Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

సెప్టెంబర్ - 29

“మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఆస్ట్రియా వెళ్తున్నారట...?” అనడిగాడు ఆ సాయంత్రం ఫోన్ చేసిన హరి.

“ఏమో నాకు తెలీదే” అన్నాడు ఫిల్మ్ డైరెక్టర్ జీవన్.

“మధ్యాహ్నం మా షూటింగ్ దగ్గర కొచ్చినప్పుడు చెప్పేడు జార్జి ప్రసాద్” అనేసి ఇంకా వేరే సంగతులు మాటాడేడు.

రాత్రి ఎనిమిది గంటలప్పుడు జార్జి ప్రసాద్ కి ఫోన్ చేసి అడిగితే “ఔనండి మ్యూజిక్ డైరెక్టర్ యోగి కి పాస్ పోర్టు లేదు. దాని కోసం ట్రై చేస్తున్నాం..... నేనిక్కడ వేరే పనిలో ఉన్నాను, పొద్దుటొచ్చి కలుస్తాను” అన్నాడు.

మూడ్నెళ్ళ క్రితమే గదా ఆస్ట్రియా వెళ్ళేను. అక్కడికి ఎందుకు..? హంగేరీ గానీ పోలెండ్ గానీ అయితే బాగుంటది గదా అనిపించింది జీవన్ కి.మర్నాడు పొద్దుట వచ్చి కల్సిన జార్జి ప్రసాద్ “వేరే యూనిట్ పాటల షూటింగ్ కి వెళ్తుంటే అందులో మిమ్మల్నీ, యోగినీ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను మీరేవంటారు..?”
అన్నాడు.

“వెళ్ళే వాళ్ళెవరు...?”

“సలీం అని పాత ప్రొడ్యూసరే”

“ఆఁ.... ఆఁ.... తెల్సు తెల్సు, ఊళ్ళో చాలా హోటల్సున్నాయి అతనే గదా..?”

“ఆ అతనే.... నాకు చాలా మంచి ఫ్రెండ్. వాళ్ళ సిస్టర్ షహనాజ్ కి సంబంధిచిన ప్రాబ్లమ్స్ తో చాలా టెన్షన్ పడుతున్నాడు సార్. దాంతో ఈ ఫారిన్ ట్రిప్ నన్ను చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాడు” అన్నాడు జార్జి ప్రసాద్.


“నువ్వెళ్ళు.., నేనెందుకూ...?” అన్నాడు జీవన్.

“అలాగ్గాదు..., ఆ యోగి కి సినిమాలు చాలా ఉన్నాయి. ఇక్కడుంటే ఒకటి రెండు హాఫ్ డే లు మించి దొరకడు. అక్కడికి తీసుకెళ్ళి పడేశావనుకోండి, కనీసం ఏభైకి తక్కువగాకండా చేస్తాడు ట్యూన్లు. అందులోంచి మీరో అయిదు ఏరుకోవచ్చు...! నేనిప్పుడు సలీం భాయి ఇంటికెళ్తున్నాను. మీరూ రండి దార్లో మాటాడుకుందాం” అన్నాడు.

పంజాగుట్ట స్మశానం దాటింది కారు.

షహనాజ్ భలే పేరు.., చాల సేపు ఆలోచిస్తూ ఉండిపోయిన ఫిల్మ్ డైరెక్టర్ జీవన్ “ఆవిడ ప్రాబ్లమేంటి..?” అన్నాడు.

“వచ్చే నెల్లో జరగాల్సిన షహనాజ్ పెళ్ళి, వజీర్ అనే వాడు చాలా గట్టిగా అడ్డుపడేసరికి ఆగిపోయింది..... ఇలా కాదు మీకు బాగా అర్థం కావాలంటే ఇంకాస్త డీటెయిల్డ్ గా చెప్పాలి” అన్నాడు.

కారు లకిడి కాపూల్ దాటింది.

“ప్రశాసన్ నగర్ లో ఉంటున్న డాక్టర్ అబూతో షహనాజ్ పెళ్ళి సెటిలయ్యింది. తాజ్ కృష్ణాలో గజల్స్ గ్రూప్ లో తబలా వాయించే వజీర్ అనే వాడు “నాకు దక్కాల్సిన షహనాజ్ ని నువ్వు చేసుకోవడం ధర్మ కాదు. మేమిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం”
అన్నాడు.

”“మీరిద్దరూ ప్రేమించుకున్నట్టు ఆధారాలున్నాయా...?”

“చూపిస్తే నీకు షహనాజ్ తో నేను దగ్గరుండి పెళ్ళి జరిపిస్తాను. చూపించకపోతే ప్రొఫెషనల్ కిల్లర్స్ తో నిన్ను చంపిచేస్తా” నన్నాడు అబూ.మొజాంజాహి మార్కెట్టు దాటి అజాంషాహీ రోడ్డులోంచెళ్తుంది కారు.“పెళ్ళి వాయిదా పడింది అందుకన్న మాట..? మరి షహనాజ్ ఏవంటుంది..?” అన్నాడు జీవన్.

“ఒకేచోట అతను తబలా, నేను వయోలిన్ నేర్చుకున్నాం. చాలా సార్లు నా వెనకబడేవాడు. పిచ్చివాడిలా ప్రవర్తించేవాడు. ఒకసారి నా బర్త్ డే ఆశీర్వదించండి, మీరు నా ఆరాధ్య దేవత అని నా కాళ్ళ మీద పడ్డాడు. ఇంకోసారి రక్తంతో ఉత్తరం రాసేడు. ఇలాంటివి చాలా చేసేడు. అతన్తో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పింది షహనాజ్.“ఆ వజీర్ గాడెవడో మహర్షి సినిమాలో హీరోలాగున్నాడండి” అన్నాడు జార్జి ప్రసాద్.చార్మినార్ ఇంకా రాకుండానే ఎడం పక్కకి తిప్పాడు కారుని. అది కంకణ్ రోడ్డట. దారి పొడుక్కీ కంసాలి దుకాణాలే. ఠక్ ఠకా ఠక్ ఠకా... సౌండ్లతో ఆ వీధంతా గోల, సౌండ్ పొల్యూషన్. అది దాటి మిఠారి మండీ వేపెళ్ళాడు.

నిజామ్స్ మ్యూజియం అవతలి రోడ్డులో ఎకరం నేలలో ఉన్న పురాతనమైన హవేలీ. అదే సలీం ఇళ్ళు. ఎటు చూసినా ముస్లీం కల్చరు. నెమలి పించం రంగు వేసి ఉన్న ఆ హవలీకి ముందు ఆర్చిలున్నాయి. అర్ధ చంద్రాకారంలో ఉన్న ఆ కొయ్య గుమ్మాలకి చాలా గొప్పగా చెక్కబడి ఉన్నాయి నగిషీలు. వందేళ్ళ కాలం నాటి ఆ పురాతనమైన భవనం ముందు రకరకాల రంగుల పూలు పూస్తున్న గులాబి మొక్కలు పెరుగుతున్నాయి.

కారు దిగగానే వయోలిన్ నాదం వినిపించింది. భీమ్ సేన్ జోషి కనిపెట్టిన హిందోళ బహార్ అనే రాగం అది. అరకు లోయలో చలి కాలపు రాత్రి మంచు – వెన్నెల కలిసి కురుస్తున్నంత హాయిగా ఉంది. ఒక్క క్షణం మనసు తన్మయత్వంతో ఊయాలూగింది.కాలింగ్ బెల్ నొక్కాడు జార్జి ప్రసాద్.

వయోలిన్ సౌండాగింది. కాసేపటికి ఆ పెద్ద పెద్ద తలుపులు తెరుచుకున్నాయి. నల్లటి భురఖా వేసుకున్న ఆ అమ్మాయి కళ్ళు విశాలంగా ఉన్నాయి. కాంటాక్ట్ లెన్స్ లు పెట్టుకున్నట్టు నీలం రంగు కనుపాపలు అందంగా మెరుస్తున్నాయి. ఆ కళ్ళల్లో వెన్నెల కురుస్తోంది.“సలీం భాయి లేడా..?” అన్నాడు జార్జి ప్రసాద్.

నమాజ్ కెళ్ళి ఇంకా రాలేదందామె.

“నెనొచ్చినట్టు చెప్పమని” కారు స్టార్ట్ చేశాడు జార్జి ప్రసాద్.

“ఎవరామ్మాయి..?” అడిగాడు జీవన్

“షహనాజ్” అన్నాడు జార్జి ప్రసాద్.

కారు ముందుకు కదిలింది. వయోలిన్ నాదం మళ్ళీ మొదలైంది. జీవన్ మాత్రం ఆ కళ్ళ దగ్గరాగిపోయాడు.

ఆది కవులు వాళ్ళ కావ్యాల్లో వర్ణించారేమో.

అంత గొప్ప కళ్ళని జీవనెక్కడా చూళ్ళేదు. బహుశా నిత్యం కలలు కనే కళ్ళు అంటే అవేనేమో...! కళ్ళే అంత అపూర్వంగా ఉన్నాయంటే, ఇక మనిషెంత గొప్పగా ఉంటుందో అనుకున్నాడు. ఇక రోజంతా ఏం చేస్తున్నా ఆ కళ్ళు జీవన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పటికయినా ఆ మనిషి సంపూర్ణ రూపం చూడాలని పెద్ద శపధమే చేసుకున్న జీవన్ కి ఆ రాత్రంతా రకరకాల కళ్ళు గుర్తుకొచ్చాయి. సీత కళ్ళు, సావిత్రి కళ్ళు, కృష్ణుడి కళ్ళు, రాముడి కళ్ళు, జమున కళ్ళు, వాసంతి కళ్ళు, వెన్నిరాడై నిర్మల కళ్ళు, జయంతి కళ్ళు, పుష్పలత కళ్ళు, పుష్పవల్లిక కళ్ళు, శ్రీదేవి కళ్ళు, రేఖ కళ్ళు, భానుప్రియ కళ్ళు... కానీ, షహనాజ్ కళ్ళ ముందు ఆ కళ్ళన్నీ తేలిపోయాయి.ఈ ప్రపంచంలో ఎంత గొప్ప కళ్ళని చూపించినా షయనాజ్ కళ్ళ ముందు అవన్నీ దిగదుడుపనిపించాయి జీవన్ కి.

ఎందుకో...

తనకి తెలీకండానే ఆ షహనాజ్ తనకి సొంతమయిపోయింది. తన ఆరాధ్య దేవతైపోయింది. ఆ షహనాజ్ సమస్య తన సమస్య అయిపోయింది. ఆ షహనాజ్ బాధ తన బాధయిపోయింది. షహనాజ్ వేదన తన వేదనయిపోయింది. రీజన్ లేదు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti