Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
horoscope

ఈ సంచికలో >> శీర్షికలు >>

నాట్యభారతీయం - కోసూరి ఉమాభారతి

..స్నేహమే ఓ పెన్నిది ...

స్నేహపూరిత చిరు జల్లులైనా, ద్వేషపూరిత జడివానలైనా!  పురోగతికి సోపానాలుగా.... ‘నృత్యకళ’ నా జీవితంలోకి ఎన్నో విశేషాలని, విశేష వ్యక్తులని, అపురూప సంఘటల్ని ఆవిష్కరించి ఎన్నోఅందమైన అనుభూతలని ఇచ్చింది.....

నా నృత్యానికి నేరుగా తోడ్పడి, నా పురోగతికి సహకరించిన వ్యక్తుల్లో ముఖ్యులు కొందరు.

నా ‘కూచిపూడి రంగప్రవేశం’ అయ్యాక,  డాన్స్ ప్రోగ్రాములకి ఓ కొత్తగాయని కోసం, ఓ కొత్త వాయిస్ కోసం నిరంతర అన్వేషణ కొనసాగేది... నాన్న ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారు...ముఖ్యంగా విదేశీ పర్యటనలు దగ్గర పడుతున్న సమయంలో ఒకరు కాదు ఇద్దరు సింగర్స్ కావాలని ప్రయత్నాలు ముమ్మరం చేసారు.  ‘భారతీయ నృత్యాలు’ డాక్యుమెంటరీ, వీడియోలకి నాకు మాచ్ అయ్యే ప్లేబ్యాక్ వాయిస్ కోసం కూడా ఆ అన్వేషణ అత్యవసరమయింది.

సరీగ్గా అదే సమయానికి ‘చంద్రకాంత నాడ’ అనే ఓ యువ గాయని నాన్నకి తటస్థ పడింది.  ఏ క్షణాన కలిశామో ‘మేము చరిత్ర సృష్టించామనే’ అంటాను... ఇంచుమించు ఇద్దరం ఒకే వయసు వాళ్ళం.   అందరూ నాకు సరయిన వాయిస్ దొరికందన్నారు.  నా మరో గాయని కనకదుర్గ.  వెంపటి సత్యం గారి వద్ద శిష్యరికం చేసింది.  వారిద్దరూ నా నృత్యానికి గాత్రమివ్వడమే కాక మాకు చాలా దగ్గరయ్యారు.

చంద్రకాంత కిలకిలా నవ్వేది.  కోకిలలా పాడేది... చంద్రకాంత గొంతు నాకు, మా కుటుంబ సభ్యులకి కూడా – ‘నభూతో నభవిష్యత్’.  మాకంత ఇష్టం చంద్ర పాటంటే. చంద్రని మా అమ్మా నాన్న వారి సొంత అమ్మాయిలా చూసుకున్నారు.   నాకూ మంచి ఫ్రెండ్ అయింది..

డాన్స్ వల్ల ఏర్పడిన ఓ స్పెషల్ స్నేహం, అభిమానం చంద్రకాంత. తనూ, వివాహమాడి  హ్యూస్టన్ లో సెటిల్ అవ్వడం విశేషం.  చంద్రకాంత కోర్ట్ నీ గా హిందుస్తానీ మ్యూజిక్ స్కూల్ స్థాపించడం విశేషం. కొన్ని సినిమాల్లో పాటలు పాడింది కూడా.

అలాగే హ్యూస్టన్ లో ‘అర్చన డాన్స్ అకాడెమీ’ స్థాపించాక, సుభద్ర విశ్వనాధం, లక్ష్మీ కలపటపు నాకు మంచి స్నేహితురాళ్ళు, శ్రేయోభిలాషులుగా నిలిచారు. వారితో అనుబంధం కూడా నాకు నా నృత్యం వల్లే ఏర్పడింది.. వారి అమ్మాయిలు మాధురి, సాగరిక నా శిష్యురాళ్ళు.  వారికి సంగీత, నృత్య  కళలంటే మహా ఇష్టం.  ఆ పై నేనన్నా నా నాట్యం అన్నా ఎనలేని అభిమానం.  అలా దగ్గరయ్యారు లక్ష్మి గారు, సుభద్ర గారు. ఎన్నో ప్రదర్శనలకి వారి తోడ్పాటు, సహకారాలు వెల కట్టలేనివే.  నే చేపట్టిన అన్ని కార్యక్రమాలు, టెలిఫిలిం ‘ఆలయనాదాలు’ తో సహా వారిద్దరూ ముందుండి  సజావుగా జరిగేలా సహకరించారు.  ఒక్కోప్పుడు నాకు ఓ అమ్మంత సాయం చేసేవారు... వారిలాంటి స్నేహితులు అరుదుగా ఉంటారు. 
 చిన్ననాటి స్నేహితురాలు ఉష.  నైన్త్ గ్రేడ్ లో మా సెక్షన్స్ వేరు.  సెయింట్. ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజీలో, కాలేజీలో కూడా తను బి.కాం. నేను బి.ఎ.  అయినా మంచి స్నేహితులమాయ్యాం.  తనతో పాటు లక్ష్మి.  ఫిష్, ప్రాన్స్ వంటి ఫుడ్స్ వాళ్ళ ఇళ్లలోనే నేను టేస్ట్ చేసింది...  వారిద్దరి ఫామిలీస్ కి నా నృత్యం అంటే ఎనలేని ఇష్టం... ఏ ఒక్క ప్రోగ్రాం మిస్ అవ్వకుండా వచ్చేవాళ్ళు.  వాళ్ళ అమ్మలు నన్ను ఎంతగానో  ఆదరించేవారు.

మేము ముగ్గురం కాలేజీ ఎగ్గొట్టి చూడని పాత హిందీ, తెలుగు సినిమాలు లేవు... ఎప్పుడన్నా జేమ్స్ బాండ్ మూవీస్ కూడా.  శనాదివారాలు తప్పకుండా రోజంతా కలిసే గడిపేవాళ్ళం.  ఆ స్నేహం పదింతలగా పెరిగింది.  ఉష లాంటి స్నేహితురాలు ఉండడం గొప్ప అదృష్టం... ఇంత దూరాన ఉన్న నాకు మా నాన్న విషయంలో ఉష కనబరిచిన శ్రద్ధ, సమయానికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపే మాటలే లేవు.   అలాగే లక్ష్మి  కూడా ఏనాడైనా, ఎటువంటి సాయమైనా చేయందిస్తుంది.. ఈ రోజు వరకు కూడా వారితో ప్రత్యేక అనుబంధం.

మొదట్లో నేను చేసిన ప్రతి రచన, ఉష చదివి ఫీడ్-బ్యాక్ ఇచ్చి కామెంట్ చేసేది...  మా అమ్మ పోయాక, నేను ఇండియాలో చేసిన డాన్స్ ప్రోగ్రాములకి కూడా ఉష నాకు అమ్మంత సాయం చేసేది. నా వీరాభిమానులైన ఉష, లక్ష్మీ వారి కుటుంబాలకి కృతజ్ఞతలు.  ఉష హైదరాబాదు, లక్ష్మి శాన్- హోజే వాస్తవ్యురాలు.

“హలో ఉమా, నేనెవరో చెప్పుకో చూద్దాం.  మారేడుపల్లిలో మీ ఇంటి కార్నర్ తిరిగాక లెఫ్ట్ సైడ్ లాస్ట్ హౌజ్ మాది... నీ డాన్స్ ప్రోగ్రాం ఉందంటే చాలు ముందు వరసల్లో నేనుండేదాన్ని...నీ మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు నేను మన క్లాస్ మేట్స్ తో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాము కూడా.  ఇప్పుడు కూడా నీవింకా నీ డాన్స్ కంటిన్యూ చేస్తూ ఇంత ఫేమస్ అయ్యావంటే నాకు చాలా గర్వంగా ఉంది. తెలుసా?”  ఫోనులో అటునుండి ఒకావిడ... ఎవరబ్బా ఇంత అభిమానంగా ఫోన్ చేసి, స్కూల్, కాలేజీ నాటి విషయాలు గుర్తు చేస్తూ ... ఎవరై ఉండచ్చు?  అనుకుంటూ ఫోన్ మీది నంబర్ చూసాను... గుర్తు పట్టే ఏరియా కోడ్ కూడా కాదు.  “ఎక్కడినుంచి కాల్ చేస్తున్నావు?” అడిగాను....

“నేనుమా ఇందుమతిని.  లండన్ నుండి కాల్ చేస్తున్నాను,” అంది ఇందు...  అప్పటినుండీ ఇప్పటివరకు, నేను చేపట్టే ప్రతి కార్యక్రమానికి మొదటి శుభాకాంక్షలు అందుకునేది ఇందుమతి నుండే...

పాతికేళ్ళ తరువాత,  వేల మైళ్ళ దూరాన ఉన్న నన్ను వెతికిపట్టుకొని పలుకరించి, మరుగున  పడిన ముచ్చట్లతో  నవ్వించి,  చల్లని  కబుర్లల్లో  ముంచేసి, గత పదేళ్లగా  అదే  స్నేహభావంతో  నన్ను  పలకరిస్తూ, అరుదైన  స్వచ్చమైన  చెలిమిని పంచుతున్న నా చిననాటి నేస్తం  ఇందుమతి.నా నృత్యం అంటే ఎనలేని అభిమానం..

నా చెల్లెళ్ళు జయంతి, అను కూడా అంతే, నా ప్రోగ్రాములప్పుడు, ఒకళ్ళు పూలు కడితే, ఒకళ్ళు టిఫిన్ అందించేవారు..  ఎంతసేపూ నా గురించి, నా డాన్స్ గురించే కాక, నా వెంటే ప్రోగ్రాములుకి తిరిగే వారు అమ్మా నాన్న.  అప్పుడు జయంతి, అను చదువుకుంటూ ఇల్లు చూసుకునే వారు... నా వల్ల, నా కళ వల్ల కాస్తో కూస్తో నష్టపోయినవారు నా తోబుట్టువులే.. అయినా మేము స్నేహితులమే...జయంతికి తన సొంత స్నేహితులతో కంటే నా క్లాస్ మేట్స్, ఫ్రెండ్స్ తోనే స్నేహం, ఎరుక ఎక్కువ...ఇప్పుడు కూడా మా ఇంటికి దగ్గరిలో సెటిల్ అయ్యారు వాళ్ళు.  నా కంటే మంచి ‘కుక్’.  అప్పుడప్పుడు నాకు నచ్చినవి వండి తెస్తుంది.  అమెరికాలో నాతోపాటు ప్రోగ్రాములకి, సభలకి వస్తుంది.  జయంతి మేలైన మంచి తోడు, నేస్తం నాకు..కనుమరుగైతే కొన్నిసార్లు బంధవ్యాలని, స్నేహాలని నిలబెట్టుకునే సమయం గాని ఓపిక గాని ఉండకపోవచ్చు.  అయినా అలా నిలిచిపోయిన అనుబంధాలలో కొన్నింటిని మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించాను..

అమెరికాలో స్థిరపడ్డాక, పాటుపడి నృత్యరంగంలో పేరు, గుర్తింపు సాధించాను.పలువురు శిష్యులు నా ఆధ్వర్యంలో కూచిపూడి రంగప్రవేశం చేస్తుంటారు.  ‘ఆలయ నాదాలు’ అనే టెలిఫిలిం  నిర్మించి అమెరికాలో వీడియోలుగా విడుదల  చేసాము....’రాగం-తానం-పల్లవి’ అనే మరో డాన్స్ వీడియో నిర్మాణం చేపట్టాము.ఇలా నిత్యం కళారాధనలో మునిగి తేలాను అంటే అతిశయోక్తి కాదు.

మా అబ్బాయి, అమ్మాయి కళారంగంలో కొనసాగే విషయంలో మాత్రం, నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. పసివాడిగా ఉన్నప్పటినుండే, ఎటువంటి మ్యూజిక్కైనా మా వాడు చాలా చక్కగా లయబద్దంగా డాన్స్ చేసేవాడు... ... అయినా వాడిని డాన్సుకి కాక, టెన్నిస్ కి ప్రోత్సహించాలని నేనూ, మావారు కూడా అనుకున్నాము. అలాగే చేసాము కూడా.

మా అమ్మాయిని మొదటినుంచీ నేను చదువుల సరస్వతిగానే చూడాలని అనుకొన్నాను.నా నాట్యం విషయంగా, మా అమ్మగారు పడిన శ్రమ, చేసిన త్యాగాల దృష్ట్యా – కుటుంబంలో  నేనొక్కితినే నాట్యరంగంలో ఉంటే చాలు అనుకోవడమే కారణం.

అయితే, దైవేచ్చ ముందు నా నిర్ణయం ఏపాటి?  నిర్ణయంలో మార్పులు రావడానికి కారణాలు మాత్రం చిత్రమైనవే.

.....స్నేహపూరిత చిరు జల్లులైనా, ద్వేషపూరిత జడి వానలైనా! పురోగతికి సోపానాలుగా....మలుచు కోవాలి అని నిశ్చయించున్నాను. 

డాన్స్  అకాడెమీ  స్థాపించిన రెండేళ్ళకి,  మా  ఊళ్ళో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి.   ఆ ప్రోగ్రాములో పాల్గొనాలని, నేను నా శిష్యులకి ట్రైనింగ్ ఇచ్చి, బేషుగ్గా సిద్డం చేసాను. తెలుగు సంఘం వారి కార్యక్రమాల్లో - సాధారణంగా, గురువు పేరు, స్కూల్ పేరు కూడా చెప్పి పిల్లలచేత వాళ్ళ ఐటమ్స్ చేయిస్తారు.  అప్పటివరకు అదే ఆనవాయితీ.  అయితే తీరా నా శిష్యులు స్టేజ్ ఎక్కే ముందు,  “మీ పేరు గాని, మీ స్కూల్ పేరు గాని, అనౌన్స్ చేయము.  పిల్లల పేర్లు మాత్రమే ఇవ్వండి,”  అన్నది తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షురాలు.  అప్పటివరకు కూడా ఏనాడు అటువంటి చిరాకులు, కళాకారుల  పట్ల నిరసనలు ఉంటాయని కూడా తెలియని నేను, “అదేమిటండీ, ఎందుకు? ఎప్పటినుంచి ఈ కొత్త విషయం? ఇంతకు ముందు వేరే స్కూల్ పేరు టీచర్ పేరు చెప్పారుగా,” అడిగాను...కాస్త బెరుగ్గా... “ఇప్పుడే నిర్ణయించాము” అన్నదావిడ..అసలావిడలా అనబట్టే ఆ విషయం పెద్దదిగా తోచింది.అప్పటినుండీ నాలోనూ  పట్టుదల పెరిగింది. గురువుగా నా సత్తా చాటాలని పాటుపడ్డాను.  ఫలితంగా ఆ తరువాత అంచెలంచెలుగా మా అకాడెమీ పేరు, మా ప్రదర్శనలకి ఆదరణ పెరిగాయి.  కాలిఫోర్నియా ‘తానా’ సభలలో‘భరతముని భూలోక పర్యటన’ కి మా మొట్టమొదటి ‘TANA’SOUTSTANDING PERFORMANCE AWARD’అందుకున్నప్పుడు, ఆ తెలుగు సంఘం అధ్యక్షురాలే, హ్యూస్టన్ నుండి అందరి తరఫునా మొదటి అభినందనలు తెలిపారు.  అంతేకాదు, వాళ్ళమ్మాయిని నా వద్ద శిష్యరికం చేయిస్తానని, మూడేళ్ళలో ‘కూచిపూడి రంగప్రవేశం’ చేయించమని కూడా కోరారావిడ.

ఓ యేడు మా ఊళ్లోనే అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరుగనున్నాయని అనౌన్స్మెంట్ రావడంతో అందరిలో ఉత్సాహం మొదలయింది. ఐదువేల మంది హాజరవుతారని అంచనా.  సాంస్కృతిక కార్యక్రమాలకి  లభించే ఆదరణ ఎనలేనిదే..టాలెంట్ ఉన్న నా శిష్యురాళ్ళు.  వారి పేరెంట్స్ కూడా ఆసక్తి కనబరిచారు.

కాక  తనంతట తాను ఆసక్తిగా నేర్చుకుని, ప్రదర్శనలిచ్చి, అప్పటికే నృత్యరంగాన గుర్తింపు, అవార్డులు పొందిన మా అమ్మాయి శిల్ప కూడా నాకొక పెద్ద ఎసెట్ ...ఆ సమయంలోనే, మా టెలి-ఫిలిం ‘ఆలయనాదాల్లో’ కూడా అనుకున్నంత దానికంటే చక్కగా నటించి ఇండియాలో అందరి మెప్పు పొందింది.నా శిష్యులందరితో ఆ సభల్లో ఓ చక్కని నృత్యనాటిక చేయించాలని నాకూ ఉత్సాహంగానే ఉంది.

సభ కన్వీనర్, అధ్యక్షులు కూడా కళాకారిణిగా నాకు ఇవ్వవలసిన గౌరవాన్నిచ్చి,  నా పార్టిసిపేషన్ కోరారు.  ఆ తెలుగు సభల ఇనాగురల్ కి ప్రత్యేక పాటలు, ప్రత్యేక సంగీతం కూర్చారు.  మహదానందంగా మా ప్రోగ్రాం ప్లానింగ్  మొదలుపెట్టాము.

సాంస్కృతిక  ఇన్ చార్జిగా ఓ పెద్దాయన నియమించబడ్డారు..  వాళ్ళ కుటుంబం బాగా పరిచయస్తులే.  అధ్యక్షుడిగా పేరు మాత్రం ఆయనది,  ఆట మాత్రం వాళ్ళావిడది.  నా లాటి వాళ్లందరినీ ఒక్కాటాడించాలని ఆవిడ రంగంలోకి దిగారేమో.  ఏ సమాచారం ఇచ్చి పుచ్చుకోడానికైనా ఆవిడే మాట్లాడేది.  మా ప్రాక్టీసులు ఓ యజ్ఞంలా ఉత్సాహంగా సాగిపోతున్న సమయంలో ఓ రోజు పొద్దున్నే,  ఫోన్ చేసారు సాంస్కృతిక అధ్యక్షుల శ్రీమతిగారు. 

“చూడండీ, మీ అమ్మాయిని వెనుక వరసల్లో నిలబెట్టి డాన్స్ చేయించండీ... ముందు వరసలో, ప్రామినెంట్ గా అందరికీ కనబడేలా వద్దు,”  అన్నది.... ఒక్క పొల్లు కూడా తప్పు పోకుండా సరిగ్గా అవిడ అన్న మాటలవే... నేను విన్నది నిజమే...గమత్తుగా అనిపించింది. వొళ్ళు చల్లబడి మళ్ళీ ఎదో ఫీలింగ్ నాలో ఉరకలు పెట్టింది.  తాపీగానే, “ఎందుకండీ?” అడిగాను.  “అందరూ ఏమన్నా అనుకుంటారు,” అంది.  తరువాత ఏమన్నానో నాకు గుర్తు లేదు.   ఆ మాటలకి నాలో కలిగినంతటి అవమానం, కోపం, దిగ్భ్రాంతి మునుపెన్నడూ కలగలేదు. తర్జన భర్జనల తరువాత, మా సభల అసలు అధ్యక్షుల వారు కలిగించుకొన్నాక నేను మళ్ళీ రిహార్సల్స్ మొదలెట్టాను. ఇష్టమైనా, ద్వేషమైనా పొంగి పొర్లాలేమో...అందుకే ఆవిడ అదే పంథాలో కొనసాగింది... నన్ను అడుగడుక్కి విసిగించి, స్టేజ్ రిహార్సల్స్ సమయంలో పదిమందిలో నన్నవమానించి, నానా యాగీ చేసిందావిడ.

అయితే, ఆ కార్యక్రమంలో మా ప్రదర్శనకి ఊహించని  స్పందన ఆదరణ లభించాయి.   మా అమ్మాయి నృత్యానికి ‘స్టాండింగ్ ఒవేషన్’ లభించడం విశేషం.  

అంతవరకూ మా అమ్మాయి డాన్స్ పై అంతగా దృష్టి పెట్టని నేను, ఆ సభలో మా ప్రదర్శనకి వచ్చిన  స్పందన,  కాక సంస్క్రతిక అధ్యక్షుడి భార్య ఇచ్చిన ప్రేరణలతో,  పూర్తి దృష్టి సారించి, రెట్టింపు ఉత్సాహంతో మా అమ్మాయితో పాటు శ్రమించి, పదిహేనేళ్ళపాటు ఎన్నెన్నో ప్రదర్శనలు, వీడియో ప్రాజెక్ట్స్ చేశాము.  తల్లిగా - గురువుగా అరుదైన, విలువైన ఆనందాన్ని పొందాను. మా అమ్మాయి శిల్పకి ఇక్కడా, ఇండియాలోనూ యువనర్తకిగా గుర్తింపు, ఆదరణ లభించాయి. ఆ కళామ్మతల్లికి సేవచేసి తరించాము.  శిల్ప బాలనటిగా ‘కళ్యాణి’ పాత్ర పోషించిన టెలి-ఫిలిం ‘ఆలయ నాదాలు’ ని ప్రోమోట్ చేసి అమెరికాలో అకాడెమీ తరఫున, వీడియో పంపిణీ  చేసాము.  ‘సన్ టి.వి’ వారు ‘జెమినీ’చానల్ ద్వారా పద్నాలుగు దేశాల్లో సీరియల్ గా  కూడా ప్రసారం చేసారు.  శిల్పకి  అందినంత ఆదరణ అభినందనల పరంపర అనూహ్యం... “ట్వింకల్ – టోస్’ అని యేడేళ్ళ శిల్పకి కొరియాగ్రఫెర్, ఫిలిం యూనిట్ ఇచ్చిన నిక్-నేమ్....సాంస్కృతిక అధ్యక్షుడి భార్యామణికి కృతజ్ఞతలు.  ఆమెవల్లనే మా అమ్మాయిలోని టాలెంట్ ని కనుగొని అంతటి ఆనందాన్ని, తృప్తిని పొందగలిగాను... లేదంటే తల్లిగా ఆ ఆనందాన్ని చవిచూడగలిగేదాన్ని కాదు. స్టేజీ మీద వెనుకు వరసల్లో దాక్కోవలసిన అవసరం లేదు శిల్పకి, తారాజువ్వలా పైకెగిసే సత్తా ఆ దేవుడే ఆమెకి ఇచ్చాడు అని తెలుసుకున్నాను, నలుగురితో పంచుకోగాలిగాను.

తెలుగు సభలలో ప్రదర్శనలు వల్ల, నాకు- మా అమ్మాయికి- శిష్యులకి- అకాడెమీకి- నా నృత్య సంబంధిత రచనలకి- కొరియాగ్రఫీ కి అందుతున్న ఆదరణ, వస్తున్న స్పందన నాకు బాగా రుచించింది.  మా కృషికి, మాకు సరైన వేదిక అదేననిపించింది.  దాన్ని మించిన అనుభూతి లేదనిపించింది.  ప్రతియేడు మరో ఊరు, మరో ప్రదర్శన.  మరోమారు అనూహ్యమైన ప్రేక్షకులు ఆదరణ అన్నట్టుగా జరిగాలని ఆశించాను, అందుకు శ్రమపడ్డాను. మరుసటి  యేడు అమెరికాలో పేరున్న మరో మహా పట్టణంలో, జరగునున్న సభలో బ్రహ్మాండమైన వేదికపైనృత్య ప్రదర్శన చేయడానికి మొత్తం ఆరుగురం వెళ్ళాము.  అక్కడి సాంస్కృతిక అధ్యక్షులు– ఓ పెద్దమనిషి- ఎందుకో నా పైన పెద్దెత్తున కినుక బూనారు.  మా నృత్య  ప్రదర్శన జరగకూడదని, నేను వారి ఊళ్ళో  ప్రదర్శనకి అడుగుపెడితే, తాను సాంస్కృతిక అధ్యక్ష పదవినుండి విరమించుకుంటానని తెలియజేసాడుట.  ఆ విషయంగా కార్యకర్తలంతా ఎమెర్జెన్సీ మీటింగ్ పెట్టుకోవలసి వచ్చింది...అయితే, ఇంత ప్రయత్నమూ చేసి, ఖర్చు పెట్టుకుని, అహర్నిశలూ శ్రమించిన మా పరిస్థితి ఏమిటని, సభ అధ్యక్షులతో మీట్ అయ్యాను.  వారు కలగజేసుకొని మాకు కేటాయించిన సమయాన్ని, ప్రైం-టైం స్లాట్ ని యధావిధిగా ఉంచారు.  మా ప్రదర్శన మేము ఊహించినట్టే  బ్రహ్మాండంగా పేరు తెచ్చిపెట్టింది మాకు...అయినా నేనొక కళాకారిణి మాత్రమే.  నా అరగంట టైం నాకు ఇస్తే, అయిపోతుంది కదా! ఇటువంటి  ప్రాముఖ్యత  నాకివ్వాల్సిన అవసరమా? అనిపించింది...

ఎంతటి ప్రతిఘటనలనైనా ఎదుర్కొని, మా ప్రదర్శనని ప్రేక్షకుల ముందుకుతీసుకువెళ్ళే ప్రయత్నం చేయవలసిందేనని ఆ సభ తరువాతే నిర్ణయించుకున్నాను. అలాగే కొనసాగి,  వరుసగా పదేళ్ళకి పైగానే ఎన్నో కథావస్తువులు రచించి ప్రదర్శించాము... వరుసగా ‘TANA’S OUTSTANDING PERFORMANCE AWARD’ ని మూడ్ సార్లు గెలిచాము. మా శిల్ప కొన్ని మార్లు ప్రేక్షకుల కోరిక మేరకు ‘REPEAT PERFORMANCE’ కూడా చేసింది.

మరి ఆ తడవ ఆ సాంస్కృతిక అధ్యక్షుల వారు  అలా పంతం పట్టబట్టే కదా! నాలో రచనలు చేసే సృజనాత్మకతని పెంపొందించుకొని, పట్టుదలతో ముందుకు సాగి, నాట్యరంగంలో శిల్పకి, మా అకాడెమీకి అవార్డులు రివార్డులు సాధించాము.

అలా జరగబట్టే, శిల్పకి ‘ఆటా’ వారి ‘YOUTH RECOGNITION AWARD’ వచ్చింది..

మాకు అంతటి ప్రేరణ నిచ్చిన ఆ సాంస్కృతిక అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు.  ఇలాటి సంఘటనలు మరెన్నో... ప్రతికార్యం ఓ యజ్ఞంలా భావించి, భయభక్తులతో నిర్వహించాను.   చిత్తశుద్దితో మెలిగే అవకాశం అందించినవారందరూ నా దృష్టిలో నిజానికి మంచివారే సుమా!

మరిన్ని శీర్షికలు
sudhamadhuram