Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

అవికా గోర్ తో ముఖాముఖి

interview with avika gor

హీరో ఎవ‌రైనా.. నా రూల్స్ నావే - అవికా గోర్

'ఉయ్యాల జంపాల' సినిమా చూస్తే అవికాగోర్‌ని మ‌ర్చిపోలేం. అమాయ‌క‌మైన మొహం, హుషారైన న‌ట‌న‌, చ‌లాకీ చూపులు వెర‌సి - మ‌నింటి అమ్మాయేనేమో అనిపిస్తుంది. అంత‌కు ముందే.. 'చిన్నారి పెళ్లికూతురు'తో అంద‌రి హృద‌యాల‌నూ దోచుకొన్న అవికా.. ఈసినిమాతో మాత్రం గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుంది. ఆ త‌ర‌వాత ఎన్నో అవ‌కాశాలు ఆమె ముందు వాలిపోయాయి. కానీ.. అవికా తొంద‌ర ప‌డ‌డం లేదు. త‌న వ‌య‌సు, అభిరుచులు, ఇష్టాలూ అన్నీ దృష్టిలో ఉంచుకొనే క‌థ‌లు ఎంచుకొంటోంది. తాజాగా ఆమె న‌టించిన 'ల‌క్ష్మీ రావె మా ఇంటికి' ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సందర్భంగా అవిక‌తో.. 'గో తెలుగు' ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. ఆ సంగ‌తులు ఇవీ..

* హాయ్ అవికా... ఎలా ఉన్నారు..?
- నేను సూప‌రండీ..

* ల‌క్ష్మీ రావె మా ఇంటికి చూసి జ‌నాలు ఏమంటున్నారు..?
- ఇలాంటి కూతురు మాక్కూడా ఉంటే బాగుంటుంది అనుకొంటున్నారు. నాలో త‌మ కూతుర్ల‌ను చూసుకొంటున్నారు.. ఇంత‌కంటే ఏం కావాలి..?

* మ‌రి టీనేజ్ వాళ్ల మాటేంటి?
- అమ్మాయిల‌కు నా క్యారెక్ట‌ర్ భ‌లే న‌చ్చేసింది. అమ్మాయంటే నీలా ఉండాలి అని కాంప్లిమెంట్లు ఇచ్చారు..

* ల‌క్ష్మి పాత్ర‌.. మీ నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుందా..?
- చాలా. ఎందుకంటే నేను కూడా ల‌క్ష్మీలానే త‌ల్లిదండ్రుల మాట‌కు ఎక్కువ‌గా విలువిస్తా. వాళ్లే నా ప్రాణం.

* ప్రేమించ‌మంటూ అబ్బాయి వెంట‌ప‌డితే...
- ఏమో మ‌రి. అలాంటి అనుభ‌వం నాకింకా ఎదురుకాలేదు.

* తెలుగు ప‌రిశ్ర‌మ ఎలా అనిపించింది?
- ఐయామ్ హ్యాపీ అండీ. సెట్లో న‌న్ను మ‌హారాణిలా చూసుకొంటున్నారు.

* ఉయ్యాల జంపాల త‌ర‌వాత చాలా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ట‌.  కానీ రెండు సినిమాలే ఎంచుకొన్నారు. కార‌ణం ఏంటి?
- నాకు ఆద‌రాబాద‌ర‌గా సినిమాలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. వ‌చ్చిన పేరు పోకుండా.. జాగ్ర‌త్త‌గా ఉండాలి క‌దా. పైగా నాకు సీరియ‌ల్స్ ఉన్నాయి. నాకంటూ ఓ అభిమాన గ‌ణం ఉంది. వాళ్ల కోసం టీవీల్లో క‌నిపిస్తూనే ఉండాలి. ఇటు సినిమా అటు బుల్లితెర రెండింటికీ స‌మ‌యం ద‌క్కాలి క‌దా..? అందుకే మంచి పాత్ర‌లు వ‌చ్చిన‌ప్పుడే ఒప్పుకొంటున్నా.

* అస‌లింత‌కీ మీ దృష్టిలో మంచి పాత్ర అంటే..?
- నా వ‌య‌సుకి త‌గిన‌ట్టుగా ఉండాలి.

* అంటే గ్లామ‌ర్, ఎక్స్‌పోజింగ్‌.. వీటిపై అభ్యంత‌రాలు లేవ‌న్న‌మాట‌..
- భ‌లేవారే. ఎక్స్‌పోజింగ్ అంటే నేను చ‌చ్చినా ఒప్పుకోను. నాకు హోమ్లీ ఇమేజ్ అంట‌నే ఇష్టం. ఎక్స్‌పోజింగూ, ముద్దులూ అంటే నో చెప్తా. హీరో ఎవ‌రైనా స‌రే, నా ష‌ర‌తులు ఇవే.

* ఇలాంటి ష‌ర‌తులు విధిస్తే అవ‌కాశాలెలా వ‌స్తాయ్‌?
- ఇలాంటి ష‌ర‌తుల‌తోనే అవ‌కాశాలు అందుకొన్న‌వాళ్లు, మంచి పొజీష‌న్‌లో ఉన్న‌వాళ్లు ప‌రిశ్ర‌మ‌లో చాలామంది ఉన్నారు. వాళ్లంతా నాకు స్ఫూర్తే.

* ఇంతకీ మీ అభిమాన హీరోలెవ‌రు?
- బాలీవుడ్‌లో షారుఖ్‌, ఇక్క‌డ ప‌వ‌న్‌..

* ప‌వ‌న్‌లో బాగా న‌చ్చిన అంశం..
- అత‌ని స్టైల్ బాగుంటుంది. అత్తారింటికి దారేది సినిమా చూశా. అందులో బండి దిగే స‌న్నివేశం బాగా న‌చ్చింది. అలాంటి సీన్స్‌లోనూ త‌న దైన స్టైల్ చూపిస్తారాయ‌న‌.

* న‌ట‌న కాకుండా మీకు ఇష్ట‌మైన రంగాలేంటి?
- ద‌ర్శ‌క‌త్వం అంటే ఇష్టం. ఎప్ప‌టికైనా మెగాఫోన్ ప‌డ‌తా. ఈలోగా డైరెక్ష‌న్‌కి సంబంధించిన అవ‌గాహ‌న పెంచుకొంటా.

* సినీ స్టార్ అయ్యాక కూడా సీరియ‌ల్స్ వ‌ద‌ల్లేదు. కార‌ణం ఏంటి?
- నాకు గుర్తింపు ఇచ్చిన‌వే అవి. పైగా కొన్నేళ్లుగా ఓ జీవితానికి, ప‌నికీ అల‌వాటు ప‌డిపోయా. ముందే చెప్పిన‌ట్టు నాకంటూ అభిమానులున్నారు. వాళ్ల‌ని సంతృప్తి ప‌ర‌చాలి.

* ల‌క్ష్యాలేమైనా ఉన్నాయా?
- మ‌న‌కిష్ట‌మైన ప‌నిని ఎంజాయ్ చేస్తూ చేసుకొంటూ పోవ‌డ‌మే. అంత‌కు మించిన ల‌క్ష్యాలెందుకు..?

* త‌ర‌వాతి సినిమా ఏమిటి?
- రాజ్ త‌రుణ్‌తోనే సినిమా చూపిస్త మావ లో న‌టిస్తున్నా. పంజాబీ అమ్మాయిని. బబ్లీగా క‌నిపిస్తా. ఇప్పుడొచ్చిన రెండు సినిమాల్లోని నా పాత్ర‌ల‌కంటే డిఫ‌రెంట్ గా ఉంటుంది.

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్యూ..

- కాత్యాయిని

మరిన్ని సినిమా కబుర్లు
Lingaa - Movie Review