Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Gunde Ootalu(Naaneelu)

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ- eవీ - భమిడిపాటి ఫణిబాబు

 ఒక తీగ పైకి పాకాలంటే ఒక చిన్న పుల్ల అవసరం ఎంతో ఉంటుంది. మన ఇళ్ళల్లో ఏదైనా పాదులు పెట్టినప్పుడు, గుర్తుండేఉంటుంది,,  ఆ మొక్క పెరిగడానికి ఓ పందిరిలాటిది వేసేవాళ్ళం. అలాగే, మన జీవితాల్లో పైకి రావడానికి కూడా , ఓ పుల్ల అవసరం. దానినే  “పలుకుబడి” అనికూడా అనొచ్చు. ఈ పలుకుబడి అనేది, పుష్కలంగా ఉన్నవాళ్ళు జీవితంలో, ఒక్కో మెట్టూ అలవోకగా ఎక్కేస్తూంటారు.

ఈ పలుకుబడి అనేది ఏదో గొప్పగొప్పవాళ్ళతోనే ఉండాలనే లేదు. ఉదాహరణకి , ఏదైనా ఆసుపత్రి కానీ, బ్యాంకుకానీ, అదీకాదనుకుంటే ఓ ప్రభుత్వ ఆఫీసు తీసికోండి, అక్కడ ఉండే పెద్దపెద్ద అధికారులే కానక్కరలేదు, అదే ఆఫీసులో పనిచేసే సెక్యూరిటీ వాడిదగ్గరనుండి, అదే ఆఫీసులో పనిచేసే మామూలు ఉద్యోగిదాకా ఎవరైనా ఫరవాలేదు. కావాల్సిందల్లా, మనం ఆ ఆఫీసుకి వెళ్ళినప్పుడు, మన మొహం గుర్తుపట్టి, “ అరే.. మీరా మాస్టారూ..” అనగలిగేవాడు ఒక్కరున్నా చాలు. ఏ బ్యాంకులోనైనా కొత్తగా ఎకౌంటు తెరవాలంటే, తెలిసున్నవ్యక్తి ( మళ్ళీ అదే బ్యాంకులో ఎకౌంటుకూడా ఉండాలంటారు ) తో సంతకం పెట్టించమంటారు. రేపెప్పుడైనా వాళ్ళని బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తే, ఈ సంతకం పెట్టినవాడినైనా పట్టుకోవచ్చని ! అలాగే ఆసుపత్రులలో మనకి పెద్ద డాక్టరుగారే తెలియనక్కర్లేదు, ఆ ఆసుపత్రిలో పనిచేసే , మేల్ నర్సో, ఆయాయో అయినా , మనపని నిముషాల్లో పూర్తవుతుంది.

రైల్వే లలో అయితే, ఒక్క టీసీ తో పరిచయం ఉంటే చాలు, చివరి క్షణాల్లో , రిజర్వేషను లేకపోయినా సరే, మహారాజభోగంతో ప్రయాణం చేసేయొచ్చు. కానీ వచ్చిన గొడవల్లా ఎక్కడంటే, మనకి ఎవరో పలుకుబడి ఉన్నాయనతో పరిచయం ఉందని, ఏదో మన status పెంచుకుందామని , ఊరికే గొప్పలు చెప్పేసికుంటే, చిక్కుల్లో పడతాము. ఎవరికో అత్యవసరపరిస్థితుల్లో గుర్తొస్తుంది, ఫలానా ఆయన, మన స్నేహితుడికి పరిచయంకదా, ఇతనిద్వారా మన పని చేయించుకోవచ్చూ అని . స్వంత పనులకే వాడుకోని , ఈ మొహమ్మాటస్థుడు అకస్మాత్తుగా ఇరుకులో పడిపోతాడు. ఏదో పరిచయం ఉందికదా అని, వేరెవరికో రికమెండేషన్ అడగలేడూ, అలాగని స్నేహితుడికి చెప్పా లేడూ. “ ఏదో మాట సహాయం చేయమంటే, మరీ పేద్ద పోజెట్టేస్తున్నాడూ..” అని అపోహ పడి, స్నేహం కూడా మానేసే పరిస్థితి వస్తూంటుంది. అందువలన ఎట్టిపరిస్థితిలోనూ, మన పలుకుబడీ వ్యవహారాలు ఊరంతా టముకేసుకోకూడదు.

ఉత్తినే పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు చేసేసికుంటే చాలదు, వాటిని  కాపాడుకోవడం కూడా రావాలి. అలాగని ప్రతీరోజూ దర్శనం చేసికుని పూజ చేయఖ్ఖర్లేదు. కనీసం , ఏ పండక్కో పబ్బానికో వెళ్ళి పలకరించినా చాలు. అంతేకానీ, మనకి ఏదో అవసరం ఉన్నప్పుడే వెళ్ళడం కాదు. సంఘంలో  “ పెద్దమనుషులు” గా చలామణీ అయేవారిలో ఒక బలహీనత కూడా ఉంటుంది. అదేమిటంటే, తన పేరు ఉపయోగించుకునో, లేదా తనో మాట చెబితేనో, పనులు సులభంగా చేయించేసికుంటున్న వారు, రెగ్యులర్ గా కనిపించడం మానేసి, ఏదో వారికి పనున్నప్పుడే, మొహం చూపిస్తారనుకోండి, మొహం మీదే అనేస్తూంటారు కూడానూ—“ ఏమిటండోయ్.. మళ్ళీ ఏదైనా నాతో పనిబడిందా ..అందుకే కాబోసు మళ్ళీ వచ్చారూ.. అయినా ఏదో పనిబడ్డప్పుడే గుర్తొస్తూంటాములెండి..” అని వ్యంగ్యంగా కూడా దెప్పిపొడుస్తూంటారు. అందుకే, పెద్దవాళ్ళతో పరిచయం చేసేసికుంటే చాలదు, దాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యం.

ఇందులో మళ్ళీ ఇంకో తిరకాసుంటుంది. రైల్వేల్లోనూ, బ్యాంకుల్లోనూ ముఖ్యమైన పదవుల్లో ఉండేవారిలో చూస్తూంటాం, వాళ్ళు ఎవరినిపడితే వారిని దగ్గరకు రానీయరు. వారివారి “ జాతి వారినే “ రానిస్తూంటారు. ఇక్కడ జాతంటే , ఏదో కులమూ, గోత్రమూ అని కాదు. బ్యాంకులవాళ్ళు  తోటి బ్యాంకులవాళ్ళనీ, రైల్వేవారు తోటి ఉద్యోగస్థులనీ అన్నమాట ! అలాగే vice versa  అవతలివాడివలన తనకి ఏదైనా లాభం ఉందా అని చూసుకునే పరిచయాలు పెట్టుకుంటూంటారు. అందుకనే ఉద్యోగంలో ఉండేటప్పుడు, మన ఉద్యోగాన్ని బట్టే , పరిచయాలు కూడా ఉంటూంటాయి.  ఆ పరిచయాలు అంతా ఒఠ్ఠి మిథ్య అని గమనించ ప్రార్ధన. ఇవన్నీ స్వానుభవంతోనే వ్రాస్తూంట.  ప్రభుత్వోద్యోగంలో ఉన్నప్పుడు, మన “కుర్చీ” దే అసలు “పవర్ “ అంతానూ.  బ్యాంకులవాళ్ళు, ఎందుకు దగ్గరకు రానీయరంటే, రేపెప్పుడో మరీ రూల్స్ కి వ్యతిరేకంగా అప్పు ఇవ్వమంటే కష్టం కాదూ?

పోలీసు శాఖలో పలుకుబడి ఉందనుకోండి, ఏ  ఎమర్జెన్సీ వచ్చినా గొడవుండదు. అలాగని మరీ హత్యలూ అవీ చేయమని కాదూ, ఏదో ట్రాఫిక్కు నేరాలలోనో ఇరుక్కున్నప్పుడు ఈ పలుకుబడి ఉపయోగిస్తూంటుంది. రైల్వే వారు కూడా వీలైనంతవరకూ ,దూరంగానే ఉంటూంటారు. లేకపోతే, అయినదానికీ, కానిదానికీ ఎవరో ఒక తెలిసినవాడు రావడం, ఆఖరి క్షణంలో రైల్లో బెర్తు కావాలనడం, ఊరికే “ సంఘసేవ” చేస్తూంటే ఎలా  కుదురుతుందీ ?

అతావేతా చెప్పొచ్చేదేమిటంటే, జీవితంలో ఈ “పలుకుబడి “ అనేది చాలా ముఖ్యం. పరిచయాలు ఎలా చేసికుంటారూ, ఆ పరిచయాన్ని ఎలా వృధ్ధి చేసికుంటారూ అన్నది, మన తెలివితేటలమీద ఆధార పడి ఉంటుంది. సర్వే జనా సుఖినోభవంతూ....

మరిన్ని శీర్షికలు
Capsicum Chicken