Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevnam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆర్.కె. లక్ష్మణ్ వ్యాఖ్య - కార్టూనిస్ట్ జయదేవ్

R.K Laxman

వ్యాఖ్య కార్టూనుకు ప్రాణం, వ్యాఖ్యలలో ఏమాత్రం లోటు పాట్లున్నా కార్టూన్ పేలదు కదా, మట్టి ముద్దలా చప్పడిపోతుంది. వ్యాఖ్యని  పొందికగా రాయాలంటే నేర్పు అవసరం. భాష మీద పట్టు అవసరం. నా మాతృ భాష తెలుగైనప్పటికీ, నేను  చెన్నై వాసిని గనక, తెలుగు వ్యావహారికం మీద, యాస మీద, మాండలికాల మీదా నా జ్ఞానం అసంపూర్ణకం గా వుండటం వల్ల, నా కార్టూన్లలో, నేను రాసిన వ్యాఖ్యలలో లోపాలు కనిపించేవి., ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి నా కృషి నేను గీసిన తొలి కార్టూను నుంచీ ఇప్పటిదాకా కొనసాగుతూనే వుంది. నా తెలుగు కార్టూనులతో పాటు , ఇంగ్లీషు కార్టూన్లు కూడా గీయాలని, ఆ ప్రక్రియని 1970 ప్రాంతం లో ప్రారంభించాను. నా చదువు, నేను సమకూర్చుకున్న లైబ్రరీ, నా లోని మొండి ధైర్యం అండలుగా పెట్టుకుని, ఇంగ్లీషు వ్యాఖ్యలు రాయడం ఉపక్రమించాను. నా కార్టూన్లను ఇంగ్లీషు పత్రికలకి పంపించాను. అన్ని కట్టలు కట్టుకుని తిరిగి వచ్చాయి. నా బొమ్మల్లో లోపం లేదు. భావం లో అంతకన్నా లేదు. వున్నదల్లా, నేను రాసిన వ్యాఖ్యల్లోనే ! సరైన వ్యాఖ్య రాయడం ఎలా? నా అన్వేషణ మొదలైంది.

మన దేశం లో పేరు మోసిన కార్టూనిస్టులు అబూ అబ్రహం, మారియో మిరాండా, R.K లక్ష్మణ్  గార్ల కార్టూన్లు సేకరించాను. పరీక్షలకి పుస్తకాలు చదివే పట్టుదలతో వాటిని చదవడం, కంఠస్థం చెయ్యడం మొదలు పెట్టాను. ఆ ముగ్గురు మహానుభావుల్లో, నన్ను విశేషం గా ఆకట్టుకున్న కార్టూనిస్టు R.K లక్ష్మణ్ గారు. నా అదృష్టం కొద్దీ R.K లక్ష్మణ్  గారి "YOU SAID IT" కార్టూన్ పుస్తకాలు విరివిగా స్టాల్స్ లోకి కుప్పలు తెప్పలుగా  వచ్చిపడ్డాయి.  అన్ని వాల్యూంస్ ని , ఆత్రం గా కొనుక్కుని నా లైబ్రరీ నింపుకున్నాను. ఇప్పుడు నా ఇంగ్లీషు వ్యాఖ్య రచనలో మార్పు వచ్చింది. నా కార్టూన్లు ఇంగ్లీషు పత్రికల్లో సెలక్టు అయ్యాయి! "Thanks to RK laxman sir!!

ఇంతకీ ఆ " లక్ష్మణ్ వ్యాఖ్య" ప్రభావం ఎటువంటిది? ఆ వ్యాఖ్యలో దాగిన మర్మం ఏమిటీ? ఆయన రాసే ఇంగ్లీషు ఎలాంటిది? ఆయన  పద నిర్మాణం పద్ధతి ఎటువంటిది? చూద్దాం.

ఒక బీడు వారిన ప్రదేశం, రెండు మూడు కూలిపోయిన గుడిశెలు, ఒకరిద్దరు చింకి పాతల బీదలు, హెలికాఫ్టర్ ల నుంచి ఒక రాజకీయ నాయకుడక్కడ దిగాడు. అతడ్ని చూసి, పేదవాడు ఎదో మాట్లాతున్నాడు.

నేనైతే , నా వ్యాఖ్యనిలా రాస్తాను. " మీరేవో బీదా బిక్కీ కి సాయాలందిస్తానన్నారు.... మా జీవితాలిలా తగలబడ్డాయి" అని,

లక్ష్మణ్ గారిలా రాశారు! "ఈ పరిస్థితికి వరదలూ, కరువూ కారణం కాదండి! ప్రభుత్వం!!

That is లక్ష్మణ్  !!

R.K లక్ష్మణ్ సార్ నేను ఆరాధించే గురువుల్లో ఒకరైపోయారు. వారిని కలవాలని ఉబలాట పడ్డాను. వారి జీవిత విశేషాలు తెల్సుకోవాడానికి   న్యూస్ పేపర్లు, పుస్తకాలు తిరిగేశాను. ఎడిటర్లని కలిశాను. ప్రముఖ బ్రిటిష్ కార్టూనిస్టు డేవిడ్ లో కార్టూన్లు పరికించి చూశాను. డేవిడ్ లో లక్ష్మణ్ గారిని ప్రభావితం చేసిన కార్టూనిస్టు అని అందరూ చెప్పుకుంటారు. అందువల్ల, డేవిడ్ లో కార్టూన్లు సేకరించాను. నిజానికి డేవిడ్ లోకి మన దేశం లో గుర్తింపు లభించడానికి కారణం R.K లక్ష్మణ్ గారే, ఇద్దరి కార్టూన్లూ గమనిస్తే పోలికలు కొంతమేరకు కనిపిస్తాయి గానీ, ఎవరి దారి వారిదే.

డేవిడ్ లో కార్టూన్ వ్యాఖ్యలు చదివాను. ఇతర బ్రిటిష్ కార్టూనిస్టుల వ్యాఖ్యలూ చూసాను. ఒక్క ముక్క అర్ధమవలేదు. అటు అమెరికన్ కార్టూనిస్టుల "వైఖరీ"  అంటే, " The new yorker లో "  వెలువడే కార్టూన్ల లో వ్యాఖ్య రహితమైనవి తప్పించి, మిగతావి బొత్తిగా అర్ధమవవు. యూరోపియన్, అమెరికన్ స్టైలు కార్టూన్లే అంత, ఆ కార్టూన్లు చూసి ఆనందించాలంటే మనం యూరప్, అమెరికా లైఫ్ స్టైలుకు అలవాటుపడాలి. వాళ్ళ భాష మనకి అర్ధమవాలి, వాటితో మనకి అవసరం. మనం మన ఇంగ్లీష్ తెల్సుకోవాలి. Let us meet laxman sir, అని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు కోసం ఎదురు చూశాను. ఆ అద్భుతమైన , నా జీవితం లోని మరుపురాని రోజు రానే వచ్చింది. 1984, మార్చ్ 11 న, లక్ష్మణ్ గారు, వారి సతీ మణితో మద్రాసుకు విజయం చేశారు. మద్రాసు తమిళ పత్రికలు సంయుక్తం గా నిర్వహించి న  ఒక సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగానంతరం మద్రాసులోని కార్టూనిస్టులతో పాటు , నేను ఒక తెలుగు కార్టూనిస్టుగా, ఒక బడ్డింగ్ ఇంగ్లీష్ కార్టూనిస్టుగా, లక్ష్మణ్ గారితో కరచాలనం చేసే భాగ్యం దక్కింది. ఆ రోజున మేమందరం ఆయన్నడిగిన ప్రశ్న , "సార్, కార్టూనుకు వ్యాఖ్య రాయడం ఎలా?" ఆయన ఇచ్చిన సమాధానం ఇది.

"కార్టూన్ వ్యాఖ్య క్లుప్తం గా వుండాలి... ఐనా వుండకూడదు. వాక్యం పొట్టిగా వుండాలి... మరీ పొడుగ్గా వుండకూడదు. వ్యాఖ్య సగమే రాయాలి, మిగతా సగం పాఠకుడు , బొమ్మ నుంచి చదువుకోగలగాలి!"

ఇది కార్టూన్ వ్యాఖ్య ఫార్ములా, ధర్మ సూత్రం లక్ష్మణ్ గారు ఇందులో చాలా చెప్పారు. ముఖ్యం గా ఆయన చివర్లో చెప్పిన విషయం , పూర్తిగా బొమ్మకి సంబంధించినది, బొమ్మ ప్రాముఖ్యతకి సంబంధించినది. మేమందరం చేతులు కట్టుకుని భక్తి భావం తో ఆయన మాటలు విన్నాం, ఆయన పాదాలకు నమస్కరించాం.

లక్ష్మణ్ గారు నిర్వహించిన వ్యాఖ్య సూత్రం తుదినించి చివరి వరకూ పాటిస్తే చాలు. కార్టూనిస్టు జీవితం ధన్యమైనట్లే. కార్టూనిస్టు, పాఠకులకి చేరువైపోతాడు, వాళ్ళ గుండెల్లో గూడుకట్టుకుంటాడు. తన సత్తా ఏమిటో చాటి చెబుతాడు. నాకు చీకట్లు తొలిగాయి. వ్యాఖ్య ఇతివృత్తం తెలిసిపోయింది. తెలుగైనా సరే, ఇంగ్లీషయినా సరే, తమిళం అయినా సరే కార్టూన్లను నిరాటంకం గా గీయడం నా వల్ల సాధ్యం అయ్యింది.

ఆ సదస్సులో లక్ష్మణ్ గారు మరొక విషయం సూచించారు. కార్టూనిస్టుకు అబ్సర్వేషన్, చిత్రలేఖనం మీద ఒకింత అవగాహన , పుస్తక పఠనం చాలా చాలా అవసరం అని! నేను నా తోడి కార్టూనిస్టులకు ఈ విషయం చెప్పదలుచుకుంటున్నాను. కార్టూన్ కళ చాలా గొప్ప కళ. అందరూ కార్టూనిస్టులు కాలేరు. అందుచేత ఒకింత గుర్తింపు సాధించిన తడువుగా , కృషి , శ్రమ కొనసాగిస్తూనే వుండాలి. అందువల్ల ఒక విషయం తేట తెల్లమవుతుంది. కార్టూనిస్టు తన గురించిన శక్తి, తనలో ఇమిడివున్న అనిర్వచనీయమైన క్రియాశీలతను అర్థం చేసుకుని విస్మయం పొందగలడు. ఈ అనుభూతి వర్ణనాతీతం.R.K లక్ష్మణ్ గారిని నేను తర్వాత 1998, 2000, 2002 ల్లో కలిశాను. ఆయన నన్ను ఒక కార్టూనిస్టుగా గుర్తించారు, అభినందించారు. Continue your good work అన్నారు.

వారిని కలిసినప్పుడల్లా నాకు కొన్ని సూచనలు లభ్యమయ్యాయి. ఆయన చెప్పిన మరొక ధర్మ సూత్రం.

"ప్రతి వాక్యంలో మొదట్లో ప్రారంభం, చివర్న ముగింపు వుండడం సహజమైతే, కార్టూన్ వ్యాఖ్య ముగింపు తో ప్రారంభమై , ప్రారంభం లో ముగించాలి!"

ఇది కార్టూనిస్టులందరూ పాటించాల్సిన విషయం, R.K  లక్ష్మణ్ గారు విడిచి వెళ్ళిన గొప్ప సందేశం, సంపద, లక్ష్మణ్ వ్యాఖ్య!!

R.K  సార్ ఆత్మ శాంతించాలని సర్వేశ్వరుడిని ప్రార్ధిస్తూ,

కార్టూనిస్ట్ జయదేవ్
Chennai - 6000 051
29-1-2015
Exclusive to gotelugu.com

మరిన్ని శీర్షికలు
kakoolu