Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
na preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Sankranthi

మేఘన

 

జరిగిన కథ : కళ్ళముందు కనిపిస్తున్నవీ, జరుగుతున్నవీ వాస్తవమో, భ్రమో అర్థం చేసుకోలేకపోతుంటాడు హరి. వాచ్ మెన్ పలకరింపు, ప్రవర్తన అసహజంగా అనిపిస్తుంది. ఈలోగా బాల్కనీలో నిల్చున్న అతడి చెవిలో గుసగుసగా... ఎవరో పిల్చిన అనుభూతికి లోనవుతాడు.... ఆ తర్వాత......

ఎవరో చేయిపట్టి నడిపించుకెళ్తున్నట్లుగా... నెమ్మదిగా మెట్లవైపు కదిలాడు హరి.

ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ చివరగా ఆరవ అంతస్తు చేరుకుని టెర్రెస్‌మీదకు వెళ్లాడు.

అక్కడ....

ఒక స్త్రీ ఆకారం వెనుక వైపు నుండి కనిపిస్తున్నది... ఆమె జడ వేసుకోకుండా వదిలేసిన జుట్టు గాలికి కదులుతూ ఉంది...

పరిచితమైన మనిషి లాగానే ఉంది... ముఖం కన్పించడం లేదు. ఆమె ఎదురుగా గట్టుమీద ఒక ముసలామె... ముఖాముఖీ కన్పిస్తున్నది. ఎక్కడో చూసినట్లుందీ ముసలమ్మని.

‘‘ఔను... ఒకసారి తన ఇంట్లోకి చొరబడింది... ఇంకోసారి హాస్పిటల్‌లో స్వీపర్‌లాగా ఎదురై, నాయనా నీవే దారి చూపించాలి, నీవే ఆదుకోవాలి అంటూ పీడించింది. వదిలించుకోలేక నానా బాధలూ పడాల్సి వచ్చింది.’’

ముసలామె చూపులు హరి చూపులు కలిసాయి... మళ్లీ ఆమె చూపుల్లో ఏదో అభ్యర్ధన... ఏదో ఆశిస్తున్నట్లుగా, ఏదో కోరుతున్నట్లుగా...బలవంతంగా చూపులు తప్పించి, ఇంకెవరో ఉన్నట్లుగా అనిపించి టెర్రెస్‌ పిట్టగోడ వైపు చూసాడు. అవును వాడే... మరాటా, తెలుగు సిన్మా యాక్టరు... అదేదో షిండే...

‘‘ముఖం కరుగ్గా పెట్టుకుని, కోపంగా హరి వైపే చూస్తున్నాడు. అదే చిరాకు, అదే ఎర్రజీర కళ్లల్లో వాడికేదో బాకీ పడ్డట్లు, వాడు చెప్పిన పనేదో చేయనట్లు, అందుకు వాడికి కోపం వచ్చినట్లు, చెప్పిన పని చేయకపోతే... ఏం...రా ఎంతకాలమయ్యింది, చెప్పింది చేయక ఎక్కడ పెత్తనాలు వెలగబెడుతున్నావ్‌ అనే  ఎక్స్‌ప్రెషన్‌ కొట్టవచ్చినట్లు  కనిపిస్తున్నది.’’ కనీసం నాలుగుసార్లు కనబడి ఉంటాడు ఇదే అపార్ట్‌మెంట్స్‌లో సడన్‌గా ఏదో గుర్తుకు వచ్చి, షిండే గాడి పాదం వైపు చూసాడు హరి...

అదే వాసం మేకు... అదే రక్తం...

వీడు మనిషి కాదు, మనిషైతే ధనుర్వాతంతోనో, సెప్టిక్‌తోనో ఈ పాటికి చచ్చి ఉండేవాడు. ఇంతకాలమైనా చావలేదంటే వీడు సామాన్యుడు కాదు. అసలు మనిషే అయి ఉండడు.

మనిషి కాకపోతే....? దయ్యమా....?

మొట్టమొదటిసారి జీవితంలో వెన్నులోంచి చలి పుట్టుకు వచ్చింది హరికి. ఒళ్ళు గగుర్పొడిచింది... ఒక రకమైన జలదరింపు.

ఎన్నో మృతదేహాలను చూసినా, వాటిని కోసినా ఏ మాత్రం లేని జలదరింపు... సడన్‌గా ఇప్పుడు?

చలిజ్వరం వచ్చినట్లుగా, కొద్ది కొద్దిగా దేహం కంపించనారంభించింది.తనలో జరుగుతున్న మార్పులు తేలిగ్గానే కనిపెట్టగలుగుతున్నాడు హరి...

ఇంతలో... పిల్లవాడు గుర్తుకొచ్చాడు... హరికి.

కర్ణ కఠోరంగా రోధించే పసిబిడ్డ... షిండే చేతుల్లో ఉండేవాడు ఎక్కడ..?

టెర్రెస్‌నేల మీద ఒక మడత మంచం గుడ్డ పరచబడి ఉన్నది. దానిపై దోగాడుతున్నాడు వాడు... హరిని చూసి కేరింతలు కొట్టడం మొదలుపెట్టాడు. ఎలా..? ఈ పసివాడు ప్రవర్తనలో ఇంత మార్పు ఎలా వచ్చింది?

హరి రెండు చేతులూ చెమటతో తడిసిపోయాయి. హేంకీ కోసం పాంటు జేబులో చెయ్యి పెట్టి చూసాడు... లేదు. అలాగే రెండు అరచేతులూ పాంటుకే రుద్దుకున్నాడు... నుదుటి మీది నుండి రెండు చెమట బిందువులు కనుబొమ్మల మీదుగా ప్రయాణించి, ఎడమ కంటిలో పడ్డాయి.ఒక్కసారిగా కన్ను మండింది...

గబగబా చేతితో రుద్దాడు... మోకాళ్లు బలహీన పడుతున్నట్లుగా తెలుస్తూనే ఉంది.ఇంతలో...వెనక్కి తిరగి ఉన్న స్త్రీ హరివైపు తిరిగి చిన్నగా చిరునవ్వు నవ్వింది...

మేఘన....

కానీ ఈ మేఘన కంప్లీట్‌ ఆపోజిట్‌గా ఉంది.. పాలిపోయిన ముఖం... జీవంలేని చిరునవ్వు... సివియర్‌ ఎనీమియా (అత్యధిక రక్తహీనత) ఇంత ప్రస్పుటంగా కొట్టవచ్చినట్లు కన్పిస్తుందా.నిన్నంతా బాగానే ఉందే... ఇప్పటికిప్పుడు అంత మార్పు ఎలా వస్తుంది?

ఏదీ..? ఆ.. కళ్లల్లోని మెరుపు...?

ఏదీ..? ఆ... ఆత్మీయత...?

ఏదీ..? ఆ.. చిరునగవు లోని విద్యుత్తు..?

నిస్తేజంగా చూస్తున్న ఈ కళ్లేమిటి?

ఏ భావమూ లేకుండా చూస్తున్నాయెందుకు...?

‘అట్టర్‌కన్‌ఫ్యూజన్‌’తో చూస్తున్న హరినుద్దేశించి పరిచయాల కార్యక్రమం మొదలుపెట్టిందామె.

‘‘ఈమె మా పిన్ని... ’’

ఈ ముసలమ్మ... పిన్నా..? చూస్తుండి పోయాడు హరి.

‘‘మరి అతను?’’

‘‘మా బాబాయి...’’

‘‘పిన్ని ఇంత ముసలి దానిలా ఉంది? బాబాయి నడివయస్కుడిలా ఉన్నాడు..?’’

‘‘మరి ఈ పిల్లవాడు..?’’

‘‘పక్కింటి వాళ్ల పిల్లవాడు. ఒక్కడే కొడుకు. ముక్కుపచ్చలారని పసివాడు.’’

హరి అనుమానాలను సందేహాలను పట్టించుకోకుండా పరిచయాలు చేసింది మేఘన...

‘‘మేమందరము నిన్ను కలవాలనీ, నీ సహాయం కోరాలనీ, నీ నుంచి మేలు పొందాలనీ ఎంతో ఆశగా గత కొద్దికాలంగా వేచి చూస్తున్నాము.’’ అన్నది మేఘన.

అంత విచిత్రమైన పరిస్థితుల్లోనూ చటుక్కున కోపం వచ్చింది హరికి...

‘‘నన్నెందుకు కలవాలి?’’

‘‘నాకు వీళ్లకూ సంబంధం ఏమిటి? కనీసం నా పేషంట్లు కూడా కాదు వీళ్లందరూ. నాకు ఏ విధంగానూ కనీసం చూచాయగానూ వీళ్లెవరో, ఏమిటో, వీళ్లకేం కావాలో నాకేం తెలుసు? నా కోసం వెతకడమేమిటి? నా సహాయాన్ని అర్థించడమేమిటి? అసలేమైనా అర్థముందా? వీళ్లదేమైనా మాఫియా గ్యాంగా? డబ్బులేమన్నా కావాలా? నన్ను ట్రాప్‌ చేద్దామనుకుంటున్నారా...? అసలేమిటీ నాటకమంతా..? ఎందుకు నా వెనక బడుతున్నారు..? నేనేమిటి? మేలు చేయడమేమిటి? ఇదేమన్నా ఇచ్చి పుచ్చుకోవడమా? వీళ్లేదో నాకు మేలు చేసినట్లు, నేను తిరిగి మేలు చేయాలన్నట్లు ఏదో నా మీద మీకేదో హక్కు ఉన్నట్లు మాట్లాడుతున్నారేమిటి? ఏమిటిదంతా? తనలో తాను కోపంగా అనుకుంటున్నాడు.

పిట్టగోడ దగ్గరున్న బాబాయి చటుక్కున హరివైపు తిరిగి, ఎప్పుడూ చూసే చూపుతోనే అన్నాడు...

‘‘ఔను... చేసిన మేలు గుర్తుండదు మనుషులకి. చేసిన మేలు వెంటనే మర్చిపోవడమూ, కృతజ్ఞత చూపించడం మనుషులకి తెల్సినంతగా వేరే ఏ జీవాలకీ తెలియదు.’’

నిర్ఘాంతపోయాడు హరి...

ఈ బాబాయి గాడు చిరాగ్గా చూడడమే కాక, ఇంత చిరాగ్గా మాట్లాడగలడా..? వీడేంటి? నాకు మేలు చేయడమేంటి? హరి మనసులోని మాట కనిపెట్టినట్లుగా అన్నాడు షిండే.. బాబాయి...

‘‘గుర్తు లేదా..? గుర్తుంచుకోలేదా..? కరీంనగర్‌ శివార్లలో నీ కారు ఆగిపోయినప్పుడు, ఆ చీకట్లో వర్షంలో ఎటు అడుగులు వేస్తున్నావో తెలియకుండా, ఎక్కడ పడుతున్నావో తెలియకుండా, ఎందులో కూరుకుపోయావో గుర్తుకు రావడం లేదా? రోడ్డు పక్కన రైస్‌మిల్లు గుర్తు లేదా? రావడం లేదా?’’ అన్నాడు.

లీలగా గుర్తుకొచ్చింది హరికి....

ఎప్పుడో జరిగినవీ తాను మర్చిపోయినవీ గుర్తు చేసి వాళ్ళు చెప్పబోతున్న ఆసక్తికర విషయాలేమిటి...వాటిపట్ల హరి స్పందన ఎలా ఉండబోతోంది...???? వచ్చేవారం దాకా ఆగాల్సిందే...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra