Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : పేపర్ యాడ్ చూసి స్పందించిన వాళ్ళళ్ళో ముత్తూ గ్రూప్ ఒకటి...సహస్రని పట్టుకుంటే వచ్చే కోటి రూపాయల కోసం కలలు కంటూంటారు... తనపేరుతో ఇచ్చిన ప్రకటన సంగతి అమీతుమీ తేల్చుకుందామని కోపంగా వచ్చిన సహస్ర విరాట్ తో వాదనకు దిగుతుంది..
ఆ తర్వాత......


పేపరు తెరవగానే తన ఫోటోతో ప్రకటన చూసి మండి పడి వీడ్ని చితగొట్టి బుద్ది చెప్పాలని గదా అంత ఆవేశపడి వచ్చింది. అదంతా ఏమైపోయింది? తనని మాటల్లో బెట్టి మాయజేస్తున్నాడు వీడు. అసలు తన ఫోటో వేసి పేపరు ప్రకటనివ్వడానికి తానెవరు? అది వదిలేసి ఏదేదో మాట్లాడేయటం ఏమిటి నాన్సెన్స్.

తలెత్తి చూసింది

విరాట్  తన ముఖాన్నే చూస్తున్నాడు.

అదే చిరునవ్వు..........

అసలా నవ్వు చూస్తే చాలు, ఎలాంటి అమ్మాయయినా పడిపోతుందనిపించింది. కంగారుగా అతడి ఛాతీ మీద చెయ్యేసి వెనక్కి తోసింది. ‘‘ఏంట్రా,  ఏంటా చూపు? తిక్కతిక్కగా ఉందా?  చెప్పు  ఈ  పేపరు ప్రకటన అదీ నా ఫోటోతో సహా ఎందుకిచ్చావో చెప్పు?’’ కోపంగా అరిచింది. ‘‘ఎందుకో వేరే చెప్పాలా?  నీ కోసమే.  రైల్వేస్టేషన్ లో పోస్టర్లు వేసినప్పుడే మర్యాదగా నాకు ఫోన్ చేసుంటే ఈ ప్రకటనతో పనుండేది కాదుగా.’’

‘‘అంటే?  తప్పు నాదంటావ్?  నేనెందుకు నీకు ఫోన్ చేయాలి?’’

విరాట్  ఏదో చెప్పబోయాడు

ఇంతలో అతడి సెల్  మోగింది

‘‘వన్  మినట్  ప్లీజ్’’  అంటూ సెల్ అందుకున్నాడు విరాట్.  సహస్రకి వస్తూన్న కోపానికి విరాట్ ని చితగొట్టేయాలనిపిస్తోంది. ‘‘హాలో ఎవరండీ? ఎవరు కావాలి?’’ అడిగాడు విరాట్.

‘‘సార్  నా పేరు ముత్తూ’’  అవతలి నుంచి గరగరలాడిందో గొంతు.

‘‘నువ్వు ముత్తువైతే నాకెందుకు చెత్తవైతే నాకెందుకు?  నీకెవరు కావాలి.  ఎందుకు ఫోన్ చేసావ్?’’    అడిగాడు విసుగ్గా.

‘‘ఈ రోజు మీ పేపరు ప్రకటన చూసాను సార్.  ఫోటోలో అమ్మాయి చాలా బాగుంది సార్.’’

‘‘బాగుందా................  నాకయితే అస్సలు నచ్చలేదు.’’

‘‘అదేమిటి సార్. తను మీ ప్రియురాలు గదా.  మీరు ప్రేమించుకున్నారు గదా? ’’

‘‘అవును గదా?  ప్రేమించుకున్నాం.  ఏం లాభం,  అదో రాక్షసి,  పిశాచి, దయ్యం, అందమైన భూతం, అదిక్కడ నన్ను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇంతవరకు ఐలవ్యూ చెప్పలేదు.  ఏం చేస్తాం ఖర్మ.  ఇంతకీ ఫోనెందుకు చేసావ్’’

స్పీకర్  ఫోన్ లో ఆ సంభాషణ వింటున్న సహస్ర కోపంతో మరింత ఉడికి పోతూ గుప్పిళ్ళు బిగించింది.  అవతల ముత్తు అడుగుతున్నాడు.

‘‘ఏం లేదు సార్,  ఈ అమ్మాయి సహస్రను పట్టిస్తే నిజంగా కోటి రూపాయలు ఇస్తారుగా?’’

‘‘నీకా చాన్స్ లేదు బ్రదర్.  ప్రకటన చూడగానే తనే నన్ను వెదుకుంటూ వచ్చేసింది.  ఫోన్ పెట్టెయ్’’  అంటూ లైన్ కట్ చేసాడు విరాట్.‘ ‘ఇప్పుడు చెప్పు,  ఏమన్నావ్’’  సహస్రని అడిగాడు.

‘‘ఊ’’  అంది అమోమయంగా సహస్ర.  విరాట్  మాటలు చేతలు ఆమెను గందరగోళం చేసి మైండ్ ని బ్లాక్  చేసేస్తున్నాయి.

‘‘ఏదో అన్నావ్ చెప్పు’’ తిరిగి అడిగాడు.

‘‘నేను కాదు. నువ్వన్నావ్’’ పిచ్చి కోపంతో అరిచింది సహస్ర.

‘‘ఏంటీ?  నేను రాక్షసినా,’’

‘‘కాదు,’’

‘‘దయ్యాన్నా.’’

‘‘ఛ.......ఛ.......  దయ్యం కన్నా బాగుంటావ్’’

‘‘అందమైన భూతాన్ని కదూ’’

‘‘ఆ మాట నేననలేదు’’

‘‘అబద్దాలాడకు.  నువ్వన్నావ్.  వాడితో ఫోన్ లో ఏమన్నావ్,  పిశాచి, దయ్యం, భూతం.......రాక్షసి,  ఏంటది? అందమైన భూతాన్నా.............’’

‘‘అంతకన్నఎక్కువగా ............. అందంగానే వున్నావ్ గా’’

‘‘ఓరి దేవుడా,  నన్నిలాంటి వాడికంట్లో ఎందుకు పడేసావయ్యా?  పిచ్చెక్కిస్తున్నాడు.  మాటల గారడీతో మాయచేస్తున్నాడు.  వీడి జిమ్మడిపోను, వీడి ముఖం మండ’’.............. తిట్లు అందుకొంది.

‘‘అయ్యబాబోయ్ ..........నన్నే ’’........... అరిచాడు.

‘‘నిన్నే రా మాయలోడా.......... మండ్రగప్ప.......... శాఖాచరా......... నిశాచరా..... అష్టావక్రా.............. నీ జేజెమ్మ జెల్లకొట్ట, నన్నిలా తగులుకొని ఏడిపిస్తున్నావేంటి రా మండూక రాజా’’.

‘‘అమ్మె........వామ్మె.............ఓర్నాయనో.........ఆపవేబాబు. ఒరేయ్ చందూ.........

ఈ పిల్ల అర్దంగాని తిట్లు తిట్టి నన్ను అన్యాయంగా చంపేయాలని చూస్తోందిరా. ఇవేం తిట్లో కాస్త వచ్చి చెప్పరా’’ అనరిచాడు విరాట్ వెంటనే. ‘‘మిత్రమా భయపడకు’’  అంటూ కిచెన్ లోంచి చందూ గొంతు విన్పించింది.

‘‘నిన్ను రక్షించటానికి పాకశాల యందు పదిలముగా యుంటిని.  శాఖాచరుడనిన కొమ్మల మీద సంచరించువాడు అనగా కోతియని అర్ధం. నిశాచరుడనిన చీకట్లో తిరుగువాడని యర్ధము.  అనగా రాక్షసుడు లేదా పిశాచి.  అష్టావక్రుడనిన ఒంట్లో ఎనిమిది వంకర్లున్నా వాడని అర్ధము. జేజమ్మ జెల్లి కొట్టయనిన నీ బామ్మ చావ అని.  మండూక రాజాయనిన కప్పల నాయకుడవని అర్దము. కావున మిత్రమా నీ ప్రియురాలు నిన్ను మెచ్చుకొంటూ  నిన్ను  కోతి, పిశాచి, వంకరోడా, నీ బామ్మ చావ అని ముద్దుగా ఆశీర్వదిస్తూ నిన్ను పెద్ద మండ్రగప్పతో పోల్చుచున్నది’’ అన్నాడు. అతని మాటల వెంటే దీక్షలోన చిన్నగా నవ్వటం విన్పిస్తోంది.

ఆ మాటలకు సహస్ర ముఖం మరింత జేగురించగా విరాట్  పకపకా నవ్వాడు.

‘‘ఆహా,  ఎంత చక్కగా పోల్చిందిరా’’

‘‘ఏయ్  ఏయ్?  ఆగాగు.......  నిన్ను కాదు నీ ఫ్రెండును తన్నాలి’’  అంటూ పిచ్చి కోపంతో టీపాయి మీద పేపర్  వెయిట్ ని బలంగా కిచెన్  డోర్ వైపు విసిరింది.  అది పెద్ద శబ్దం సృస్టిస్తూ డోర్ ని తాకి బార్లా వెనక్కి నెట్టేసింది.

లోన జంట అదిరిపోయింది.

దీక్ష తీరిగ్గా కూచొని టిఫిన్ లాగించేస్తోంది. చందూ వంట పనిలో బిజీగా ఉన్నాడు.

‘‘ఓర్నాయనో ప్రయోగం ఆరంభమైంది.  ఏయ్  దీక్షా,  ముందే డోర్  మూసేసిరా’’ అనరిచాడు చందూ.
అదంతా కళ్ళారా చూడగానే

దీక్ష ఆపోజిషన్  పార్టీలో ఎప్పుడో చేరిపోయిందని అర్ధమైపోయి హతాశురాలయింది సహస్ర. ’’ ఏయ్  దీక్షా ఆగవే.......’’  అంటూ  సహస్ర కిచెన్ వైపు వెళ్ళేలోగ దీక్ష డోర్ మూసి లోపల బోల్ట్  వేసేసింది.

వస్తున్నాను నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు విరాట్.  విసరిసా తిరిగి అతడి ముందుకొచ్చింది సహస్ర.  కోపం పట్టలేక పోతోంది సహస్ర. కళ్ళలో దూకటానికి సిద్దంగా ఉంది నీరు.  ఏమిటిది?  ఎంత పెద్ద తప్పుచేసాడు?

తను ఎంత ప్రమాదంలో ఉందో తెలీక ఇదంతా తమాషాగా తీసుకొని వాళ్ళు నవ్వుకుంటున్నారు.  ఏం చేయాలి? ముందీ కోపం తగ్గాలంటే వీడ్ని కొట్టాలి,  చితగొట్టాలి. వెనక్కి వస్తూనే ఆవేశంతో టీపాని ఒక్కతన్ను తన్నింది.  కాలు వెంబడే గాల్లోకి లేచిన టీపాయ్  గింగిరాలు  తిరుగుతూ పోయి గోడకు వేలాడుతున్న నిలుపుటద్దాన్ని తాకి భళ్ళున పగలగొట్టింది. ‘‘ఏయ్  ఆగాగు సహస్ర.  ప్లీజ్  నీ కోపం నా మీద చూపించు.  పాపం  ఇంటి  సామాన్లు  అవేం చేసాయి’’ అన్నాడు  విరాట్.

‘‘రేయ్  విరాట్,  నా సంగతి నీకు తెలీదు.  కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు.  నిన్నూ వదల్ను. నీ యింటినీ వదల్ను.  నా ఫోటో ప్రకటించి  అల్లరి చేస్తావా..........  ఇవాళ  నా చేతిలో అయిపోయావే’’ అంటూ ముందుకు దూకబోయింది సహస్ర.

‘‘ఆగాగు’’........ అన్నాడు వెంటనే విరాట్.

‘‘ఫోన్...........  ముందు ఫోన్  మాట్లాడి తర్వాత మన తగువు తేల్చుకుందాం.’’  అంటూ సెల్ ఫోన్  అందుకున్నాడు.

ఆగింది సహస్ర

స్పీకర్  ఫోన్  ఆన్లోనే ఉంచటంతో మాటలు బయటికి విన్పిస్తున్నాయి.  ఫోన్ చేసింది వాడే.....  మురడన్  ముత్తు.

‘‘మళ్ళీ ఎందుకురా ఫోన్  చేసావ్?’’ విసుగ్గా అన్నాడు విరాట్.

‘‘సార్ నాపేరు మురడన్ ముత్తూ. మాది కోయంబేడు మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లోఎవరినడిగినా నా గురించి చెప్తారు. చాలా పట్టుదల మనిషిని సార్’’‘‘ఇప్పుడే మంటావ్ రా?’’

‘‘ఇందాక మీరు చెప్పింది సరిగా అర్ధమై చావలేదు సార్. ఇలా ప్రకటనివ్వగానే అలా వచ్చేసిందంటే ఎలా నమ్ముతాను సార్?  మీరేదో  విసుగులో వున్నట్టున్నారు.  మీరు కోటి రూపాయలు ఇస్తానంటే చెప్పండి సార్, వారం తిరిగే లోపు చెన్నైలో ఆ పిల్ల ఎక్కడ వున్నా పట్టితెచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తా’’

అయిందా ఇంకా ఏమన్నా చెప్పాలా........  నిజంగానే సహస్ర వచ్చేసిందిరా మూర్ఖ.  ప్రస్తుతం సెటిల్ మెంట్లో వున్నాం.  ఆ  కోటి రూపాయలు నా ప్రియురాలి కే చెందుతాయి. నువ్వేం శ్రమ పడనక్కర్లేదు. ఫోన్  పెట్టెయ్.’’

‘‘అది కాదు సార్............’’

‘‘ఇంకోమాట మాటాడితే నిన్ను కోయంబేడు నుంచి లాక్కొచ్చి పక్కన ఏర్ పోర్ట్ లో పడేసి విమానాల చేత తొక్కించేస్తాను.  బ్లడీఫూల్ ’’అంటూ కట్చేసాడు  విరాట్.

సహస్ర వైపు తిరిగే లోన

తిరిగి ఫోన్  మోగింది

విసుగ్గా ఫోన్  తీసి చూశాడు

ఈ సారి ముత్తూ కాదు

నంబర్  మారింది

‘‘హాయ్’’  అన్నాడు.

‘‘ఏరా..........  ఈ రోజు పేపరు ప్రకటనిచ్చింది నువ్వేగా?’’  అవతలి నుంచి గరగరలాడిందో గొంతు.  ఆ గొంతులో నిర్లక్ష్యం,  దర్పం.
హంకార ధ్వనినిస్తున్నాయి. తనకి ఫోన్ చేసి తననే ఏరా అని పిలుస్తున్న అవతలి వాడి పొగరుకు విరాట్ కి ఒళ్ళు మండింది.

‘‘నువ్వెవడ్రా?  ఫోన్  చేసి మరీ నన్నేఅరే ఒరే అంటున్నావ్.  ఇడియట్ ?  మెంటల్ ఆస్పత్రి నుంచి వస్తున్నావా?’  సీరియస్ గా అడిగాడు విరాట్.
స్పీకర్  ఫోన్ లో  అవతలి గొంతు వింటూనే అలర్టయింది సహస్ర.  ఆ గొంతు తనకి గుర్తే........... అది మధురై ఎ యస్ పి ప్రకాష్  గొంతు.

‘‘ఏయ్  మిస్టర్  నాలుక దగ్గరుంచుకో.  ఇవతల మాట్లాడుతోంది మధురై ఎ యస్ పి ప్రకాష్’’ ........ ప్రకాష్  హెచ్చరికను మధ్య లోనే ఖండించాడు విరాట్.
‘‘అయితే ఏమంటావ్రా?  ఎ యస్ పి వైతే కొమ్ములొచ్చాయా?  పబ్లిక్ తో ఎలా బిహేవ్  చేయాలో తెలీదు?  ఫోన్  చేసే  ముందు  నాలుక దగ్గరెట్టుకొని మాట్లాడాలని తెలీదా?’’

‘‘రేయ్..... నా గురించి నీకు తెలీదు...............’’

‘‘అరవక.  నా గురించి నీకు తెలీదు.  ఫోన్  చేసిన వాడివి నువ్వు.  మర్యాదగా మాట్లాడు.  లేదంటే నీకు మర్యాద నేర్పాల్సి వస్తుంది.’’

విరాట్  మాటలకి అవతల ఎ యస్ పి ప్రకాష్  ఎలా స్పందిస్తున్నాడో గాని ఇవతల ఆ మాటలు వింటున్న సహస్ర ఆశ్చర్యంతో మ్రాన్ పడి పోయింది. ఏంటి వీడి ధైర్యం?  ఇంత నిర్భయంగా నిలదీస్తున్నాడు.  పైగా ఎక్కడ మధురైలో వున్న ఎ యస్ పికి మర్యాద నేర్పిస్తాడా? .........
ఆసక్తిగా వారి సంబాషణ వింటోంది.

‘‘అంత గొప్ప వాడివా?  శభాష్ రా,  నీ పేరేమిటి?’’

‘‘చెప్తే నీకు అర్దం కాదా?  ఫోన్ లో నా చేత తిట్టించుకొనే కార్యక్రమం పెట్టుకోకు.  నువ్వెందుకు ఫోన్  చేసావో చెప్పు.’’

‘‘లహరి ఫోటో ప్రకటించి పెద్ద తప్పు చేసావ్ రా.  అది చెప్పాలనే ఫోన్  చేసాను.’’

‘‘ఏయ్  మెంటల్,  లహరి ఎవర్రా?’’

‘‘లహరి ఎవరా?  ఏరా ఆ పిల్ల ఎవరో తెలీకుండానే ప్రేమించేసావా?  సహస్ర లహరి ఒకరే.  తన పూర్తి పేరేమిటో అదన్నా తెలుసా?......... లక్ష్మీ సహస్ర.  మధురై మహదేవనాయకర్  ఏకైక సంతానం.  రచయిత్రి సహస్ర.  తనే దిగ్రేట్  జర్నలిస్ట్...........  త్యాగరాజన్  భూకుంభకోణాల్ని తవ్వి తీసి కోర్టుకెక్కిన జర్నలిస్టు లహరి తనే...........’’

ఫోన్లో ప్రకాష్  మాటలు వింటూ నమ్మలేనట్టు సహస్ర వంక చూసాడు.

ఆమె ముఖంలో కోపం ఛాయలింకా అలాగే వున్నాయి.  ఆవేశంగా చూస్తూ నిలబడుంది.  లహరి అభిమానుల్లో తనూ ఒకడు.  త్యాగరాజన్ మీది భూకుంభ కోణాల వ్యవహారం, దాని చరిత్ర పత్రిక మూలంగా తెలిసిందే కాని తను ప్రేమించింది లహరినంటే నమ్మలేకపోతున్నాడు. తాత్కాలికంగా తన ఆలోచనల్నిఅదుపుచేసుకుంటూ ప్రకాష్ మాటలు వినసాగాడు.

‘‘రేయ్.........  నీ పేరేమిటో నాకు తెలీదు.  ఇష్టం లేకపోతే చెప్పకు.  కాని సహస్రను మర్చిపో.  లహరి నాది.  నాకాబోయే భార్య.’’

‘‘వ్వాట్?’’ అరిచాడు విరాట్.

‘‘షాకయ్యావా?’’ అంటూ నవ్వాడు ప్రకాష్.




[email protected]

www.suryadevararammohanrao.com

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yaatra