Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekambar

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ: సౌమ్య తో తనకు పెళ్ళయిన నేపథ్యం గురించి మేఘన తో చెప్తుంటాడు డా. హరి.
ఆ తరువాత.................................

..........................................

 

ఆ అమ్మాయి ఇల్లెక్కడో తెలుసా నీకు అన్నారు. తెలీదు...

ఆ అమ్మాయికి అమ్మా, నాన్నలున్నారో లేదో తెలుసా? తెలీదు...

సరే నేను చెపుతాను విను... ఆ అమ్మాయికి అమ్మానాన్నలు లేరు, చిన్నప్పుడే పోయారు. ఉన్నది ఒక్కతే అక్క. ఆ అక్క దగ్గరే ఈమె ఉంటున్నది, అక్క భర్త యూనివర్సిటీలో అటెండర్‌...

నేనొక ప్రొఫెసర్‌ని, మీ అమ్మ ప్రొఫెసర్‌, నువ్వు ఒక డాక్టర్‌, నువ్వు రేపు పీజీ చేయాలి, సూపర్‌ స్పెషాలిటీ చేయాలి, లైఫ్‌చాలా ఉంది. ఆ అమ్మాయి ఏ విధంగానూ నీకు సరిపోదు. ఒక అటెండర్‌తో సంబంధం కలుపుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఒకవేళ అటెండర్‌ అయినా కాంప్రమైజ్‌ అవొచ్చు. మనిషి మంచివాడయితే, ఎప్పుడూ దొమ్మీ కేసులు, కొట్లాటలలో ఇరుక్కుని పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటాడు. మర్డర్‌ కేసు కూడా ఉందని చెప్పుకుంటున్నారు. పెద్దలెప్పుడో చెప్పారు దుష్టులతో, దుర్మార్గులతో సంబంధం కలుపుకుంటే అది మన వినాశనానికి దారి తీస్తుందని... సినిమాలు చూసి నువ్వనవచ్చు... నేను ప్రేమించింది సౌమ్యని ఆమె అక్కాబావలను కాదు అని... ఆ మాటలు సినిమాల వరకే బాగుంటాయి... నిజ జీవితంలో కాదు.

కొంచం జాగ్రత్తగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. అన్నారు నాన్నగారు.’’

‘‘హీరో నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగుండదు..’’

ఈసారి చిన్నగా మేఘన నెత్తిన మొట్టికాయ వేసాడు హరి.

‘‘సరిగ్గా అదే జరిగింది... నా మాట కాదనలేక అమ్మానాన్న వెళ్లి వాళ్లనడగడం వాళ్లు ఆనందంతో తబ్బిబ్బయ్యి ఒప్పుకోవడం, పెళ్లి జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి.’’

‘‘కథ కంచికి... ఇక నేనింటికీ... ఇప్పటికే చాలా పొద్దుపోయింది.’’ అన్నది మేఘన.

‘‘అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది... నీకు వినాలని ఉంటే చెబుతాను.’’ అన్నాడు హరి.

‘‘తప్పదంటారా?’’

‘‘నిజానికి నాకు చెప్పే ఉద్దేశం లేకపోయినా నీవడిగావని మొదలుపెట్టాను... కానీ ఇప్పుడు పూర్తి చేయకపోతే నాకేదో అసంతృప్తిగా ఉంటుంది.’’

‘‘సరే కానివ్వండి... కానీ... సిగ్గు విడిచి మీకో నిజం చెప్పాలని ఉంది.’’

‘‘మన మధ్యలో సిగ్గులు ఎగ్గులెందుకు.? చెప్పు’’

‘‘ఇవే కబుర్లు నీ ఒడిలో తలవాల్చి చెప్పుకోవాలని ఉంది.’’

‘‘అదేదో పెద్ద ఆకాశం నుంచి ఊడిపడిపోయే ఊసులాగా చాలా గొప్పగా చెప్పావు.’’

‘‘హరీ... నీ సాన్నిహిత్యంలో సాన్నిధ్యంలో ఎందుకు నేనింత సంతోషంగా ఉంటాను?’’

‘‘స్త్రీ పురుషుల సాన్నిహిత్యంలో రెండు రకాలున్నాయి. ఒకటి శారీరక సాన్నిహిత్యం రెండోది మానసిక సాన్నిహిత్యం... మానసిక సాన్నిహిత్యం మొదటి దానికన్నా చాలా గొప్పది. ఎన్ని రకాల కళలైనా మనసును రంజింప చేయడానికే అన్నారు పెద్దలు. మనసును రంజింపజేసి, సంతోషాన్నిచ్చేది మానసిక సాన్నిహిత్యం అది పొందిన దంపతుల దాంపత్య జీవితం అమరం, అజరామరం.’’

‘‘డాక్టరు గారికి సాంప్రదాయాలు అన్నీ బాగా తెలుసునే...? అన్నీ తెలిసి ఈ పొరపాటెలా చేస్తున్నారు?’’

‘‘ఏ పొరపాటు?’’

‘‘నాతో స్నేహం పొరపాటు కాదా? సమాజానికి వ్యతిరేకం కాదా? మీ భార్యకి ద్రోహం కాదా?’’

‘‘నీతో స్నేహం పొరబాటా? కాదా? అనే విషయం నేనెప్పుడూ ఆలోచించలేదు. ఒక జీవి, ఒక ఆత్మ పరితపిస్తుంది. ఏదో విషయమై దుఃఖంగా ఉంది, ఆ ఆత్మకి కాస్త ఊరట కలిగించడం పొరపాటనీ, తప్పనీ కించిత్‌కూడా నా మనసుకు అనిపించలేదు.

ఇక సమాజం... ఒకరిని చూసి ఒకరు మితిమీరి నీతి బాహ్యంగా ప్రవర్తించకూడదని కట్టుబాట్లు పెట్టింది ఈ సమాజమే... ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని హరించడం మహా పాపమన్నదీ ఈ సమాజమే... నీ మాన ప్రాణ సంరక్షణకై చేసే పోరాటంలో నీవు అసంకల్పితంగా ఎదుటివాని ప్రాణాలు హరిస్తే దానికి నీ బాధ్యత లేదని చెప్పిందీ ఈ సమాజమే...

గత దశాబ్దంలో వచ్చిన అన్ని  భాషల సినిమాలన్నీ చూస్తే భర్త నిర్ణయుడై దుర్మార్గుడై, నిస్సహాయురాలైన భార్యని హింసిస్తుంటే ఆ భార్య భర్తని విడనాడితే, ఆ భార్యని మెచ్చి, ఆ సినిమా సూపర్‌డూప్‌హిట్‌ చేసిందీ ఈ సమాజమే... మాంసం తిను నాయనా కానీ ఎముకలు మెడలో వేసుకుని తిరగవద్దు నాయనా అని చెప్పిందీ... ఈ సమాజమే.

పదిమందీ కలిస్తే సమాజం.

పదిమంది ఎదురుగా నేను చేసింది తప్పా? అంటే ఔను తప్పే అంటారు.ఒక్కొక్కడ్ని విడి విడిగా కలిసి అదే మాట అడిగితే తప్పేం లేదంటారు.మరెందుకలా అందరిలో మీ మనసులోని మాట చెప్పలేక పోయారంటే... తప్పదు నాయనా... సమాజానికి తల వంచాలంటారు.ఏ విధంగా చూసినా... నేను చేసింది పొరపాటుగా నేను భావించడం లేదు.

ఇక భార్య ద్రోహం లాంటి పెద్ద మాటలు వినసొంపుగా లేవు. నేను సౌమ్యను అన్యాయం చేయడం లేదు. ఆమె ఆలనా, పాలనా, కుటుంబ బాధ్యత ఎక్కడా ఏ కోశానా లోపం చేయడం లేదు. ఇక ప్యూరిటీ, శుద్దత్వం... నా మనస్సులో ఏ కల్మషం లేదు, నా శరీరం ఎలా కలుషితమవుతుంది?

నేను కావాలని, వేషభాషలేసి, రసాభాస చేసి కలుషితమైన మనస్తత్వంతో నీతో స్నేహం చేసి ఉంటే తప్పక అది తప్పే అవుతుంది. కానీ నేనేం అలా చేయలేదు కాబట్టి నాకేమీ గిల్టీ ఫీలింగ్‌లేదు.

‘‘ఇదే మాట మీ భార్య మీతో అంటే.’’

‘‘అంటుంది... అని తీరుతుంది... ఎప్పుడు? నా కర్తవ్యాన్ని, నా విధుల్ని... నా బాధ్యతల్ని విస్మరించి కనీస ధర్మాలైన ప్రేమ, ఆదరణ, స్నేహం, సాన్నిహిత్యం, అప్యాయత, భద్రత, మానసిక ప్రశాంతత, శారీరక ఉత్సాహం ఇవేమీ తనకివ్వలేకపోతే తప్పక ఆ సిచ్యువేషన్‌ఫేస్‌చేయాలి...

దేవుడు స్త్రీ పురుషుల్ని సమానంగానే తయారుచేసాడు. ఒకరికో రూలు ఇంకొకరికో రూలు లేదు. నీవు చెప్పిన సిచ్యువేషన్‌లో సమాజం సమర్ధించేది నన్ను కాదు, నా భార్యని.’’

‘‘చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది.’’

‘‘స్థిరంగా ఆలోచిస్తే అన్నీ తేటతెల్లమవుతాయి. కన్‌ఫ్యూజన్‌ ఏమీ లేదు.’’

‘‘ఔను... ఇంతకీ సౌమ్య ఎక్కడుందీ..?’’

‘‘సిమ్లాలో...’’

‘‘సిమ్లాలోనా..?’’

‘‘ఔను..’’

‘‘ఎంతకాలంగా..?’’

‘‘గత ఆరు నెలలుగా...’’

‘‘ఎందుకు..?’’

‘‘తను కొంచెం మానసికంగా దెబ్బతిన్నది, కోలుకోవడం కోసం.’’

‘‘నీ వంటి మనిషి తోడు నీడలో.... మానసికంగా దెబ్బ తినడమా...! నమ్మశక్యం కావడం లేదు.’’

‘‘నాకూ నమ్మశక్యం కావడం లేదు, కానీ జరిగిన సంఘటనలు అటుంటివి...’’

‘‘సిమ్లాలో ఎవరున్నారు...?’’

 

సౌమ్య, హరిల మధ్య ఎలాంటి విభేధాలు లేవా? అసలు హరి చెప్తున్న దాంట్లో నిజానిజాలెంత??
వచ్చే వారం తెలుసుకుందాం......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti