Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

 

 జరిగిన కథ : పరువుగా బ్రతికే తన జీవితంలో సౌమ్య బావ రవిబాబు సృష్టించిన అలజడి గురించి డా. హరి ఒక్కోటి చెపుతూంటే వింటూ ఉంటుంది మేఘన.....
....................................ఆ తర్వాత......

‘‘తప్పకుండా... ఒప్పుకుంటాను మేఘనా, వాడే నెగ్గాడు. నన్ను తప్పుదోవ పట్టించి, సామరస్యంగా శాంతంగా జరగాల్సిన పరిష్కారాన్ని నాశనం చేసాడు. పైగా నన్ను రెచ్చగొట్టి, కోర్టు కేసు అర్జంటుగా వేయాలని ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. అయితే ఇలాంటి చిల్లర గొడవలు ఇష్టంలేని నేను ఉన్నదున్నట్లుగా, నాకిలాంటివి పడవని చెప్పేసాను. అప్పటికతను నెమ్మదించాడు.’’

‘‘ఈ గొడవంతా చేయించింది రవిబాబేనని మీకెలా తెలిసింది?’’

‘‘జరిగిన విషయంమంతా నా క్లాస్మెట్ కృష్ణయ్యకి చెప్పాను. అతను మెడిసిన్ ప్రాక్టీస్ మానేసి, ఐపీఎస్ పాసయ్యి, డీసీపీగా హైదరాబాద్ లో ఉన్నాడు. ఎందుకో అనుమానించి, నలుగురు కానిస్టేబుల్స్ తో పాటు పనిమనిషిని పది ప్రదేశాలకు తిప్పాడు. చివరకు పనిమనిషి తన మీద దౌర్జన్యం చేసిన రౌడీలను గుర్తుపట్టడం, వాళ్లని తన్నడం, వాళ్లు నిజం చెప్పడం జరిగింది.’’

‘‘రవిబాబుని జైల్లో వేస్తే బాగుండేది..’’

‘‘అది కూడా అనుకున్నాం కానీ ఆరుగురు పిల్లలు, సౌమ్య సొంత అక్క వీధిన పడతారు. వాడెలాగూ వెధవ... వాడితో సమానంగా మనం ప్రవర్తించకూడదని వదిలేసాను. కానీ అతనికి మాత్రం నేను కనిపెట్టిన విషయం ఉన్నదున్నట్లుగా చెప్పేసాను. అతనికి నోట మాట లేదు... ఉలకక, పలకక మిన్నకుండిపోయాడు.

‘‘పోనీలెండి, మీ మంచితనాన్ని మీరు నిలబెట్టుకున్నారు.’’

‘‘మంచితనమో కాదో గానీ బురదలో పడి కొట్టుకోవడం ఇష్టమనిపించలేదు నాకు.’’

‘‘చదువు సంస్కారం గల ఉన్నత మనస్కులు చిల్లర రాజకీయాలకు లొంగరని నిరూపించారు.’’|

‘‘థ్యాంక్స్ మేఘనా... కానీ...’’

‘‘కానీ...?’’

‘‘ఇలాంటి గొడవలు అలవాటులేని సౌమ్య... హరి గొంతు బాధగా ధ్వనించింది. హతాశురాలై  కోలుకోలేక పోయింది. అందర్నీ మంచిగా చూసిన తనపై దుర్భాషలు భరించలేకపోయింది, తనలో తనే కుమిలిపోయి, ఎంతో దుఃఖానికి గురయ్యింది. నాతో కూడా మాట్లాడ్డం మానేసింది. నవ్వుతూ సరదాగా తిరిగే సౌమ్య, సౌమ్యురాలైన సౌమ్య మూగబోయింది.

అదే సమయంలో మా పిన్ని కూతురు సౌమ్యని సిమ్లాకు తనతో తీసుకెళ్లింది.

ఇప్పుడు సౌమ్య కోలుకుంది. సిమ్లాలో బోరు కొడుతుందనీ వచ్చి తీసుకెళ్లమనీ ఫోన్లు చేస్తున్నది. వచ్చే వారం వెళ్లి తనని తీసుకురావాలి.’’‘‘విపరీతకాలే... వినాశబుద్ధి అన్నట్లు ఒక్క చీడపురుగు ఎంతమందిని బాధ పెట్టింది.’’

‘‘ఐతే అయ్యింది మేఘనా తెలుసుకుని బయటపడడం మంచిదయ్యింది... లేకుంటే ఎల్లకాలం అనవసరమైన హింసను భరించాల్సి ఉండేది.’’

‘‘నిజమే...’’

‘‘ఇంకొక మాట చెప్పనా మేఘనా...?’’

మేఘనా.....?

అప్పటికే నిద్రలోని జారుకున్న మేఘనని తన ఒడిలో  నుండి నెమ్మదిగా జరిపి తను కూడా నిద్రకుపక్రమించాడు హరి.

X                 X                X

ఎవరో దబ దబా తులుపులు బాదుతున్న సౌండ్ కి మెలకువ వచ్చింది హరికి.

నిద్ర సరిపోయినట్లుగా లేదు. కళ్లు మండుతున్నాయి... ఇంకాస్సేపు పడుకుంటే బాగుండుననిపిస్తుంది. తలుపులు కొట్టేవాడి మీద పీకల్దాక కోపమొచ్చింది.

అతికష్టం మీద బలవంతంగా లేచి తులుపు దగ్గరకు వెళ్తున్నంత లోనే, ఇంకా దబ దబా శబ్దం... అంత ఓపిక పట్టలేని వాడెవడబ్బా...? పేషెంట్లెవరూ ఇంతవరకు తన అపార్ట్ మెంట్ కు వచ్చి తలుపులు బాదింది లేదు...

గబ గబా వెళ్లి తలుపు తీయగానే.... ఎదురుగా వాచ్ మన్ జైరాజు....

హరిని చూడగానే గుడ్ మార్నింగ్ డాక్టర్  గారూ... అన్నాడు. వచ్చిన కోపాన్ని తమాయించుకుని... ‘‘జైరాజ్... అర్థాంతరంగా నా నిద్ర పాడుచేసావు. ఏమంత అర్జంటు?’’ అన్నాడు.

‘‘క్షమించండి సార్... మీ నిద్ర పాడు చేసినందుకు... నేను కావాలని రాలేదు. ఉదయం 8.30 గంటలకే మీ అమ్మగారు ఫోన్ చేసారు... బాబు ఎలా ఉన్నాడని...

ఆ సమయానికే మీరు ఎప్పుడూ రెడీ అయ్యి హాస్పిటల్ కు వెళ్తూ కనిపిస్తారు. మీరు కనిపించక పోయేటప్పటికి...’’

‘‘కనిపించకపోతే... తలుపులు పగలగొట్టేస్తావా..?’’

‘‘అది కాదు సార్.... ఏమో.. జ్వరం ఎవరికైనా రావచ్చు కదా సార్. డాక్టర్లయినంత మాత్రన రాకూడదని ఉందా? మీ మీద నాకు గౌరవం, మీరొక్కరే ఉంటున్నారు... మిమ్మల్ని చూసుకోమని మీ అమ్మగారు వచ్చినప్పుడల్లా నాకు చెప్పి వెళ్తుంటారు. మీ యోగక్షేమాల విచారణకు అప్పుడప్పుడూ నాకు ఫోన్ చేస్తుంటారు. సారీ సార్... క్షమించండి. టైమిప్పుడు 12 గంటలయింది. అందుకనే వచ్చాను.’’ అంటూ వెనుదిరిగాడు జైరాజు.

తలుపు వేసుకోబోతుండగా మేఘన గుర్తుకొచ్చింది... అప్రయత్నంగా మేఘన.. అన్నాడు హరి.

వెళ్తున్నవాడల్లా చమక్కున 360 డిగ్రిల్ల్లో మళ్లీ వెనక్కి తిరగాడు జైరాజు....

‘‘ఎవరు సార్ మేఘన...’’ అన్నాడు.

స్పృహలోకి వచ్చాడు హరి... ‘‘ఏదో గబుక్కున అనేసాను, ఏమీ లేదులే.’’ నువ్వెళ్లు అన్నాడు.వెళ్తున్న వాచ్ మన్ వైపు చూస్తూ... ఇతని ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అనుకున్నాడు హరి. వాచ్ మన్ వెళ్లగానే తలుపు మూసి ఇల్లంతా కలియదిరిగాడు... మేఘన జాడ లేదు. బాల్కనీ లోకి వెళ్లి చూసాడు. అక్కడా కూడా లేదు... అనుకోకుండా బాల్కనీలో నుండి బయటకు చూసాడు.

కింద జైరాజు ఎవరితోనో మాట్లాడుతున్నాడు... అతని వాలకం చూస్తుంటే ఏదో ఒక గొప్ప సన్నివేశంలో లీనమైపోయి దానిని యాక్షన్ తో సహా వివరిస్తున్నాడు ఎదుటి వ్యక్తికి. ఏదో కళ్లను వర్ణిస్తున్నట్లుగా ఉన్నాయి అతని భంగిమలు...

బాల్కనీలో నుండి మళ్లీ బెడ్రూమ్ లోకి వచ్చాడు హరి...

అలా... అలా నడుచుకుంటూ ముఖం కడుక్కుందామని బాత్రూమ్ కి వెళ్లాడు. ముఖం కడుక్కుంటూ అద్దంలోకి ఒకసారి చూసాడు...కనిపిస్తున్న ప్రతిబింబం తనది కాదు... వేరెవరిదో...

జుట్టు బాగా పెరిగి, గడ్డం, మీసాలు బాగా పెరిగి నీరసించిన ముఖం, ఎర్రటి చింత నిప్పుల్లాంటి    కళ్లు అద్దంలోంచి తననే చూస్తున్నాయి తీక్షణంగా.... ఒక్కసారి రెండు చేతులలో ముఖం కప్పుకుని మళ్లీ అద్దం వైపు చూసాడు.

మళ్లీ అదే ముఖం... అదే చూపు...

‘‘ఓహ్... నాదే ప్రతిబింబం... ఈ మధ్యన గ్రూమింగ్ పట్టించుకోవడం లేదు నేను. పైగా రాత్రి నిద్రలేదు... కబుర్లతో సమయం తెలియలేదు... కళ్లు ఎర్రబారక ఏమవుతుంది.’’ అనుకుంటూ ముఖం కడుక్కుని, కాఫీ పెట్టుకుందామని వంటగది వైపు కదిలాడు....

అంతలో...

ఎవరో మృదు మధురంగా పిలుస్తున్నారు... చెవిలో గుసగుసలాడుతూ పిలుస్తున్నారు. అది ఒక స్త్రీ స్వరం... మంద్రంగా, మెత్తగా... ‘‘హరీ... హరీ.’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
na preyasini pattiste koti