Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ : ఆస్ట్రియాలో ప్రయాణిస్తున్న బస్సులో హరిప్రియ-అనిల్ ల మధ్య ముద్దుల భాగోతం ఊపందుకుంటుంది...షహనాజ్ గురించి జీవన్ కలలు సాగుతూనే ఉంటాయి............. తర్వాత.....

కెమెరామెన్ వినాయకన్ ఫ్యాంటు, డాన్స్ మేస్టర్ టీషర్టూ ఇచ్చారు. యోగి పాత బ్రష్ ఇచ్చాడు. డైరెక్టర్ వేగేష్ బాగా పొదుపు, దానికి తోడు బాగా పిసినిగొట్టులాగున్నాడు. “నా దగ్గరేంలేదు, సరిపడా తెచ్చుకున్నాను” అన్నాడు.

“రేపు నా సూట్ కేస్ రాగానే ఇచ్చేస్తాను సార్” అన్నాడు గంగరాజు.

“అంటే, నువ్వు వాడింది మళ్ళీ నేను వాడనా..?” చిరాకు పడ్డాడు వేగేష్.

“అరెరే.., దార్లో వేప పుల్ల విరవడం మర్చిపోయేనే” అని చందర్రావు అంటుండగా తాళాలు తీసుకొచ్చిన జార్జి ప్రసాద్ అందరికీ పంచుతున్నాడు.జీవన్, యోగికి ఒక రూమిచ్చారు. దాని నంబర్ 310.

 

అక్టోబర్ – 3

రాత్రయింది.

కొండల మీంచి వీస్తున్న చలిగాలి.

యూనిట్లో అంతా తాగే పనిలో ఉన్నారు. ఈ చలిలో ఎంత తాగినా ఎక్కడం లేదు. ఆ షహనాజ్ ఏం చేస్తుందో వెళ్ళి పలకరిద్దామా..? అనిపించింది జీవన్ కి.

యూనిట్ తో పాటూ స్టాంపింగ్ కోసం వచ్చిన సందీప్, ప్రణయ్ అనే ఇద్దరు కుర్రాళ్ళు అందరి రూములకీ వచ్చి “రూముల్లో భోజనం ఎలవ్ చెయ్యరంట సార్. హోటలు బయటున్న డైనింగ్ హాలు దగ్గర కొచ్చేయ్యండి తొరగా” అనెళ్ళిపోయాడు.

మందులో ఊగిపోతా అంతా తింటున్నారు. ఒక మూల షహనాజ్ తింటుంది. యూనిట్ తో పాటు వచ్చిన వంట కుర్రోడు రాము పచ్చి పులుసూ, బంగాళాదుంపల కూరా చికెనూ వండాడు. అందరి భోజనాలయ్యాక వంటోడు సర్దుకుంటుంటే ఆ టైములో దిగారు హరిప్రియ, అనిల్ కుమార్. స్పీడుగా వాళ్ళ దగ్గరకెళ్ళిన జార్జి ప్రసాద్ “రేపట్నుంచి ఇంత ఆలస్యమైతే ఫుడ్డుండదు. ఎన్ని సార్లు మీ తలుపు కొట్టాలి..?” అని కేకలేశాడు.

“పేకాడుకుంటున్నాం” అన్నాడు అనిల్.

“ఏవాడుకుంటున్నారో మాకు తెల్సులేరా..!” అని తిట్టేశాడు జార్జి ప్రసాద్.

రూమ్ లోకొచ్చాక “చలికి తట్టుకోలేక పోతున్నా సార్” అని నెపోలియన్ బాటిల్ మళ్ళీ తీసి తాగడం మొదలెట్టిన యోగి ఈ మధ్య మైసూరు టూరు వెళ్ళినప్పుడు తను కంపోజ్ చేసిన పాటలు వినిపిస్తున్నాడు.

అంతలో..,

వయోలిన్ నాదం. మొజార్ట్ సి మేజర్లో రాసిన వయోలిన్ కాన్ సెర్ట్ కెవి 373 లో చిన్న పీస్ వినిపిస్తుంది. అంటే షహనాజ్ ఉండేది ఎదురు గదిలోనేనా....!? మొజార్ట్ అంటే తనకూ చాలా ఇష్టమున్నట్టుంది.

అది వినడం మొదలెట్టాకా పాడ్డం మానేసి “వెస్ట్రన్ కూడా తెల్సన్నమాట.... ఎంత బాగా వాయిస్తుంది సార్ మన ప్రొడ్యూసర్ గారి చెల్లెలు.... ఒప్పుకుంటే BGM వాయించమని అడగాలి” అన్నాడు.

“అడుగు గానీ, తాగేసున్నావ్ కాబట్టి ఇప్పుడొద్దు” అన్నాడు జీవన్.

“అలాగే” అని పడిపోయాడు యోగి. అంతలో వచ్చిన గంగరాజు ని చూసి నవ్వాగలేదు జీవన్ కి. కురస ఫ్యాంటూ, పరమ లూజు టీ షర్టూ, పాత బూట్లూ హోటల్ బయట దొరికిందట చిరిగిపోయిన హేట్. మొత్తానికి ఒక టైపు కమెడియన్ గెటప్ లో ఉన్నాడు.

పడిపోయిన యోగి, స్ప్రింగులా లేచి గంగరాజు గెటప్ చూసి తెగ నవ్వుతూ “చాలా బాగుంది” అన్నాడు.“థాంక్స్ గానీ, చెప్పాను కదా నా కరెన్సీ అంతా సూట్ కేసులో ఉండిపోయింది. మీరేవన్నా ఇస్తే కాస్సేపు కిందనున్న బార్లో కెళ్తాను” అంటూ అక్కడున్న వేర్ హౌస్ స్కాచ్ కేసి చూసి వెళ్ళి దాన్నందుకుంటూ “ఇది ఉండగా ఇక బారెందుకు నాకు..?” అంటూ ఆ సీసా పట్టుకెళ్ళిపోయాడు.

షహనాజ్ గదిలో నుంచి వయోలిన్ వినిపిస్తుంది. మొజార్ట్ దే ఇంకో చిన్న పీస్ వాయిస్తోంది. అంతటి చలిలో కూడా గుండెల్లో ఎక్కడో చిన్న మంట రగులుకుని నులివెచ్చని అనుభూతిలో ఒళ్ళంతా మత్తెక్కింది జీవన్ కి.

మొజార్టే ఎదురు గదిలో కూర్చుని వాయిస్తున్నట్టుంది. గదిలోకి వెళ్ళి పలకరించి, ఆ రాత్రంతా షహనాజ్ వయోలిన్ వాయిస్తుంటే తన్మయత్వంలో చూస్తూ ఉండిపోవాలనిపించింది జీవన్ కి.

గది వరకూ వెళ్ళి పలకరించకుండానే తిరిగొచ్చేశాడు జీవన్. షహనాజ్ నన్ను ఎందుకిలా వెంటాడుతూ ఉంది...? ఆలాపన లాంటి ఆమె ప్రేమ కదా...? హృదయాన్ని పరిమళింపచేసే ఆమె వయోలిన్నా...? ఉల్కాపాతాల్ని వర్శించే ఆమె కళ్ళా...? ఏమో తెలీదు అనుకుంటున్నాడు జీవన్.

అక్టోబర్ – 4

తెల్లారింది.

ఎవరూ లేపకపోయే సరికి ఆలస్యంగా లేచాడు జీవన్. పక్క బెడ్ మీద పెద్దగా గురక పెడ్తూ మ్యూజిక్ డైరెక్టర్ యోగి. వాడ్ని లేపడానికి ప్రయత్నాలు చేసి ఇక తన వల్ల గాక బాత్రూమ్ లో కెళ్ళొచ్చి ముఖం తుడుచుకుంటున్నాడు జీవన్.

అంతలో డోర్ సౌండొస్తే వెళ్ళి తీసేడు.

మేకప్ మేన్ సతీష్ “బ్రేక్ ఫాస్ట్ రడీ అంట సార్. రాత్రి మనం భోజనం చేసిన హాల్లోనేనండి” అన్నాడు.

కింద కెళ్ళేసరికి హోటలు వాడు ప్రొవైడ్ చేసిన కార్న్ ఫ్లెక్సూ, జాములూ, ఆరెంజ్ పళ్ళు, వంటోడు రాము చేసిన ఎగ్ డస్టూ తప్ప తక్కిన గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉన్నవాటితో సర్దుకుందామని బ్రెడ్ కి జామ్ రాసుకుంటూ అప్పుడు గమనించాడు జీవన్. షహనాజ్ ఒక్కతే కూర్చుని టీ తాగుతుంది. జీవన్ ని చూసింది.

“హాయ్...!” అన్నట్టు చేత్తో సైగ చేశాడు.

రెస్పాండవ్వకుండా నవ్వి ఊరుకున్నాయి ఆ కళ్ళు.

ఇదంతా గమనిస్తున్న యోగి “ఏంటి సార్, ఆ అమ్మాయిని పరిచయం చేసుకోడానికి ట్రై చేస్తున్నారా..?” అన్నాడు జామ్ రాసుకున్న బ్రెడ్ ని నోట్లో కుక్కుకుంటూ.

“ఆ అమ్మాయి ఎప్పుడో నాకు పరిచయమైంది. జార్జి ప్రసాద్ తో సలీం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చూశాను” అన్నాడు జీవన్.“హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి చూస్తున్నాను, మీ కళ్ళు ఆ అమ్మాయినే వెంటాడుతున్నాయి. ఎందుకు సార్ ఆ అమ్మాయి అంటే అంత ఇంట్రస్ట్..?” అన్నాడు యోగి.

“నేను కాదు, ఉల్కాపాతాల్ని వర్షించే ఆ అమ్మాయి కళ్ళే నన్ను వెంటాడుతున్నాయి” అన్నాడు జీవన్.

“ఉల్కాపాతాల్ని వర్షించే కళ్ళు అంటే..?” అన్నాడు అర్థం కాక యోగి.

“ఉల్కలు రాలిపోతూ దివ్యమైన కాంతిని వెదజల్లుతాయి. ఆ కాంతితో మెరుస్తున్నాయి ఆమె కళ్ళు” అన్నాడు జీవన్.

టీ తాగి షహనాజ్ వెళ్ళిపోయింది. ఆమెని క్రాస్ చేసుకుంటూ ఆ అనిల్, హరిప్రియ ఒకళ్ళనొకళ్ళు అంటుకుపోయి మరీ దిగారు.“వీళ్ళ వాలకం చూస్తుంటే ఏదో గందరగోళం అయ్యేలాగుంది సార్” అన్నాడు యోగి.

మాట్లడలేదు జీవన్.

“ఇతన్ని నేను పెళ్ళి చేసుకుంటాను అని ఆ అమ్మాయి ఊహించుకుంటుంది. ఈవిడికి నేను కడుపు చేద్దామని వాడు ఊహించుకుంటున్నాడు. రెండిటిలో ఏది కరక్టంటారు...?”

“రెండోదే...”

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti