Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

తెలుగులో సినిమా చేయాల‌ని వుంది! - ధ‌నుష్‌

జాతీయ ఉత్త‌మ‌న‌టుడు అనిపించుకొన్న ధ‌నుష్ విల‌క్ష‌ణ‌మైన క‌థానాయ‌కుడు. తాను ఎంచుకొన్న క‌థ‌ల్లో వైవిద్యం ఉంటుంది. త‌న హీరోయిజం ధియేట‌ర్‌కే ప‌రిమిత‌మ‌వ్వ‌దు. సినిమా చూశాక కూడా... మ‌న‌ల్ని వెంటాడుతుంటుంది. పాత్ర‌లో నాట‌కీయ‌త కంటే.. స‌హ‌జ‌త్వానికే ప్రాధాన్యం ఇస్తాడు. హీరోయిజ‌నాన్ని కాదు.. క‌థ‌నే హీరో అని న‌మ్ముతాడు. సినిమాల్లోనే కాదు, బ‌య‌టా సాదాసీదాగానే క‌నిపిస్తాడు. ఎంత సాధించినా 'ఏమీ లేన‌ట్టే' క‌నిపిస్తాడు. అచ్చం మామ‌గారు ర‌జ‌నీకాంత్ లా. ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గా తెర‌కెక్కించిన త‌మిళ చిత్రం ''వీఐపీ''. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాల‌ని ఇద్ద‌రు ముగ్గురు క‌థానాయ‌కులు ప్రయ‌త్నించారు.కానీ తెలుగులో త‌న మార్కెట్ పెంచుకోవ‌డానికి ఈ సినిమాని డ‌బ్ చేసి విడుద‌ల చేశాడు ధ‌నుష్. జ‌న‌వ‌రి 1న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా ధ‌నుష్‌తో మాటా మంతి.

* హాయ్ ధ‌నుష్‌.. నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు
- ధ్యాంక్యూ వెరీమ‌చ్‌.. విష్ యు ద సేమ్‌

* తొలి రోజునే బాక్సాఫీసు ద‌గ్గ‌ర అల్ల‌రి చేస్తున్నాడు మీ ర‌ఘువ‌ర‌న్‌..
- (న‌వ్వుతూ) చాలా హ్యాపీగా ఉందండీ. త‌మిళంలో చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సినిమా ఇది. క‌మ‌ర్షియ‌ల్‌గా బాగా ఆడింది. దాంతో పాటు విమ‌ర్శ‌కులూ మెచ్చుకొన్నారు. తెలుగు నేటివిటీకీ స‌రిగ్గా స‌రిపోతుంద‌నిపించింది. అందుకే విడుద‌ల చేశాం. ఇప్పుడు మంచి స్పంద‌న వ‌స్తున్నందుకు సంతోషంగా ఉంది.

* ఇలాంటి క‌థ ఒప్పుకోవాలంటే కాస్త ధైర్యం కావాలి. ఎందుకంటే... గ్లామ‌ర్ అస్స‌లు లేదు క‌దా..?
- క‌థ‌కు మించిన గ్లామ‌ర్ వ‌స్తువు మ‌రోటి ఉంటుంద‌ని నేను అనుకోను. స‌రిగ్గా తీయ్యాలే గానీ క‌చ్చితంగా ఆడ‌తాయి. హ్యూమ‌న్ ఎమోష‌న్స్‌తో పాటు కామెడీని మిక్స్ చేస్తూ ఓ క‌థ చెప్ప‌డం అనుకొన్నంత సుల‌భం కాదు. జ్ఞాన‌వేల్ ఈ క‌థ చెప్పిన‌ప్పుడు ఆశ్చ‌ర్య‌పోయా. అరె... భ‌లే క‌థ చెప్పాడు.. త‌ప్ప‌కుండా చేయాలి అనిపించింది. అయితే.. త‌న‌కి ద‌ర్శ‌క‌త్వ ప‌రంగా ఎలాంటి అనుభ‌వం లేదు. ఇలాంటి క‌థ ఎలా తెర‌కెక్కిస్తాడా అనే అనుమానం వెంటాడింది. `సార్‌.. నేను చేయ‌గ‌ల‌ను..` అని భ‌రోసా ఇచ్చాడు. త‌న‌పై న‌మ్మ‌కంతో మా సొంత సంస్థ‌లోనే ఈసినిమా నిర్మించాం.

* ఒక్క‌మాట‌లో చెప్పాలంటే `ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌` ఎలాంటి క‌థ‌?
- తండ్రీ కొడుకుల అనుబంధం, త‌ల్లీ కొడుకుల అనుబంధాన్ని ఓ కొత్త డైమెన్ష‌న్‌లో తెర‌కెక్కించాం. అప్ప‌ట్లో ఇంజ‌నీరింగ్ అంటే క్రేజ్ ఎక్కువ‌. దాంతో బీటెక్ చేసిన‌వాళ్లు కుప్పలు తెప్ప‌లుగా పుట్టుకొచ్చేశారు. అలా బీటెక్ చేసి.. ఉద్యోగాన్వేష‌ణ‌లో గ‌డ‌పుతున్న ఓ అబ్బాయి క‌థ ఇది. త‌న‌కో ప్రేమ క‌థ ఉంది. కుటుంబం, ప్రేమ‌, త‌న అల్ల‌రి ఇవ‌న్నీ మిక్స్ చేసిన సినిమా ఇది. న‌వ్విస్తూ న‌వ్విస్తూ కంట‌త‌డి పెట్టిస్తుంది.

* తెలుగులో ఈ సినిమా రీమేక్ చేయొచ్చు క‌దా, డ‌బ్బింగ్ రూపంలో ఎందుకు తీసుకొస్తున్నారు?
- రీమేక్ అయితే ఫీలింగ్స్‌ని మ‌ళ్లీ య‌ధాత‌ధంగా క్యారీచేయ‌లేం క‌దా.

* రీమేక్ కోసం ఎవ‌రైనా సంప్ర‌దించారా?
- అవును.. కొంత‌మంది నిర్మాత‌లు అడిగారు. కానీ ఈ సినిమాని డ‌బ్ రూపంలోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందివ్వాలి అనిపించింది.

* తెలుగు మార్కెట్‌పై దృష్టి పెడుతున్నారా?
- నిజం చెప్పాలంటే...  ఇది వ‌ర‌కు నా సినిమాని తెలుగులో రీలీజ్ చేయాల‌న్న ధ్యాస ఉండేది కాదు. త్రీతో ఆ ఆలోచ‌న కలిగింది. మంచి సినిమాకి ప్రాంతీయ బేధాలుండ‌వు. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంద‌నుకొన్న‌ప్పుడు త‌ప్ప‌కుండా తెలుగులోనూ డ‌బ్ చేసి అందిస్తా.

* తెలుగులో ఓ సినిమా చేయొచ్చుగా..?
- నాకూ చేయాల‌నే ఉంది. నిజం చెప్పాలంటే తెలుగు ద‌ర్శ‌కులెవ్వ‌రూ నన్ను సంప్ర‌దించ‌లేదు. వ‌స్తే.. త‌ప్ప‌కుండా చేస్తా.

* తెలుగు నేర్చుకొన్నారా?
- అబ్బే లేదండీ. తెలుగు రాదు. అర్థ‌మ‌వుతుంది గానీ, తిరిగి మాట్లాడ‌లేను. నాకు హిందీ కూడా రాదు. కానీ అక్క‌డ‌కు వెళ్లి ఓ సినిమా చేశా క‌దా..?

* ఇప్పుడు బాలీవుడ్‌లో బాల్కీతో ష‌మితాబ్ చేస్తున్నారు క‌దా. ఆ సంగ‌తులేంటి? 
- బాల్కీ అద్భుత‌మైన ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌తో సినిమా అంటే మ‌రేం ఆలోచించ‌క్క‌ర్లెద్దు. సీన్ ఇది.. అని చెప్తారు. మాకంటూ క్రియేటీవ్ లిబ‌ర్టీ ఇస్తారు. ఆయ‌న‌దంతా డిఫ‌రెంట్ స్కూల్‌. ప‌నిచేస్తున‌న్న‌న్ని రోజులూ ఏదో ఒక‌టి నేర్చుకొంటూనే ఉన్నా.

* మీ శ్రీ‌మతి ద‌ర్శ‌క‌త్వంలో ఎప్పుడు న‌టిస్తారు..?
- ఆ ఆలోచ‌నే లేదండీ. ఎందుకంటే ఇద్ద‌రం క‌లసి ఓ సినిమా చేయాలంటే క‌నీసం ఏడాది ఇద్ద‌రం అదే ప‌నిలో ఉండాలి. అప్పుడు పిల్ల‌ల గురించి ఎవ‌రు ప‌ట్టించుకొంటారు..??

* ఇంత‌కీ ర‌ఘువ‌న‌న్‌ని మీ మామ‌గారు ర‌జ‌నీకాంత్‌కి చూపించారా?
- ఆయ‌న‌కు చూపించ‌కుండానా..?  చూపించాం. బాగా న‌చ్చింది. నేను చేశాన‌ని కాదు. ఈ సినిమా ఎవ‌రు చేసినా ఆయ‌న‌కు న‌చ్చుతుంది. ఎందుకంటే క‌థ అలాంటిది.

* ఇద్ద‌రూ క‌ల‌సి న‌టించే అవ‌కాశం ఉందా..?
- ఏమో.. చూడాలి.

* ఆ శుభ‌ఘ‌డియ త్వ‌ర‌లోనే రావాల‌ని కోరుకొంటున్నాం.. ఆల్ ది బెస్ట్
-  థ్యాంక్యూ....

మరిన్ని సినిమా కబుర్లు
movie review