Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద

వినియె నెలల్చతుర్ద్వయిని వృష్టి దినాళికి, రాత్రికై దివం
బున, జరకై వయస్సునను బూని, పరంబున కిప్పుడుద్యమం
బనువుగ జేయగా వలయునంచు బురోహితధర్మ మాత్మ గీ
ల్కొన నల విప్రుడా ద్విజులలోన సుభాషితముల్ పఠింపగన్

నెలలు చతుర్ద్వయిని నాలుగులు రెండు, అంటే ఎనిమిది నెలలు. ఎనిమిది నెలలలో, వృష్టి దినాళికిఅంటే వర్షపు రోజులకోసం. అంటే సంవత్సరంలో ఎనిమిది నెలలు పోగా మిగిలిన నాలుగు నెలలు వర్షాకాలపు రోజులు. జ్యేష్ఠ మాసము, ఆషాఢ మాసముకూడా శ్రావణ భాద్రపద మాసాలకు తోడుగా వర్షాకాలపు లక్షణాలనుకలిగి వుంటుంది, లేదూ అంటే తీవ్రమైన వేసవి ఉంటుంది, వానలు పడడం మొదలు కాకున్నా గాలిదుమారాలతో కూడిన చిరుజల్లులు, ముసుర్లు పట్టే కాలం. కనుక ఈ నాలుగు నెలలకోసము మిగిలిన ఎనిమిదినెలలలో తిండి గింజలు సంపాదించి నిలవ ఉంచుకోవాలి. జర అంటే వృద్ధాప్యము, వృద్ధాప్యము కోసం వయస్సులోనేశ్రమించి నాల్గు కాసులు, సంపద దాచుకోవాలి, అంటే ముసలితనంలో కొద్దిగా సుఖంగా ప్రశాంతంగా బతకాలిఅంటే వయసులోనే శ్రమించాలి, ముసలితనములో శ్రమించలేము కాబట్టి. ఇలా పురోహిత ధర్మాన్ని అనుసరించిబోధ చేసిన ఆ పరదేశి బ్రాహ్మణుడు పఠించిన సుభాషితములు ఆత్మలో నాటుకొనగా విన్నాడు మత్స్యధ్వజుడు.వయసున సంపాదించినా ధనము అయినా ఉండాలి, వయసున పుట్టిన పిల్లలు అయినా ఉండాలి, ముసలితనములో
ఆదుకొనడానికి. రాత్రుళ్ళు చీకటిలో ఇబ్బందిపడి తిండికి ఏర్పాటు చేసుకొనడం కన్నా పగటిపూటే రాత్రికి కూడాకావలసిన సంబారాలు సమకూర్చుకోవాలి. వర్షాకాలపు నాలుగునెలలకోసము మిగిలిన ఎనిమిది నెలలు కష్టపడాలి,బాగానే ఉంది, కానీ ఇంతవరకూ ఇవి రాజుకు సంబంధించిన వివరాలు కావు. వర్షాకాలంలో అయినా, రాత్రుళ్ళుఅయినా, వృద్ధాప్యములోనైనా మహాచక్రవర్తికి కష్టపడాల్సిన అవసరము ఏముంటుంది? 'పూని పరంబునకిపుడుఉద్యమంబు అనువుగ జేయగా వలయును' అనే మాట, దారుల వెంట కనిపించిన అడ్డమైనవాటికి మోరలెత్తిఆశపడుతున్న గుర్రాన్ని కొరడాతో అదలించినట్లు, చెళ్ళున చెంప మీద చరిచినట్టు, అంధకారాన్ని అంతం జేస్తూభళ్ళున తెల్లారినట్టు అడ్డదారుల వెంట వెళ్తున్న రాజుకు, అప్పుడప్పుడు తన అంతరాత్మ చేస్తున్న బోధనలనుపెడచెంపన పెడుతున్న రాజుకు, కామంతో కండ్లు మూసుకుపోయిన రాజుకు తగిలింది.

విని తద్గ్రంథార్ధము నె
మ్మనమున నూహించి తెలిసి మ్రాన్పడి కడకుం
దనమోసమునకు భయపడి
జనపతి యటు చనక నిలిచి సంతాపమునన్

ఆ మంచి మాటను, సుభాషితాన్ని విని, దాని అంతరార్ధమును మనసులో ఊహించి తెలుసుకుని, మ్రాన్పడిపోయాడు మహారాజు. తన మోసానికి అంటే తను ఇంతకాలమూ కామభోగాలు, యవ్వనము, ఐశ్వర్యము శాశ్వతములన్నట్టునమ్మి మోసపోయిన విధానానికి, తను ఎంత ప్రమాదపు మార్గంలో పయనిస్తున్నాడో తెలిసికొని, భయపడి, తనుఅంతవరకూ క్రమం తప్పకుండా వెళ్తున్న ఉంపుడుగత్తె నివాసభవనమునకు వెళ్ళకుండా నిశ్చేష్టుడై నిలిచి, సంతాపంచెందాడు. మోసము అంటే ప్రమాదము అని కూడా అర్థము

.ఎక్కడి రాజ్యవైభవము లెక్కడిభోగము లేటిసంభ్రమం
బక్కట బుద్బుద ప్రతిమమైన శరీరమునమ్మి మోక్షపుం
జక్కి గణింపకుంటి యుగసంధుల నిల్చియు గాలుచేతి బల్
త్రొక్కుల నమ్మనుప్రభ్రుతులున్ దుద రూపరకుండ నేర్చిరే?

ఇవెక్కడి రాజ్యవైభవములు? ఎక్కడి భోగములు? ఏమిటీ వెఱ్ఱి? అయ్యో! నీటిబుడగ వంటి శరీరమును శాశ్వతముఅనుకున్నాను. మోక్షమార్గమును గురించి ఆలోచనే చెయ్యలేదు. యుగాలపర్యంతము దీర్ఘ ఆయుర్దాయమునుఅనుభవించిన మనువులు 'దీర్ఘ ఆయువును'మాత్రమే పొందారు కానీ, శాశ్వతమైన ఆయువును కాదుకదా! వారేచిరంజీవులు కారే, వారే తనువులు చాలించి వెళ్ళిపోయారే, నేను అనగా ఎంత? నా రాజ్యము, నా భోగములు ఎంత?

సగరు నలుం బురూరవుఁ  ద్రిశంకు సుతున్బురుకుత్సుఁ  గార్తవీ
ర్యు గయుఁ  బృథుం భగీరథుం సుహోత్రు శిబిం భరతుం దిలీపునిన్
భ్రుగుకులు యౌవనాశ్వు శాశిబిండు ననంగుని నమ్బరీషు బూ
రుగురుని రంతి రాఘవు మరుత్తుని కాలము కోలుపుచ్చదే?

సగరుడు, నలుడు, పురూరవుడు, హరిశ్చంద్రుడు, పురుకుత్సుడు, కార్తవీర్యుడు అనబడే (ఆరుగురు)షట్చక్రవర్తులను,గయుడు, పృథుడు, భగీరథుడు, సుహోత్రుడు, శిబి, భరతుడు, దిలీపుడు, భ్రుగువంశము వాడైన పరశురాముడు,యౌవనాశ్వుడు, శశిబిందుడు, అనంగుడు, అంబరీషుడు, యయాతి, రంతి, చివరికి రఘురాముడు, మరుత్తు, ఈషోడశ(పదహారుమంది) మహారాజులను కూడా కాలము కబళించలేదా? నేనెంత? వీరందరికీ తప్పని మృత్యువును

నేనా తప్పించుకోగలవాడిని?

'సర్వే క్షయాంతా నిచయాః పతనాంతాః సముచ్చ్రయాః / సంయోగా విప్రయోగాంతాః మరణాంతం హి జీవితం',కూడబెట్టినవన్నీ ఒకనాటికి కరిగిపోయేవే, పైపైకి ఎగిసినవన్నీ క్రిందికి పడిపోయేవే, కలయికలన్నీ ఎడబాటులకే,జీవితానికి మరణము అనే ముగింపు తప్పదు అనలేదూ వాల్మీకి? 'యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాత్భయం /ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్భయం', మ్రగ్గిపోయిన పండుకు ఎప్పుడు రాలిపోతానో అనే భయము, నరుడికిఎప్పుడు మరణిస్తానో అనే భయము ఉంటాయి అనలేదూ? అది సరే, మరణము తప్పదు, నిజమే, మరణము అంటేఇహలోకములో లేకుండా పోవడమే కదా, ఇహలోకము అంటే పరలోకము అనేది ఒకటి ఉండాలి, ఉన్నట్టే కదా!బ్రతుకంటేనే ఈ లోకమునుండి ఆ లోకమునకు పయనము కదా, ఈ లోకములో జీవితము హాయిగా ఉండడానికిఎన్నో ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకున్నట్టు, ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకున్నట్టు ఆ లోకములో జీవితము కోసం కూడాఏర్పాట్లు, జాగ్రత్తలు, ప్రణాళికలు అవసరము కదా!ఆ పరలోకపు భయమునుండి అభయమును ఇవ్వగలిగింది, అక్కడికోసము చేసుకొనవలసిన ఏర్పాటు మోక్షచింతనయే కదా! అయ్యో! ఇంతదాకా ఎంత వ్యర్ధము ఐపోయింది జీవితం! ఇంతవరకూ ఏ ఏర్పాటూ చేసుకోలేదే,పరలోకం కోసం, అని ఇంతా తన మనసులో అనుకున్నాడు రాజు. కనుక ఒక స్థిర సంకల్పం తీసుకున్నాడు.ఇంత విచక్షణా, విషయ పరిజ్ఞానము, జ్ఞానము ఉన్నవాడే ఆ మహారాజు అని ఆయనను పరిచయము చేసినప్పుడేచెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు. అన్నీ తెలిసినవాడే, స్వతహాగా మంచివాడే, కానీ ఆచరణలోకి వచ్చేప్పటికి బెసికాడు!మంచిమనిషికి ఒక మాట చాలు గనుక, ఆ మాటకే, ఆ క్షనములోనే శాశ్వత పరివర్తన కలిగింది ఆ మహారాజుకు.ఇదేమీ నాటకీయత కాదు. తులసీదాసుకు ఇలాగే జ్ఞానోదయము ఐంది. మహానుభావుడు నారాయణ తీర్థులకుకూడా తులసీ దాసుగారికి లాగానే, భార్యా లోలుడై భార్యతో కామభోగాలతో మునిగి తేలుతూ భార్య పుట్టింటికి వెళ్తేఆవిడ పొందుకోసం నిండు వర్షాకాలములో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని పొట్టకు కుండ కట్టుకుని ఈదుతూ దాటి,అత్తవారింటి తలుపు తడితే, తలుపు తెరిచిన భార్య చీవాట్లు పెడితే జ్ఞానోదయము ఐంది. తనపట్ల తన మొగుడివ్యసనపరతను తన సోదరులు, వదినలు హేళన చేస్తారేమో, నవ్విపోతారేమో అని ఆవిడ భయము! ఈ మమకారాన్నిభగవంతుడి మీద చూపిస్తే మీరు తరిస్తారు, ప్రపంచాన్ని తరింపజేస్తారు అని చీవాట్లు పెట్టింది.ఆక్షణములోనే సిగ్గుపడి, పరివర్తన కలిగి ఆ తర్వాత తను తరించడమే కాక ప్రపంచాన్ని తరింపజేసే మహానుభావుడుఅయినాడు. ఆయన తన శ్రీకృష్ణ లీలా తరంగిణి గానము చేస్తుంటే శ్రీకృష్ణుడు బాలుని రూపములో ఆయన బొజ్జమీదఆడుకుంటూ ఆలకించేవాడుట! నమ్మగలిగినవాళ్ళ అదృష్టము!సంగీతము, సాహిత్యము, నాట్యము అనే త్రివేణీ సంగమము ఆయన బోధనల సారాంశము. సిద్దేంద్ర యోగికినృత్యశాస్త్రములో నారాయణతీర్థులు గురువు. త్యాగరాజస్వామికి గానకళలో, ఆధ్యాత్మిక సాహిత్యములోఆదర్శప్రాయుడు నారాయణ తీర్థులు. లీలాశుకుడూ, వేమన కూడా ఒక్క క్షణ కాల అనుభవముతోనే విరక్తినిపొందారు, వేదాంతులు అయినారు. కనుక మత్స్యధ్వజుని వృత్తాంతము రాయలవారి విపరీత కల్పనా కాదు,అసహజమూ కాదు. కాకుంటే సామాన్యుల విషయములో సహజముగా జరిగేది కాదు. అసామాన్యుడు ఐన ఆచక్రవర్తి విషయములో జరిగింది, ఆయన మాన్యుడు కావడానికి కావలసిన స్థిరసంకల్పముతో ఒక సుస్థిరమైననిర్ణయము తీసుకున్నాడు.

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని శీర్షికలు
avee-e vee