Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : విరాట్ తల్లితో మాట్లాడి ఫోన్ సహస్రకిస్తాడు. కాబోయే కోడలితో మాట్లాడి తాను కూడా ఇంప్రెస్ అవుతుంది. తన తండ్రిపేరు చెప్పవద్దని సహస్ర సైగ చేస్తున్నా గమనించడు విరాట్....ఆ తర్వాత..

ఆ మాట వినగానే  పక్కన  బాంబు పేలినట్టు ఉలికిపడ్డాడు విరాట్.

సహస్ర అయ్యయ్యో........అంటూ

నుదురు ఎందుకు కొట్టుకుందో

అప్పటిగ్గాని బోధ పడలేదు.

‘‘ఏమిటి మమ్మీ అలాగంటావ్....’’ అన్నాడు నొచ్చుకుంటూ.

‘‘ఇంకెలా అనాల్రా.......... ఆ మహాదేవనాయకర్ కి మీ డాడీకి అస్సలు పడదు. నీకు తెలీదా? ’’ కసురుకుంది మంగ తాయారు.ఈసారి నిజంగానే నిర్ఘాంత పోయాడు విరాట్. వాళ్ళిద్దరికీ గత పరిచయం వుందా? ఇద్దరికీ పడదా! పాత పగలేమన్నా వున్నాయా? ఎందుకు? ఇదేం కొత్త మెలికరా బాబూ అనుకుంటూ...

‘‘నాకేం తెలీదు మమ్మీ, ఏమైందసలు?’’ అనడిగాడు.

అప్పుడు మూగాంబిగై తన కూతురు సహస్రకు ఎలా కెమికల్ ఫ్యాక్టరీ గొడవ చెప్పుకొచ్చిందో అలాగే యిప్పుడు మంగతాయారు తన కొడుకు విరాట్ కి జరిగింది విన్పించింది.

‘‘ఆయనసలే నీ పెళ్ళి సాగరికతోనే జరగాలని పట్టుదలగా వున్నారు. పోనీ ఎలాగో నచ్చచెప్పొచ్చనుకున్నా నువు లవ్ చేసింది మీ డాడీకి గిట్టని వ్యక్తి కూతుర్ని. బహుశ మీ పెళ్ళికి మహాదేవనాయకర్ గారు కూడ ఒప్పుకోరు. కాబట్టి మీ పెళ్ళి మీ యిష్టం ’’

‘‘ ఏంటి మమ్మి... నువ్వు కూడా మమ్మల్ని వదిలేస్తానంటే ఎలా...? ఆ గొడవ జరిగినప్పుడు నేను ఫారెన్ లో వున్నాను కాబట్టి నాకు తెలీదనుకో. ఇప్పుడు నేనేం చేయాలి? పోనీ సహస్రని వదిలేయనా?’’ అనడిగాడు సహస్ర వంక చూస్తూ. క్షణాల్లోఅతడు కోరుకున్న ఎఫెక్ట్ వచ్చేసింది. నిటారుగా కూచుంటూ కోపంగా చూసింది సహస్ర. ఆమె ముఖం కుంకుమ పువ్వులా ఎర్రబడింది. విరాట్ పెదవుల మీద చిరునవ్వు ఆమెకు ఒళ్ళు మండేలా చేస్తోంది.

‘‘ఇంత వరకు వచ్చాక వదిలేస్తావా....? నేన్నీవెంట పడ్డానా?  రైల్వే స్టేషన్ లో పోస్టర్లు వేసి పేపర్ లో ప్రకటనిచ్చి,  నేనెక్కడుందీ అందరికీ తెలిసి పోయేలా చేసి ఇప్పుడొదిలేస్తావా....? నువ్వు వదిలినా నేను నిన్నొదలుతాననుకున్నావా....... ఆగరా నీ పని చెప్తా....’’ సహస్ర పిడికిళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. అవతల మంగతాయారు గారి మాటలు వినిపించక పోతే నిజంగా విరాట్ తో వార్ డిక్లేర్ చేసేదే. అవిడ కొడుకు మీద కోప్పడుతోంది.

‘‘ఏరా నీకు బుద్దుందా? ఆ పిల్లని వదిలేస్తావా? అదీ సహస్ర ఎదురుగా నాతో అంటున్నావంటే కావాలని ఆ పిల్లని ఉడికించటానికేగా? నువ్విలా పిచ్చి వేషాలేస్తే తను మళ్ళీ వెళ్ళి పోతుంది. మళ్ళీ ప్రకటనిస్తావా...?’’

‘‘అది కాదు మమ్మీ’’

‘‘ఏది కాదు ? మీ పెళ్ళికి పెద్దాళ్ళిష్టపడరన్నాను గాని ఆ పిల్లని వద్దన్నానా? మీ ప్రేమ పెళ్ళి వరకు రావాలంటే మీరు చాలా కష్టపడాలనిపిస్తోంది. అసలు విషయం చెప్తాను విను. ఎలాగయినా సరే కూతురు కిచ్చిన మాట నిలబెట్టుకుని సాగరికతోనే నీ పెళ్ళి జరిపించాలని మీ డాడీ పట్టుదలగా ఉన్నాడు. నువ్వు చెన్నైలో ఎక్కడ కన్పించినా కాళ్ళు చేతులు కట్టి కోయంబత్తూరు తీసుకు రమ్మని మీ డాడీ మననూలు మిల్లులో పని చేసే మునుస్వామికి పదిమందిని సాయమిచ్చి చెన్నై పంపించారు. వాళ్ళిప్పుడు దారిలో ఉంటారు. కాబట్టి నిన్ను హెచ్చరిద్దామనే ఫోన్ చేసాను. కోరింది దక్కించుకోవాలంటే పోరాడక తప్పదు. వీలయితే మీరు పెళ్ళి చేసేసుకోండి. అప్పుడు మీరు కావాలనుకున్న వాళ్ళు వెదుక్కుంటూ మీ దగ్గరకే వస్తారు.’’

‘‘మమ్మీ.......’’

‘‘మమ్మీనే చెప్తున్నాగా.........లక్ష్మీ సహస్ర నా కోడలు. మీరుగా పెళ్ళి చేసుకున్నా పెద్దల అంగీకారంతో పెళ్ళి జరిగినా సంతోషమే. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. అమ్మాయి సహస్ర....... ఫోన్ అమ్మాయికివ్వరా’’

విరాట్ చేతిలోంచి ఫోన్ అందుకొంది సహస్ర.

‘‘చెప్పండి ఆన్టీ’’ అంది.

‘‘ఇంకా ఆన్టీ ఏంటమ్మాయ్! అత్తయ్యని పిలు, మీ సంతోషమే నాక్కావాలి. మా వాడు కాస్త అల్లరోడే కాని అంతకన్నా మంచి వాడుండడు. ఇక మీద ఏ కోప తాపాలున్న సర్దుకు పోవాలి గాని వెళ్ళి పోకూడదు. జాగ్రత్తగా ఉండండి. ఇదిగో విరాట్ ’’

‘‘చెప్పు మమ్మీ’’

‘‘ఓసారి అన్నయ్య విక్రాంత్ కి ఫోన్ చేసి మాట్లాడు. మీ డాడీ వాడి మాటే వింటారు. బయట మీ డాడీ వస్తున్నాట్టున్నారు. ఉంటాను’’ అంటూ అవతల లైన్ కట్ చేసింది మంగ తాయారు.

మధురై...

పోలీస్ కంట్రోల్ రూమ్...

అక్కడ ఎంట్రన్స్ కాంపౌండ్ గేట్ ఎదురుగా రోడ్ అవతల చిన్న హోటల్ ఒకటి ఉంది. చూడ్డానికి చిన్నదయినా టీ టిఫిన్లు చాలా నీట్ గాను రుచిగా ఉంటాయని పేరుంది. పోలీస్ అధికారులు కూడ అక్కడ్నుంచి టిఫిన్ తెప్పించుకుంటారు. కాబట్టి ఎప్పుడూ బిజీ గానే ఉంటుంది. బయట బల్లల మీద పది మంది టీ తాగుతూనో టిఫిన్ చేస్తూనో కన్పిస్తుంటారు ఎప్పుడూ. ఇంతలో ఒక కానిస్టేబుల్ హడావుడిగా వెదుక్కొంటూ వన్నాట్ ఫోర్ కోసం వచ్చాడు.

‘‘నువిక్కడున్నావా? త్వరగా వెళ్ళు. ఎక్కడున్నా సరే వెంటనే రమ్మని ఎ యస్ పి గారి ఆర్డర్ ’’ అన్నాడు.‘‘ఇంతకు ముందేగా బయట కొచ్చాను. ఇంతలో ఏమైంది? తేలు కుట్టిందా దోమ పొడిచిందా?’’

‘‘ఏమోరా బాబు నాకేం తెలుసు. పోయి అడుగు. ఆయనకీ నీకూ సరి పోయింది’’ అంటూ నవ్వాడతను.

‘‘వెళ్ళొస్తాలే’’ అంటూ అక్కడ్నుంచి బయలు దేరాడు వన్నాట్ ఫోర్.

వన్నాట్ ఫోర్ వెళ్ళేసరికి తన ఛాంబర్ లో కాలు గాలిన పిల్లిలా అటు యిటు పచార్లు చేస్తున్నాడు ఎ యస్ పి. మనిషి కోపంగానూ చాలా సీరియస్ గానూ వున్నాడు. వన్నాట్ ఫోర్ ని చూడగానే ఎ యస్ పి ప్రకాష్  అతని చేయి పట్టుకొని లోపలి గది లోకి లాక్కెళ్ళి తలుపు మూసాడు. తమ మాటలు ఎవరూ వినకూడదని ఆయన ఉద్దేశం గావచ్చు. కాని తనను కొట్టడం కోసం లాక్కొచ్చాడనుకొని వన్నాట్ ఫోర్  ఠారెత్తి పోయాడు. అర చేతులు చెమటలు పట్టి గొంతు పూడుకు పోయి మాట పెగల్లేదు. కాని ఎయస్ పి అతని అవస్తను గమనించకుండా చెప్పుకు పోతున్నాడు.

‘‘అసలేమిట్రా వాడి ఉద్దేశం...? నాకే సవాల్ విసురుతున్నాడు? ఎవడు వాడు? వాడి బ్యాగ్రౌండ్ ఏమిటి? చెప్పరా........ ఇక్కడ మోస్ట్ సీనియర్ వి నువ్వే. నీకు తెలీకుండా ఉండదు. నేనిక్కడికి రాక ముందు ఏం జరిగింది? వాడి మాట కత్తిలా ఉంది.  మాటలో నదురు బదురు లేదు. భయమంటే ఏమిటో తెలీని వాడిలా వున్నాడు. చెప్పరా..... ఎవడు వాడు?’’

ఎ యస్ పి అలా తలా తోక లేకుండా గడగడా మాట్లాడేస్తూ తనను అడుగుతుంటే విషయం ఏమిటో తెలీక బిత్తర పోవటం వన్నాట్ ఫోర్ వంతయింది. అయితే విషయం తన గురించి కాదనీ గ్రహించి గుండెను తేలిక పర్చుకున్నాడు.

‘‘సార్! నాకు మీ మాట ఒక్కటీ అర్ధం గావటం లేదు. ఏం జరిగిందీ ఎవరితో మాట్లాడారు?’’ అనడిగాడు.

‘‘వాడేరా........ఆ ప్రకటనిచ్చివాడు’’ చెప్పాడు ఎ యస్ పి ప్రకాష్.

ప్రకటన అనగానే విషయం కొంచెం బోధ పడింది వన్ నాట్ ఫోర్ కి. ‘‘ సహస్ర ఫోటో పేపర్ కిచ్చిన వాడేనా? ’’

‘‘ఆవున్రా... వాడే’’

‘‘ప్రకటనలో ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేసారా? ’’

‘‘చేసాను. వాడ్ని కాస్త భయపెట్టి చెన్నైలో ఆ పిల్ల ఎక్కడ ఉండేది ఎక్కడ మిస్సయిందో వివరాలు తెలుసుకుందామని ఫోన్ చేసాను. వాడు నాకే ధమ్కీ ఇస్తున్నాడ్రా. వాడి గురించి నాకు తెలియాలి’’

‘‘ఎలా తెలుస్తుంది సర్? వాడెవడో మనకి తెలీదుగా. ఆ నంబరు సిమ్ కార్డు ఎవరి పేరున ఉందో ఎంక్వరీ చేయిస్తే దొరికి పోతాడు. అది మీ చేతిలో పనే’’

‘‘గుడ్ అయిడియా. ఎంక్వైయిరీ చేయొచ్చు కాని ప్రస్తుతం వీలు కాదు. ఏదో ఒక కేసులో బుక్కయి పోయిన వాడి నంబరయితేనే నెట్ వర్క్ వాళ్ళు వివరాలు చెప్తారు. మామూలుగా అడిగితే పోలీసులతో చెప్పరు.’’

‘‘అయితే పెద్ద చిక్కే ఉంది. అయినా బెదిరించటంలో మీరే నెంబర్ వన్ అనుకుంటే మిమ్మల్ని ఒకడు బెదిరించటం ఏమిటి సార్. నిజంగానే వాడ్ని వదల కూడదు.’’

‘‘వదలన్రా. వాడి అంతు చూస్తాను. లహరి నాది. దాని కోసం ఏమైనా చేస్తాను.’’

‘‘కొంప దీసి వాడూ ఇదే మాటన్నాడా సార్? సహస్ర నాది మీరే డ్రాపయి పోండి అని బెదిరించాడా?’’

‘‘బెదిరి పోవడానికి నేనేమన్నా కుందేలునా? మీసాలున్న మగాడ్ని. నా చేతిలో అధికారం ఉంది.’’

‘‘ఈ మాట కరక్టే అనుకోండి. ఇంతకీ ఏమంటాడు సార్?’’

‘‘రేపు తెల్లవారే లోపల వాడు నాకు మర్యాద నేర్పిస్తాట్ట’’

‘‘మర్యాద.....అదెలా వుంటుందో కూడ మనకి తెలీదే ’’ అంటూ నవ్వాడు వన్ నాట్ ఫోర్.

‘‘అయినా సార్ వాడుండేది చెన్నైలో. మనం ఉండేది మధురైలో. మూడొందల కిలో మీటర్ల దూరంలో ఉన్న మీకు మర్యాద నేర్పిస్తాడంటే ఖచ్చితంగా వాడు బ్లఫ్ మాస్టరైనా అయ్యుండాలి లేదా మంత్రికుడయినా అయ్యుండాలి. బ్లప్ మాస్టరైతే వాడి మాటలన్నీ కోతలే. పట్టించుకోనక్కర్లేదు. కాని మంత్రగాడయితేనే ప్రమాదం. ఏ కాలో చెయ్యో పడి పోయేలా మంత్రం పెట్టాడనుకోండ. అంతే పులి లా ఉండే మీరు పిల్లియిపోతారు’’ అంటూ తను మరి కాస్త బెదర గొట్టాడు.

‘‘వాడి ధోరణి చూస్తే మాటల మనిషిలా లేడు. చేతల మనిషిలా ఉన్నాడు. వాడి గురించి నా దగ్గర క్లూ వుంది. అది చెప్తావనే నే పిలిచాను’’ అన్నాడు టేబుల్ మీద కూచుంటూ ఎ యస్ పి ప్రకాష్.

‘‘క్లూ వుందా? ఇకనేం నాకు తెలిసుంటే యిప్పుడే వాడెవడో మీతో చెప్పేస్తాను. ఆ క్లూ ఏంటో ఇలా నా చెవిలో పడేయండి’’ అన్నాడు వన్ నాట్ ఫోర్.

‘‘నాకు ముందు ఇక్కడ ఎ యస్ పి గా పని చేసిన అయ్యా సామి నీకు తెలుసు గదా?’’

‘‘అయ్య బాబోయ్ ఆయన తెలీక పోడం ఏమిటి సార్. మహా పొగరు బోతు. లంచాలు మెక్కి మెక్కి తెగ బలిసి కన్ను మీన్నూ తెలియ కుండా ఉండేవాడు. చివరికేమైంది. దేవుడు ఆయన కాలు తీసేసి మదం అణిచేసాడు. మోకాలు వరకు కాలుపోడంతో ఉద్యోగం పోయింది. ఆసలు నన్నడిగితే అలాంటి వాళ్ళను చూసి అయ్యో పాపం అనుకోడం కూడ పాపమే సార్.’’  ఏదో ఫ్లోలో అనాల్సిన నాలుగు మాటలు అనేసి చివరికి నాలుక్కరుచుకున్నాడు వన్ నాట్ ఫోర్. ఎందుకంటే తన ఎదురుగా వున్న వాడు అయ్య సామి లాంటి ముఖ్యుడే నని అప్పటిగ్గాని గుర్తుకు రాలేదు. భుజాలు తడుముకుని తన భరతం పడతాడని భయ పడ్డాడు. కాని తీవ్రంగా ఆలోచనల్లో వున్న ఎయస్ పి ప్రకాష్ వన్ నాట్ ఫోర్ మాటల్ని పెద్దగా పట్టించుకో లేదు.

‘‘అయితే వాడు ఫోన్ లో చెప్పింది వాస్తవమేనన్న మాట.

ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పు ’’ అన్నాడు.

‘‘వివరంగా అయితే చెప్పలేను సార్. ఎందుకంటే నేను అయ్య సామికి గిట్టను. మాసిలామణి అని ఓ కానిస్టేబుల్ ఉండేవాడు. వాడే ఆయనకి పర్సనల్ గా వ్యవహరించేవాడు. గత ఏడాదే వాడూ ట్రాన్స్ ఫరై వెళ్ళి పోయాడు. నేను విన్న విషయాలు చెప్పమంటే చెప్తాను.’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana