Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ : సౌమ్యతో పెళ్ళికి ఎదురైన అభ్యంతరాలు..ఆనాటి పరిస్తితులు మేఘనకు చెప్తూంటాడు హరి...

ఆ తర్వాత.....

‘‘మా పిన్ని కూతురు, అక్కడ ఆల్ ఇండియా ఆడిట్ట్రైనింగ్ఇన్స్టిట్యూట్లో డైరక్టర్, ఆమె భర్త సైకియాట్రిస్ట్. కొద్ది రోజులు తమ దగ్గర ఉంచుకుంటామని నాతో కొట్లాడి సౌమ్యని తీసుకెళ్లారు. ప్రస్తుతం తను బాగానే కోలుకుంది. వచ్చేవారమో, ఆపై వారమో వెళ్లి తీసుకురావాలి.’’‘‘సౌమ్య వచ్చిన తర్వాత నన్ను మరిచిపోతావు కదా..?’’

‘‘ఇదేమన్నా కొత్త రూలా? నువ్వు పెట్టావా? నేను పాటించాలా?’’

‘‘అలా అని కాదు. సౌమ్య లేదు కాబట్టి నాతో చనువుగా ఉన్నావు. తను వచ్చేస్తే నామీద ఇంట్రస్టు తగ్గిపోతుందిగా?’’

‘‘తెలుగు సినిమా ఎఫెక్టులంటే ఇవే... తాగేసిన బ్రాందీ సీసా, పీల్చేసిన సిగరెట్పీక, అనుభించేసిన ఆడదాన్ని చూస్తే నాకసహ్యం అన్నాడంట ఒక విలన్. అవన్నీ సినిమాల వరకే. మగవాళ్లందరూ విలన్లూ, కఠిన హృదయులూ కారు. కానీ ఒక విషయం కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యం ముందు తర్వాత మిగిలిన విషయాలు. మన ప్రైమరీ అనగా ప్రాథమిక బాధ్యత కుటుంబం... నీకు గానీ నాకు గానీ దాని తర్వాతే ఏదయినా... ఈ బాధ్యతని విస్మరిస్తే సమాజం గానీ కుటుంబం గానీ హర్షించదు.’’

‘‘అంటే... మీ హాస్పిటల్... కుటుంబం... అన్ని పనులు కాగా ఎప్పుడన్నా మీరు తీరికనిపిస్తే నన్ను గుర్తు చేసుకుంటారన్నమాట.’’‘‘సువర్ణ సుందరి అని నలభయేళ్ల క్రితం సినిమా ఒకటుంది... చూసావా?’’

‘‘చూళ్లేదు... చూసినా అర్థం కాదు... అంత పాత సినిమాలు కూడా చూస్తావా..?’’

‘‘స్టోరీ చెప్పనా?’’

‘‘ఇప్పుడెందుకు?’’

‘‘ఆ స్టోరీ చెబితే నీకు సరిగ్గా అర్థమవుతుంది.’’

‘‘ఓకే...’’

‘‘సువర్ణ సుందరి లో నాగేశ్వరరావు మానవుడు, అంజలీ దేవి దేవ కన్య, ఇంద్రుడి దగ్గర పనిచేస్తుంటుంది డాన్సర్గా... భూలోక పర్యటనకొచ్చి నాగేశ్వరరావుని ప్రేమించి, వదలలేక, వదలలేక తన లోకానికీ, డ్యూటీకి వెళ్లిపోతూ... పోతూ ఇదిగో ఈ పిల్లనగ్రోవి (ఫ్లూటు) ఇస్తున్నాను. నన్ను కలవాలనిపిస్తే ఇది ఊదు వెంటనే నీ ముందుంటాను అని వెళ్లిపోతుంది.

అంజలీ దేవేమో ఇంద్రుడి దగ్గర ఎంప్లాయీ... ఏ ఎంప్లాయిమెంట్లేకుండా బలాదూర్గా తిరిగేవాడు నాగేశ్వరరావు. ఒకరోజు ఆమె డ్యూటీ మధ్యలో, సభా మధ్యలో, కొన్ని వందలమంది సమక్షంలో బిజీగా     ఉన్నప్పుడు పనీపాటాలేని నాగేశ్వరరావుకు ఆమె గుర్తుకొచ్చి బూర(ఫ్లూటు) తీసి ఊదుతాడు. ఫ్లూటు మహిమేమిటంటే ఊదగానే బలవంతంగా అంజలీ దేవిని లాక్కొచ్చి నాగేశ్వరరావు ముందు పడేస్తుంది. సరే నాగేశ్వరరావు ఫ్లూటు వాయించగానే ఆమెనేదో శక్తి లాక్కెళ్లాలని చూస్తే, బలవంతంగా ఆపుకుంటుందామె.

ఏమిటీ ఈమె ఇంకా రాదేమిటని పిచ్చిపట్టిన వాడిలాగా నాగేశ్వరరావు ఫ్లూటు వాయిస్తూనే ఉంటాడు. ఆమె వెనకు ముందులాడి ఢామ్మని పడిపోతుంది. విషయం అందరికీ తెలిసిపోయి రసాభాస అయిపోతుంది. కొంపమునుగుతుంది.’’

‘‘సువర్ణ సుందరి స్టోరీకి, మన స్టోరీకి పోలికేమిటి?’’

‘‘నీ మీద ఇంట్రస్టు తగ్గలేదని నిరూపించుకోవడానికి నేను ఖాళీ దొరికినప్పుడల్లా నాగేశ్వరరావు లాగా ఫోన్లు మీద సెల్ఫోన్లు కొడితే ఎక్కడున్నా నువ్వు వచ్చేయగలవా? ఈజ్ఇట్పాజిబుల్? నీకు పిల్లాడు, కుటుంబ బాధ్యతలున్నాయి కదా? ఎక్కడివక్కడ వదిలేసి నేను బూర ఊదగానే ఎగురుకుంటూ వచ్చేయగలవా? ఏదో నోటికొచ్చింది మాట్లాడేయటమేనా? కొంచం ఆలోచించేది లేదా? ఏమంటావు?’’

‘‘తప్పై పోయింది క్షమించు మహానుభావా? అర్థమయ్యింది, బాగా అర్థమయ్యింది, ఇంతకీ సౌమ్య ఎందుకలా డిస్ట్రబ్అయ్యింది?’’‘‘అసలు నీకు సౌమ్య గురించి తెలుసుకోవాలని లేదు..’’

‘‘ఎందుకలా అనుకుంటున్నావు?’’

‘‘ఏదేదో మాట్లాడతావు మేఘనా నువ్వు. అసలు పాయింటు తప్ప...’’

‘‘ఏమో... హరీ... నీతో మాట్లాడాలనిపిస్తుంది, కొట్లాడాలనిపిస్తుంది, వాదోపవాదాలు చేయాలన్పిస్తుంది. ఇవన్నీ జీవితంలో ఎంత మిస్సయి పోయాను నేను?’’ సడన్గా మేఘన గొంతులో గద్గత, కళ్లల్లో నీళ్లు.

ఒక్కసారిగా తన ఒడిలో తలపెట్టుకుని మాట్లాడుతున్న మేఘనను పూలచెండులాగా పైకి లేపి తన హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు హరి. గువ్వలాగా ఒదిగిపోయింది మేఘన. ఆమె కన్నీళ్లు ఆనంద బాష్పాల రూపంలో అతని గుండెని తడిపేస్తున్నాయి. శారీరక సాన్నిహిత్యం కంటే రెండు హృదయాల సాన్నిహిత్యం అక్కడ రాజ్యమేలుతోంది. ఇద్దరిలోనూ ఏ కోరికా లేదు. చాలాసేపటి తర్వాత నెమ్మదిగా అన్నది మేఘన.

‘‘హరీ... పక్కటెముకలు (రిబ్స్) విరిగితే కట్లుకడతారా లేక కుట్లు వేస్తారా? రేపు ఆ పని చేయగలవా?ఒక్కసారిగా పెద్దగా నవ్వు ముంచేసింది హరిని. గబుక్కున ఆమెని వదిలేసాడు. తన ప్లేస్లో యథావిధిగా రిలాక్సయ్యింది మేఘన.

‘‘ఎందుకు సౌమ్యకా పరిస్థితి వచ్చింది?’’ అన్నది.

‘‘సౌమ్య తన అక్క దగ్గర ఉండి చదువుకునేదని చెప్పాను కదా. ఆ అక్క భర్త గుణగణాల గురించి చెప్పాను కదా..?’’‘‘ఔను.. ఏదో మర్డరు కేసులో ఉన్నాడనుకుంటున్నారు అన్నావు.’’

‘‘అతని పేరు రవిబాబు.’’

‘‘సూర్యుడిలాగా ధగధగ మెరిసిపోయే గుణగణాలున్న మనిషన్నమాట’’

‘‘ఈ రవిబాబు మాకు పెళ్లైన కొత్తలో చేదోడు వాదోడుగా ఉంటూ సహాయంగా మంచిగా ఉండేవాడు. ఏదో అటెండర్ని.... చాలీ చాలని జీతం, ఆరుగురు పిల్లలు... అంటూ పదీ పరకా అడిగి తీసుకునేవాడు నా దగ్గర. ఉన్నంతలో ఇచ్చేవాడిని. అదీగాక తన భార్యతో చెప్పి సౌమ్య దగ్గర కూడా వసూలు చేసుకునేవాడు. ఏదో అక్క, ఆరుగురు పిల్లలు కదా అని నేను తనకిచ్చేదాంట్లోంచే ఎంతోకొంత సర్దుతూ ఉండేది.కాలక్రమేణా నేను పీజీ చేయ్యడం, మంచిపేరు తెచ్చుకోవడంతో నాకు ఆదాయం కూడా పెరిగింది. ఇది గమనించిన రవిబాబు గొంతెమ్మ కోరికలు కోరడం మొలుపెట్టాడు. తన భార్యతో బంగారు గొలుసులనీ, ల్యాప్టాప్లనీ, టీవీలనీ, టూవీలర్అనీ, పిల్లల ఫంక్షన్లనీ, ఫీజులనీ రకరకాలుగా సౌమ్యని అడిగించేవాడు.

వీలున్నంతలో నాకు చెప్పి పరీక్ష ఫీజులు ఇతర ఖర్చులకనీ డబ్బులిచ్చేది సౌమ్య.’’‘‘ఉల్టా అయ్యిందనమాట...’’ అన్నది మేఘన.‘‘అంటే...!’’‘‘పిల్లనిచ్చిన మామ దగ్గర గొంతెమ్మ కోరికలు కోరతాడు అల్లుడు. అమ్మాయిని కానీ కట్నం లేకుండా స్వీకరించిన మిమ్మల్ని గొంతెమ్మ కోరికలు కోరుతున్నాడు కట్టబెట్టినవాడు. బాగుంది, మీకు స్ట్రా పెట్టాడన్నమాట.’’

‘‘స్ట్రా... అంటే..?’’

‘‘కోకా కోలా బాటిల్లో స్ట్రావేసి పీలిస్తే కోకాకోలా కొద్ది కొద్దిగా మనం అనుకున్నప్పుడల్లా తాగవచ్చు... అలాగే ఒక మనిషికి స్ట్రా పెడితే వాడి రక్తాన్ని కూడా కొద్ది కొద్దిగా జుర్రుకోవచ్చు. రక్తం బదులు మీ శ్రమనీ, ఆదాయన్నీ కొద్ది కొద్దిగా దోచుకుంటున్నాడు రవిబాబు... బాగుంది.’’‘‘ఈలోగా ఇంకో విషయం తెలిసింది...’’

‘‘ఏమిటది?’’

‘‘సౌమ్య తలిదండ్రులిద్దరూ మరణించలేదు.’’

‘‘మరి..?’’

‘‘తల్లి మరణించింది, తండ్రి బతికే ఉన్నాడు. అంతేకాదు సౌమ్యకు ఇంకొక అక్క, తమ్ముడు కూడా ఉన్నారు.

 


మేఘనతో సాన్నిహిత్యం హరి కాపురంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది...
వచ్చేవారం దాకా ఆగాల్సిందే....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra