Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
na preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ : సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఆస్ట్రియా బయలుదేరుతారు డైరెక్టర్ జీవన్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల బృందం....నిర్మాత సలీం భాయ్ హవేలీకి వెళ్ళిన జీవన్ కి సలీం భాయ్ చెల్లెలు షహనాజ్ ఎదురవుతుంది..ఆమె కళ్ళని చూసి మైమరచిపోతాడు డైరెక్టర్ జీవన్....

ఆ తర్వాత.....

................

సెప్టెంబర్ – 30

ఫ్లైట్ తెల్లవారుజాము నాలుగు గంటలకయితే పన్నెండింటికే వచ్చేసింది వాళ్ళ కంపెనీ కారు. మేనేజరు హరి కి ఫోన్ చేసి “ఆప్పుడే పంపించేసేవేంటి..?” అన్నాడు జీవన్.

“సార్, కారు మీ ఇంటి ముందుంటుంది. టైమయ్యాకా ఎయిర్ పోర్ట్ నించి ప్రొడ్యూసర్ జార్జిప్రసాద్ గారు ఫోన్ చేస్తారు అప్పుడు బయల్దేరండి” అన్నాడా మేనేజరు.

రెండు గంటలకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కొచ్చే సరికి ఈ టూర్ కండక్ట్ చేసే వేణు గారు లాంజ్ లో హడావుడిగా తిరుగుతూ కనిపించాడు. మేకప్ మేనూ, దోబీ, కో – డైరెక్టరు గంగరాజు, కొత్త డాన్సు మేస్టరూ వాడి అసిస్టెంటూ, కెమెరా, నాగరా కి సంబంధించిన మనుషులూ, ఇంకా రాజమండ్రి నించొచ్చిన జార్జి ప్రసాదు ఫ్రెండ్సు గోవిందు, చందర్రావూ లాంజ్ లో కూర్చుని ఉన్నారు.

“మేమిద్దరం ఇంకో దేశం వెళ్లడం ఇదే ఫస్టు టైమ్ సార్” అన్నాడు చందర్రావు.

“అసలు విమానం ఎలాగుంటుందో చూడ్డం ఫస్టు టైమ్ ముందది చెప్పు” అన్నాడు గోవిందు.

“ఇలాగంటే అలాగని అర్థంగాదేంటి ఈయన గారికి” అని ఎదో గుర్తొచ్చినట్టు జీవన్ దగ్గర కొచ్చిన చందర్రావు “చూడండి గురూ గారూ, విమానం గాల్లోకి ఎగిరినప్పుడు నా కళ్ళు తిరిగినా, దాని కుదుపుకి కింద పడినా మీరు కాస్త చూసుకోవాలి మమ్మల్ని....! నాకు కొంచెం హార్టు ట్రబులుంది. విమానం పైనున్నప్పుడు నెప్పిలాంటిదేవయినా వస్తే డాక్టర్లుంటారు గదా..?” అన్నాడు.

అంతలో వచ్చిన ప్రొడ్యూసర్ జార్జి ప్రసాద్ “అప్పుడే మొదలెట్టేసేవా ఎదవ గోల..?” అంటూ డైరెక్టర్ జీవన్ కి అయిదు వేల యూరోలు ఇచ్చి ఏదో మాటాడ్తున్నవాడల్లా, బుక్ స్టాల్ పక్కనున్న ఇంకో షాపు వేపు చూసే సరికి అక్కడున్న బెల్టులు, తాళం కప్పలు లాంటివన్నీ కొనేస్తూ కనిపించేడు గోవిందు. అతని దగ్గరికెళ్ళిన జార్జి ప్రసాదు “ఇవన్నీ ఎందుకురా..!?” అన్నాడు.

“ఎందుకంటావా...?” అడిగేడు గోవిందు.

“ఎందుకూ..?” అన్నాడు జార్జి ప్రసాదు.

“ఏమో నాకేం తెల్సు ఈ చందర్రావు గాడు కొనమంటే కొంటున్నాను” అనే సరికి గిర్రుమని చందర్రావు వేపు తిరిగిన జార్జి ప్రసాదు “ఎందుకురా ఇవన్నీ కొనమన్నావ్ వాడ్ని..?” అన్నాడు.

“ఎందుకంటే...” అంటూ తలొంచేసుకూర్చున్న చందర్రావు “ముందలా బెదరగొట్టకు” చెపుతాను.

“ఎందుకంటే..., ఫస్ట్ టైం ఫారినెళ్ళావ్ మాకేం తెచ్చావ్..? అని మా ధవిళేశ్వరంలో మా రధం వీది జనం అడిగితే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి...! అందుకు కొనమన్నాను” అని ఫినిష్ చేసేడు.

“మనం ఇంకా ఫారిన్ లో పాదం పెట్టలేదు గదా” అన్న గంగరాజు గూబ మీద లాగి కొట్టేసిన చందర్రావు “ఫారిన్ వేళ్ళలేదని నాకు తెలీదా..? అక్కడ ఆళ్ళు చెప్పే రేట్లకి మనం తూగగలమో లేదో అని ముందు జాగ్రత్తతో ఇవన్నీ కొనిపిస్తున్నాను” అని అక్కడ్నించెళ్ళిపోయాడు.ఈలోగా వాళ్ళ మమ్మీ డాడీతో పాటు దిగింది కొత్త హీరోయిన్ హరిప్రియ.

“యూనిట్లో అంతా నన్నో తోబుట్టువులాగ చూస్తారు. వీళ్ళంతా ఉండగా మీరెందుకు చెప్పండి..?” అని గట్టిగా చెప్పడంతో ఆమె తాలూకు వాళ్ళెవరూ కూడా రావాడం లేదట. ఓ పక్క అందరితోనూ మాటాడ్తూనే ఎంట్రన్స్ గేటు వేపు చూస్తుంది హరిప్రియ.

కాస్సేపటికి దిగిన కొత్త హీరో అనిల్ ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసింది. ఇంకాస్సేపటికి ఇద్దరు పోటోగ్రాఫర్లనీ, ఒక వీడియో తీసే అతన్నీ, దగ్గరుండే మొత్తం స్టాఫ్ నీ వేసుకుని దిగిన మ్యూజిక్ డైరెక్టర్ యోగి ఎయిర్ పోర్టంతా హడావుడి చెయ్యడం మొదలెట్టాడు. అంతలో ఎవరో ఇద్దరొచ్చి నాలుగు దండలేసారు.

“ఎవర్రా వాళ్ళు..?” యోగి ని అడిగాడు జీవన్.

“ఫాన్స్, వరంగల్ నుంచి వచ్చారు” అన్నాడు.

“ఎయిర్ పోర్ట్ కొచ్చి దండలు వెయ్యడానికి నువ్వు కిరాయికి పెట్టుకున్న మనుషులు వాళ్ళు ఔనా..?” అన్నాడు జీవన్.

“ఊరుకోండి సార్, నేనేం చేసినా ఏదో వంక పెడతారు” అంటూ ఎవరో పిల్చినట్టు యాక్ట్ చేస్తూ ఇంకో పక్కకెళ్ళిపోయాడు.

“నే వెళ్ళి ఎయిర్ పోర్ట్ మేనేజర్ని కలుస్తాను” అని వేణూ అరుస్తుంటే ఏంటా అని అటు వేపు వెళ్ళారీళ్ళు. నెగిటివ్ స్కేన్ చేస్తాం అంటారు వాళ్ళు. చేసేటప్పుడు కన్వేయర్ బెల్ట్ మీద ముందుకెళ్ళాలి గానీ మళ్ళీ వెనక్కి రాకూడదు. అలా వస్తే ఇంకది షూటింగ్ కి పనికి రాదు అంటాడు వేణు. అక్కడో చిన్న సైజు గొడవ మొదలైంది.

కాస్సేపటికి జార్జి ప్రసాదు పార్టనర్ జాస్తి చౌదరి, కన్నారావు వచ్చారు.

ఈ ఫ్లైట్ లో జర్నీ చేసే జనాల కంటే వాళ్ళని సాగనంపడానికొచ్చిన జనాల్తో కళకళ్ళాడిపోతుందా ఎయిర్ పోర్టు.

మామూలుగా మెయిన్ గేటు వేపు చూసిన జీవన్ అలా ఉండిపోయేడు.

చేతిలో వయోలిన్ బాక్సుతో షహనాజ్.

అంతలో,

మాటాడ్తున్న సెల్ కట్ చేసి టెన్షన్ తో ఊగిపోతూ వచ్చాడు సలీం భాయి. మెయిన్ హీరో సందేశ్ మూడు రోజులు లేటుగా వస్తానని కబురు చేశాడట లాస్ట్ మినిట్ లో. “అసలే నా ప్రర్సనల్ ప్రాబ్లమ్స్ తో నే చస్తుంటే ఏంటి భాయూ ఇది” అన్నాడు సలీం.

ఆ సినిమా డైరెక్టరైన వేగేశ్వర్, డాన్స్ మేస్టరు అశోక్ అక్కడికొచ్చి మొత్తం మేటరంతా విని “మీరేం టెన్షన్ పడకండి సార్, మెయిన్ హీరో గారు వచ్చేలోగా ఆ కొత్తోళ్ళిద్దరితో మేనేజ్ చేస్తాం” అన్నారు.

ఇంకా రిపోర్టింగ్ టైం అవ్వకపోవడంతో యూరప్ వెళ్ళే సినిమా యూనిట్లో వాళ్ళంతా ఎయిర్ పోర్ట్ లో కలియతిరుగుతున్నారు.జీవన్ మాత్రం ఒక మూలనున్న చెయిర్లో కూర్చున్న షహనాజ్ నే చూస్తున్నాడు. తనని మర్చిపోయి చూస్తున్నాడు. ఒక తన్మయత్వంతో చూస్తున్నాడు. ఒకానొక అనుభూతితో చూస్తున్నాడు. అలా చూస్తున్న జీవన్ కి పాకీజా సినిమాలో మీనా కుమారీ, మధుమతి లో వైజంతిమాలా, మూగ మనసులు లో సావిత్రి, ఆమె ఎవరు? లో జయలలిత, పరాక్ లో సాధన, కాగజ్ కే పూల్ లో వహిదా రెహమాన్, తలాష్ లో షర్మిలా ఠాగోర్ గుర్తుకొస్తున్నారు. వాళ్ళందరి కళ్ళు గుర్తుకొస్తున్నాయి.

షహనాజ్ కళ్ళ ముందు వాళ్ళందరి కళ్ళు దిగదుడుపే అనిపిస్తుంది.

హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళే ఆ విమానం నాలుగు గంటలకి టేకాఫ్ అవుతుండగా సేఫ్టీ బెల్టులు పెట్టుకోమని ఎనౌన్స్ చేస్తుంటే... ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్న యోగి పొరపాటున జీవన్ రెండు బెల్టుల్లో ఒకటి కట్టేసుకుని ఎయిర్ హోస్టెస్ తో తిట్లు తిన్నాడు. ఇడ్లీ సాంబారని చెప్పి రెండు అట్ట ముక్కల్లాంటి వాటి మీద సాంబారు రంగులో ఉన్నదేదో వేసిచ్చిన ఎయిర్ హోస్టెస్ తో ఇంగ్లీషులో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న చందర్రావు కేసి చూస్తూ నవ్వుకుంటున్నారు ప్యాసింజర్లంతా. ఆఖరికి చిరాకులో ఉన్న సలీం కూడా నవ్వేశాడు. ఈలోగా అక్కడికొచ్చిన జార్జి ప్రసాదు, చందర్రావు ని తెగ తిట్టి “నోర్మూసుకుని కూర్చో” అన్నాడు.

దూరంగా సలీం పక్కన కూర్చున్న షహనాజ్, కిటికీలోంచి దూదిలా తేలిపోతున్న మేఘాలను చూసుంది. ఆమె ఒడిలో నిద్రపోతున్న పసిపాపలా ఉంది వయోలిన్. ఏవో లోకాల్లోకి చూస్తా మౌనాన్ని మోస్తున్నాయి ఆవిడ కళ్ళు.

ప్రతీ సీటు ముందు ఫిక్స్ చేసి ఉన్న మానిటర్లో ఫ్లైట్ మాప్ కనిపిస్తుంది. ముంబై, అహమ్మదాబాదు, కరాచీ దాటుకుంటూ అరేబియా సముద్రం మీదుగా దుబాయ్ వేపు ప్రయాణం చేస్తుందా విమానం.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్