Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Keloids | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

28 వ హైద్రాబాదు పుస్తక ప్రదర్శన 2014 - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

28 వ పుస్తక ప్రదర్శన 2014. నిజంగా సాహితీప్రియులకీ, చదువరులకీ సాహితీమృష్టాన్న భోజనం! పుస్తకాలతో నిండిన ఒక్కో స్టాల్ వరసగా క్రమశిక్షణ కలిగిన విధ్యార్ధుల్లా ఆహుతులని గౌరవ అథితులుగా సమాదరిస్తూ ముత్యాలసరాల్లా భాసిల్లాయి. అరల్లో, బల్లలమీదా ఆనాటినుండీ ఈనాటివరకూ సాహితీ సేద్యం చేసిన, చేస్తున్న రచయితలు పుస్తకాల రూపంలో ఒద్దికగా చోటుచేసుకున్నారు. పాఠకులు వేళ్ళతో స్పృశిస్తూ, అరచేతుల్లోకి పుస్తకాలని తీసుకుని అలౌకికానుభూతినొందడం, చూసితీరవలసిన ముచ్చట.

ఎవరన్నారండీ పుస్తకాలకి విలువ తగ్గిందని! ఒక్కసారి పుస్తక ప్రదర్శనలోకి తొంగిచూసి చెప్పమనండి. ఖర్చుకి వెనకాడకుండా అపురూపపెన్నిధిని సొంతం చేసుకుంటున్నట్టు భారమైన పుస్తకాల సంచిని పొదివి పట్టుకుని ఆనందాహ్లాదాలతో అడుగులేస్తున్న వాళ్లని చూసి చెప్పమనండి.

దేశభాషలందు తెలుగు ఎందుకు ఖ్యాతినొందిందో తెలుసుకోవాలంటే తప్పక దర్శించాలి..చిరిగిన చొక్కా తొడుక్కుని..ఎండిన డొక్కతో..సాహిత్యాభిమానంతో పుస్తకాలదొంతర్లని సొంతం చేసుకున్న వాళ్ళ సంతోషం చూడ తరమా? సాహిత్యానికి ఊపిరులూదేవాళ్ళు చాలా మందే ఉన్నారండోయ్, భేష్!( పుస్తక ప్రేమికుడుగా నా భుజం నేనే తట్టుకున్నాను)

పాఠకులని ఉర్రూతలూగించినవి, ఊహలకు ఊపిరిలూదినవి, మెదడుకి పదునుపెట్టినవి, సమాజగతిని మలుపుతిప్పినవి, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడినవి, విజ్ఞాన్నానందించేవి, మూఢ విశ్వాసాలు తొలగించేవి, పద్యాలు, గద్యాలు, పాటలు..ఒక విషయమా? ఒక లోకమా? ముద్రితాలు..అముద్రితాలు..అమూల్యాలు..అలభ్యాలు.ఓహ్! ఆబాలగోపాలం ఆవురావురుమంటూ పుస్తకాలను జుర్రుకుంటూ, మస్తకాలని నింపుకుంటుంటే చూసితీరవలసిందే!

1985 నుండీ ఇప్పటి దాకా 27 పుస్తక ప్రదర్శనలు సిటీ సెంట్రల్ లైబ్రరీ, నిజాం కాలేజీ గ్రౌండ్స్, కేశవ్ మెమోరియల్ హై స్కూల్, పీపుల్స్ ప్లాజా లాంటి వివిధ ప్రదేశాల్లో విజయవంతంగా నిర్వహించబడి నేడు డిశంబరు 17 నుండి 26 వరకు ఎన్ టి ఆర్ స్టేడియం లో 28 వ పుస్తక ప్రదర్శన  జరగడం మన అదృష్టం కాక మరేమిటి?  కలకత్తా బుక్ ఫెయిర్ తర్వాత అతిపెద్దది ఇదే!

ఎన్ని విషయాల మీద పుస్తకాలు కొలువుదీరాయనుకున్నారు? అబ్బో! రాజకీయాలు, సినిమాలు, చరిత్ర, లెక్కలు, వంటలు, హస్తలాఘవం, ఇంద్రజాలం, అతీంద్రియ శక్తులు, వ్యక్తిత్వవికాసం, భాషాపరిజ్ఞానం, ఆటలు, ఓహ్! ఒక్కటనేమిటి? తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మలయాళం, కన్నడ, తమిళ్, ఉర్దూ..భాషల్లో అందర్నీ అలరించే ఐక్యవేదికగా నిలిచిందంటే నమ్మండి.

విద్యార్థులకి కావలసిన అన్ని పుస్తకాలూ దొరకడం నిజంగా అదనపు ఆకర్షణ! ఇహ వాళ్ళు చదివి అభివృద్ధి నిచ్చెనలెక్కడమే తరువాయి.

ఒక్కోసారి మనకి కావాలసిన పుస్తకం కోసం కోఠీ, సికింద్రాబాదు లోని పుస్తకాల షాపులకీ  పిచ్చిగా, కాళ్లరిగేలా ఎన్నిసార్లు తిరిగుంటాం? గుర్తుచేసుకోండి.

ఇప్పుడు వెదకబోయిన పుస్తకం చేతికి దొరికేంత దగ్గరకొచ్చింది. మరి సద్వినియోగం చేసుకోవాలి కదండీ మనం!  మిగతా జిల్లాల వాళ్ళు తమకా అదృష్టం కలగనందుకు (ఫేస్ బుక్కుల్లో..పేపర్లలో చూసి)మనమీద కుళ్ళుకోవడం మాత్రం ఖాయం.

పుస్తక ప్రదర్శన  భారీగానే వుంది. తొక్కిసలాట జరిగేంత పుస్తకప్రియులు నిత్యం దర్శిస్తున్నారు. ఏర్పాట్లూ చక్కగా వున్నాయి. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఇబ్బందులెదురైనా పెద్దమనసుతో తమ కార్యక్రమంలా భావిస్తూ, మనసులో సంపూర్ణ సంతృప్తిని నింపుకుని వెళ్లలేక వెళ్ళలేక ఇంటిముఖంపడుతున్న వాళ్ల బాధ వర్ణనాతీతం (నాకు తెలిసి ప్రతిఒక్కరూ ‘పునర్దర్శన ప్రాప్తిరస్తూ’ అని మనసులో అనుకుని మళ్ళీ మళ్ళీ  పుస్తక ప్రదర్శనలో భాగం పంచుకుని వుంటారనడంలో ఎటువంటి సందేహంలేదు)

అ‘క్షరం’ అంటే నాశనం లేనిదీ అని అర్ధం. అలాంటి అసంఖ్యాక అక్షరాలని కలిగివున్న పుస్తకాలు అంతరించిపోతాయా? తెలుగుభాష నశించి పోతుందా? (అన్నవాళ్ళు, అనుకుంటున్నవాళ్ళు పుస్తకాలకొలువు చూసి నోరు వెళ్ళబెట్టాల్సిందే!) అమంగళం ప్రతిహత మవుగాక! మా భాషని అవసరమైతే మా ఆయుష్షుపోసి అయినా చిరంజీవిని చేసుకుంటాం. తధాస్తు.

అక్కడే పుస్తక ప్రదర్శన మధ్యలో సభావేదికని ఏర్పాటు చేసి,  రచయితలూ కవులతో, ప్రచురణకర్తలతో పరిచయాలు, కవి సమ్మేళనాలు, పుస్తకావీష్కరణలు, పండగ వాతావరణానికి ఏ మాత్రం తీసిపోదు. అవును మరి కనులపండువేకదా! అదో సంబరం..మళ్ళీ సంవత్సరం వరకూ వేచి చూ..డా..లా? ఇదొక్కటే చదువరుల మనసుని మెలేసే బాధ!

మరిన్ని శీర్షికలు
photos..........