్యాలనుకున్నాడు. కానీ, సమయం చూస్తే మించిపోతుంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు.

అమ్మానాన్న చూస్తే ఎంతో సంతోషం గా వున్నారు. చెల్లాయిని పెళ్ళికూతుర్ని చేసే ఏర్పాట్లలో బంధువులందరిని పిలవడానికి వెళ్ళారు.నీలాంబర్ తనకేమీ పట్టనట్టు తన కంప్యూటర్ సెంటర్ కి వెళ్ళిపోయాడు. అలివేలుమంగ పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతున్నకొద్దీ ఉత్సాహంగా, ఉల్లాసం గా తిరుగుతోంది. ఏకాంబర్ సెల్ ఫోన్ మోగింది. గబాలున ఫోన్ తీసి చూసాడు. ఇన్స్యూరెన్స్ కంపెనీ మేనేజర్.హమ్మయ్య లోన్ సాంక్షన్ అయ్యుంటుంది.

హలో సార్ గుడ్ మార్నింగ్ ఆనందంగా విష్ చేసాడు ఏకాంబర్.

ఏం మార్నింగోనయ్యా! చస్తున్నాం! రేపు మన కంపెనీ చైర్మెన్ గారు ముంబై నుండి వస్తున్నారట.

సార్! నా లోన్ సంగతి ఏమైంది సార్! ఆగలేక అడిగేసాడు ఏకాంబర్.

నీ లోన్ ఇంకా శాంక్షన్ ఆర్డర్ రాలేదు ఏకాంబర్! ముందు నేను చెప్పింది వినండి ప్లీజ్ అభ్యర్ధించాడు బ్రాంచి మేనేజర్.చెప్పండి సార్! అయిష్టం గానే అన్నాడు ఏకాంబర్.

రేపు హోటల్ లో ఉదయం నుండి పదిగంటలకి ఎచీవర్స్ మీట్ వుంది కదా! నీకు మీ డెవలప్ మెంట్ ఆఫీసర్ చెప్పే వుంటాడు కదా!అయితే... అతృతగా అడిగాడు ఏకాంబర్.

మొన్న నువ్విచ్చిన క్లైం సెటిలయ్యిదట. దాని చెక్కు నామినీకి ఇచ్చి ప్రెస్స్ కి న్యూస్  రిలీజ్ చేద్దామంటున్నారు. మీరు అర్జెంటుగా బండ్ల రాజు గారి భార్యని తీసుకుని ఎలాగైనా రేపు తాజ్ హోటల్ మీటింగ్ కి రాక తప్పదు స్థిరం గా చెప్పాడు బ్రాంచిమేనేజర్.

వెంటనే మేడి పండు అబద్దాలరావు గారికి ఫోన్ చేసాడు ఏకాంబర్.

నాలుగైదు సార్లు ఎమ్మెల్యే కి ఫోన్ చేసి విసిగిపోయి , ఎమ్మెల్యే పి.ఏ కి కాల్ చేసాడు.

సార్ హైద్రాబాద్ లో వున్నారు. శాసన సభ జరుగుతోంది. ఈ పది రోజులు మీకు ఆయన దర్శనం జరగదు చెప్పాడు ఎమ్మెల్యే పీ.ఏ.బండ్ల రాజు భార్యకి విషయం చెప్పి రేపు తాజ్ హోటల్ కి వెళ్ళే ఏర్పాటు చెయ్యాలి. కాదు కూడదంటే తానే దగ్గరుండి తీసుకువెళ్ళక తప్పదు. ఆలోచిస్తూ బైక్ ని కంచెరపాలెం హైవేలో పరుగులెట్టిస్తున్నాడు. ఏకాంబర్.బండ్ల రాజు గారి భార్య పిల్లలు ఇక్కడే గా వుండేది. ఒకసారి ఆమెని పిలుస్తారా? అడిగాడు ఏకాంబర్.ఆల్లెక్కడున్నారు బాబు. బండోడు చనిపోయిన మరునాడే ఎమ్మెల్యే గారే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడి నుండి తరిమేసారు. పాపం ఆ చిన్న పిల్లల్ని తీసుకుని గోడున ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది అని అనుచరుడి భార్య చెప్పింది.ఇక్కడికి దగ్గర్లోనే వుంటుంది అని మరో అనుచరుడి భార్య చెప్పింది.

మీలో ఎవరో ఒకరు ఆమెని తీసుకుని బీచ్ రోడ్ లో వున్న తాజ్ హోటల్ కి రాగలరా... అడిగాడు ఏకాంబర్.

బండ్లరాజు చనిపోయాడు కదా.. అందుకని ఆయన క్లైం చెక్కును రేపు అక్కడ మీటింగులో ఇస్తారు అని చెప్పాడు ఏకాంబర్.

అప్పుడే ఇంటికొచ్చిన సత్యవతి వాళ్ళని చూస్తూనే ఏంటొదినా ఇలా వచ్చారు.. ఏంటి పని.. బైక్ మీద వచ్చి సడన్ బ్రేక్ వేసిన ఏకాంబరాన్ని చూస్తూ ఉలిక్కిపడి అడిగింది.

నీ కోసమే వచ్చాం.. ఈ బాబు గారు నిన్ను కలవాలంటే.. అని చెప్పారిద్దరూ...

మీ ఆయన పోయారు కదమ్మా! ఆయన పేర వున్న ఇన్స్యూరెన్స్ పాలసీ డబ్బు వచ్చింది. రేపు బీచ్ రోడ్ లో వున్న తాజ్ హోటల్ లో చెక్కు ఇస్తారు రండమ్మా.. అని తనొచ్చిన పని చెప్పాడు ఏకాంబర్.

అలాగే బాబూ తప్పక వస్తాము సత్యవతి తో పాటు అన్నారు ఆడవాళ్ళు ఇద్దరూ.

మీటింగ్ కోసం వచ్చాడే కానీ ఏకాంబర్ కి ముళ్ళ మీద కూర్చున్నట్టే వుంది. రేపే చెల్లెలి పెళ్ళి. ఏర్పాటలన్నీ అయిపోయినా, ఇంటికి వస్తున్న బంధువుల యోగక్షే మాలు  తెలుసుకుంటూ సౌకర్యాలు ఏర్పాట్లు చేయాల్సిన పని ఆదుర్ధాలో వున్నాడు.

ఇంతలో ఇన్స్యూరెన్స్ అదికారులు, డెవలప్ మెంట్ ఆఫీసర్లు ఏజెంట్లలో కలకలం బయలుదేరింది. అందరూ ఇన్స్యూరెన్స్ కంపెనీ చైర్మెన్ గారు వస్తున్నారనేసరికి ఆతృతగా మీటింగ్ హాల్లో నుండి గేటు దగ్గరకు వచ్చారు.

కంపెనీ చైర్మెన్ చేతుల మీదుగా సత్యవతికి చెక్కులు ఇప్పించారు.

ఆ సమావేశం లో జోనల్ టాపర్ గా ఏకాంబర్ ని వేదిక మీద ఘనం గా సన్మానించారు.

రాజనాలకు కూడా జోనల్ టాపర్ గా సన్మానం జరిగింది.

అందరూ హోటల్ నుండి బయటకు వచ్చారు.

అమ్మా ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి. నేను ఇంటికి వెళ్ళాలి.  ఏకాంబర్ అన్నాడు వారితో.

ఈ చెక్కు ఎలా మార్చాలో నాకు తెలీదయ్యా.. నువ్వే ఏదోకటి చెయ్యాలి  అంది సత్యవతికి.

అదేమిటీ?! మీకు మీ వారికి ఒక బ్యాంకు అకౌంట్ వుంది కదా! అందులో వేయండి. అన్నాడు ఏకాంబర్.

కూలీకి అయ్యగారి దగ్గర కాపలా కుక్కలా పడుండే మా బోటోళ్ళకి బ్యాంకు ఖాతా లెక్కడివయ్యా... అన్నారు మిగతా ఆడవాళ్ళిద్దరూ..ఏకాంబర్ ఆశ్చర్యం గా వారికేసి చూసాడు.|

అదేమిటీ మీ భార్యాభర్తలిద్దరి పేర బ్యాంకు అకౌంట్ వుందే అంటూ గబాలున తన బ్యాగ్ లో  చూసాడు. మరణ దృవ పత్రం, అకౌంట్ కాపీ జిరాక్స్, డెత్ సర్టిఫికెట్ కాపీలు ఆమె చేతికి ఏకాంబర్ ఇవ్వబోతే.. మాకొద్దయ్యా... మీరే ఏమైనా చేయండి.. మాకేమీ తెలియదు అంది దీనంగా సత్యవతి.

వెంటనే మహారాణి పేట , కలెక్టరాఫీసు దగ్గరికి సత్యవతిని, ఆమెతో వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళాడు.మేడం ఈ అకౌంట్ ఒకసారి చూస్తారా! అంటూ పాస్ బుక్ జిరాక్స్ కాపీ కౌంటర్ లో ఇచ్చాడు.

సార్ పాస్ బుక్ కావాలి ఇలా జిరాక్స్ కాపీలతో అకౌంట్ చూడకూడదు  కౌంటర్ లో వున్న అమ్మాయి సీరియస్ గానే ఏకాంబర్ కి సమాధానం చెప్పింది.

ముగింపు వచ్చే సంచికలో..................

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్