Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : సహస్ర విరాట్ తో వాదిస్తూండగానే వచ్చిన ఏ.ఎస్.పి ప్రకాష్ ఫోన్ కాల్ లో విరాట్ మాట్లాడే పద్ధతికి ఆశ్చర్యపోతుంది సహస్ర. అతని ధర్యానికీ, అతనికున్న సర్కిల్ కీ విస్మయం కలుగుతుందామెకి. విరాట్ చెప్పిన ఒక సంఘటన గదిలో నుంచి విని ఉలిక్కిపడుతుంది దీక్ష....ఆ తర్వాత......

భళ్ళున బయటి హాల్లో

ఏదో పగిలిన శబ్దం విన్పించి

ముఖ ముఖాలు చూసుకున్నారిద్దరూ.

హాల్లో సహస్ర విరాట్ల పోరాటం మొదలై క్షణాలు వేగంగా గడిచిపోతున్నాయి.

హాల్లో విలువైన వస్తువు డామేజ్  గాకుండా జాగ్రత్తగా పడుతూ రకరకాల ఫీట్లతో సహస్రకు చిక్కకుండా తప్పించుకోంటున్నాడు విరాట్.  ముప్పుతిప్పలు పెడుతున్నాడు.

అతడు తప్పించుకునే కొద్దీ సహస్రలో పట్టుదల పెరిగింది.  రోషం కోపం పెరిగిపోయి ఇంకా తీవ్రంగా వేగంగా ప్రయత్నిస్తోంది.  అయిదు........ పది .......... పావుగంట సమయం ఇట్టే గడిచిపోతోంది గాని తను విరాట్   దుస్తుల్ని కూడా టచ్  చేయలేక పోయింది.  దాంతో ఉడికిపోతూ కార్నర్లో ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాజ్ నందుకొని అతని మీదకు విసరబోయింది.

‘‘ఏయ్  ఆగాగు....... ఇది మన ఒప్పందానికి విరుద్దం.  దాన్నక్కడ పెట్టు’’  అనరిచాడు విరాట్’’

‘‘ఒప్పందమా.......... చేతికి దొరకవా? నన్నే తిప్పలు పెడతావా.......... మనకి ఒప్పందం ఏంట్రా’’ .......  అంటూ చేతిలో ఫ్లవర్ వాజ్ ని బలంగా విరాట్  పైకి విసిరేసింది.  విరాట్ తనకు తగలకుండా తప్పించుకున్నాడు గాని ఖరీదైన యల్ సిడి టీవిని కాపాడుకోలేక పోయాడు.  ఫ్లవర్ వాజ్  టివి స్క్రీన్ ని తాకి భళ్ళున పగులగొట్టేసింది.

‘‘ఓ మైగాడ్’’ అనరిచాడు విరాట్.

ఈ సారి విరాట్ మీద దాడి చేయలేదు సహస్ర.  హాల్లోని ఖరీదైన ఫర్నీచర్  మీద దాడి చేస్తూ తన కోపం ఉక్రోషం వాటి మీద
తీర్చుకోనారంభించింది.

ఇక ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు విరాట్....

నవ్వుతూ వెళ్ళి మెట్ల మీద ఆయాసం తీర్చుకొంటూ రిలాక్స్ గా కూచుండి పోయాడు

ఇక సహస్రను చూడాలి

శివమెత్తి నాట్యం చేస్తూన్నట్టుందామె. దేన్నీ వదల్లేదు.  టేబుల్  మీది టివి తో బాటు సౌండ్  సిస్టం మెత్తం ముక్కలు చెక్కలైంది.డైనింగ్  టేబుల్  రెండుగా విరగొట్టేసింది.  కాళ్ళతో తన్ని కుర్చీలను విరగ్గొడుతూ ఫుట్ బాల్  ఆడుకుంది. సోఫాలను చించేసింది.  ఫ్యాన్  రెక్కలు విరిచేసింది. బర్మా బజార్లో మోజుపడి కొనితెచ్చుకున్న ఖరీదైన జర్మనీ గోడ గడియారాన్ని నేలకు విసిరికొట్టి ధ్వంసం చేసింది.  హాల్లో ఏదీ వదలకుండా నాశనం చేస్తే గాని సహస్ర కోపం చల్లారలేదు. చల్లారగానే ఉన్నట్టుండి ఏడ్చేస్తూ సహస్ర విరాట్ వంక చూసి చున్నీని ఎప్పటిలా ముఖానికి చుట్టుకొంటూ బయటకి పరుగెత్తింది.

ఆ వెనకే తనూ వెళ్ళేవాడే విరాట్.

కాని అంతలో....

అతడి సెల్  మోగింది...

ఏదో కొత్త నంబరు.

‘‘హలో......... ఎవరు ?’’  అడిగాడు.

‘‘బాబూ........ నా పేరు మూగాంబికై’’ .........  అవతలి నుంచి ఎవరో పెద్దావిడ గొంతు ఎంతో సాఫ్ట్ గా వినిపించింది.

‘‘చెప్పండి ఆన్టీ మీకు ఎవరు కావాలి?’’  అడిగాడు.

‘‘ఈ రోజు పేపర్లో ప్రకటనిచ్చింది నువ్వేనా?’’  అడిగిందావిడ.

‘‘అవును’’

‘‘నేను సహస్ర తల్లిని నాయనా.  మధురై నుంచి మాట్లాడుతున్నాను.  నా బిడ్డ సహస్ర ఇల్లొదిలి అయిదు మాసాలయి పోయింది. ఏమైందో ఎక్కడుందో తెలీక బెంగ పడుతుంటే ఇవాళ నీ ప్రకటన మరింత భయపెట్టింది.  సహస్ర తప్పిపోయిందని ప్రకటనిచ్చావ్.  నా బిడ్డకేమీ కాలేదు గదా’’........... అవతల బోరున ఏడవడానికి సిద్దంగా ఉన్నట్టుంది ఆవిడ గొంతు. వెంటనే విరాట్  అలర్టయిపోతూ.

‘‘ఆన్టీ ఆన్టీ....... ప్లీజ్  మీరు సహస్ర గురించి కంగారు పడకండి. తను క్షేమంగా ఉంది.  ప్రకటన చూడగానే వెనక్కి వచ్చేసింది’’  అన్నాడు.‘‘నిజంగానా బాబూ, నేను ఓ సారి దాంతో మాట్లాడొచ్చా’’

‘‘తప్పకుండా ఆన్టీ......... నా మీద అలిగి ఇప్పుడే లోనకెళ్ళింది.  ఒక్క అయిదు నిముషాలాగండి.  ఇదే నంబర్ కి ఫోన్ చేసి సహస్ర చేత మాట్లాడిస్తాను.’’

‘‘నీ పేరేమిటి ........... మా సహస్ర నువ్వు ప్రేమించుకున్నారా?’’

‘‘ఆన్టీ..........  ముందు మీరు మీ కూతురుతో మాట్లాడితే మీ మనసు తేలిక పడుతుంది.  మిగిలిన విషయాలు తర్వాత.  అయిదు నిముషాల్లో ఫోన్  చేస్తాను’’.  అంటూ లైన్ కట్  చేసాడు విరాట్.  వెంటనే బయటికొచ్చి తన బైక్ స్టార్ట్  చేసి మూడో వీధి వైపు దూకించాడు.‘‘ఉన్నట్టుండి బయట నిశ్శబ్దమై పోయిందేమిటి?’’  చాలా సేపటికి దీక్ష అడిగింది అనుమానంగా.

‘‘అదే అర్దం గావటం లేదు, బైక్ శబ్దం విన్పించింది విరాట్ బయటకెళ్ళినట్టున్నాడు’’

‘‘విరాట్  బయటికెళ్తే సహస్ర ఎక్కడ?  పద చూద్దాం’’  అంటూ లేచింది దీక్ష.  కిచెన్  తలుపు తెరుచుకొని అడుగు బయటపెడుతూనే కెవ్వున అరిచాడు చందూ.  దీక్షయితే దెయ్యం పట్టినట్టు అలా చూస్తుండి పోయింది.తను లోనకొచ్చేసరికి ఖరీదైన ఫర్నీచర్ తో ఎంతో అందంగా ఉన్న హాలు మొత్తం ఇప్పుడు మారిపోయింది.  ఏదీ వదల్లేదు.  సోఫా సీట్లతో సహా మొత్తం ధ్వంసమై పోయాయి. ఎటుచూసినా పగిలిన పెంకులు,  విరిగిన కుర్చీలు, ధ్వంసమైన టివి సెట్టు సౌండ్  సిస్టమ్  కాలు బయటపెట్ట లేనంతగా హాలు చెత్త కుప్పయి పోయింది.

‘‘ఓర్నాయనో........ .ఓరిదేవుడో........... ఇద్దరూ కలిసి హాలు మొత్తం నాశనం చేసి పడేసారు........  అంతా నాశనం’’  అరిచాడు చందూ.

‘‘ఇద్దరూ అనక.  సహస్ర కోపంతో చేసిన విధ్వాంసమిది.  ఇంతకీ సహస్ర ఎక్కడ?  ఏయ్  సహస్ర’’......... అంటూ జాగ్రత్తగా అడుగులేస్తూ ముందుకెళ్ళింది దీక్ష.

‘‘స్కూటీ తాళాలు నీ దగ్గరే వున్నాయా?’’  ఆమెననుసరించి ముందుకొస్తూ అడిగాడు చందూ.

‘‘అవును,  ఏం?’’  తిరిగి చూసింది దీక్ష.

‘‘ఇంకా ఏముంది కోపంతో అన్నీ ధ్వంసం చేసి సహస్ర నడుచుకొంటూ వెళ్ళిపోయుంటుంది సహస్ర. ఉంటే విరాట్  వెళ్ళేవాడు కాదు’’  అన్నాడు.

‘‘ఇప్పుడెలా.......... అక్కడేం గొడవ పడుతున్నారో ఏమిటో నేవెళ్తాను’’  అంటూ పోబోయింది  దీక్ష.

ఆమెను వెనక్కులాగి

‘‘వెళ్ళి ఏం చేస్తావ్?  గొడవపడనీ......... ఇప్పుడు మనం వెళ్లకూడదు’’  అన్నాడు.

‘‘అయితే ఏం చేద్దాం? ఈ చెత్తంతా క్లీన్  చేయటం నా వల్ల కాదు బాబూ’’  అంది బుంగ మూతిపెట్టి.

‘‘ఆ చెత్త గొడవెందుకు?  మన పని మనిషి చూసుకుంటుంది. విరాట్  సహస్రలు తిరిగొచ్చే లోపు మనం బెడ్రూమ్ లో కూచొని కబుర్లు చెప్పుకుందాం పద’’

‘‘వూహు, నేను రాను,’’

‘‘వద్దులే నేనే తీసుకెళ్తాను’’  అంటూ దీక్షను ఎత్తుకొని తన బెడ్రూమ్ లోకి తీసుకుపోయి తలుపు మూసాడు చందూ.విరాట్  బైక్ ను వేగంగా పోనిస్తూ నడిచి పోతున్న సహస్ర వీధిలో కన్పిస్తోందేమోనని చూసాడు, కాని అప్పటికే సహస్ర ఇంటికెళ్ళిపోయింది. సరాసరి చివరి ఇంటికి చేరుకొని గేట్ లోంచి బైక్ ని పోర్టికోకి తెచ్చి ఆపాడు.

వీధి తలుపు మూసి ఉంది

బయట సహస్ర చెప్పులు కన్పిస్తున్నాయి

తలుపు తెరవాలని చూసాడు

తెరుచుకోలేదు

‘‘సహస్ర............... ప్లీజ్ తలుపు తియ్యి’’  తలుపు కొట్టి పిలిచాడు.

‘‘ఎందుకొచ్చావ్.......... పో .......... నేను నీకేంకాను వెళ్ళిపో’’  లోపల్నుంచి అరిచింది సహస్ర.  ఆమె ఒంటరిగా కూచొని ఏడుస్తోందని గొంతు వింటేనే అర్ధమైపోతోంది.

‘‘తలుపు తెరుస్తావా లేదా?’’

‘‘తెరవను పో’’

‘‘అయితే విరగొట్టు కొస్తాను’’

‘‘విరగొట్టడానికి ఇది నా యిల్లు కాదు,  దీక్షది’’

‘‘ఓహొ,  నా యిల్లంతా ధ్వంసం చేసి వచ్చి ఇక్కడ తీరిగ్గా నీతులు చెప్తున్నావా?  మనం తర్వాత గొడవపడొచ్చు,  ముందు మీ మమ్మీతో మాట్లాడు.’’

‘‘మమ్మీ?  ..............ఏయ్ కొత్త నాటకమా?’’

‘‘నాటకం కాదు నిజం.  పేపరు ప్రకటన చూసి నువ్వేమయ్యావోనని కంగారు పడి నా నంబరుకి ఫోన్ చేసారు’’  అంటూ సెల్  అందుకుని ఫోన్ చేసాడు.  ఆవిడ ఫోన్ కోసం వెయిట్  చేస్తున్నట్టుంది. వేంటనే లిఫ్ట్ చేసింది.

‘‘ఆన్టీ, సహస్ర ఇక్కడే వుంది మాట్లడండి’’  అన్నాడు స్పీకర్ ఫోన్ ఆన్ లోనే ఉంది.

‘‘సహస్ర....... ఏమిటే మాటాడవ్?’’  ఫోన్ లో తల్లి గొంతు వింటూనే చటుక్కున తలుపు తెరచింది సహస్ర.  విరాట్ చేతిలోంచి ఫోన్  లాక్కొని ‘‘మమ్మీ’’ అంది ఆత్రంగా. ఇంతసేపు లోన కూచొని ఏడ్చినట్టుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కన్నీరు తుడుచుకొని స్పీకర్ ఫోన్ ఆఫ్ చేసింది.‘‘మమ్మీ నేను బాగానే ఉన్నాను.  అక్కడంతా ఎలా ఉన్నారు.  డాడీ ఎలా ఉన్నారు?’’  అడుగుతోంది.

తను పక్కనుండటం బాగుండదనీ వెనక్కి పోర్టికోలోకి వచ్చేసాడు విరాట్. సహస్ర డోర్ లోనే ఉండి మాట్లాడుతోంది మెల్లగా.  సహస్ర మాటలు వినబడుతూనే ఉన్నాయి.

‘‘ఏమిటి మమ్మీ, చిన్న పిల్లలా ఏడుస్తావ్? నేను బాగానే వున్నా గదా’’ అంటోంది సహస్ర.

‘‘ఏం బాగుండటమే, ఇల్లొదిలి పరాయిచోట ఆడపిల్లవు ఒంటరిగా ఉండటం బాధగా ఉండదా? యిద్దరూ యిద్దరే నా ప్రాణానికి దొరికారు మొండి ఘటాలు.  నీ మాట డాడీ వినరు,  ఆయన మాట నువ్వు వినవు ఎంత కాలమిలా..........’’?

‘‘మమ్మీ ప్రాణంపోయినా నేను డాడీ చూసిన సంబంధం చేసుకోను.  నా మాటకి నా యిష్టాలకి అస్సలు విలువ లేదా?  డాడీ పట్టించుకోరే? ఒకె మమ్మీ, ఆయన కూతుర్నేగా, ఆయనకుండే తిక్క నాకు ఉంది. నువ్వు మాత్రం అనవసరంగా బెంగపడకు.’’

‘బెంగపడకుండా ఎలా ఉంటానే?  నిన్నుచూసి అప్పుడే ఏళ్ళు గడిచిపోయినట్టుంది.  ఇంటికెప్పుడొస్తున్నావ్?’’‘‘ఇప్పట్లో మధురై రావటం వీలు కాదు’’‘‘పోనీ నీవిష్టపడిన అబ్బాయి గురించయినా వివరాలు చెప్త్తావా?’’

‘‘తర్వాత చెప్తాను’’

‘‘చెప్పవే తల్లీ,  నీ మనసు కాస్త కుదుటపడుతుంది. పేపర్లో ప్రకటన చూసి ఫోన్ చేసే వరకు ప్రాణం నిలువ లేదు. చక్కగా మాట్లాడుతున్నాడు. అబ్బాయి గుణవంతుడేనా?’’

‘‘అబ్బో పెద్ద పోకిరి’’

‘‘నీ లాంటి పెంకిదానికి పోకిరి కరక్టేలే. ఇంతకీ అబ్బాయి చూడ్డానికెలా ఉంటాడు? బాగుంటాడా?’’

‘‘ఆహా....... పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చేంత బాగుంటాడు’’

ఆ చివరి మాటలు తన గురించేనని గ్రహించి చిన్నగా నవ్వుకున్నాడు విరాట్

‘‘ఏయ్.....  తమాషాలొద్దు. నిజం చెప్పవే. అబ్బాయెలా ఉంటాడు?’’

తల్లి మాటలు వింటూ

పోర్టికోలో అటూ యిటూ తిరుగుతున్న విరాట్  వంక చూసింది సహస్ర.

‘‘నిజం చెప్పనా?’’  అంది చిన్నగా.

‘‘చెప్పవే’’

‘‘చాలా... చాలా......... బాగుంటాడు.  రాకుమారుడిలా’’

‘‘అతనెవరి తాలూకు ఏ వూరు? చెన్నై వాడేనా?’’

‘‘నువ్వు డాడీతో చెప్పనంటే చెప్తాను’’

‘‘నేనెందుకు చెప్తానే తల్లీ.  నేను నీ పార్టీయే గదా.  అస్సలు చెప్పను.’’

‘‘కొయంబత్తూరు......... నూలు మిల్లు ఓనరు వెంటకరత్ననాయుడుగారి గురించి విన్నావా?  ఆయన చిన్నకొడుకు.  పేరు విరాట్.’’

‘నిజమా’’‘‘అబద్దమనుకొంటున్నావా?’’

‘‘కొంప మునిగిందంటున్నాను’

‘‘అదేమిటమ్మా’’

‘‘ఆ నాయుడు గారికి మీ డాడీకి అస్సలు పడదుగదా’’

‘‘ఏమైంది’’

‘‘కోయంబత్తూరు దగ్గరలో మన పొలాల దగ్గరే నాయుడుగారి పొలాలున్నాయి. అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ ఏదో పెట్టాలని నాయుడుగారు ప్లాన్ చేసారు.  కెమికల్ ఫ్యాక్టరీ పొల్యూషన్ తో మా పొలాలు దెబ్బ తింటాయి గాబట్టి అక్కడ కట్టడానికి వీల్లేదన్నారు మీ డాడీ.  ఈ విషయంలో గొడవలు పడి కోర్టు వరకు వెళ్ళారు.

 

[email protected]

www.suryadevararammohanrao.com

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్