Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
28th hyderabad book fair 2014

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆరోజుల్లో ఫుటోలు... - భమిడిపాటి ఫణిబాబు

photos..........

 ఇప్పుడంటే ఇన్స్టెంట్ ఫొటోలు వచ్చాయి కానీ, ఇదివరకటి రోజుల్లో అయితే, ఫొటోలు తీయించుకోవడం ఓ యజ్ఞం లాటిది.ఊరంతటికీ ఓ ఫొటోలు తీసేవాడొకడుండేవాడు. అతని కొట్టుని ఏదో 'ఫలానా స్టూడియో' అనేవారు. అక్కడికి వెళ్ళగానే,అక్కడ ఏ సినిమా స్టారుదో ఓ పేద్ద ఫొటో ఉంటుంది. అలాగే, ఏ సినిమా శతదినోత్సవానికి సంబంధించినదో ఓ ఫొటో.అందులో ఎవరినో సత్కరిస్తున్నట్లుగా ఉండేది. ఆ పక్కనే ఓ బైక్కుమీద కూర్చుని, కంటికి చలవ కళ్ళజోడు ( గాగుల్స్) తో పోజు పెట్టి ఒకడి ఫుటో.

ఆ రోజుల్లో ఎక్కడా అంత పెద్దగా ఫొటోల అవసరం ఉండేవి కావు.ఇంకా మనుషుల్లో, నీతీ నిజాయితీ అనేవి ఉండేవి.పరీక్ష హాల్ టికెట్లకైనా సరే, ఫొటోల అవసరం ఉండేది కాదు.హెడ్మాస్టర్/ప్రిన్సిపాల్ గారి సంతకం తో సరిపోయేది. మరి ఈ రోజుల్లో, దేనికైనా ఫొటో ఐడింటిటీ అవసరం అవుతోంది.ఎందుకంటె,ప్రతీ ఫీల్డ్ లోనూ,ఎప్లికెంటు ఒకడు పరీక్ష రాసేవాడు ఇంకోడూ, ఆఖరికి ఇంటర్వ్యూ లోకూడా అలాగే.అందువలన ప్రతీ విషయంలోనూ ఈ ఫొటో ఐడెంటిటీ కంపల్సరీ అయిపోయింది. పెళ్ళి చూపులకోసం కూడా, ఫొటోలు ఎక్కడుండేవండీ? ఎవరో మధ్యవర్తి వారా ఎవరిదో సంబంధం గురించి వినడం, వాళ్ళ గోత్రం, మిగిలినవీ సరిపోతే పెళ్ళిచూపులకి వెళ్ళడం, పెళ్ళి నిశ్చయించుకోవడం. స్థోమత ఉన్నవాడైతే పెళ్ళిలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఓ ఫొటో తీయించడం. అది ఏ కొండమీదైనా పెళ్ళి అయితే ( మా లాగ), ఇంకో పెళ్ళీకి వచ్చిన ఫొటోగ్రాఫర్ కాళ్ళు పట్టుకుని, ఒకటో రెండో ఫొటోలు తీయించుకోవడం. అంతే. ఆ పెళ్ళికొడుకు,మెళ్ళో తాళి కడుతూ, ఫొటో కి పోజు ఎలా ఇస్తాడో ( నాదీ అలాగే ఉందనుకోండి),ఆ తరువాత, ఆ ఫొటోలు తీసినవాడికి, మన ఎడ్రస్సు ఇచ్చి రెండంటే రెండే కాపీలకి ముందుగానే డబ్బులిచ్చి, ఆ ఫోటోలు వచ్చేదాకా ప్రతీ రోజూ పోస్ట్మాన్ కోసం ఎదురుచూడ్డం.ఆ ఫొటో వచ్చిన తరువాత, దానికి ఓ ఫ్రేం కట్టించి, ఒక ఫ్రేం అల్లుడికీ ( పిల్లనిచ్చుకున్న పాపానికి), రెండో ఫ్రేం, పెళ్ళి అయిందీ అన్న సాక్ష్యానికి ( ఆ రోజుల్లో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్లూ అవీ ఉండేవి కావు), హాల్లో ఓ గోడకి మేకు కొట్టి ప్రదర్శించేవారు.అందుకనే మీరు చూసే ఉంటారు, ప్రతీ పెళ్ళి ఫొటో పసుపు బట్టలతోటీ (అంటే కలరు కనిపించిందని కాదు),కర్పూరం దండలతోనూ కనిపిస్తాయి. ఇంటికి ఎవరైనా వచ్చారంటే, వాళ్ళకి కనిపించేది ఈ ఫొటోయే.

ఇవే కాకుండా, దేముడి ఫొటోలూ-మళ్ళీ వాటిలో కొన్ని బ్రహ్మాండమైన పూసల తోనూ, చెమ్కీలతోనూ చేసిన శ్రీరామ పట్టాభిషేకం, దానికి ఓ పేద్ద ఫ్రేమూ.ఆ లైనులో ఇంక దేముళ్ళ ఫొటోలు తప్ప ఇంకేమీ ఉండేవి కావు.ఏ తీర్థ యాత్రకో వెళ్ళినప్పుడు కొనుక్కున్న సత్యనారాయణ స్వామి ఫొటో, ఇవే కాకుండా ఏ బట్టల కొట్టువాడో ఇచ్చిన ఏ దేముడి ఫొటోనో ఫ్రేం కట్టించి ఉంచడం. ఆ వరసలోనే గణపతీ,అమ్మవారూ,శ్రీ వెంకటేశ్వరస్వామి,అలా ఉండేవి.ప్రతీ రోజూ ప్రొద్దుటే స్నానం చేసి, ఓ అగరొత్తు పుల్ల వెలిగించి,ఆ ఫ్రేం కార్నర్ లో గుచ్చడం. ఈ అగొరొత్తు పుల్లనుండి వచ్చే పొగతో, ఆ ఫ్రేం అంతా పొగచూరడం.ఆ ఫొటోలన్నీ ఏ నెలకోసారో,తుడుచుకోవడం.మర్చిపోయానండోయ్, శ్రీరామ పట్టాభిషేకం ఫొటోకి, రంగు కాగితాల దండలో మరోటో వేయడం.ఆ దండకూడా కొన్నిరోజులకి మట్టీ, దుమ్మూ పేరుకుపోతూంటుంది.అయినా సరే అలాగ ఉండాల్సిందే. ఈ దేముళ్ళ ఫొటోలు మొత్తం అన్నీ అయిన తరువాత, రెండో లెవెల్ లోకి, ఇంటి పెద్ద ఏ తాతగారో,నాయనమ్మో (ఇద్దరిదీ కలిసి ఉంటే ఫర్వా లేదు) లేకపోతే విడి విడిగా ఉన్నా సరే ఒకే ఫ్రేం కట్టించేసి పెట్టడం. దానికో దండా.ఆ ప్రక్కనే ఇంటి వంశోధ్ధారకుడి కాన్వొకేషన్ ఫోటో,ఆ ప్రక్కనే కాలేజీ, స్కూల్ ఫొటోలూ. ఎవరైనా ఇంటికి వచ్చారంటే, ఈ ఫొటోలు చూసి వాళ్ళ వంశవృక్షం అంతా తెలిసేది.

ఇంటికి ఏ సున్నాలో వేయించేటప్పుడు, ముందుగా ఈ ఫొటోలన్నీ తీయవలసి వచ్చేది. ఈ తీయడం, తిరిగి పెట్టడం అనే ప్రక్రియ లో కొన్నిటి గ్లాస్ పగిలిపోయేది.ఆ పగిలిన ఫొటో వాడి ఇంపార్టెన్స్ ని బట్టి, ఆ ఫ్రేం మళ్ళీ వేయించడమో, లేక దానికి పూర్తి రిటైర్ మెంట్ ఇచ్చేయడమో.అలా రిటైర్ అయిన ఫొటోలు, ఇంట్లో ఉండే చెత్తా చదారాల్లోకి వెళ్ళి చెద పట్టేసి పంచభూతాల్లోనూ కలిసిపోయేవి.

ఈ రోజుల్లో ఫొటోలైతే ఉన్నాయి,కానీ వాటికి ఫ్రేమ్ములూ వగైరాలు కొండెక్కేశాయి. ఏ కంప్యూటర్ లోనో దాచుకోవడంతో, ఇళ్ళల్లో గోడలు కూడా బోసిపోతున్నాయి..

మరిన్ని శీర్షికలు
kaakoolu