Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ : ఫ్లైట్లో ప్రయాణిస్తుంటారు సినిమా టీం..గంగరాజనుకుని రాంగ్ నెంబర్ కి డయల్ చేసి ఎవరో అరబ్ షేక్ కి తగులుకుంటాడు యోగి.....ఇతడి మాటల్లోని ఇడియట్ అనే పదమొక్కటే అర్థమై నేరుగా వచ్చి తిట్లకెత్తుకుంటాడు ఆ అరబ్ షేక్....డైరక్టర్ జీవన్ మాత్రం షహనాజ్ నే తదేకంగా చూస్తూంటాడు.....ఆ తరవాత......

అక్టోబర్ – 2

గంట తర్వాత జర్మనీ లో ఉన్న మ్యూనిక్ వెళ్ళే ఎమిరేట్స్ విమానం ఎక్కారంతా.

ఎనిమిది గంటల ప్రయాణం.

దుబాయ్ నుంచి రకరకాల ముస్లీం కంట్రీలు దాటుతుంది ఎమిరేట్స్ విమానం.

అమ్మాన్, ట్రిపోల్, అదెన్స్, మాల్టా దాటుకుంటూ బ్లాక్ సీ వేపెళ్తుంది విమానం.

మేం అడిగిన కోగ్ నేక్ బ్రాందీ, మాల్ట్ విస్కీలూ, వెజిటబుల్ సలాడ్సూ, సాల్ట్ మిక్స్ చేసిన కేష్యూ పిస్తా బాదం పప్పుల్నీ చాలా ఓపిగ్గా అందిస్తున్నారు అందమైన ఆ ఎయిర్ హోస్టెస్ లు.

షహనాజ్ చేతిలో ఉన్న వయోలిన్ మామూల్ది కాదు. అదో లేటెస్ట్ వయోలిన్. ఎలక్ట్రిఫైడ్ వయోలిన్.

దానికున్న అవుట్ పుట్ సాకెట్ కి హెడ్ ఫోన్ కేబుల్ కి కనెక్ట్ చేసి విమానంలో ఉన్న వాళ్ళెవరికీ డిస్ట్రబ్ కాకుండా తను మాత్రమే వింటా రకరకాల ఆలోచనల్లోకెళ్ళిపోతా వాయిస్తోంది వయోలీనాన్ని.

ఎన్ని హిందుస్థానీ రాగాలో.... ముఖ్యంగా పహడీ రాగంలో ఆజారే పరదేశీ, శివరంజని లో మేరే నైనా సావన్ బాదో, వీటి తర్వాత గులామ్ అలీ గజల్స్ మాండ్, దర్భారీ పడ్ దీప్, తోడి... రకరకాల రాగాలు ఆ వయోలిన్ మీద పలుకుతున్నాయి.

లంచ్ టైమయ్యింది.

“మీకు ఇండియన్ ఫుడ్ కావాలా..? అరబిక్ ఫుడ్ కావాలా..?” అనడిగింది ఏయిర్ హోస్టెస్.

“ఏది ఆర్టర్ చేద్దాం..?” అన్నాడు గోవిందు.

“ఎదవ ఇండియా భోజనం రోజూ మనింట్లో ఆడోళ్ళు వండేదే గదా..! వెరైటీగా ఉంటది అరబిక్ ఫుడ్ చెబుదాం” అన్నాడు చందర్రావు.“ఓకే, అరబిక్ ఫుడ్” అన్నాడు గోవిందు.

పావు గంటలో ఆమె తీసుకొచ్చిన భోజనం చూసిన చందర్రావు గొళ్ళుమన్నాడు. గుప్పెడంటే గుప్పెడు అన్నం, అర చెయ్యి అంత వెడల్పున్న సగం కూడా ఉడకని తోలు తీసిన చేప ముక్కా, ఒలిచీ ఒలవనీ ఉడికీ ఉడకని నాలుగు రొయ్యలూ ఉన్నాయి.ఇవి గాకండా ఆకులు, అలములూ, గడ్డీగాదం ఉన్నాయి.

కారుతున్న కన్నీళ్ళని గోవిందు భుజం మీదున్న టవల్ తో తుడుచుకుంటుంటే అక్కడికొచ్చిన జార్జి ప్రసాద్ “అన్నీ వంకర పన్లే...!” అని చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్ ఇచ్చి “తిను ఈ పూటకిదే నీ లంచ్” అనెళ్ళిపోయాడు.

ఇండియన్ లంచ్ ఒకటి ఆర్డర్ చేసి తెప్పించుకున్న హరిప్రియా అనిలూ ఒకళ్ళకొకళ్ళు గోరు ముద్దలు చేసి మరీ తినిపించుకుంటున్నారు.అది చూసిన కో – డైరెక్టరు గంగరాజు “అమ్మానాన్నల్ని కూడా రావొద్దని ఈ పిల్ల ఎందుకందో ఇప్పుడర్థమైంది..!” అన్నాడు.

“నాకెప్పుడో అయ్యింది” అన్న యోగి, గంగరాజు కాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.

దూరంగా సలీం పక్కన కూర్చున్న షహనాజ్, జీవన్ దగ్గరికొచ్చి మాటాడింది. ఆమె, జీవన్ మాటాడుకుంటుంటే జనమంతా నిద్రపోతున్నారు. పెక్స్ దాటాకా లేక్ బాలాటన్ లో దిగింది విమానం. ఆమె లేక్ ఒడ్డున కూర్చుని చాలా సేపు వయోలిన్ వాయించింది. అక్కడ్నుంచి బుచారెస్ట్ దాటి హంగేరి క్యాపిటల్ అయిన బుడాపెస్ట్ వెళ్ళారు. రెక్వియమ్, సెవెన్త్ సీల్ లాంటి సినిమాలు తీసిన జోల్టన్ పేబ్రి ఇంటికీ వెళ్ళి మాటాడి అక్కడ్నుంచి ఎగురుకుంటూ పోలెండ్ లో దిగారు. వార్సాలో ఉన్న క్రిస్టప్ కిస్లో వస్కీ చదువుకున్న ఫిల్మ్ స్కూలుకెళ్ళారు. అక్కడ్నుంచి వియన్నా, ట్రుయీ వెళ్ళారు.

విమానం కుదుపుకి మెలకువ వచ్చింది. అంతా కల, దూరంగా సలీం పక్కనే కూర్చుని ఉంది షహనాజ్. ఎమిరైట్స్ విమానం మ్యూనిక్ ఎయిర్ పోర్ట్ రన్ వే మీద వాలింది.

ఒకటే వర్షం.

ఎయిర్ క్రాఫ్ట్ క్రూ అరబిక్ భాషలోనూ, ఇంగ్లీషులోనూ ధన్యవాదాలు తెలియజేస్తుంటే బయటికొచ్చిన ఏరో బ్రిడ్జి మీంచి నడుచుకుంటూ బయటికొచ్చి ఆ తర్వాత ఎస్కలేటర్ లో కిందికి దిగారంతా.

కన్వేయర్ బెల్ట్ మీంచొస్తున్న సామాన్లలో ఎవరిది వాళ్ళు తీసుకుని ట్రాలీల మీదేసుకుని బయటికొచ్చే ప్రయత్నాల్లో ఉండగా ఒక శుభవార్త తెలిసింది. అదేంటంటే...

నెగెటివ్ ఉన్న బాక్సులు ఈ ఫ్లైట్ లో రాలేదట.

అసలే సందేష్ విషయంలో అప్ సెట్ అయిపోయున్న ప్రొడ్యూసర్ సలీం, మరింత డల్ అయిపోయేడు. అతని పరిస్థితి చూసి దగ్గరికెళ్ళిన కో – ఆర్డినేటర్ వేణు “మీరేం టెన్షన్ పడకండి... వచ్చే ఫ్లైట్ లో వస్తాయట ఆ బాక్సులు. నేనిక్కడే ఉండి వాటిని తీసుకుని వస్తాను” అన్నాడు.“నేనూ మీతో పాటుంటాను. నెగెటివ్ లేకుండా అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను..?” అని, “ప్రసాద్, వీళ్ళని తీసుకెళ్ళి తక్కిన పన్లన్నీ నువ్వు చూసుకో” అన్నాడు జార్జి ప్రసాద్ తో సలీం.

“సరే” అని అంతా బయటికి కదలబోతుంటే “నా లగేజి రాలేదండి” అన్నాడు కో - డైరెక్టర్ గంగరాజు.“అది కూడా ఆ నెగెటివ్ బాక్సులతో పాటు ఉండిపోయి ఉంటుంది. వేణు గారు తెస్తార్లే పద “ అన్నాడు జార్జి ప్రసాద్.

“అది కాదండీ బాబూ, నా షేవింగ్ కిట్టూ టవలూ... అన్నీ ఆ సూట్ కేసులో ఉండిపొయినియ్యి, డబ్బులు కూడా. కట్టుబట్టలతో ఉన్నానండీ ఇప్పుడు” ఏడుస్తూ అన్నాడు గంగరాజు.

“అదేదో చూద్దాం లేవయ్యా బాబూ పద ముందు” అన్నాడు జార్జి ప్రసాద్.

“పళ్ళు తోముకోడానిక్కూడా ఏదీ లేదంటే వినిపించుకోరే” అని గంగరాజంటుంటే గబగబా వచ్చేసిన చందర్రావు “దారిలో ఏ వేప పుల్లో విరిచిస్తాంలే పద” అన్నాడు.

“ఈ దేశంలో వేప చెట్లుంటాయా మరి..?” డౌటొచ్చింది గోవిందుకి.

“వేప చెట్లు కాకపోతే తంగేడు చెట్టు, అదీ కాకపోతే నేపాళం చెట్టు ఏదోటి లేకుండా ఎలాగుంటది.”

“వాడేసిన బ్రష్షు కావలంటే నా దగ్గరొకటుంది” అన్నాడు యోగి వాళ్ళ గొడవలా జరుగుతుండగా కాస్త దూరంగా వయోలిన్ బాక్సు తో నిలబడున్న షహనాజ్ దగ్గరికెళ్ళి ఏదో మాటాడి వచ్చిన సలీం, జార్జి ప్రసాద్ దగ్గరికొచ్చి “నేనొచ్చేదాక సిస్టర్ని జాగ్రత్తగా చూసుకో ప్రసాద్ భాయి” అన్నాడు.

వర్షం వదిలేట్టు లేదు.

ఎయిర్ పోర్ట్ బయట వేణు తాలూకూ ఆస్ట్రియన్ డ్రైవర్ హన్సీ, వాళ్ళబ్బాయీ హైటెక్ బస్సు రెడీగా పెట్టుకునున్నారు.

జీవన్ ని పలకరించాడు హన్సీ. అతనూ ఉల్ఫీ అనే అతనూ బస్సు తెచ్చుకుని ట్రిప్ కింతని మాటాడుకుంటున్నారు. డైరెక్టర్స్ కి లోకేషన్స్ లాప్ టాప్ లో చూపించి నచ్చిన వాటి పర్మిషన్లు తీసుకునే పని “ఉస్లా” అనే లేడీ చేస్తుంది.

“ఈ అబ్బాయి ఎవరు..?” అని హన్సీ ని అడిగితే చెప్పాడు వాళ్ళబ్బాయేనట. ఇవాళ స్కూలు లేకపోవడంతో కూడా వచ్చాడట.అది విన్న గోవిందు “అచ్చం మన పిల్లల్లాగే” అన్నాడు.

లగేజీ మొత్తం బస్సులో సర్దేశాక బయల్దేరిన హైటెక్ బస్సు, ఎయిర్ పోర్ట్ దాటుతుంటే పక్కనే ఉన్న రన్ వే మీంచి లుఫ్తాన్సా ఫ్లైటు వెళ్తుంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti